వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: మదరిండియా!

|
Google Oneindia TeluguNews

దేవతల్ని వెంటపడి తరిమి ఎట్లాగూ చావరు గనక చావగొట్టి ఘిల్లు ఘిల్లున నవ్వే అవకాశం వచ్చిందిరా యిన్నాళ్లకి అనుకున్నారు రాక్షసులు.

దొరికాడ్రా దున్నపోతు. వీడితోక పట్టుకుని సొరగానికి ఎగిరిపోయి దేవతల్ని లాఠీ చెయ్యచ్చు అనుకున్న రాక్షసులు దొరికిన దున్నపోతుని తమకు రాజుని చేసుకున్నారు దున్నపోతుని సింహాసనం ఎక్కించారు.

అసలేదున్న ఆపైన రాక్షసరాజు. ముక్కులో దూర్చబడని పగ్గాలు పట్టశం కాకుండా వున్న వాడు మందినీ మార్బలాన్నీ కత్తుల్నీ కటారుల్నీ కొమ్ములున్న వాళ్లనీ, కోరులన్న వాళ్లనీ వేనకేసుకుని సొరగలోకపు ద్వారం దాకా హూంకారిస్తూ కాళ్లు ఎగరేస్తూ వొళ్లు విరగేస్తూ చేరుకున్నాడు.

అల్లంత దూరాన్న రాక్షస సైన్యాన్నీ రాక్షస రాజునీ కొందరు ఆడవాళ్లు మహిషాసురుడు వచ్చాడు రాక్షసుడు వచ్చాడు అని వాళ్ల భాషలో అరుస్తూ చెల్లాచెదురై గుండెలు చెరువులై పరుగులు తీశారు. హెవెన్‌లో గాడ్సందరికీ ఈ బ్రేకింగ్ న్యూస్ అందింది. ఇంకేముంది ఇంజను చల్లబడ్డది అనుకున్నాడు ఇంద్రుడు. బ్రతికుంటే బలుసాకు అనుకునే వీల్లేదు గదా దేవతలకి అమృతం తాగివున్నారు గనక చచ్చినా చావరు గనక చావు దెబ్బలకి ఝడిసి దాపున్న చోట్ల దాక్కున్నారు. తమని రక్షించే దిక్కు కోసం తలో దిక్కూ పరుగెత్తేరు.

ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని మహిషాసురుడ్ని అడ్డుకుందామా అనుకున్నాడు గురుబోధ చేశాడు గురుడు. సాహసం చేయకురా డింభకా అన్నాడు. మహిషాసురుడి చండ ప్రచండ దోర్దండ శక్తుల్ని విడమర్చి చెప్పేడు. వాడికున్న ఆటమిక్ ఎనర్జీని ఎదుర్కోవడం త్రిమూర్తులకు కూడా వల్ల కాదన్నాడు. దున్నపోతు తన్నుల్తో వీపు విమానం సౌండు యివ్వక ముందే ఎక్కడికో అక్కడికి పారిపోవయ్యా అని సలహాయిచ్చేసి ‘శీఘ్రబుద్ధేపలాయన:' అంటూ అంతర్థానమై పోయేడు.

Chintapatla Quick boxing on Vijaya Dashami festival

ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది బుర్రకు ఎక్కదు కానీ తన్నులు తప్పించుకోవాల్సిన టైం కాబట్టి మన టైం బాగుండలేదని బాగా అర్థమయ్యి ‘భాగో' అనుకున్నాడు.

సొర్గలోకపు సింహాసనం ఖాళీగా వుంటంతో దాంట్లో ఎక్కికాలు మీద కాలేసుక్కూచుని ‘ఈళ్లంతా ఏర్రా' అని హుంకరించాడు మహిష్.

మీ కాలిగిట్టల చప్పుడు పిట్టల్లా ఎగిరి పోయినట్టున్నారు మైలార్డ్ అన్నాడు రాక్షస మంత్రి.

మరిప్పుడేం చేద్దాం? ఎవర్ని తందాం అని దిగులు పడ్డాడు మహిష్.

డోంట్ వర్రీ సర్! వీసాలు వున్న వాళ్లు యింకా పైలోకాలకి పారిపోయినా అవిలేని వాళ్లు యిక్కడే ఎక్కడో దాక్కుని వుంటారు. మనవాళ్లు వాళ్లని సైరన్ లేని పోలీస్ వ్యానుల్లో వెళ్లి పట్టుకొస్తారు. వచ్చా వాళ్లని బండ బాదుడు బాదిద్దాం ఆనందిద్దాం అన్నాడు మంత్రి రాక్షసుడు.

మరి వాళ్ల సంగతేమిటి? గానా బజానా ఆటాపాటా అని కిసుక్కున నవ్వాడు దున్నపోతు ముఖం అదో మాదిరిగా పెట్టి.

వో! ఛీర్ గర్ల్సా! ఆళ్లెక్కడికి పోతారు అందర్నీ ఒడిసి పట్టుకొచ్చి ‘డాన్స్ మారథాన్' చేయిద్దాం. సేనాపతీ నువ్వీ క్షణమే బ్యూటీల వేట డ్యూటీకి బయల్దేరు అని రాక్షస మంత్రి రాక్షస సేనాపతికి ఆర్డరేశాడు.

అందాక డ్రమ్ముల్తో సారాలాగిస్తా ఎవడ్రా అక్కడ అని దున్నపోతులా అరిచేడు మహిషాసురుడు.

