వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వం: అభివృద్ధి కోసం అడ్వాన్స్‌ థింకింగ్‌

By Pratap
|
Google Oneindia TeluguNews

అభివృద్ధిలో ముందుకు సాగడానికి ముందుచూపు గల అడ్వాన్స్‌ థింకింగ్‌ ఎంతో అవసరం. ముందు చూపు లేని ఆలోచనలు అభివృద్ధిని అందుకోలేవు. అడ్వాన్స్‌ థింకింగ్‌ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. పాతభావాల నుండి విముక్తం కాకుండా ముందు చూపుతో ఆలోచించడం అంత సులభం కాదు. పాత భావాలు ఆధునిక అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఆధునిక సమాజంలో నూతనంగా ఆలోచించడం, నూతన విషయాలను కనుక్కోవడం లోకాన్ని గమనించి పోటీ పడి ముందుకు సాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అవకాశాలను సృష్టించుకోవడం ఎంతో అవసరం. అప్పుడే ప్రపంచంతో పోటీ పడి ముందుకు సాగడం సాధ్యపడుతుంది.

ఇటీవల చరిత్ర, సంస్కృతి, ప్రణాళికా సంఘం ఆవశ్యకత పేరిట కొత్త చూపును అడ్డగించే భావాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఉదహరిస్తాను. ఇటీవల వృద్ధాప్య పెన్షన్‌లు, ఉన్నత విద్య కోసం ఆర్ధిక సాయం, పేద బాలికల పెళ్ళిళ్లకు ఆర్ధిక సాయం, సబ్సిడీపై ఎరువులు, బట్టలు, ఆహారం, ఆహార దినుసులు అందించే కృషి జరుగుతున్నది. ఆధునిక సౌకర్యాలతో కూడిన పేదల గృహ నిర్మాణం ఆవశ్యకత గుర్తించబడుతున్నది. కేసీఆర్‌, నరేంద్ర మోడీ వంటి వాళ్లు ఈ విషయాల్లో నూతనంగా ఆలోచిస్తున్నారు. ఇవి కొందరికి రుచించడం లేదు. పాతుకుపోయిన వాళ్లు పాత పద్ధతిలోనే ఉండాలని కోరుకోవడం సహజం. కొందరు ప్రగతిశీల వాదులు కూడా నూతనత్వాన్ని వ్యతిరేకించడం ఆశ్చర్యకరం. ఉదాహరణకు ప్రణాళికా సంఘం రద్దు గురించి కొందరు ప్రగతిశీల వాదులు కూడా బెంబేలెత్తుతున్నారు. ప్రణాళికా సంఘం కన్నా అత్యున్నతమమైన, ప్రజల అవసరాలకు అనువుగా ఆలోచించే నూతన వ్యవస్థను ఊహించడం, ప్రతిపాదించడం మేధావుల, జర్నలిస్టుల, సామాజిక శాస్త్రవేత్తల ప్రగతిశీల కర్తవ్యం. ప్రణాళికా సంఘం ఎంత దిగజారిపోయిందంటే 35 రూపాయలు సంపాదించే వాళ్లు బాగానే బతుకుతున్నారని, వాళ్లు పేదలు కారని నిర్ణయించారు. వీళ్లు మనుషులేనా? వీళ్లలో మానవత్వం ఉన్నట్టేనా? ఇలాంటి వాళ్ల చేతుల్లో ప్రణాళికా సంఘం ప్రజల కోసం ఏం పని చేస్తుంది? బడా పారిశ్రామిక వేత్తల, ఎగువ మధ్య తరగతి, సంపన్నుల ప్రయోజనాల కోసం, కాంట్రాక్టర్ల, ప్రభుత్వ అధికారుల ప్రయోజనాల కోసం బడ్జెట్లను మళ్లిస్తాయి. ఇంతదాకా జరుగుతున్నది అదే తంతు.

