వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: ఆరు నూరయినా...

|
Google Oneindia TeluguNews

వేలెడంత లేవు. వేలు పెట్టి చూపిస్తావా వెధవా లే.. ‘స్టాండప్ ఆన్ ద బెంచ్' అని అరిచింది పంతులమ్మ.

వేలెడంత లేని ఆ వెధవ లేచి నేల మీద నుంచున్నాడు ఉలక్కుండా పలక్కుండా.

‘స్టాండప్ ఆన్ ది బెంచ్' అంటే అర్థం కాలా అంటూ వురిమి చూసింది టీచరమ్మ.

తరగతి గదిలో నేల మాత్రమే వుండి బెంచీ లెక్కడా లేకపోవడంతో ఏ బెంచీ ఎక్కాలో అర్థం అవలేదు వేలెడంత వెధవకి. పోనీ అదైనా ఎక్కినుంచుందామంటే అసలు టీచర్లకి వుండాల్సిన బల్లాలేదు కుర్చీ కూడా లేదు. పగుళ్లు పట్టి తెల్ల ముఖం వేసిన నల్లబల్ల తప్ప.

అలవాటుగా స్టాండప్ ఆన్ ది బెంచ్ అన్న ఆ టీచర్ నాలుక్కర్చుకుని వెయ్యి గోడ కుర్చీ వెయ్యి అంది.

chintapatla sudarshan column on teacher's behaviour

వేలెడంత లేని వెధవ గోడకు వీపు ఆనించి, మోకాళ్లు వచ్చి రెండు చేతులూ ముందుకు చాచి కుర్చీలో కూచున్నవాడి ఫోజు పెట్టాడు. వీపు ఆనించినప్పుడు గోడలోంచి అంతపెద్ద మట్టి పెళ్ళ భళ్ళున విరిగి నేల మీద పడ్డది.

గింగిరాలు తిర్గుతూ వచ్చి నేలమీద పడ్డ ఆ ప్రాణి చచ్చన్రోయ్ అనుకుంది మొదట ఆ తర్వాత నానాతంటాలూ పడి లేచి నుంచుని అమ్మయ్యోయి బ్రతికేవున్నానురోయి అనుకుంది.

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఇట్లా మనుషులు వుండే వూళ్లోకి వచ్చి పడ్డాను అనుకుంది ఆ ప్రాణి. పొట్టి కాళ్ళు, పొట్టివే చేతులు చాకలి బానలాంటి పొట్ట మీద బోర్లించిన మూకుడు లాంటి తల దానికి అతుక్కున్న ముఖమూ ముఖంలో వుండాల్సినవన్నీ కొంచెం అటూ ఇటూగా వున్నాయి.

ఊరి పొలిమేరల్లో పడిలేచిన ఆ ప్రాణి ఇదేవూరయి వుండునో అని పరికించి చూశాడు. ఎగిరిగంతేశాడు. పొట్టి వాడవడం వల్ల గెంతిన సంగతి ఆట్టే తెల్సిరాదు మరి. ఇది మా ఊరే అరే! అనుకున్నాడు. అవును సుమా! మళ్లీ కళ్లు వత్తుల్ని వెలిగించి చుట్టూ చూశాడు. అదే ఇదే ఇదే మా ఊరిదే అనుకున్నాడు. ఇక్కడో చింత చెట్టుండాలి గదా దానికింద ఓ పెద్ద అరుగుండాలి కదా అవేం కనపడవేం అనుకున్నాడు. కనపబడ్డవో చెట్టు కింద కూచుని ఆనాటి గ్నాపకాల లోకంలోకి వెళ్లిపోయాడు.

ఆ వూళ్ళో బడిలేక పోవడాన్ని గొడ్లు కాసునే వాళ్ళు పొల్లగాళ్ళు.. మరో పనేదీ లేక.. ఈ ఊరికి పంతులు వుంటే బావుండునని కొందరు అనుకున్నా పంతలూ బడీ వస్తే వుంటే గొడ్లుగాసేదెవరు కొందరు అనుకోలేకపోలేదు. అట్లాంటి సమయంలో దిగబడ్డాడు పొట్టి పంతులు. చింతచెట్టు అరుగు మీదికి. ఇంకేం వుంది ఊరికే కళవొచ్చింది. పంతులు వచ్చాడని సంబరపడి కొందరు పిల్లల్ని పంపడం మొదలుపెట్టారు.

