వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వ వికాసం: సంస్కృతి, ఇంగిత జ్ఞానం

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రజల పలుకుబడుల్లో, లోకోక్తుల్లో, పొడుపు కథల్లో, శాస్త్రాల్లో, సూక్తుల్లో, విధి నిషేధాల్లో, తిట్లలో, ఎత్తి పొడుపుల్లో, సంస్కృతి, సంస్కారం, ఇంగిత జ్ఞానంకు సంబంధించిన అనేక అంశాలు గమనించవచ్చు. అందరి తీరు ప్రవర్తించకుండా ఎబ్బెట్టుగా ప్రవర్తించేవారిని హేళన చేస్తుంటారు. విచిత్రంగా చూస్తుంటారు. మతాలన్నీ విశ్వాసాలు, సంస్కృతి, విలువల రూపంలో కొనసాగుతుంటాయి. మతాలు లేకపోయినా, సంస్కృతి, విలువలు, విశ్వాసాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ సంస్కృతి, విలువలు, విశ్వాసాలు లేకుండా మతాలు మనజాలవు. సంస్కృతి, సంస్కారం, ఇంగిత జ్ఞానం రూపంలో కొనసాగు తుంది. దీన్నే ఇంగ్లీషులో కామన్‌ సెన్స్‌ అని అంటారు. కామన్‌ సెన్స్‌ లేదా అనేది తిట్టు. అనగా ఎవరూ చెప్పకుండానే అర్థం చేసుకొని ఆచరించాలి అని కోరడమే ఈ తిట్టు అర్థం.

వెనకటి గ్రంథాల్లో ఆదర్శాలు, వ్యక్తిత్వ వికాసాలు...

దేశీయ సంస్కృతిలో ప్రజలు ఆచరిస్తూ వస్తున్నవి, ఆచరించాల్సినవి పెద్దలు చెప్పడం జరుగుతుంది. అలాంటివి కొన్ని లిపిబద్దమయ్యాయి. బౌద్ధం, జైనం, శుక్రనీతి, అపస్తంభ సూత్రాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం, రామాయణం, మహాభారతం, పురాణాలు బృహస్పతి స్మృతి, మనుస్మృతి, వాత్సాయన కామ సూత్రాలు, బార్హస్పత్య అర్థశాస్త్రము, మానసోల్లాసము, చరక సంహిత, యాజ్ఞవల్క్యశిక్ష, భగవద్గీత, సుభాషితరత్నభాండాగారము, పాణినీయశిక్ష, మార్కండేయ స్మృతి, సూక్తిముక్తావళి, సుమతి శతకం, నరసింహ శతకం, కుమారీ శతకం, వేమన తత్వాలు, వీరబ్రహ్మం తత్వాలు, గురు రవిదాస్‌, కబీర్‌ సూక్తులు, గురుగ్రంథ సాహిబ్‌, యోగవాశిష్ఠం, హితోపదేశం, నారద స్మృతి, హరీతస్మృతి, గౌతమ ధర్మసూత్రం, ఉపనిషత్తులు, వాటి వ్యాఖ్యానాలు మొదలైనవాటిలో కొన్ని నేటికీ ఆదర్శంగా తీసుకోవాల్సినవి ఉన్నాయి. కప్ప గంతుల లక్ష్మణశాస్త్రి కొన్నింటిని 'లక్ష్మణ రేఖలు' భారతీయ సదాచార - వ్యవహార కరదీపిక గ్రంథంలో అర్ధ తాత్పర్యాలు వివరించారు. వీటినుంచి నమస్తే తెలంగాణ పత్రికలో 2013 చివరలో - 2014 ప్రారంభంలో కొన్నిటిని ప్రచురించారు. వాటిని ఇలా చెప్పుకోవచ్చు.

Personality development sensitivty

రోజువారీ జీవితంలో...

సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. చదువుకోవాలి. పనులు చేసుకోవాలి. పిల్లలు వారి ఈడువారితో ఆటలాడు కోవాలి. పెద్దలు, యువకులు ప్రియ మిత్రులతో రెండు గంటల వరకు హాస్యం, వినోదం, క్రీడలు చేయాలి. క్రీడల్లో జగడాలు కలిగేపద్దతిలో ఆడ కూడదు.

సాయంత్రం వాహ్యాళికి, వాకింగ్‌కు, పార్కులకు మిత్రులతో ఇష్ఠాగోష్ఠి. సాయంకాలం సంగీత గోష్ఠి, పొడుపు కథలు, కళారూపాల చూచుట, మన స్సుకు ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు.

