వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: ఫెస్టివల్ ఆఫ్ లైట్స్

|
Google Oneindia TeluguNews

రాక్షసుడయిన వాడెవడూ తిన్నగా వుండడు కదా! తన రాజ్యమేదో తాను ఏలుకుంటూ తనమందేదో తను తాగుతూ, తన ఫుడ్డేదో తను కొడుతూ వుంటే సరిపోతుంది కదా. కానీ అట్లా కూచున్నచోటు కూచుని, ఏ పబ్లిసిటీ లేకుండా వుండలేడు కదా!

ఏదో ఓటి చెయ్యాలి, న్యూసులోకి రావాలి. నలుగురినోళ్లల్లోనూ నానాలి. అప్పుడు కానీ రాక్షస జన్మధన్యం అవదు కాబోలు. అందువల్లనే రాక్షస జన్మ సార్థకం చేసుకునేందుకు ‘గ్లోబ్' మీదకు ఎడం కాలు ముందు పెట్టి దిగాడొక అసురుడు. భూమ్మీద జనం నరకానికి పోడానికి ముందే వాళ్లకు నరకం చూపించే ప్రోగ్రాం పెట్టుకుని.

రాక్షసుడయితేనేం నరకం చూపించే అసురుడయితేనేం వాడికీ ఓ మిషన్ వుంది. వాడిదీ వో ప్రాజెక్టు వర్కే. అడవుల్లో వుంటూ పర్ణశాలల్లో టైంపాస్ చేస్తూ ఆకులూ అలములూ కందమూలములూ వంటి వాటిని నవుల్తూ యజ్ఞాలు చేస్తూ, ధ్యానంలో భక్తిలో తాదాత్మ్యం చెందుతూ వుండే గడ్డాల వాళ్లను చూస్తే అసురులకెందుకో గానీ చెప్పలేని చిరాకు. అందర్రాక్షసులకి మల్లేనే ఈ నరకం డాట్‌కామ్ రాక్షసుడికీ వీళ్లంటే చిరాకే కాదు వొళ్లుమంట. వీళ్లు చేసే పూజల్లో ఎవడో ఎక్కడుంటాడో తెలీని వాణి భజనలూ, కీర్తనలూ తిక్కరేపుతయి. కళ్లెదుట చెట్టంత రాక్షసుడు కనబడుతుంటే వాడికోరలూ కొమ్ములూ వాడి చేతిలో ముళ్ళ దుడ్డుకర్రా కనబడుతుంటే పట్టించుకోకుండా ఎక్కడో వున్నవాడి కోసం జపాలూ తపాలూ. అంచేత వీళ్లకి బుద్ధి చెప్పడం వీళ్లని చావగొట్టి చెవులు మూయడం ఒక ఇంటరెస్టింగ్ జాబ్ అయ్యింది ఈ నరకుడనే వాడికి. దొరికిన వాడ్ని దొరికినట్టు నరకడమే పనిగా పెట్టుకున్నాడు. గడ్డాల వాళ్లవి నిజం గడ్డలా, పెట్టుడు గడ్డాల అని లాగి చూసేవాడు. ఇళ్లూ వూళ్లూ తగలెట్టేవాడు. అయితే అందమైన ఆడాళ్లని మాత్రం ఏమీ అనేవాడు కాదు. తీసుకువచ్చి తన జనానాలో కలిపేసుకునేవాడు.

ఇలాగిలాగు వీడు సజ్జనులను గుంజలకి కట్టేసి కొరడాల్తో బాదేసి కాళ్లూ చేతులూ తీసేసి వికటంగా నవ్వుతూ ఎంజాయ్ చేసేస్తుంటే జనమంతా ‘ఓ గాడ్ సేవ్ అజ్' అని కకావికలుగా, చెల్లా చెదురుగా, ఆదరాబాదరాగా ప్రాణాలు కమండలాల్లోనూ, ఉత్తరీయాల అంచుల్లోనూ మూటగట్టుకుని రేసుగుర్రాల్లా పరుగెత్తసాగారు. ప్రాణాల మీదకి వస్తే ఏ ప్రాణి అయినా రేసుగుర్రమే మరి.

పరుగెట్టిన వాళ్లంతా ఆ యుగంలో ఆ కాలంలో అందరికంటే తెలివైన వాడూ, అందరి కంటే బలమైన వాడూ, అందరికంటే పవర్‌ఫుల్ వెపన్ వున్నవాడూ అన్నింటినీ మించి అందరికంటే మంచివాడు ముఖ్యంగా మంచోళ్లకి మంచివాడూ అయిన డీ.కే. దగ్గరికి చేరుకున్నారు. డీకే అన్న పేరున్న ద్వారకా కృష్ణారావు వాళ్ల ప్రాబ్లమ్స్ అన్నీ ఓపిగ్గా విన్నాడు. ఇమీడియెట్‌గా యాక్షన్ తీసుకుంటానని మాటిచ్చాడు.

chintapatla quick boxing on Deepavali festival

మాటయితేయిచ్చేడు గానీ ఆ సార్‌కీ తెల్సు అందరు రాక్షసులూ ఒక్కలా చావరని, ఒక్కొక్కడి చావు వో ప్రత్యేకమైన ఎపిసోడ్ అనీ వో స్రీకెట్ కోడ్ వుంటుందనీ. అందుకే సీబీఐ వాళ్లని పిలిచాడు. మంత్రాంగం చేశాడు. టెక్ట్స్ బుక్కులూ, రిఫరెన్సు బుక్కులూ తిరిగేశాడు. ఫైనల్‌గా వో కంక్లూజన్‌కి వచ్చాడు. ఈ నరకుడనే రాక్షసుడ్ని తన సుదర్శన చక్రం నరకలేదని ఈ పుండాకోరు రాక్షసుడు వాడి తల్లి చేతిలో తప్ప చావడనీ తెల్సుకున్నాడు. అయితేనేం ట్రై అండ్ ట్రై అనుకున్నాడు. వీడ్ని చంపుతానని మాటయిచ్చాం గనక యుద్ధం చేద్దాం చావ గొడ్దాం మళ్లీ మంచోళ్ల దగ్గరికి రాకుండా వార్నింగిద్దాం అనుకున్నాడు. వీడి తల్లి కనబడితే బాగుణ్ణు ఆవిణ్ణి తీసుకుపోయి చితగ్గొట్టిచ్చే వాణ్ణి అనుకున్నాడు.