మీ ఊరి వాళ్ళకు అదృష్టం శనిలా పట్టింది. అందుకే నడిచొచ్చే సరస్వతిలా వొచ్చినాను. మీ పిల్లలకి నాలుగక్షరం ముక్కలు చెప్పి డొక్క శుద్ధి చేసి పోదామని వచ్చాను. అని గర్వంగా చెప్పుకునేవాడు పంతులు. ఒకరూ ఇద్దరూ పిల్లలయితే జరుగుబాటు కాదని, పూటకి శేరున్నర అన్నమూ శేరు కంది పప్పూ పెద్ద ముంతెడు నెయ్యి అంతేముంతెడు పెరుగూ రోజుకో రకం కూరగాయలు సమకూరాలంటే బళ్లోకి వచ్చే వాళ్ళ పెరగాలి కదా అందుకే పొట్టి పంతులు కాళ్లకి గజ్జెలూ, తలకి కిరీటమూ పెట్టుకుని గజ్జెలు ఘలుఘల్లు మనేలా నడుస్తూ చిత్ర విచిత్రంగా చేతులూపుతూ తల ఆడిస్తూ

‘పంపండయా బాబు పంపండయా..
మీ బాలురందరిని పంపండయా
బడికి పంపండయా
బడికి పంపండయా'

అని ఇంటింటి ముందూ ప్రదర్శించడం మొదలుపెట్టారు. పోరగాళ్ళు పొట్టి పంతులు చేష్టలకు కడుపులుబ్బేట్టు నవ్వుతూ ఆయన వెంటపడి బడికి వచ్చేశారు.

బడి చింత చెట్టుకి ఎదురుగ్గా గదిలోకి మారింది. పంతులు గారు జరుగుబాటు బహు బాగా కావడంతో మరింత ఒళ్లు పెంచారు. పిల్లలకి అక్షర ముక్కలు వొచ్చేయో లేదో గాని బడి వైపు నుంచి వెళ్లే గ్రామస్తులకి ‘చస్తి చస్తి' ‘బాబోయ్' అన్న చుప్పుళ్ల కెవ్వుమనే కేకలు వినిపించేవి.

పంతులుగారు ఉదయాన్నే లేచి కాలవగట్టుకి వెళ్లి వస్తూ నాలుగైదు చింత బరిగెలు తెచ్చుకునేవారు. బళ్ళో పిల్లల్ని తెచ్చే సరుకుల్ని బట్టి తరగతులుగా విడగొట్టారు. నెయ్యి, పెరుగు తెచ్చే వాళ్ల వీపులకి ఢోకా వుండేది కాదు. అసలేమీ తేలేని వాళ్ల వీపులు వాతలు తేలిపోయేయి.

పొట్టి పంతులు తమ పిల్లల్ని చావ బాదుతున్నారని తెల్సి ఎవరైనా వెళ్లి అడిగితే పెద్ద పాఠమే చెప్పేవాడు. గురువు అంటే ఎవడు. పిల్లలకి భయం నేర్పేవాడు. భయం వుంటేనే మనిషి మనిషిలాగుంటాడు. అది లేకపోతే నాలుక్కాళ్ల పశువే. వెధవ అక్షరముక్కలు నేడు కాపోతే రేపు రావా పోవా? కానీ భయం వచ్చేదెట్లా. భయమే అసలు చదువు - చదువు కోవడమంటే భయం నేర్చుకోవడమే. అన్నము పెడితే అరిగిపోతుంది. వస్త్రం యిస్తే చిరిగిపోతుంది. భయం పెడితే కలకాలం వుంటుంది. అన్నం తిన్నవాడు మరచిపోతాడు కానీ తన్నులు తిన్నవాడు మరిచిపోడు రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుంది అంటూ అడగ వచ్చిన వారిని మీదపడి కరిచినంత పని చేసేవాడు.

ఎవరయ్యా నువ్వు అని ఎవరో అరిస్తే ఉలిక్కిపడి లేచాడు ఆనాటి గ్నాపకాలలోంచి బయటకి వచ్చాడు పొట్టి పంతులు. ఒక టారెండా వొందల యేళ్లయ్యింది కదా అనుకున్నాడు. మన ఊరికి కొత్తగా వచ్చిన సార్‌లు కాబోలు సార్ సార్ ఆ ఎదురుగ్గా కనపడుతున్నదే చింత చెట్టు దానికి ఈ పక్కా సోలుపుతావున్న గదులు అదే ఇస్కూలు అన్నాడు మరొకడు.

తను వెతుక్కుంటున్న చోటు అదే అని అర్థమయ్యి పొట్టి పొట్టి అడుగులు వేస్తూ ఆ వైపు నడిచాడు పొట్టి పంతులు. తను ఇదివరకు పాఠాలు అనగా భయం నేర్పిన చోటు అదేనని ఉత్సాహంగా నడిచాడు.

అప్పటిదాకా పిల్లలతో అరచి అరచి అలసిపోయిన పంతులమ్మ వొచ్చిన పొట్టి పంతులే ఆ స్కూలుకి సర్కారు పంపిన కొత్త పంతులను కొని పొల్లగాళ్ళను అప్పజెప్పి అన్నానికని వెళ్లింది.

ఇంకేంవుంది. పొట్టి పంతులుకు పోరగాళ్ళను చూసేసరికి మంచి ఊపూ ఉషారూ వచ్చినయి. ఒక్క అడుగు అసింటావేసి కిందకు వంగివున్న చింతచెట్టు పిల్లకొమ్మల్ని విరిచి అందుకొచ్చాడు.

