వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాయిలర్ కోళ్లలా: అమెరికాలో పిల్లల పెంపకం

By Pratap
|
Google Oneindia TeluguNews

మా చిన్నప్పుడు మేము ఎలాంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలు చదువు కోలేదు. అలాంటి పుస్తకాలున్నట్టు తెలియదు. చందమామ, బాలమిత్ర, బాల సాహిత్యం చదివే వాళ్ళం. అమ్మా, నాన్న, తాత అమ్మమ్మ, నానమ్మ, మేన మామలు, ఇరుగు పొరుగు వగైరా చెప్పే కథలు, సుద్ధులు, సూక్తులు, సామె తలు, తిట్లు, విధి నిషేధాలు, సంస్కృతి, అలవాట్లు, మాటతీరు మొదలైనవాటిద్వారా ఆ వయస్సుకు అర్థమైన మేరకు మాపై ప్రభావం వేసేవి. అలా నడుచుకునేవాళ్ళం.

నేటికీ అవసరమైనవే...

బడికి పోవడం మొదలైనాక అక్షరాలతోపాటు, చిన్న చిన్న వాక్యాలు నేర్పారు. మూడో తరగతినుంచి వేమన, సుమతీ పద్యాలు పాఠాల్లో చదువు కున్నాము. అలా క్రమంగా సుమతీ శతకం, వేమన శతకం, నరసింహ శతకం, కుమారి శతకం, భర్తృహరి సుభాషితాలు, ధూర్జటి కాళహస్తీశ్వర పద్యాలు, దాశరథి శతకం, మొదలైనవి పరిచయంలోకి వచ్చాయి. వాటిలో భక్తి, లోకరీతి, సూక్తులు చెప్పేవాళ్ళు. వాటి ద్వారా మనిషి నడక, నడత ఎలా ఉందో, ఎలా ఉండాలో తెలిసేది. చదివినకొద్దీ వాటి ప్రభావం మాపై పడేది.
బాల సాహిత్యం, జానపద కథలు, పొడుపుకథలు, తిట్లు, సామెతలు, శాస్త్రాలు, లేటెస్ట్‌ సంఘటనలు, సంగతులు వాటిపై వ్యాఖ్యానాలు మొదలైన వాటిద్వారా అనేక విషయాలు అర్థమయ్యేవి. ఇవన్నీ నేటికీ అవసరమైనవే.

స్కూల్లో టీచర్లు అనేక విషయాలు చెప్పేవాళ్లు క్లాసులో, ప్రార్థనలో టీచర్లతో, తోటి విద్యార్ధులతో, ఇంటిలో, ఇరుగుపొరుగుతో ఉండాల్సిన తీరు, క్రమశిక్షణ, మాట మర్యాద, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా స్నానం చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మొహం కడుక్కోవాలి అని చెప్పడంతో పాటు, తల వంచుకొని నడవాలి. ఛాతి విరుచుకొని నడవకూడదు. పెద్దలపైకి తిరగబడకూడదు, పెద్దలు కొట్టినా పడాలె, ఏడవాలె తప్ప, తిరిగి కొట్టకూడదు, తిట్టకూడదు అని నొక్కి చెప్పేవాళ్లు. వాటి ద్వారా అనేకం నేర్చుకున్నాము. చేప పిల్లకు ఈత నేర్పుడా...? అని అన్ని సహజంగా అబ్బుతాయని అనుకునేవాళ్ళు. చేపకు నీళ్ళు ఒక సహజ వాతావరణం. అందువల్ల బతకడానికి పుట్టుకతోనే ఈత నేర్చుకోక తప్పదు. పక్షి రెక్కలు విప్పి ఎగరక తప్పదు. పాములు పుట్టుకతోనే పాకడం నేర్వక తప్పదు. అలా సహజంగా అబ్బేవన్నీ చుట్టూతా ఉండే సమాజంనుండి సహజం అనుకొని నేర్చుకొనేవే.

