వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల సుదర్శన్: ఓల్డ్ స్టోరీ - న్యూమోరల్స్

|
Google Oneindia TeluguNews

తలకి రెండు పక్కలా జవాన్లల్లా నుంచున్న చెవుల్తో ముఖంలో ఎరుపురంగు గోళీలు కదుల్తున్న కళ్లూ పళ్లూ కాయలూ గడ్డీ గాదమూ నవిలే పళ్లతో వున్నవాడు మెత్తటి తెల్లటి కోటుతో స్మార్టుగా వున్నాడు. ఇక్కడో అంగవేస్తే అక్కడో జంపు వేస్తే అసలు వాడెక్కడున్నాడో కనిపించనంత చురుగ్గా వున్నాడు.

తల ఎక్కడుందో తెలీదు. ఒకబోర్లించిన బొడిపెల బుట్ట. నాలుక్కాళ్ల మీద గంటకో అంగ వేస్తూ నడిచే ఆ బుట్టలో ఏముందోనని చూడగా చూడగా బయటకి వస్తుందో పొడవాటి మెడ దాని చివర చిన్న కళ్లున్న తల. ఇలా బయటికి సాగి వచ్చి అలా తలని అటూ ఇటూ తిప్పి ఒక్కొక్క ఇంచీ చొప్పున వెనక్కి వెనక్కి తరిగి తరిగి చూడగా చూడగా లోపలికి పోతుందో పొడవాటి మెడదాన్ని చివర వున్న తల బుట్టలోపలికి వెళ్లి మాయమైపోతుంది. అలాగ రోడ్డు పక్కన విసిరేయబడ్డ బండరాయిలా వుండి పోతుందా బుట్ట కదలకుండా అసలు కదలడ మనేది దానికి తెలుసా అన్నట్టుగా.

తెల్లకోటు ‘రాబిట్సనుడూ' బుట్టబాడీ ‘టర్టలుడూ' మంచి ఫ్రెండ్సే మీ కాదు. అసలు ఆ ఇద్దరికీ కుదర్దు. తెల్లకోటు వాడు స్మార్టు గానూ చురుగ్గానూ ఉంటే బుట్లబోడీ వాడు డిమ్ముగానూ డల్లుగానూ వుంటాడు. అయితేనేం ఒకానొక సందర్భం వాళ్లిద్దరినీ ప్రపంచంలో పాప్యులర్ చేసేసింది.

ఆ సందర్భంగా మరోటేం కాదు వాళ్లిద్దరి మధాన కాంపిటీషనే. ఆ కాంపిటీషనింకోటేం కాదు కాదు రన్నింగ్ కాంపిటీషనే!

తన చురుకు తనానికి మిడిసి పడుతూ వుండేవాడు రాబిట్సనుడు. ‘ఏరా నాసాటి ధీరులెవ్వరు రా' అని పాడుకుంటూవుండేవాడు. తన లాగా జంపింగు చేసేవాడూ రన్నింగ్ లాగే వాడూ మరొకడు లేడుగాక లేడని గర్వపడుతూ చెవులు నెత్తికెక్కి వుండేవాడు. వాడు ఉరికితే మనకేమి దుమికితే మనకేమి అని తనమానాన తను బుట్టలో వుండిపోయిన టర్టలుడిని బస్తీమే సవాల్ అంటూ రెచ్చగొట్టాడు రాబిట్సనుడు. ఒళ్లూపై తెలీకుండా టర్టలుడిని చలిమిడిముద్దవనీ, మూలనున్న గొంగళీవనీ, చాతగాని చవటవనీ వెక్కిరించాడు. తెల్లకోటు వూగిపోయేట్టు ‘విలన్ హాసం' చేశాడు. దాంతో గదిలో బంధించిన పిల్లికి వచ్చే ధయిర్యం లాంటిది వచ్చింది టర్టలుడికి. వీడికిదో పిదప కాలం పోయేకాలం. నన్ను వెక్కిరిస్తున్న వీడ్ని వోడించి వీడి గర్వం అణచాలి కానీ తనకి రన్నింగనేదే తెలీదు కదా ఎలా అని వాపోయింది. వాడి మానాన వాడే పోతాడులే అని మౌనం వహించింది. కానీ రెచ్చిపోయాడు తెల్లకోటు వోనరు. ‘అస్తమానూ అట్లా బుట్టలో తలదాచుకుని సిగ్గు పడుతూ వుండకపోతే బయటకు రారాదూ చేతయితే చేవ వుంటే నాతో ‘రేస్'కి సై అనరాదూ' అన్నాడు.