అరేయ్ పిల్లలూ మీకు అక్షరాలన్నీ వచ్చినట్టేనా అనడిగాడు గంభీరంగా.

ఓ అన్నాడు వచ్చేసినయి సార్ అన్నాడొకడు.

సారేంట్రా అన్నాడు పంతులు ఆమాట అర్థంకాక.

నోరు తెరిస్తే చంపేస్తాను. మీ కందరికీ భయం బాగా నేర్పార్రా అనరిచాడు.

భయమా అన్నాడొకడు వో మూల నుంచి పొట్టి పంతులుకి వాడు కనబళ్ళేదు. మీకు మీ పంతుళ్ళు రోజూ టంచనుగా తొడపాశాలు పెట్టడం, తొడల మీద చుట్ట కాల్చి అంటించడం, దులానికి వేలాడేట్టు కోదండం వేయించడం చేస్తున్నారా లేదా అన్నాడు.

అవన్నీ మాకు తెలీదు సార్ అన్నాడో దురదృష్ట జాతకుడు తలబిరుసుగా ముందు వరుసలో వుంటాన్ని దొరికిపోయేడు.

అరే అర్భకుడా చచ్చావురా నా చేతిలో అంటూ చింత బరిగె ప్రయోగం మొదలు పెట్టాడు. అసలు చదువు అంటేనే భయం అదేంటో తెలీదులావుంది మీకెవ్వరికీ. మీకు భయం నేర్పడానికేనన్నా పరాత్పరుడు కిందకి తోలివుంటాడు అంటూ తరగతిలో వున్నవాళ్ళందరినీ వరుసపెట్టి బరిగెతో వీపులు చిట్లి పోయేట్టు వాయించసాగాడు. పోరాగాళ్ళ ఏర్పడులతో హాహాకారాలతో ఆ చోటు దద్దరిల్లిపోయింది.

ఆదారంట పోతున్న వో పిల్లాడి తండ్రి ఏం జరిగిందోనని బళ్ళోకి వచ్చాడు. పిల్లల పరిస్థితి చూసి అవాక్కయ్యేడు. నువ్వు మనిషివా రాక్షసుడివా అనరిచాడు. నేను పంతుల్ని భయం నేర్పే పంతుల్ని అంటూ అదే రేంజిలో అరిచాడు పొట్టి పంతులు. అనడమే కాదు అసలు భయం ముందు పిల్లల తండ్రులకి నేర్పాలి. మీకు భయం లేకే వీళ్ళిట్లా తయారయ్యారు అంటూ ఆ తండ్రిని కూడా చింతకర్రతో వాయించడం మొదలు పెట్టాడు.

దారేపొయ్యేవాళ్ళంతా బళ్ళో జారపడడ్డారు. ఈ పంతుళ్ళకి అసలు భయం లేకుండా పోయింది. ఇంగ్లీషు మాటాళ్లేదని ఓ టీచర్ కుర్రాడి మాడు పగలగొట్టింది. హోం వర్కు చేయలేదని వో సార్ కుర్రాడి దవడ పళ్ళూడగొట్టేడు. ఓ సారు రూళ్ళ కర్రతో కుర్రాడి నడుం విరగ్గొట్టాడు. చెంపలు వాయించడం, చెవులు మెలిపెట్టటం వీపు మీద గుద్దడం, మెళ్ళో అట్టలు వేలాడదీసి స్కూలంతా తిప్పడం, పెన్సిల్‌ని వేళ్ళ మధ్య పెట్టి మెలి తిప్పడం స్కేళ్ళు విరగ్గొట్టడం గుండు గీకించడం ఎక్కడో వోచోట యిప్పటికీ కంటిన్యూ చేస్తున్నారీ పంతుళ్లు కాలం మారినా పంతుళ్ళు మారలేదు. భయం నేర్పడం తప్ప చదువు నేర్పడం రాదు వీళ్ళకి అంటూ పొట్టి పంతుల్ని ఓ గదిలో వేసి తాళం పెట్టారు.

చచ్చి సొర్గాన వున్న తను ఇక్కడికి రావడమేంటి వీళ్ళు తన్ని గదిలో బంధించడమేమిటి అని దిగులుపడ్తూ కూచున్న పంతుల్ని సొర్గలోకపు పిట్ట గోడ మీంచి కిందికి గెంతిన నిన్ను పట్టుకుపోకపోతే మా ఉద్యోగాలూడతయి అంటూ దేవదూతలు వచ్చి ‘హాంఫట్' అని మళ్ళీ పై లోకానికి ఎత్తుకుపోయారు.

ఈ పొట్టి పంతులు పేరు గణపతి. ఈ పంతులు చరిత్రను రాసిన చిలకమర్తి లాంటి హాస్యం వండి వడ్డించే వాళ్ళు లేకపోయినప్పటికీ గణపతి లాంటి పంతుళ్ళు మాత్రం యింకా వున్నారు. వసతుల్లేని బళ్ళూ వున్నయి.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about teacher's behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X