 Personality development depends on experience

పరిసరాలతో, ఇరుగుపొరుగుతో, పెద్దలతో వ్యక్తిత్వ వికాసం

ఆటపాటలు, చెరువుకు వెళ్లి స్నానం చేయడం, ఇంటిలో చిన్న చిన్న పనులు చేయడం, బావిపక్కన కూరగాయలు పెంచడం, పందిరికి కూరగాయల పాదులు తీగలు పాకించడం, కోళ్లు, కుక్కలు, పిల్లులు పెంచడం మొదలైనవాటి ద్వారా నడక, నడత, స్వభావాలు పెరుగుతూ వచ్చాయి. చిన్నపిల్లల ఆటల్లో, పోట్లాటల్లో, కాకి ఎంగిలి పంపకాల్లో, అలగడంలో, తెచ్చింది పంచుకోవడంలో, సంతోషాలు కలిసి చెప్పుకోవడంలో, పరస్పరం స్నేహం భావ ప్రకటన, ఆత్మీయత మొదలైనవి వికాసం చెందడం ప్రారంభమయ్యాయి.

అక్కలు, అన్నలు, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు పెద్దలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, టీచర్లు, తమ గౌరవాలను చెప్పి సముదాయించి అలవాట్లుగా మార్చారు. ఉదాహరణకు టీచర్‌ కనపడగానే నమస్కరించాలని, లేచి నిలబడాలని, టీచర్లే చెప్పేవారు. వాటిని గౌరవాలు (ప్రోటోకాల్స్‌) అని చెప్పవచ్చు. రక్త సంబంధీకుల మధ్య, ఇరుగు పొరుగు మధ్య, వాడా ఊరు మధ్య, వయస్సుకి వయస్సుకి మధ్య ప్రోటోకాల్స్‌ అనుభవం నుండి ఆచరణ నుండి తెలుసుకున్నాము. అర్థం చేసుకొని ఆచరించాము.
అమ్మ ఒడినుండి కిందికి జారి పాకడం, అంబాడడం, మంచాలు, గోడలు పట్టుకొని నిలబడడం, మెల్లిగా నడక నేర్చుకోవడం, మూడుగీరల బండి పట్టుకొని నడక సాఫీగా సాగించడం, పెద్దలు ప్రశంసిస్తూ ప్రోత్సహించడం, పెద్దలు మాటలు నేర్పుతూ మేం పలికినకొద్దీ సంతోషంగా ముద్దులు పెట్టడం, మొదలైనవాటితో నడక, నడత, భాష నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. స్కూల్లో, కాలేజీలో, ఊర్లో, విశాల ప్రపంచంలో ఇదే విధానం ద్వారా అనేక విషయాలు నేర్పారు. నేర్చుకున్నాము.

అలా మేం ఉన్న స్థితిలో పరిసరాలనుండి, ప్రకృతినుండి, పశుపక్ష్యాదుల నుండి, పిన్నలు, పెద్దల నుండి వారి నడక, నడత నుండి అనేక విషయాలను గమనించాము. మాకు తెలియకుండానే వాటిని అనుకరించాము. అనుసరించాము. అలవాటుగా ఆచరించాము. అలా మా పెద్దలు ఏ దేవుళ్ళకు మొక్కితే ఆ దేవుళ్ళకు భక్తితో మొక్కాము. ఏది మాట్లాడితే అలా మాట్లాడాము. ఏది తింటే అది తిన్నాము. ఏది మంచిదంటే దాన్ని మంచిదని నమ్మాము. ఏది చెడ్డది అంటే అది చెడ్డదిగా భావించాము. దుష్టులకు దూరంగా ఉండాలి అని చెప్తే దూరంగా ఉన్నాము. పాలు మరిచి అన్న ప్రాసన నుంచి శాఖాహారం, మాంసాహారం, రుచులు ఏవీ మేం కోరుకున్నవి కావు. అమ్మ ద్వారా పెద్దల ద్వారా రుచులు, తిండి అలవాటు చేయబడ్డాయి. ఎవరి ఆర్థిక స్థోమతను, ఎవరి కులాన్ని అనుసరించి వారు ఆహారపు అలవాట్లను అనుసరించారు.

దొంగతనం చేయవద్దు అంటే దొంగతనం చేయకుండా ఉన్నాము. కొట్లాడుకోవద్దు అని చెప్తే దాన్ని వీలైనమేరకు ఆదర్శంగా తీసుకున్నాము. అబద్దాలు ఆడకూడదు. సత్యమునే పలకాలి అని చెప్తే అలాగే నమ్మాము. ఆచరించాము. బుద్ధిగా చదువుకోవాలి. మంచి నౌకరీ వస్తది అని చెప్తే అలాగే బుద్దిగా చదువుకున్నాము.