అవమానం కన్నా ప్రాణం యేం గొప్పది కాదు అనుకున్నాడు టర్టలుడు. పందెంలో వోడి చచ్చి పోయినా సరే అనుకున్నాడు. చావో రేవో అనుకున్నాడు. రన్నింగ్ రేస్‌కి రడీ అయిపోయేవాడు. మొదలూ చివరా ఏర్పటయ్యేయి.

రేస్ మొదలయ్యింది. రాబిట్సునుడు నాలుగడుగులు నలభై అడుగులు వేసేప్పటికి టర్టలుడి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. వీడి మొగం వీడికి రన్నింగా నేను నలభై సార్లు వచ్చీపోయినా వీడు పావురేసు కూడా డేక లేడు అనుకుని నవ్వుకున్నాడు రాబిట్సునుడు.

Chintapatla sudarshan column on Turtle and Rabbit story

తనకు ఉన్న శక్తినంతా కాళ్లల్లోకి పంపి అడుగులో అడుగు వేస్తూ కదిలాడు టర్టలుడు. కనుచూపు మేరలో లేడు రాబిట్సనుడు. ప్రాణం పోయినా సరే ఆగేది లేదు అలాగ అడుగు పడుతూనే వుండాలి అనుకుంటూ ప్రాణాలు అరిపాదాల్లో పెట్టి అడుగిడసాగేడు టర్టలుడు కొండదారంటా కొండ పక్కనించీ చెట్లలొంచీ అలా అలా నడుస్తూనే వున్నాడదే రన్నింగుమరి.

సగానికి పైగా పరుగెత్తి వెనక్కి వెనక్కి తిరిగి చూసిన రాబిట్సనుడికి టర్టలుడి జాడ ఎక్కడా కనిపించలేదు. వీడింకా ‘స్టార్ట్ లైను' దాటినట్టు లేడు అని నవ్వుకుంటూ ఓ చెట్టు నీడన కూలబడ్డాడు. ఎండలో ఎగురుతూ వచ్చాడు కదా కొంచెం అలసట అనిపించింది. పైగా చెట్టుకింద చల్లటి నీడా వీచే గాలీ మజాగా అనిపించింది. చేరుకోవాల్సిన చివరి లైను అల్లంత దూరంలో కనిపిస్తూనే వుంది. కాస్సేపు ‘స్లీపింగ్' చేసిపోతే నష్టమేం లేదనిపించి రాబిట్సనుడు నిద్రలోకి నిద్రలోంచి ఓ తీపికలలోకి జారుకున్నాడు.

ఎంతెంత దూరం ఇంకెంత దూరం అనుకుంటూ ఆయాసపడుతూ వచ్చిన టర్టలుడికి చెట్టు కింద గుర్తు పెట్టి నిద్దరోతున్న రాబిట్సనుడు కనిపించాడు. అల్లంత దూరంలో చివరాకరిచోటు కనిపించింది. ‘హే ప్రభూ తేరీలీలా' అనుకుంటూ బుట్ట వడివడిగా దొర్లిపోయింది. తను నిజంగా రేసు గెలిచానని తెలిశాక బుట్టబోడీలోంచి హెడ్డివతలకి వచ్చింది.

నిజం!! నమ్మలేని నిజం!!! టర్టలుడే గెలిచాడు. రాబిట్సనుడ్ని వోడించాడు. అవమానంతో తల ఎక్కడ దాచుకోవాలో తెలీలేదు రాబిట్సనుడికి. చిన్న కునుకు తీయడం ఎంత పెద్ద తప్పో తెల్సింది. తన ‘వోవర్ కాన్ఫిడెన్స్'కి సిగ్గుతో చితికిపోయింది. అవమాన భారాన్ని భరించలేక ‘పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని' మళ్లీ మరో ‘రేస్'కి టర్టలుడ్ని రడీ చేసింది. విజయగర్వంతో కళ్లు మూసుకుపోయిన టర్టలుడు ‘సై' అంటే ‘సై' అనేశాడు.

మళ్లీ రేసు మొదలయ్యింది. మొదలూ చివరా డిసైడైనయి. ఇది వరకటిలాగానే టర్టలుడు ప్రాణాలన్నీ కాళ్లల్లో పెట్టి పరుగు లాంటి నడక నడిచాడు. కానీ ఇదివరకటి లాగా రాబిట్సనుడు చెట్టు కింద తొంగోకుండా స్వప్నలోకంలో విహరించకుండా పరుగెత్తి గెలుపు రేఖను ముద్దాడి విజయహాసం చేస్తూ ‘విజిలే'శాడు.

