వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: ‘స్వచ్ఛేజనా సుఖినోభవంతు’

|
Google Oneindia TeluguNews

అది ఒక రాజ్యము. రాజ్యము అను మాట దానికి సరిగ్గా పొసగదు. అది ఒక మహా సామ్రాజ్యము. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ ఘార్జర మహారాష్ట్ర సౌరాష్ట్ర మగధ మాంచాల వంటి అనేక రాజ్యములతో గూడి జంబూద్వీపంలో విరాజిల్లు సామ్రాజ్యమది. ఇట్టి మహా సామ్రాజ్యమునకు ఏలిక ఎవడయి వుండాలి? ఉత్తముడు ఉత్తమొత్తముడు, పురుషోత్తముడు ధీశాలి, ధైర్యశాలి అవక్రవిక్రమ పరాక్రమ సాహసోపేతుడై వుండి తీరాలి. అశేష జనవాహినిని ఆ సేతు హిమాచల పర్యంతము నివసించు సకల జనవాళికి ఆదర్శ ప్రాయుడై వుండాలి. మాతృమూర్తుల్ని కన్నబిడ్డల్లా పితృమూర్తుల్ని కన్న కొడుకుల్లా ఏలాలి. స్త్రీ బాల వృద్ధులందరికీ సుఖశాంతులు యివ్వగలిగిన వాడైవుండాలి.

మన అదృష్టం పుచ్చిపోక పండినది కనుక మనమిప్పుడు అట్టి రాజాధిరాజ రాజగంభీర రాజచండ ప్రచండ దోర్దండులవారి నివాసమునకు సమీపమున వున్నాము. సంధ్య పిలుస్తున్నందున వడివడిగా గృహానికి బయలుదేరినాడు రవి. ఆకాశము ఎరుపెక్కింది. పక్షులు తమ తమ గూళ్లకు తిరిగివస్తూ కలకలం రేపుతున్నవి. ఇహనో ఇంకొంచెం వేచిన తరువాతనో నిశాకాంత తన నల్లటి జుత్తుతో లోకమును ముంచెత్తబోతున్నది. రండి వేగిరము. రాజ ప్రసాదమునకేగి అచ్చట యేమి జరుగుతున్నది వ్యవహారమేమి, కథయూ కమామిషుయూ ఏమిటో పరిశీలించెదముగాక!

రాజావారి రహస్య మందిరము. ఉచితాసనము మీద రాజావారు సముచితాసనము మీద మంత్రి వరేణ్యులు ఆసీనులై వున్నారు. వారేదో దీర్ఘాలోచనలో వున్నట్లు తోస్తున్నది. చీకట్లు నలుదిక్కుల నుండీ కమ్ముకొస్తున్నవి. పరిచారకులు వచ్చి దీపములు వెలిగించినారు. రాజావారు మీసములు దువ్వుచూ గడ్డము గోకుచూ వుండ మంత్రివారు తలపాగాను వూడబెరికి బట్టతల మీద గోకుకొనుచున్నారు.

వినండి వినండి విని తరించండి వారేమో మాటలాడుచున్నారు. వారి పెదవుల నుంచి మాటలు జాలువారుచున్నవి. విని తరించెదము రండి.

ఏమోయీ మంత్రిసత్తమా! మనము రాజ్యమునకు వచ్చిన నాటి నుండి ఏమేమి ఘన కార్యములు సాధించినామో ప్రజలకు ఎరుక యైనదా? అని రాజావారు అడిగినారు.

ప్రజలు సర్వజ్ఞులు ప్రభూ! వారు ఎంతో తెలివిమీరియున్నారు. వారు ఎరుంగని విషయమే లేదు అని సెలవిచ్చినారు మంత్రిగారు.

మరి యింక వారు నా నామ జపము చేయుట లేదేమి? నాపైన భజనలు, స్తోత్రములు ఎవరైనా రచించిరా లేదా? నా నామ సంకీర్తనము చేయు వారెవరైన కలరో లేరో? అని రాజావారు మీసము దువ్వుచూ ప్రశ్నించినారు.

chintapatla quick boxing on cleanness in man's character

ఏమి చెప్పను ప్రభూ! ఇది యొక పిదప కాలము. కలికాలము రాజులకు కలిసి రాని కాలము. కష్టకాలము. రాజులు ఏమి చేసియూ ప్రజలను సంతృప్తి పరచలేరు. ఎంత చేసిననూ ప్రజలు వెర్రివెంగళప్పలయి మనలను అనుసరించి రారు అనినాడు మంత్రి బట్టతల మీద బోటన వేలుతో గీక్కుంటూ.