చిన్నప్పుడు సాహసాలకు పెట్టింది పేరు

అలాగే చిన్నప్పుడు మాకు సాహసాలకు పోవద్దు అని చెప్తే సరేనని తలూపాము. అమ్మానాన్నలకు తెలియకుండా అప్పుడప్పుడు సాహసాలు చేసి చెట్లెక్కి జారిపడి దెబ్బలు తాకించు కున్నాము. చెరువుకు స్నానానికి పోవద్దు అక్కడ మైసమ్మ ఉంటది. మనుషులను తింటది అని అంటే భయ పడ్డాము. అయినా ముగ్గురు నలుగురం కలిసి సాహసించి చెరువుకు వెళ్ళే వాళ్ళం. మైసమ్మ ఎక్కడుందో చూద్దామని అనుకునేవాళ్ళం. మైసమ్మ కనపడకపోయినా పెద్దలు నూరిపోసిన భయం మాత్రం వెంటాడేది. పెద్దలు చెప్పినట్లు వింటే చెరువుకు వెళ్ళడం, ఈత నేర్చుకోవడం అయ్యేదా....? ఖచ్చితంగా చెరువుకు పోతా అని పట్టుదలతో చెప్తే అప్పుడు ఎండిపోయిన సొరకాయ బుర్రలు ఇచ్చి వాటిని నడుంకు కట్టుకొని ఈత నేర్చుకోమని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. అలాగే నిర్బంధాలు ఉంటాయి. కష్టాలు ఎదురవుతాయి అని భయపెడితే సరేనని తల ఊపి సాహసాలతో ఉద్యమంలోకి దూకాము. వాటినన్నిటిని అనుభవించాము.

చెప్పింది చేసుకుంటూ సాగాము...

పెద్దలు చెప్పింది వినుకుంటూ, చేసుకుంటూ సాగాము. కులవృత్తి చేయాలి. నేర్చుకోవాలి అన్నారు. నేర్చుకున్నాము. సర్కార్‌ నౌకరీ సంపాదించు కోవాలి అన్నారు. సరే అనుకున్నాము. కులంలోనే పెళ్ళి చేసుకోవాలి అన్నారు. సరేనని పెళ్ళి చేసుకున్నాము. పిల్లల్ని కనాలి అని చెప్తే పిల్లల్ని కన్నాము. ఆడపిల్లను కనమని అమ్మ అడిగితే సరేనని చూస్తే మాకు నలుగురు మగ పిల్లలే పుట్టారు. అమ్మ కోరిక, మా కోరిక తీరలేదు. ఇలా మా తరంవాళ్లు పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించుకుంటూ వచ్చామని చెప్తూ ఉంటారు. ఇదంతా సాంప్రదాయిక ఆలోచనా విధానం, అనుకరణ ద్వారా వ్యక్తిత్వ వికాసం.
జీవితంలో అనేక విషయాలు, సమాజంలో దాన్ని పరిణామాన్ని అనుస రించి కొనసాగుతూ వస్తున్నాయి. నా చిన్నప్పుడు ఉద్యోగం అంటే టీచర్‌ లేదా తాహసిల్‌ ఆఫీసులో నౌకరి. పోలీసు నౌకరిని వ్యతిరేకించేవాళ్లం. చదువుకుంటే టీచర్లవుతారని చెప్తుంటే, అందరూ చదువుకొని టీచర్లు అవుతూ పోతూ ఉంటే, మరి చదువు ఎవరికి చెబుతారు. చదువుకోవడం, చదువు నేర్పడం కోసమేనా? ఇంకా దేనికీ పనికిరాదా? అని అప్పుడప్పుడు పాఠశాలలో ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు అనుమానం వచ్చేది. అప్పుడు విద్య యొక్క ఉపయోగం మాకు ఇంతేనా అని అనిపించేది. మా చుట్టూతా మాకన్నా ముందు చదువుకున్నవాళ్లు అందరూ టీచర్లో, తాహసిల్‌ ఆఫీస్‌లో పనిచేసేవాళ్లో ఉండేవాళ్లు. ఇది 1960 థకంలో తెలంగాణలోని పరిస్థితి.