BS Ramulu on Advance thinking for developent

ఒకనాడు రష్యానో, అమెరికానో, చైనానో మార్గదర్శకంగా తీసుకొని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలకు పునాది వేశారు. ఏ వ్యవస్థలైనా నిత్యం చలనంలో లేకపోతే గిడసబారి పోతాయి. గడ్డకట్టిపోతాయి. పంచవర్ష ప్రణాళికా సంఘాలు, ఇలా కరుడుగట్టి గడ్డకట్టుకుపోయి పార్లమెంటు, శాసనసభల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి వారిని మించి వారిపైనే అధికారం చెలాయిస్తూ థాట్‌పోలీసింగ్‌ చేస్తూ దేశాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇది బ్యూరోక్రసీ ప్రజాస్వామ్యంగా మార్చేసింది. ఎప్పటికప్పుడు జీరో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే ఆలోచన పెరుగుతున్నది. ప్రణాళికా సంఘాలను రద్దు చేసి అంతకన్నా మంచి నిర్మాణాలను, ప్రజలకు అనువుగా ఆలోచించే నిర్మాణాలను చేపట్టవచ్చు. ఈ ఆలోచనలు కరువైన వాళ్లే పాతవాటిని రద్దు చేస్తామనగానే గగ్గోలు పెడుతుంటారు. ఇది ఆలోచనల దారిద్య్రాన్ని, తాత్విక దారిద్య్రాన్ని, ముందు చూపులేని దారిద్య్రాన్ని తెలుపుతుంది.

మరొక నూతన ఆలోచనను చర్చిద్దాం. ఉదా.కు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించాయి. 2009లో కేంద్రం కూడా 65 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఇందులో పేదలు రుణ సౌకర్యం పొందగలిగిందే తక్కువ. వాళ్లకు బ్యాంకులు రుణాలను నిరాకరిస్తుంటాయి. మేనేజ్‌ చేసుకోగలిగిన వాళ్లకే, షూరిటీ చూపగలిగిన వాళ్లకే ఈ లోన్లు ఇచ్చారు. వాటిని ప్రభుత్వాలే ప్రజాధనంతో చెల్లించడానికి ముందుకు వచ్చాయి. నూతనంగా మరొక కోణంలో ఆలోచిద్దాం. ఈ వ్యవసాయ రుణాలు రెండు, మూడేళ్ల కాలపరిమితిలో ప్రజలు తీసుకొని కట్టలేకపోయినవి. పంటలు బాగా పండిస్తే ప్రకృతి సహకరిస్తే కొంత ఆలస్యంగానైనా వడ్డీ మాఫీతోనైనా చెల్లించవచ్చు. ప్రభుత్వాలు ఆశ పెట్టినవి కాబట్టి ఆశిస్తుంటారు. ప్రభుత్వాలు చెల్లించక తప్పదు.

అయితే మరో విధంగా నూతనంగా ఆలోచిద్దాం. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం సుమారుగా 50వేల కోట్ల రూపాయలు వ్యవసాయ దారులకు అప్పు కింద ప్రభుత్వమే చెల్లించనున్నది. అయితే ఇంతే మొత్తం భూమిలేని పేద ప్రజలకు కుటుంబానికి ఐదు ఎకరాలు కొని ఇవ్వడానికి బడ్జెట్‌ కేటాయిస్తే... ? ఏం జరుగుతుంది?