జ్ఞాన సంపాదనలో...

చదువుకునేటప్పుడు మనస్సులో ఇతర విషయాల గురించి యోచించ కూడదు. చదువుతున్నదానిపైనే మనస్సు లీనం చేసి చదవాలి. గురువులపట్ల వినయంగా మెలుగుచూ ప్రశ్నలు వేస్తూ, తెలుసుకునే ఇచ్ఛతో, శ్రద్ధతో, జ్ఞానులైన గురువులనుండి జ్ఞానాన్ని సంపాదించాలి. శ్రద్ధ కలిగి జ్ఞాన సంపా దనలో నిరంతరం నిమగ్నుడై ఇంద్రియ నిగ్రహం కలిగినవారే జ్ఞానం పొందు తారు. ఒక్క క్షణం కూడా వ్యర్ధం కాకుండా విద్య సంపాదించాలి. ఒక్కపైసా కూడా విడవకుండా ధనం సంపాదించాలి.

ఏ వ్యక్తి నిరంతరం చదువుతారో, రాస్తారో, గ్రంథాలను పరిశీలిస్తారో విద్వాంసులను, శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటారో వారితో కలిసిమెలిసి ఉంటారో అట్టివారి బుద్ధి సూర్య కిరణాలచేత, కమలాలు వికసించినట్లుగా వికసిస్తాయి. చదివేటప్పుడు మధురంగా, ఇంపుగా చదవాలి. అక్షరాలను, పదాలను స్పష్ఠంగా విడివిడిగా అర్థమయ్యేవిధంగా సుందర స్వరంతో దైర్యంగా చదవాలి. లయబద్ధంగా ఉండేవాటిని, లయబద్ధంగా చదవాలి.

పిల్లలపట్ల పెద్దల కర్తవ్యాలు...

తల్లిదండ్రులు పిల్లలకు విద్యపట్ల శ్రద్ధ కలిగించాలి. పిల్లలను కొట్ట కూడదు, తిట్టకూడదు. వారి కోర్కెలను తీర్చాలి. సంతోషపర్చాలి. లాలించాలి. శారీరకంగా, ఆరోగ్యంగా ఉండేట్లు చూడాలి. వాళ్ళకు అనుకూలమైన ఆటవస్తువులను ఇవ్వాలి. పిల్లలు ఎప్పుడూ ఏడుపు మొఖంతో ఉండేట్లు చేయకూడదు. పిల్లలు చపలచిత్తం కలవారు కాబట్టి ఎంతకష్టమైనా శ్రద్ధ తీసుకోవాలి. ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లలకు నేర్చుకోవడానికి ఇష్టంలేని విషయాలను కూడా అభ్యాసం చేయిస్తే నేర్చుకుంటారు. రోగికి మందులు ఇచ్చి ఆరోగ్యవంతుడ్ని చేసినట్లు విద్యార్ధులను, పిల్లలను బుజ్జగించి, లాలించి నేర్పాలి. సమర్ధులైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కొత్త గుర్రాలవలె పిల్లలను బెదిరించి, గద్దించి, నవ్వించి, ఆడించి, లాలించి మెల్లమెల్లగా శిక్షణ ఇవ్వాలి.

వ్యాయామం, స్నానాదులు...

నూతులు, చెరువులు, కుంటలు, కాలువలు మొదలైన మానవులు నిర్మించిన జలాశయాల్లో స్నానం చేసేటప్పుడు గంగా, యమునా, కావేరి, గోదావరి, కృష్ణా మొదలైన పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం చేయాలి. స్నానానికి పూర్వం వ్యాయామం చేసి వుంటే అలసట తీరకముందు స్నానం చేయకూడదు. భయంకర వేగంతో ప్రవహించే నీళ్ళల్లో స్నానం చేయకూడదు. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటూ స్నానం చేయకూడదు.

గురువు, శిష్యుల సంబంధం...