అటులయిన మనమేమి చేయవలెను. ఏమైనను సరే మన రాజ్యమున ప్రజలను వెర్రివెంగళప్పలను చేసిన గాని మన అధికారము సుస్థిరము కానేరదు. మంత్రి కనుక గోక్కొనుటకు బొచ్చు రహిత గుండు యున్నది గనుక నీవే ఏదో ఒక ఉపాయముు నూదుము ననుచు రాజు వారు కిరీటమూడదీసి చెవిని మంత్రిగారి మూతికి అందించిరి.

ఇంతమాత్రమునకు కిరీట మూడదీయనవసరం లేదు. మీ చెవి నా మూతికడ పారవేయనూ అక్కర లేదు. పైపెచ్చుయిది రహస్య మందరిము గదా అనిన మంత్రితో

సరే! అట్లయిన ధగధగలాడే కిరీటమును తిరిగి ధరించుకున్నాను. చెప్పుడు అన్నాడు రాజు.

కలియుగమున పిదప కాలమునదగు ఈ కాలమును సంచలనముల కాలము అనియు అనుచున్నారు. రాజన్నవాడు ఏదియో యొక సంచలనము కలిగించి ప్రజల కళ్లు తెరిపించవలె నదియే తరుణోపాయము అన్నాడు మంత్రి.

తక్షణమే ఏదో ఒక గందరగోళమును లేదా సంచలనమును సృష్టించి చరిత్రలో నాపేరు సువర్ణాక్షరములలో లిఖించబడునట్లు చేయుమోయీ మంత్రి పుంగవా అన్నాడు రాజు.

అయిన ఈ క్షణమే మనం రాజ్యమున తిరిగివత్తము. చీకటి పడుచున్నది. దొంగలు నగరమున తిరుగువేళ అగుచున్నది. ఇదియే సుముహుర్తము. మనము మారువేషములలో బయలేరి పోదము. రాజావారూ తమరు అభ్యంతర మందిరమునకేగి ఏదియో ఒక దరిద్రగొట్టు వేషము ధరించిరండి. నాకే వేషమూ అక్కరలేదు. తలపాగా తీస వైచిన నాది నిజముగానొక దరిద్రగొట్టు ముఖమే. యిక ఆలస్యం వద్దు వేగిరపడుడు అని రాజును లోపలి గదిలోనికి పంపినాడు మంత్రి.

రాజునూ మంత్రియునూ మారువేషములలో చీకట్లో తారట్లాడుతూ వీధుల వెంట పడి తిరిగి తిరిగి నగరి బయట వున్న ఒక్కగుడిశె ముందుకు చేరినారు రండి అచ్చట యేమి జరుగుచున్నదో కందము, విందము రండి.. రండి.

గుడిశెముందు మినుకు మినుకు మను దీపము కడ కండ్లు మూసుకుని పద్మాసనము వేసుకుని కూర్చుని వున్నడొక్క మహానుభావుడు సన్యాసి జడధారి. మారువేషమున నున్న రాజూ మంత్రి ఆయన ఎదుట నిలబడిన మరుక్షణం ఆ సాధువు కండ్లు తెరిచినాడు.

మహానుభావా! తమరెవ్వరు. ఇంతకుముున్ను ఎప్పుడూ మీ దివ్య దర్శనము కాలేదు. ఇటకెందుకు వచ్చినారు అని ప్రశ్నించాడు మంత్రి.

సన్యాసి మందస్మిత వదనారవిందుములతో ఆ యిరువురనూ పరికించినాడు పిదప ఈ విధముగా పెదివి విప్పి పలికినాడు.

ఈ రాజ్యమునకు మా ముత్తాతతకు బాదరాయాణ సంబంధం వున్నదని తెల్సి మేరు పర్వతం మీద తపస్సును భగ్నం చేసుకుని వేంచేశాం మేం. ఈ రాజ్య సంక్షేమం కోరి వచ్చాం అన్నాడు సన్యాసి.

రాజూమంత్రీ ముఖాలు చూచుకొన్నారు. అంతకంటే కావాల్సినదేమున్నది. మేమునూ ఆ కారణముకై దిమ్మరులమై తిరుగుచున్నాము. ఏమి చేయవలయునో సెలవియ్యండి అనడిగాడు మంత్రి.

సన్యాసి గంభీర వదనంతో ఈ రాజ్యమునకు ముగ్గురు శత్రువులున్నారు. వారెవరో కాదు చెత్త, మురికి, కంపు. వారిని వోడించిన గాని ఈ రాజ్యము బాగుపడి బట్టకట్టదు అన్నాడు.