అక్కడ ఇంకా పైలోకాల్లో దేవతలు ఎమర్జన్సీ మీటింగ్ పెట్టుకున్నారు. మహిషాసురుడికి వున్న హార్స్ పవర్‌ని ఎవరమూ ఎదిరించలేమనుకున్నారు. ఏం చేయాలో తెలియక ‘హై బీపీ'తో వూగిపోయారు. ఆదిలో ఈ సమస్తలోకాల్ని సృష్టించింది ఆ ఆది పరాశక్తేనని తమకు సృష్టి, స్థితి, లయలను అడ్మినిస్ట్రేట్ చేసే కెపాసిటీ యిచ్చింది ఆమేనని యిప్పుడు ఈ లోకాల్నీ వాటినేలే మమ్మల్నీ, మిమ్మల్నీ కాపాడ గలిగింది ఆ ఒక్క జగజ్జనని మాత్రమే, సృష్టికి మూలమైన స్త్రీ శక్తే సృష్టిని కాపాడుకోగలదనీ ముగ్గురు మూర్తులూ ముక్త కంఠంతో సెలవిచ్చారు.

దేవతలందరూ ఆది స్త్రీని ప్రార్థించారు అమ్మా తల్లీ ఈ లోకాలన్నీ సృష్టించిన జననీ రక్షించు రక్షించు అని వేడుకున్నారు. అప్పుడు ఆవిర్భవించింది ఆ స్త్రీ రూపం. ఆ సబల. తాను మహీషాసురుడ్ని చంపుతానని అభయం యిచ్చింది. దేవతలందరూ తమ అస్త్రశస్త్రాలను ఆ మాతకు సమర్పించారు. ఆ ఆయుధాలను వేయి భుజాలతో ధరించి సింహాన్ని అధిరోహించి ఆ దివ్య తేజస్విని యుద్ధానికి బయలుదేరింది.

డ్రమ్ములకొద్దీ సారాపీల్చి అప్సరసల బెల్లీ డ్యాన్సులు ఎంజాయ్ చేస్తున్న మహిషాసుడికి సింహగర్జన ప్రళయకాల మేఘ గర్జనలా వినిపించింది. గుండెజారి బేజారైపోయింది. మత్తునిండిన ‘బ్లడీ ఐస్'ని బలవంతంగా తెరిచి ఎవర్రా అదీ అనరిచాడు అనరిచానని అనుకున్నాడు. అది అరుపు కాదు వొణుకు.

ఎవరో స్త్రీ! సింహమెక్కి వస్తున్నది అన్నాడు బంటు.

స్త్రీ అన్నమాట వినగానే భయం మాయం అయింది. ఓ సోస్ ఆడదేనా! సింహమెక్కి వస్తుందా! నాతో యుద్ధానికేనా! ఈ మహిషాసురుడితో ఫైటా! ఈ హీ బఫెల్లోతోనే ఫైటింగా అని పిచ్చిపిచ్చిగా అరుస్తూ యుద్ధ భూమిలోకి వెళ్లాడు మహిష్.

ఓ సోస్ ఆడదేనా అనుకుంటూ వెళ్లినవాడు ఆ స్త్రీ ఆకారాన్నీ ఆమె ధరించిన అనేక ఆయుధాల్నీ ఎప్పుడెప్పుడు వీడి రక్తాన్ని ‘స్త్రా' లేకుండా పీల్చేద్దామా అని వాడి చూపుల్తో నిలబడ్డ సింహాన్ని చూసి బెదిరాడు. కానీ అదురూ బెదురూ పైకి కనిపించకుండా దాచుకుని యుద్ధం మొదలు పెట్టాడు.

అది తొమ్మిది రోజుల ‘వార్' రోజు రోజుకీ తన పవర్ తగ్గిపోయి డీలా పడ్డాడు రాక్షసుడు. యుద్ధం జరుగుతున్నంత సేపూ ఎవరీమె అనుకునేవాడు. ఆమె బాలా త్రిపుర సుందరి అని, అన్నపూర్ణ అని, మహాకాళి అని, లక్ష్మీ అని సరస్వతి అని, గాయత్రి అని ఎవరో చెవిలో చెప్తున్నట్టు వినిపించేది. పదవ రోజు ఈమె కనక దుర్గ అని యివాళ్టీతో నీ అయువు మూడిందనీ అతని మనస్సు చెప్ప సాగింది.

మూడు నేత్రాలు, అనేక భుజాలు, సమస్త ఆయుధాలు ధరించిన సింహవాహిని దుర్గను చూసిన మహిషుడు తనకు మరణం తప్పదనుకున్నాడు.

అమ్మా! తల్లీ! ఎవరు నువ్వు నన్నెందుకు చంపుతున్నావు? అన్నాడు.

అవున్రా నేను అమ్మనే నేను తల్లినే. నిన్నెందుకు చంపుతున్నానో నీకు తెలీదూ అన్నదామె రక్తవర్ణపు నాలుకని బయటకు చాచుతూ.

అమ్మ ఎక్కడయినా బిడ్డను చంపుతుందా అన్నాడతను ఆఖరు మాటగా.

కొడుకు రాక్షసుడూ, దుర్మార్గుడూ లోక కంటకుడూ అయినప్పుడు వాడ్ని ప్రేమతో పెంచిన తల్లే శిక్షించి లోకాల్ని రక్షించాలి. తప్పదు. అన్నదామె కత్తితో అతని తల నరుకుతూ. సమయం కోసం వెయిట్ చేస్తున్న సింహం ఆ రాక్షసుడి రక్తాన్ని త్రాగింది.

స్త్రీ శక్తి స్వరూపిణి అని తెలియ జెప్పే విజయ దుర్గా దశమి ఇదే!

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Vijya Dashami festival history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X