గురువు తన పుత్రులవలె శిష్యుల అభివృద్ధిని కోరుచూ ఏదీ దాచక, పరిపూర్ణ శ్రద్ధతో, ఆసక్తితో విద్య నేర్పాలి. గురువు శిష్యులతో పనులు చేయించుకోకూడదు. శిష్యుడు అపరాధం చేసినపుడు అవసరమైన మేరకు గురువు మందలించి జాగ్రత్త పర్చాలి. శిష్యున్ని కొట్టకుండా, మందలించ కుండా, తిట్టకుండా ప్రేమతో, వాత్సల్యంతో, క్రమశిక్షణలో పెట్టి విద్య నేర్పాలి. శిష్యులను గురువు ధర్మంచేత శాసించాలి తప్ప కొట్టి, తిట్టి, భోజనం పెట్టక, ఆకలితో బాధించకూడదు. అనుచిత విషయాలు తప్ప అన్ని విషయాల్లో విద్యార్ధులు గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. గురువుయొక్క పేరును గౌరవ వాచకం శ్రీ, గారు, సార్‌ మొదలైనవి లేకుండ ఉచ్చరించకూడదు. గురువుతో ఎప్పుడుకూడా ఏ విషయంలో కూడా మొండిగా హఠం చేస్తూ వాదించకూడదు.

లోకంలో ఎవరు ఎవరికి మిత్రులు కారు, శత్రువులు కారు...

మానవ సంబంధాల్లో, వ్యవహారంలో లోకంలో ఎవరు ఎవరికి మిత్రులు కారు. శత్రువుకు కూడా కారు. మనుషులు చేసే మంచి చెడ్డ వ్యవహారాల కారణంగానే అతనికి, ఆమెకు మిత్రులు, శత్రువులు ఏర్పడతారు. అందువల్ల అందరితో పరస్పరం మంచిగా, యధోచితంగా వ్యవహరించాలి. అందుకే నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అన్నారు.

స్వభావాల కర్మలవల్లే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు...

ఎవరికి కూడా పుట్టినప్పటినుండే సహజంగా మరొకరు సృజనుడు గానీ, దుర్జనుడు గానీ కాదు. మనుషుడు తన కర్మల ద్వారా, వ్యవహారాల ద్వారానే సమాజంలో సన్మానం గానీ, అవమానం గానీ పొందుతారు. అందు చేత తన కుటుంబంలో, సమాజంలో గౌరవ స్థానం పొందడానికి తన నడవడికను, వ్యవహారాన్ని ధర్మసమ్మతంగా, నీతి సమ్మతంగా మలచుకొని నడవాలి.

ఒక మనుషుడు పుట్టిన జాతిని, కులాన్ని మాత్రమే కారణంగా అతన్ని చంపుట, కొట్టుట గానీ, లేక పూజించుట గానీ చేయవచ్చునా? అట్లు చేయకూడదు. మనుషుని వ్యవహారమూ, ప్రవర్తనను చూసి అతనిని తిరస్కరించడమో, పూజించి సన్మానించడమో జరుగుతుంది. అతడు నిరసించబడుటకు గానీ, గౌరవించబడుటకు గానీ అతని ప్రవర్తన, వ్యవ హారమే పరిగణించాలి.

బాల్యంలో లాలించాలి...

పుత్రులకు నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చువరకు తండ్రి లాలిస్తూ, ప్రేమిస్తుండాలి. అయిదేళ్ళ వయసువరకు రాజుగా చూడాలి. ఏది అడిగితే అది యివ్వాలి. ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సు వచ్చేదాక సద్గుణాలను, విద్యలను నేర్పించాలి. ఈ కాలంలోనైతే కనీసం 23 సంవత్సరాల వయస్సు వరకు విద్య నేర్పించాలి.

దారిలో, ప్రయాణాల్లో...

యాత్రలు రాకపోకల విషయంలో రాజైనా, శాసకుడైనా సరే మంచి వాహనంపై కూడా జనాల సందడి ఉండే అంగడి వీధుల్లో, మార్కెట్లలోంచి పోకూడదు. ఎక్కడికి పోతున్నావు, ఆగు, పోకు, అక్కడికి పోతే నీకేం లాభం వంటి అవతలివారికి ఇష్టం లేని ప్రశ్నలు వేస్తూ మాట్లాడటం మంచిది కాదు. అలాంటి పలకరింపులు చేయకూడదు.

ఏదైనా ఇరుకు తోవలో పోతున్నపుడు ఒకవేళ అదే మార్గంలో గురు జనం, బలవంతులు, రోగి, శవం, రాజు, పాలకుడు, సన్యాసి మొదలైన వ్రతనిష్ఠమైన పెద్ద వ్యక్తి, పండితుడు, వాహనంలో కూర్చొని వెళ్ళేవాడు. వీరిలో ఎవరు వచ్చినా వారికి తోవ వదలాలి.