ఇటీవలి కాలం దాకా తెలంగాణలో ఎకరాకు రెండు లక్షల రూపాయలు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఎనిమిది లక్షల దాకా పెరిగింది. 20వేల కోట్లతో ఎన్ని లక్షల ఎకరాల భూమి కొని పేదలకు ఇవ్వవచ్చో లెక్క వేయండి. రెండు లక్షలకు ఎకరం చొప్పున కోటి రూపాయలకు 50 ఎకరాలు, 20వేల కోట్లతో 10 లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమిని కొని పేదలకు ఇవ్వవచ్చు. ఐదేళ్లు ఇలా కేటాయిస్తే 50 లక్షల ఎకరాలు పేదలకు కొని రిజిస్ట్రేషన్‌ చేయవచ్చు. ప్రణాళికా సంఘం గానీ, వామపక్ష వాదులు, ప్రగతిశీల వాదులు గానీ ఇలా శాంతియుత పద్ధతిలో పేదలకు భూములు పంపిణీ చేసే విధానాన్ని ముందుకు తీసుకురాలేకపోయారు. డా|| బి.ఆర్‌.అంబేడ్కర్‌ వందేళ్ల క్రితమే భూములను ప్రభుత్వం సేకరించి దున్నే వారికి పంపిణీ చేయాలని కోరారు. ప్రణాళికా సంఘం ఈ మాటను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ పారిశ్రామికవేత్తల, బ్యాంకుల, భూస్వాముల, ధనిక రైతుల లక్షల కోట్ల అప్పులను ఎప్పటికప్పుడు మాఫీ చేసుకుంటూ వచ్చారు. లక్షల కోట్ల సబ్సిడీలను ఇస్తూ వచ్చారు. కానీ పేద ప్రజల కోసం 35 రూపాయలే సరిపోతాయని లెక్కలు చూపారు. ఇలాంటి ప్రణాళికా సంఘాలు, ఇలాంటి సూచనలు చేసే వారికి నిలయాలయ్యాయి. వాటన్నిటినీ రద్దు చేయడం ఎంతో అవసరం. అంబేడ్కర్‌ లాగా ఆలోచించే సామాజిక శాస్త్రవేత్తలు, అధికారులు ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగడం అవసరం. జాతీయ అభివృద్ధి కన్నా జీవన ప్రమాణాల అభివృద్ధి నిజమైన ప్రజల అభివృద్ధిని తెలియజేస్తుంది. ప్రభుత్వాలు నిజమైన జీవన ప్రమాణాల అభివృద్ధికి కృషి చేసే ప్రణాళికలు చేపట్టాలి. భారీ ప్రాజెక్టులు ప్రభుత్వ ధనంతో కడితే ముంపు గ్రామాల వాళ్లు మునిగిపోగా, ఐదువేలకు ఎకరం ఉన్న పొలాలు ప్రాజెక్టుల వల్ల ఐదు లక్షల నుండి 50 లక్షలకు ఎకరంగా ధర పెరిగింది. ఈ ధర పెరగడం ద్వారా వారు దాన్ని చూపి లోన్లు తీసుకొని మరిన్ని రంగాల్లోకి విస్తరించారు. ఈ అభివృద్ధి అంతా ప్రభుత్వ మౌలిక పెట్టుబడి ద్వారానే సాగిందనడంలో సందేహం లేదు. పారిశ్రామిక వేత్తల, బ్యాంకుల అభివృద్ధి కూడా ఇలా ప్రభుత్వ సబ్సిడీలు, మౌలిక పెట్టుబడులు, అప్పుల రద్దు వగైరా వాటి ద్వారానే అభివృద్ధి చెందాయి. అందువల్ల వీటన్నిటిలో ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు హక్కు ఉంటుంది. ఈ విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలు గానీ, ప్రణాళికా సంఘాలు గానీ, ప్రభుత్వాలు గానీ ఎన్నడైనా ప్రజలకు వివరించాయా? అందువల్ల వాళ్లు పాత ఆలోచనా విధానంలో పాత లాభోక్తులకే లాభం చేకూరుస్తారని స్పష్టం. అందువల్ల నూతనంగా ఆలోచించడానికి నూతన నిర్మాణాలు అవసరం. ప్రణాళికా సంఘాలను రద్దు చేయడం ద్వారా నూతన ఆలోచనను, నిర్మాణాలను ఆహ్వానిద్దాం.