భయపడడాన్ని కష్టపడి నేర్చుకొన్నాము

చిన్నప్పుడు ఇంటిలో, ఇరుగుపొరుగులో ప్రోత్సాహం కన్నా, భయ పెట్టడమే ఎక్కువ. గడపమీద కూర్చోకూడదు. కాలు పెట్టకూడదు. పుస్తకాలు సరస్వతి... తొక్కకూడదు మొక్కాలి. పైసలు, నోట్లు కిందపడితే తీసుకొని కళ్ళకద్దుకోవాలి. అన్నం పరబ్రహ్మం, పడేయకూడదు. పడేస్తే అన్నం దొరకదు. అప్పు చేయకూడదు... ఇలా ఏమి చేయకూడదో ఎక్కువ చెప్పేవాళ్లు. ఏమి చేయాలో చెప్పడం తక్కువ. ఏమి చేయాలో చెప్పే విషయాలన్నీ శాసనాల్లాగ చెప్పేవాళ్లు. అర్థం చేయించేవాళ్లు కాదు. అన్నిటికీ భయపెట్టి, తిట్టి, కొట్టి నేర్చుకోవాలన్నారు. అలా ప్రతి దానికి భయపడడం నేర్చుకున్నాము. భయం రక్తంలో, వ్యక్తిత్వంలో కలిసిపోయేవిధంగా పెద్దలు ప్రవర్తించారు.

కాలంతోపాటు మారుతున్న వ్యక్తిత్వ వికాసం

ఇప్పుడు కాలం మారింది. శాసనాలుగా చెప్తూ, కొట్టి, తిట్టి, కోపానికి వచ్చి చెప్పే బదులుగా, ఓపికగా చెప్తున్నారు. అర్థం చేయిస్తున్నారు. మేమిద్దరం మాకు ఇద్దరు, మాకు ఒకరు అని కుటుంబాన్ని పరిమితం చేసుకోవడం ద్వారా పిల్లలపై అనురాగంతోపాటు, బాధ్యత పెరిగింది.

25 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా తల్లులు కొడుకులకు, కూతుళ్లకు అన్నం కలిపి పెట్టి తినిపిస్తున్నారు. ఇది మరీ చాదస్తం ప్రేమ. తద్వారా కూతుళ్ళు పెళ్ళయ్యాక అత్తవారింట్లో కొత్త పరిస్థితుల్లో కలిసిపోవడం కష్టమవుతున్నది. కొడుకులు భార్యలకు భారమవుతున్నారు. భార్యనుండి తల్లిలాగ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. మరోవైపు భార్య భర్తనుండి అమ్మలాగ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఇలా ఇద్దరూ పరస్పరం అమ్మలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తూ నిరాశకు గురవుతూ సంఘర్షణకు లోనవుతున్నారు.

బ్రాయిలర్‌ కోళ్ళలా పెంచబడుతున్న బాల్యం

మరొకవైపు ప్రేమ పేరిట, బాగా చదువుకోవాలనే పేరిట తల్లిదండ్రులు, పిల్లలు తమ కంట్రోల్లో ఉండాలనే నిర్బంధం కూడా పెరిగింది. 24 గంటలూ క్రమశిక్షణలో టైం టేబుల్‌ నిర్ణయించి, ఒక రకమైన నియంతృత్వాన్ని రుద్దుతూ బ్రాయిలర్‌ కోళ్ళలా అన్నీ సమకూర్చి స్వేచ్ఛ లేకుండా పెంచుతున్నారు.
మా కాలంలో తల్లిదండ్రులు ఏదీ సమకూర్చకపోయినా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం. తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళం. నా కొడుకు ఏది చేసినా మంచే చేస్తున్నడు అని సంతోషపడేవాళ్ళు. అలా ఇంటిలో స్వేచ్ఛ లేకపోయినా, గడప దాటితే అంతా స్వేచ్ఛే అని చెప్తుంటారు. ఇపుడు 24 గంటలు పిల్లలు తమ అదుపులో ఉండాలని తల్లిదండ్రులు అతి ప్రేమతో పిల్లలను హింసిస్తు న్నారు. మానసికంగా ఎదగకుండా చేస్తున్నారు. పిల్లల తిరుగుబాటును సహించ లేక పోతున్నారు.