వివాహానికి పోతున్న వరునికి వివాహం చేసుకొనే వస్తున్న వరుడికి తోవ విడవాలి. మూగ, చెవిటి, గుడ్డి వారికి, వృద్ధులకు తోవ విడవాలి. అలాంటివారు పోతున్నపుడు పక్కకు తొలగి వారిని పోనివ్వాలి. వారికి సహకరించాలి.

సంస్కారం... చేయగూడని పనులు...

ఏదైనా గ్రామంలోగానీ, మూయబడిన ఇంటిలోగానీ, అనుచితమైన తోవ గుండా ప్రవేశించకూడదు. తన ఇంటిలోగానీ, ఇతరుల ఇంటిలో గానీ, అనుచిత మార్గం గుండా ఎపుడు కూడా ప్రవేశించకూడదు. అలా చేస్తే చూసేవారికి అనేక సందేహాలు కలగవచ్చు. ఇతరుల ఇంట్లోగానీ, స్థలంలో గానీ, కార్యాలయంలో గానీ, ఇళ్ళల్లో గానీ వాటి యజమానుల, అధికారుల అనుమతి తీసుకొని ప్రవేశించాలి.

బుద్ధిమంతుడు నడిచేటప్పుడు పైకి అటూ ఇటూ అడ్డంగా చూసుకుంటూ పోకూడదు. మనుష్యుడు నడిచేటప్పుడు తనకు ముందువైపు కాడిమాను దూరం అనగా, నాలుగు చేతుల దూరంవరకు చూస్తూ పోవలెను. శరీర రక్షణ కోరేవాళ్ళు వానలో, ఎండలో గొడుగు వేసుకొని పోవాలి. రాత్రివేళలో గానీ, అడవిలోగానీ పోవాల్సి వచ్చినపుడు చేతిలో దండం పట్టుకొని, పాదరక్షలు తొడుక్కొని పోవాలి.

బాటసారిగా... జాగ్రత్తలు...

చాలా వడివడిగా నడవకూడదు. ఒకటేసారి చాలాదూరం నడవకూడదు. శత్రువులతో, అపరిచిత వ్యక్తితో, అధార్మికుడైన దురాచారునితో కలిసి పోకూడదు. బాగా విచారించి తనకు హితుడు, సుపరిచితుడు అయిన వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు.

తనకు తెలియని తోవలో, సంకటాలు గల తోవలో ప్రయాణించకూడదు. ఈ నియమం సాహస యాత్రలు చేసేవారికి, హిమాలయ పర్వతాలు ఎక్కాలను కునేవారికి వర్తించదు.

ధూళి, మన్ను కలిసిన వాయువు భయంకరంగా వీస్తున్నప్పుడు ఎడ తెగకుండా కుండపోతగా వాన కురుస్తున్నపుడు, తీవ్రంగా మండుటెండ కాస్తున్నపుడు, చిమ్మచీకటి సమయాల్లో ఆరోగ్యవంతుడైనప్పటికీ ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు. విధిలేక పోవాల్సినప్పుడు కూడా ప్రయాణం చేయకూడదు.

సహృదయులు... నీచ హృదయులు...

ఇతడు నా బంధువు, ఇతడు కాదు అను విచారం నీచ హృదయం గలవారికి ఉంటుంది. ఇతడు నావాడు, ఇతడు పరుడు అను విచారం కక్షుద్రులు, నీచ హృదయులు చేస్తారు. కానీ ఎవరు ఉదార హృదయం కల వారో వారు సమస్త ప్రపంచాన్ని తమ కుటుంబంగానే భావిస్తారు. సమస్త ప్రాణులను తమ సమానులుగానే భావిస్తారు. ఆ భావం ప్రకారమే అందరి యెడల హితంగా, సుఖకరంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి.
ప్రాణులందరితోను మధురంగా మాట్లాడుతూ, స్నేహంగా మెలగాలి. ప్రతి దినం, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు కూడా సమస్త ప్రాణుల సుఖాలను, సుభాన్నే కోరుకోవాలి. ఏ పని తన ఆత్మకు ప్రతికూలమని తోచునో ఆ పనిని ఇతరులకు చేయకూడదు. ఏ వ్యక్తి తనకు ఏ కార్యము, ఏ ఆచరణ, ఏ వ్యవహారము అప్రియమని తోచునో, ఆ కార్యం, ఆ ఆచరణ, ఆ వ్యవహారం ఇతరులకు చేయకూడదు.