యుద్ధానికి బయల్దేరిన పతిదేవుడికి ఎనిమిది మంది భార్యలూ బొట్టు పెట్టి మంగళ హారతిచ్చేరు. తీర రథం బయలుదేరే వేళకి మంగళ హారతి పళ్ళెం చెలికత్తె చేతికందించి పయిట చెంగు బొడ్లో దోపి ‘డియర్! నేనూ నీ వెంట వస్తాను' అని రడీ అయిపోయింది ఓ పెళ్లాం, పెళ్లాలందరిలోకీ ‘రిచ్ పెళ్లాం' కోపం వస్తే యమ ఘాటుగా అలిగే పెళ్లాం.

ఆశ్చర్యంతో నోటమాట రాలేదు ‘హబ్బీ'కి. ఎన్నడూ లేనిది ఈవిడ ఇలాగ రణరంగంలోకి వచ్చేస్తానంటున్నదని విస్తుపోయి, తను వెళ్లేది పిక్నిక్ స్పాట్‌కి కాదని వార్ ఫీల్డ్ కని, అది మొగ యోధుల పని అని అబలలకూ సుకుమారులైన లతాంగులకూ అది రాకూడని చోటని సముదాయించాడు. కానీ ఆవిడ ఎప్పటిలాగే మొగుడి మాట వినలేదు. రోష కషాయిత నేత్ర అయ్యింది. బుగ్గలూ కళ్లూ ఎరుపెక్కడమే కాకుండా ముక్కు పుటాల్నించి ‘హాట్ ఎయిర్'ని ‘బ్లో' చేసింది. ఆమె అలిగితే అలక తీర్చడానికి మళ్లీ పద్యాలూ పాటలూ రాసి పాడాల్సి వొస్తుందని ‘మ్యాన్ హ్యాండిలింగ్'కి కూడా ఆ వుమన్ వెనుకంజ వేయదనీ ఒప్పుకున్నాడు పతిదేవుడు.

యుద్ధం మొదలయ్యింది. బాణాలు ఆ వైపు నించి ఈ వైపుకి పరుగులు పెట్టేయి చీకట్లు కమ్మేయి మబ్బులు వురిమేయి మెరుపులకి చూసేవాళ్ల కళ్లు బైర్లు కమ్మేయి. నరకుడు ఉన్నచోట్నించి ఒక్క ఫీటు కూడా వెనక్కి ‘లెగ్గు' పెట్టలేదు. చక్రం ప్రయోగించి అవతివాడి తలని క్షణాల్లో ‘కసక్'మనిపించే కృష్ణారావుకి యింత లాంగ్ టైం వార్ అలవాటు లేనే లేదు. బాగా ‘టైర్' అయి పోయేడు. తన ‘కండిషన్' యిలాగుంటే తన ‘బెటరాఫ్' ఎలా వుందోనని ఆమె వైపు చూశాడు. ‘పాపం' అనుకుంటూ. కానీ ఆమె కళ్లల్లో ఎరుపు జీర కనిపించి అవాక్కయ్యేడు. పూర్తిగా తెర్చుకున్న ఆ విశాల నయనాల్లోకి చూశాడు. రథమ్మీద ‘స్టడీ'గా నిలబడి ఆ అసురుడి వైపు మింగేసేలా చూస్తున్న ఆమెని పరీక్షగా చూసిన కృష్ణాజీకి హఠాత్తుగా గతం గుర్తుకొచ్చింది. ఆమె ఎవరు? ‘వో కౌన్ థీ' అనేది తెలిసొచ్చింది. గతంలో హిరణ్యాక్షుడనే వో ‘లాండ్ గ్రాబర్' భూమి అనే ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సముద్రంలో దాక్కుంటే తను వరాహమూర్తిగా వెళ్లి ఆ రాక్షసుడ్ని చంపేసి ఆమెను సతిగా స్వీకరించిన సంగతి తమ సంతానంగా ఈ నరకుడనే వాడు జన్మించాడనీ సీన్ బైసీన్ మొత్తం గుర్తొచ్చింది. ‘దటీజ్ కృష్ణా' అనుకున్నాడు. సో! ఆ అసురుడి తల్లి ఈనా ముద్దులసతి అనుకున్నాడు. అంతే ఆమె చేతిలో వాడు ఛావడం ఖాయం మధ్యలో మనమెందుకు యుద్ధం చేయడం అనుకున్నాడు. ఎలాగూ అలిసిపోయాం కదా కాస్సేపు కునుకు దీద్దామని అట్లాగే రథంలో వెనక్కు వాలిపోయేడు.

పతి దేవుడి చేతిలోంచి ధనస్సూ బాణాలూ అందుకున్న అబల సబల అయ్యింది. నరకుడికి చావు మూడింది. దీపావళి వచ్చింది. ‘బి హైండ్ ఎవ్రీ మ్యాన్ దేరీజ్ ఎ వుమన్' అన్నది నిత్య సత్యమైపోయింది!

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Deepavali festival history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X