స్వామీ తమరేమంటున్నారో మాకు అర్థమగుట లేదు అని గొణిగినాడు మంత్రి బట్టతల గోక్కుంటూ.

ఏమున్నది. విశదముగనే చెప్పితిని. చెత్త అనిన చెత్తయే. మురికి అనిన మురికియే. కంపు అనిన కంపుయే అని సన్యాసి కనులు మూసుకొని మరి తెరువలేదు. అది ధ్యానమో మౌనమో గాఢ నిద్రయో అర్థం కాలేదు రాజుకున్నూ మంత్రికున్నూ.

తెల్లవారుజామున కోటకు తిరిగివస్తూ వున్న రాజావారి మీద ఎవరో పేడనీళ్లు కొట్టిరి. మంత్రిగారి మీద బుట్టెడు కోడి బొచ్చుపడినది బెదిరి పరుగెత్తిన యిద్దరూ బురద గుంటలో పడిదొర్లి చచ్చీచెడి బయటపడి కోటకు చేరినారు. వారి శరీరముల నుంచి వచ్చు రొచ్చుకంపు వాసనకు తాళలేక పరివారము వారు పారిపోయినారు.

సన్యాసి చెప్పిన నవీ, స్వానుభవమునవచ్చినదీ కలిపి రాజావారు సంచనానికి తెర ఎత్తినారు. రాజ్య సంక్షేమమునకు అడ్డుపడుతున్న శత్రువులను ఎదిరించనిలిచినారు చీపురు కట్టతో, బకెట్టు నీళ్లతో చిల్లి జగ్గుతో ఫినాయిల్ బుడ్డితో.

రాజు తలచుకొనిన దెబ్బలు కరువా! స్వయముగ రాజావారు వీధులందు చెత్తవూడ్చసాగినారు. మురికి గంటులలో చేయి పెట్టి కెలకసాగినారు ముక్కు మూయకుండగ కంపును ఇంపుగ భావించసాగినారు. సంక్షేమ సామ్రాజ్యమునకు పునాది స్వచ్ఛ సామ్రాజ్యమే నను సందేశమును ప్రజలకు అందించినారు. సందేశములతోపాటు చీపుర్లు, బక్కెట్లు జగ్గులు కంపునింపు చేయమందు బుడ్లు అందించినారు. స్వచ్ఛ సామ్రాజ్య సాధనకు చీపురే మహాయుధమని, వజ్రాయుధమని తేల్చి చెప్పినారు. ప్రతి పౌరుని చేతికి చీపురు అందినది. గృహము లేమి, కార్యాలయములేమి, బహిరంగ స్థలములేమి, బాటలేమి పేటలేమి, బహిరంగ స్థలములేమి ఎక్కడ చూసిన చీపురు వీరంగమే బాట వెంట నడిచే ప్రతివాడు చీపురు ధరించి ఉండవలసిందే. బాట ఊడ్చుకుంటూ నడవ వలసిందే. చీపురు ఒక సంచలనమై చలించసాగింది. రాజ్యం పేరు చీపుర్ల రాజ్యమయింది. రాజావారు చీపురాజావారయ్యారు. ఎంత చేసినా, ఎంతెంత ఊడ్చినా చెత్త తరగలేదు మురికి దారికి రాలేదు కంపు కంపుగానే ఉండినది.

చాలా కాలము తర్వాత రాజుకూ మంత్రికీ మునుపెన్నడో నగరి బయట కనిపించిన సన్యాసి మళ్లీ దర్శనమిచ్చినాడు. ఎంత శ్రమించినా చెత్త మురికి కంపులను జయించలేక పోవడమును గురించి విన్నవించినారు.

అప్పుడు సన్యాసి పకపకా నవ్వినాడు. చెత్త మురికి కంపులపై విజయం సాధిస్తే సంక్షేమ రాజ్యమవుతుందని అన్న మాట నిజమే కాని ఎంత శుబ్బరం చేసినా మళ్లీ మళ్లీ పేరుకుపోయే చెత్త మురికి కంపు కాదు నేను ప్రస్తావించినది. ఈ రాజ్యమున అవినీతి చెత్త, లంచగొండి తనం మురికి, పక్షపాతం కంపు. వీటిని పారదోలితనే స్వచ్ఛతా, సంక్షేమం. మనుషుల్లో వున్న చెత్త మురికి కంపులను శుభ్రం చెయ్యండి పొండి. ‘స్వచ్ఛే జనా సుఖినోభవంతు' అంటూ కనులు మూసికొనినాడు సన్యాసి.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about cleanness in man's character.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X