వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సంగ్: ‘దేవుడితో బ్రేక్ ఫాస్ట్’

|
Google Oneindia TeluguNews

కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుండటంతో ఇటు తిరిగాడు అతను మంచం మీద. తన పక్కనే ఎవరో ముసుగు తన్నిపడుకుని వుంటమే కాదు గుర్రుకొడ్తున్నాడు.

ఉలిక్కిపడ్డాడతను. ఒక్క ఉదుట్న లేచి కూచున్నాడు. తన పక్కన తనకు తెలీకుండా వచ్చి పడుకున్నదెవరో ఎంత చించుకున్నా అర్థం కాలేదు.

లేచి మంచం మీద నుంచి ఆ పక్కకు వచ్చి పడుకున్న శాల్తీని తట్టి లేపుదామా అనుకున్నాడు. ఎవరో ఏమిటో మర్యాదగా వుండదు అనుకుంటూ అంతా తెలిసి పోతుందిలే కాస్సేపు ఆగితే అని కూడా అనుకుంటూ హాల్లోకి వచ్చాడు నిద్ర చాలించిన కళ్లు నలుపుకుంటూ.

హాల్లో సోఫాలో ఎవరో కూచుని వున్నారు.

గబగబా అడుగులు వేసేడు. ఎవరు? అన్నాడు.

Chintapatla sudarshan column on God

దేవుడ్ని అన్నాడతను సోఫాలో వెనక్కి వాలి.

అతనికి ఏమీ అర్థం అవలేదు. దేవుడా? దేవుడంటే? అన్నాడు.

దేవుడంటే దేవుడే? నన్నందరూ దేవుడనే అంటారు రా కూచో కబుర్లు చెప్పుకుందాం అన్నాడు దేవుడనే వాడు.

అస్సలేమీ బోధ పళ్లేదు అతనికి. గదిలో తన పక్కన పడుకుంది ఎవరు? ఇక్కడ సోఫాలో కాళ్లూపుతూ కూచుందెవరు?

ఆట్టే ఆలోచించకోయ్. దిలో నీ పక్కన పడుకున్నదీ ఇక్కడ కూచున్నదీ నేనే అంటే ఈ దేవుడే.

అతను వెనక్కి తిరిగి పడగ్గదిలోకి తొంగి చూశాడు. మంచం ఖాళీగా వుంది.

ఖంగారు వద్దు. రా. నిన్నంతా నన్నే తిడుతున్నావు గదా అన్నాడు దేవుడు నవ్వుతూ.

నేనా తిట్టానా? అన్నాడతను అసలిదంతా ఏమిటోనని ఓ పక్క బుర్రచించేసుకుంటూనే.

అమ్మాయితో అన్నావు గదా. మనం దండలు మార్చుకున్నప్పుడు గుళ్లో దేవుడు తప్ప ఎవరూ చూడలేదని తనెవరో నీకు తెలీదని దిక్కున్న చోట చెప్పుకో అని.

అన్నానా! అన్నాడతను అమాయకంగా ముఖం పెట్టి.

అవును కదా! దేవుడు తప్ప మరొకడు మీ పెళ్లి అదే దండల పెళ్లి చూళ్లేదనే కదా నీ ధీమా. దేవుడెట్లాగూ గుళ్లోంచి రాడనే కదా. వచ్చాను దేవుడ్నే నేనే! అన్నాడు దేవుడు.

నువ్వు నిజంగా నువ్వు నిజంగా దేవుడివేనా! అన్నాడు అతను దేవుడి వైపు పరీక్షగా చూస్తూ.

అవును ఏం? దేవుడు ఇలా వుండకూడదా? ఓ ఇదా.. ఈ పైజామానా యిది నీదే రాత్రి పడుకునే ముందు తొడుక్కున్నా విప్పేసి వెళ్తాలే వెళ్లేటప్పుడు అన్నాడు ‘జాకీ' పైజామా వైపు చూస్తూ.

నమ్మలేకపోతున్నాను. నువ్వు దేవుడివంటే అన్నాడతను ఆశ్చర్యం లోంచి బయటికి రాలేకపోతూ.

దేవుడ్ని చూసిన వాడెవడయినా నీకు చెప్పాడా దేవుడెలా వుంటాడో అన్నాడు దేవుడు మ్యాజికల్ స్మయిలిస్తూ.

ఎవరూ చెప్పలేకపోయినా దేవుడనే వాడు ఎలా వుంటాడంటే...

సినిమాల్లో కనిపించాడా! అది నిజం దేవుడికి ఎవడికి తోచిన జిరాక్సు వాడు ప్రదర్శించడమే అసలు వొర్జినల్ ఎలాగుంటుందో తెలీకుండా. దేవుడనే వాడు ఎలాగయినా వుండవచ్చు. ఇలా క్కూడా అన్నాడు దేవుడు ముందుకు జరిగి స్టడీగా కూచుంటూ. ఒకడికి కనిపించినట్టు యింకొకడికి కనిపించనునేను. నువ్వు నా ఉనికిని సవాల్ చేసినందుకు వార్నింగ్ యిద్దామని వచ్చానిలా అన్నాడు దేవుడు గొంతులో కొంచెం కోపం ధ్వనిస్తూ.