ఇది వరకులా రాబిట్సనుడు నిద్రపోకుండా తనని ఓడించడంతో టర్టలుడి మూసుకుపోయిన కళ్లు తెర్చుకున్నాయి. మొదటిసారి రాబిట్సనుడ్ని ఓడించిన ‘వోవర్ కాన్ఫిడెన్సే' తనని యిప్పుడు ఓడించిందని తెల్సుకున్నాడు. అయినా ఒకసారి గెలిచినవాడికి మళ్లీ మళ్లీ గెలవాలనే వుంటుంది. ఓడిపోవడం అంత అవమానం మరొకటి వుండదు కదా. అందువల్ల అవమాన భారాన్ని భరించలేక ‘పోగొట్టు కున్నచోటే వెదుక్కోవాలని మళ్లీ మరో రేస్‌కి రాబిట్సనుడిని రడీ చేసింది-విజయ గర్వంతో కళ్లు మూసుకుపోయిన రాబిట్సనుడు ‘సై' అంటే ‘సై' అనేశాడు.

మళ్లీ రేసు మొదలయింది. ఈసారి మొదలూ చివరా టర్టలుడు నిర్ణయించాడు. ఎక్కడికయినా ‘రడీ' అన్నాడు రాబిట్సనుడు. పరుగో పరుగు లంకించుకున్నాడు. నేలమీద పొదల్లోంచి చెంగు చెంగునా గంతులు వేస్తూ వెళ్లిన రాబిట్సనుడు ఓ చోట అవాక్కయి నిలబడిపోయేడు. దారికి అడ్డంగా ప్రవహిస్తున్నదో ఏరు. ఏట్నిండా నీరు. ఈ కంటితో ఈ కోసకంటా చూసింది అంతా నీరే. నీరే వేరే దారే లేదే. అమ్మ టర్టలుడా ఏం ఎత్తువేశావురా అంటూ నీరు గారి పోయి ఏం చేయాలో తోచక వో పొదలోకి పోయి విచారించ సాగాడు రాబిట్సనుడు. పొద్దు నడినెత్తి మీంచి అంతకంతకూ కిందకి జారిపోసాగింది. చాలా సేపటికి అక్కడి వచ్చిన టర్టలుడు, రాబిట్సనుడికేసి ఓ చూపు అలా విసిరేసి ఏటీ నీటిలోకి బుడుంగున పడి నాలుక్కాళ్ల తోనూ ఈదడం మొదలెట్టాడు. ఏటవతలి చివరి లైను ముద్దాడి నవ్వాడు.

టర్టలుడు ఈ ధఫా రేసు గెలిచాడు కానీ తను చేసింది మోసం అని పశ్చాత్తాపడ్డాడు. ఏరుదాటి వెనక్కివచ్చి రాబిట్సనుడి చేతులు పట్టుకున్నాడు. మనం యిదివరకు ఒకరికి ఒకరం ఏమీ కాము కానీ యిప్పుడు మంచి ఫ్రెండ్సయిపోదాం. మన ఈ పందెం మనకి కొన్ని జీవిత సత్యాలు నేర్పింది. దేవుడు నీకు ఓ శక్తినిచ్చాడు దానికి నువ్వు గర్వపడవల్సిన పనిలేదు. అలాగే నీతో పోటీ పడే శక్తి నాకు లేదు అయినా తెలివితక్కువగా సై అన్నాను. నీ ‘ఓవర్ కాన్ఫిడెన్స్' నిన్ను వోడించింది. అదే ‘ఓవర్ కాన్ఫిడెన్స్' నన్నూ తర్వాత రేస్‌లో ఓడించింది. నీతో పోటీ పడలేక నా తెలివి తేటల్తో గెలవడానికి చివరి రేసులో నిన్ను మోసం చేశాను. ఎంత ఇంటలిజెన్స్ వున్నా నక్కని జిత్తులమారి అనే అంటారు. మోసాన్ని ఎవరు ‘తెలివి'గా గుర్తించరు. దేవుడు ఎన్నో ప్రాణుల్ని సృష్టించాడు దేన ప్రత్యేకత దానిదే ఏమంటావ్? అన్నాడు.

అవును ఫ్రెండ్! నువ్వన్నది నిజం నాకిప్పుడు గర్వం పూర్తిగా పోయింది అన్నాడు రాబిట్సనుడు. దోస్త్! ఇప్పుడు నాకు అవమానం అన్న మాట సిల్లీగా అనిపిస్తున్నది అన్నాడు టర్టలుడు.

ఏరవతల పెద్ద తోటవుందని దాంట్లో రాబిట్సనుడికి కావాల్సినంత తిండి వుందని ఇకముందు మనం ‘ఐక్యం'గా వుందామని ఐకమత్యమే బలమని టర్టలుడు తన వీపు మీద రాబిట్సనుడిని కూచోబెట్టుకుని ఏరుదాటాడు. ఎండ్ దే లివ్‍డ్ హేపిలీ ఎవర్ ఆఫ్టర్!

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Turtle and Rabbit story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X