అమెరికాలో, యూరప్‌లో, రష్యాలో పిల్లల పెంపకం...

అమెరికాలో, యూరప్‌లో స్కూళ్లలో పిల్లలకు స్వేచ్ఛ గురించి చాలా చక్కగా చెప్తారు. తల్లిదండ్రులు తమ పనుల ఒత్తిడిలో కొన్ని విషయాలు వివరించలేక కోపానికి వస్తారని, అలాంటి సందర్భాల్లో మీరు తల్లిదండ్రులను ఆ విషయం వివరించ మని కోరాలని చెప్తుంటారు.

అమెరికానుండి 2010లో ఇండియాకు వచ్చిన మా ఎనిమిదేళ్ళ మనవడిని తండ్రి ఏదో బాగా కోపానికి వచ్చాడు. మా మనవడు తండ్రిపై ఎదురు తిరిగాడు. వై ఆర్‌ యూ యాంగ్రీ. కన్విన్స్‌మి. అంటూ నిలదీశాడు. మాకు చాలా ముచ్చటేసింది. ఇలా నూతన వ్యక్తిత్వ వికాసం పిల్లల్లో ప్రారంభమవు తున్నది.

పుణ్యం - పాపం, మంచీ - చెడు అనే పేరుతో...

వెనుకట కొన్ని పనులు చేస్తే పుణ్యం అనీ, కొన్ని పాపమని చెప్పేవాళ్ళు. న్యాయం, ధర్మం, మంచీ చెడు, పరోపకారం, స్వార్థం, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌, మొదలైనవన్నీ అలా వారినుండి వారసత్వంగా నేర్చుకున్నాము. నేర్పబడ్డాయి.

అలా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకోవడం కాకుండా మేమెలా ఉంటే బావుంటుందో వాళ్లు భావించిన విధంగా ఉండాలని వాళ్లు తీర్చిదిద్దేవాళ్లు. వాళ్లు అంటే ఎవరు... వాళ్లు అంటే కుటుంబం... కులం... ఊరు... ప్రాంతం... సమాజం. ఇలా సమాజం తనను తాను నడకలో, నడతలో, సంస్కృతిలో, భాషలో, మాటలో, బాడీ లాంగ్వేజ్‌లో, ఆటపాటల్లో, జీవన విధానంలో, ఉత్పత్తి విధానంలో నిరంతరం పునరుత్పత్తిని కొనసాగింపును ఒక చక్రంగా మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటూ వచ్చింది. కొత్తవి కల్పుకోవడం కష్టం.

పాతవాటికి, కొత్త వాటికి మధ్య సంఘర్షణ

సమాజంలో కొత్తవి వచ్చి చేరినప్పుడల్లా పాతవాటితో సంఘర్షించాల్సి వచ్చేది. వ్యతిరేకత ఎదురయ్యేది. పాతవాటినుండి కొత్తవాటికి మారడానికి తొలుత సిద్ధపడేవాళ్లు కాదు. అలవాటు అలాంటిది. బాగా ఉపయోగం అని అర్థం కాగానే వాటిని స్వీకరించేవాళ్లు.

అలా సైకిల్‌ జీవితంలో ప్రవేశించాక, సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నారు. రేడియో వినడం నేర్చుకున్నారు. బడికి వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది అని అర్థం అయ్యాక బడికి వెళ్ళడాన్ని ప్రోత్సహించారు.
మొదట్లో బడికి వెళ్ళడం అనవసరమని, చేస్తున్న కులవృత్తి, వ్యవసాయం చాలు అని, చదువు కుంటే సోమరిపోతులై పనికి వంగరని, చదువుకోవడాన్ని నిరసించేవారు. ధనవంతులు, భూస్వాములు, దొరలు కూడా చదువుకోవడాన్ని నిరసించేవాళ్లు. మాకేం తక్కువ. మా పిల్లలు చదువుకొని నౌకర్లు చేసేది ఉందా? మేమే ఎంతోమందిని నౌకర్లుగా పెట్టుకుంటున్నాము... మంది దగ్గర నౌకరి చేస్తామా? సర్కారు నౌకరీ చేయాల్సిన అవసరం మాకేముంది. అని చదువులను నిరాకరించారు. కాలక్రమంలో వాళ్లుకూడా చదువుకుంటే మంచిదని తెలుసుకున్నారు.