దేవుడికి ఎదురుగ్గా కూచున్న అతను తన ఎదురుగ్గా సోఫాలో తన జాకీపైజామా వేసుకుని టీషర్టులో వున్నవాడు దేవుడవునా కాదా, వీధి తలుపు వేసుంటే లోపల్కి ఎలా వచ్చాడు, ఎప్పుడు తన పక్కనే గుర్రు పెడుతూ పడుకున్నాడు అని ఆలోచిస్తూనే వున్నాడు.

అనవసరంగా బ్రెయిన్‌కి స్ట్రెయిన్‌నివ్వకు. కాఫీ చెయ్యడం వచ్చా నీకు. లోపల్కి వెళ్లి ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అన్నాడు దేవుడు ఆవులిస్తూ.

పాలు.. అన్నాడతను. అసలు తను ఎందుకు భయపడుతున్నాడో దేవుడ్నని చెబుతున్న ఈ దేవుడితో మాట్లాడ్డానికి.. తనకి అర్థం కాలేదు.

మెయిన్ డోర్ ఎదురుగ్గా పాల ప్యాకెట్లున్నయి రెండు వెళ్లి తెచ్చుకో అన్నాడు దేవుడు. అతను తలుపు తీస్తే గడపకు ఎదురుగ్గా ఉన్నయి పాల పాకెట్లు.

కాఫీ కలపడం రాదు సరిగ్గా తనికి. తనతో పాటు రూంలో వుండే ఫ్రెండ్సిద్దరూ ఫ్రైడే నాడే వాళ్లవూళ్లకి వెళ్లేరు. బయటికి వెళ్లి తాగొచ్చే వాడతను. కానీ యిప్పుడు తప్పదు.. కాఫీ కప్పు అందించాడు దేవుడికి అతను.

కప్పు అందుకుని దాని చెవిలో వేలు దూర్చి పట్టుకుని కొంచెం చప్పరించాడు దేవుడు. ‘కాఫీ కూడా సరిగ్గా చేత కాదు నీకు నువ్వా దేవుడ్ని ఎద్దేవా చేసేది' అన్నాడు దేవుడు.

అతను మాట్లాళ్లేదు. సైలెంట్‌గా నుంచున్నాడు.

మరి టిఫిన్ మాటేమిటి? కాఫీ ఇట్లా తగలేసిన వాడివి టిఫినేం వెలగబెడ్తావు. ఈ ఇంటి ఎదురుగ్గా టిఫిన్ సెంటర్‌లో సెపరట్టు ఉప్మా కాంబినేషన్ బావుంటుంది వెళ్లి తీసుకురా ఇవాళ యిక్కడే నా బ్రేక్ ఫాస్ట్. నిన్న రోజంతా పని చేసీ చేసీ అలసిపోయాను. మీలాగా వీకెండ్ సెలవుల్లేవు నాకు అన్నాడు దేవుడు.

టిఫినయ్యాక దేవుడ్ని తమరు ఎందుకు వచ్చారో చెప్తారా అని నసిగాడతనున

చెప్పానుగా రాతిబొమ్మను కానని నీకో వార్నింగిద్దామని వచ్చానని. ఈ పక్క ఇంటో ముసలాయన డెత్‌బెట్ మీద కొట్టుకుంటున్నాడు. ఆయన ఆత్మని బ్రీఫ్ కేస్‌లో పెట్టుకు వెళ్దామని వచ్చా అన్నాడు దేవుడు.

అప్పుడు చూశాడతను దేవుడి పక్కన సోఫాలో ఓ బ్రీఫ్ కేసు.

మనుషుల ప్రాణాలు పట్టుకుపోయేది కూడా నువ్వేనా అనడిగాడతను.

గదిలో రీ సౌండు వచ్చేట్టు నవ్వాడతను. ప్రాణాలు పట్టుకుపోవడానికి దున్నపోతు దాని మీద లావాటి మీసాల వ్యక్తీ వాడి చేతిలో బ్లాక్ రోప్.. మీ ఇమాజినేషన్‌ని మెచ్చుకోవాలసలు. దేవుడ్ని ఎన్నెన్ని శాఖలుగా ఎన్నెన్ని ఫేస్‌లుగా విభజించి పెట్టార్రా.. ఎన్నెన్ని కాక్ అండ్ బుల్ స్టోరీలు అల్లి పెట్టార్రా దేవుడి చుట్టూ. అంతా ఒట్టి హంబక్. దేవుడు అనే వాడొక్కడే అసలు సత్యం. నేనే అసలు సత్యాన్ని. అసలు దేవుడ్ని కోట్లాది మందిని ఒంటి చేత్తో పాలించేది నేనొక్కడ్నే నేనే దేవుడ్ని అన్నాడు.

దేవుడు బ్రీఫ్ కేస్‌తో బయటికి వెళ్తూ డోర్ తీసి పట్టుకుని ‘ఇదంతా కలా? నిజమా?' అని ఆలోచిస్తున్నావు కదూ. కలైనా నిజమైనా దేవుడి ముందు దండలు మార్చుకుని ఆ అమ్మాయిని మోసం చెయ్యాలనుకుంటే మాత్రం నీ ఆత్మ ఈ బ్రీఫ్ కేస్‌లో పట్టుకు పోవాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు దేవుడు.

దేవుడు వెళ్లిన వైపుకు అదే పనిగా చూస్తూ నిలబడి పోయాడు జీవుడు అనగా అతడు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about God.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X