ఇంకొక నూతన ఆలోచనను చూద్దాం. దేశంలో వంద స్మార్ట్‌ సిటీలను నిర్మించాలని ప్రభుత్వాలు కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇవి నిర్మించబడ్డాయి. మన దేశంలో వీటిని జిల్లాకు రెండైనా నిర్మించడం అవసరం. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మెడికల్‌ టూరిజం అత్యున్నత ప్రమాణాలతో విద్య, వైద్యం, పరిపాలన, విద్యుత్‌, రోడ్లు, టెలిఫోన్‌, భద్రతా సౌకర్యాలు, మాల్స్‌, బ్యాంకు వగైరా సేవల అందుబాటు ప్రపంచ స్థాయిలో నిర్మించడం ఈ స్మార్ట్‌ సిటీల ప్రధాన లక్ష్యం. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీల మరింత అభివృద్ధికర రూపమే స్మార్ట్‌సిటీలు. ఢిల్లీలో ద్వారకాపురి అనే టౌన్‌షిప్‌లో లక్ష అపార్టుమెంట్లు చక్కగా నిర్మించారు. స్మార్ట్‌సిటీలు కూడా ఇలాంటివే. మరో మాటలో చెప్పాలంటే ఇదొక ప్రత్యేకమైన టౌన్‌షిప్‌. ఒక పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీయే తప్ప మరొకటి కాదు. గేటెడ్‌ కమ్యూనిటీ యొక్క విశ్వరూపమే స్మార్ట్‌ సిటీ. అయితే ఇవి గ్రామీణ ప్రజల ఉపాధికి నష్టం కలిగిస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆధునిక అభివృద్ధి ఎప్పుడూ ఆధునిక వృత్తి, ఉపాధి అవకాశాలను పెంచుతాయి. నూతన నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తాయి. నూతన నైపుణ్యాలు అలవర్చుకొని మంచి ఉపాధిని పొందుతుంటారు. విద్యుత్‌, ఆర్టీసీ, మాల్స్‌, సూపర్‌ మార్కెట్స్‌ వంటి వాటిలో కొన్ని లక్షల మంది నూతన నైపుణ్యంతో ఇంజినీర్లుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, సేల్స్‌ సూపర్‌వైజర్లుగా, డ్రైవర్లుగా, కండక్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఆముదపు దీపాలు, ఎడ్ల బండ్లు, నాలుగు చక్రాల కూరగాయల బండ్లు, చిన్న కిరాణా షాపులు వీటికి ప్రత్యామ్నాయం కాదు. అవి చాలకనే ఆధునిక అభివృద్ధిలో ఆధునిక విద్య, ఆధునిక వైద్యం, విద్యుత్‌, బస్సులు, కార్లు, బైకులు, సైకిళ్లు, మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లు ముందుకు వచ్చాయి. వెనుకబడిన సమాజంలో జీవించే వాళ్లు వీటిని అందుకోవడం ద్వారా ఆధునిక అభివృద్ధిని అందుకోవడం సాధ్యపడుతుంది. ఇవి గ్రామీణ ప్రజల ఉపాధి నైపుణ్యాలను, ఉత్పత్తి సేవా నైపుణ్యాలను పెంచి వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుంటాయి. కానీ కొందరు గ్రామీణ ప్రజలకు నష్టమని ప్రచారం చేస్తున్నారు.

గ్రామాలు వెనుకటి వలెనే ఉండాలని కోరే వాళ్లు ప్రజలు అభివృద్ధి చెందడాన్ని కోరుకోవడం లేదు. గ్రామాల నుండి ఇప్పుడు సగం జనాభా ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు, నగరాలకు, దేశాలకు వలస వెళ్ళి ఉపాధి సాధించుకుంటున్నారు. గ్రామాలకు కూడా ఆధునిక సౌకర్యాల విస్తరణ పెరుగుతున్నది. డిజిటల్‌ గ్రామాలుగా పల్లెలు ఎదగడానికి ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, టీవీలు, ఆధునిక విద్య, ఆధునిక వైద్యం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక జీవన విధానం విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోని సౌకర్యాలు పల్లెల్లో కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు స్థానిక వనరుల ద్వారా అధిక ఉత్పత్తి, సాగునీటి, తాగునీటి సౌకర్యాల కల్పన ద్వారా గ్రామాల్లో జీవించే ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. డాబా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవి అందుకోలేని వారికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిని సక్రమంగా, అవినీతి రహితంగా, మధ్య దళారులు లేకుండా అందించడానికి సామాజిక శ్రేయోభిలాషులు కృషి చేయాల్సి ఉంది. ఇలా అభివృద్ధి కోసం అడ్వాన్స్‌ థింకింగ్‌తో నూతనంగా అన్ని రంగాల్లో ఆలోచించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది.

- బియస్ రాములు

English summary
An eminent writer BS Ramulu writes about advance thinking for progress and development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X