ఇలా ఆధునిక విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు, చదువంటే సర్కారు నౌకరికి పనికొచ్చేది అనుకునే కాలం ఉండేది. పేదోళ్లు ముందుకు రాలేదు. సంపన్నులు ముందుకు రాలేదు. కాలక్రమంలో మెల్లిమెల్లిగా చదువుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు అందరికీ చదువే సర్వస్వం అయిపోయింది.

పిల్లల అభివృద్ధే జీవిత లక్ష్యంగా మార్చుకున్న తల్లిదండ్రులుఇప్పుడు పిల్లల్ని చదివించడం, పెళ్ళి చేయడం, ఒక ఇల్లు కట్టుకోవటం, అనేవి తల్లిదండ్రులకు జీవిత లక్ష్యాలుగా మారిపోయాయి. వారికి అంతకు మించిన లక్ష్యాలు లేవు. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తే వారి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం కోసం తమ వృత్తి ఉద్యోగాలను ఉపయోగించుకుంటున్నారు. పిల్లల చదువు కోసం, వారి చదువులకు అనువైన ఊర్లకు బదిలీ చేయించుకుంటున్నారు. పిల్లలను, తల్లిని ఉంచి తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వారానికొకసారి ఇంటికి చేరుకుంటున్నాడు. ఇలా పిల్లల చదువు అనేది తల్లిదండ్రులకు జీవిత లక్ష్యం అయిపోయింది. తాము ఎదిగే లక్ష్యం కన్నా, పిల్లల భవిష్యత్‌ అనే లక్ష్యం ముఖ్యమైపోయింది.

తాము ఎదగాలని కృషి చేసి ఎదిగినవారుమరికొందరు తాము పెళ్ళయ్యాక, పిల్లలయ్యాక కూడా జీవితంలో ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించే కృషి చేశారు. అలా టీచర్‌గా ఉద్యోగానికి ఎక్కినవారు పరీక్షలు పాసై అర్హతలు పెంచుకొని, ప్రమోషన్లు పొందుతూ స్కూల్‌ అసిస్టెంట్‌, హెడ్‌మాస్టర్‌, ఎమ్‌ఈవో, లెక్చరర్‌, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌, యూనివర్శిటీ ప్రొఫెసర్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ దాకా ఎదిగారు. గుమస్తా నౌకరి నుండి సీనియర్‌ అసిస్టెంట్‌, గిర్దావార్‌, నాయబ్‌ (డిప్యూటి) తాహసిల్దార్‌, డిప్యూటీ కలెక్టర్‌, ఆర్డీవో, డిఆర్వో దాక ప్రమోషన్లు సాధించారు. మరికొందరు కవులుగా, కళాకారులుగా, రచయితలుగా, గాయకులుగా, ఉద్యోగసంఘాల నాయకులుగా, ఆర్గనైజర్లుగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌., రోటరీ క్లబ్‌, లయన్స్‌ క్లబ్‌ కార్యకర్తలుగా, ఆర్గనైజర్లుగా అదనపు రంగాల్లో కృషి చేశారు.

అలా అనేక రంగాల నుండి ఉద్యోగాలు చేస్తూనే ఎందరో రచయితలుగా, కళాకారులుగా, గాయకులుగా, గొప్ప ఆటగాళ్లుగా, నటులుగా, ఫోటోగ్రాఫర్లుగా, విలేఖర్లుగా ఎదిగారు. ఉద్యోగాలు చేస్తూనే చిన్న చిన్న వ్యాపారాలు, కాంట్రాక్టులు, చిట్‌ఫండ్‌లు, పెళ్ళిళ్ల పేరయ్యలు, ట్యూషన్లు, డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌లు, ప్రైవేటు సంస్థల్లో పార్ట్‌ టైం జాబులు, అదనంగా చేసుకుంటూ వస్తున్నారు.

English summary
An eminent writer BS ramamulu says personality development depends on experiences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X