సేవకులు, యజమానులు...

సేవకులను మధ్యలోనే కొలువునుండి తొలగించకూడదు. వారికి వేతనం లేక కూలి ఇచ్చుటలో జాగు చేయకూడదు. సేవకుడు గుణవంతుడిగా, సేవలు చేస్తున్న కొద్దీ పనుల్లో కుశలుడుగా, సమర్ధుడిగా ఎదుగుతున్న కొద్దీ అతనికి వేతనము పెంచుతుండాలి. ఏ వ్యక్తి సేవకులను కష్టపెట్టునో అతడు తనకు తాను హానే కలిగించుకుంటాడు. గృహ యజమాని తనకు, తన భార్యకు, తన పుత్రులకు అన్న వస్త్రాలు ఇచ్చుటలో కష్టం కలిగించినా, తన సేవకులను పరిచాలకులను మాత్రం కష్టపెట్టకూడదు.

సేవకుల వృత్తిని, వారి వేతనములను ఆపి ఉంచి దానిచేత రాజ్యధన సంపదలను పెంచుకోవాలనే ప్రయత్నం చేయకూడదు. సేవకులకు ఇచ్చుటకై, ఏ వేతనాలు, ఇతర సహాయాలు, నిర్ధారించి ఉన్నవో వాటిని పరిపూర్తిగా వారికి ఇచ్చివేయాలి. సేవకులను, పుత్రులతో సమానంగా ఆత్మీయంగా చూసుకోవాలి. ప్రజలను పుత్రులవలె ప్రేమతో పాలించాలి.

అతిథులు, ఆత్మీయులు... మర్యాదలు

అతిథుల యెడ ఆత్మీయంగా ఉండాలి. అతిధులకు భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేయాలి. వారి పంక్తిలో భోజనం చేయాల్సి వస్తే వారు భోజనం ఆరంభించిన పిదప తాను మొదలుపెట్టాలి. ఇంటిలోని పాలు, పెరుగు మొదలైన ద్రవ్యాలు, కూరలు, పూర్తిగా భుజించకూడదు. అతిథుల కొరకు మిగిలించి ఉంచి తక్కిన భాగం తాము భుజించాలి. ఇంటికి వచ్చిన అతిథులతో ఉండి, అతనితోనే కూర్చోవాలి. వేరుగా ఉండకూడదు.
రాత్రి పడుకునేటపుడు అతిథి అనుమతి తీసుకొని పడుకోవాలి. అతిథి కన్నా ముందే మేల్కొనాలి. దానివలన ప్రాతఃకాలమునందు అతిథికి చేయాల్సిన సేవా సత్కారములకు ఆటంకము కలగదు. మరునాడు అతిథి ఒకవేళ వెళ్ళిపోదలచిన యెడల అతనికి ఉపహారము మొదలైన సత్కారములు అతని ఇష్టప్రకారం చేసి సంతోషపరచి పంపాలి. అతిథి ఒకవేళ ఏదైనా వాహనంలో పోతే ఆ వాహనం ఎక్కేవరకు అతనిని సాగనంపుతూ వెంట పోవాలి. వాహనం ఏదీ లేకుండా అతిథి పోవుచుండిన యెడల అతడు తిరిగి పొమ్మనే వరకు అతని వెంట పోవాలి. ఒకవేళ అనుమతి ఇచ్చి గృహస్థున్ని తిరిగి పొమ్మనుటకు అతిథికి మొహమాటంతో తోచని యెడల ఊరి పొలిమేర వరకు, నేడయితే వీధి చివరి వరకు సాగనంపి గృహస్థుడు తిరిగి రావాలి.

అతిథి వ్యక్తిగా శ్రమ తీర్చుటకు ఆధారపూర్వకంగా విసనకర్రతో వీచాలి. నేడైతే ఫ్యాన్‌, ఏసీ వేయాలి. మంచినీళ్ళు, చల్ల, కూల్‌డ్రింక్స్‌, టీ, కాఫీ వగైరా ఇవ్వాలి. అతిథిగా వచ్చిన వ్యక్తికి కూర్చోవడానికి ఆసనం ఇవ్వాలి. అలసినవారి విశ్రాంతికొరకు పరుపు ఇవ్వాలి. దప్పిక కొన్నవారికి పానీయం ఇవ్వాలి. ఆకలిగొన్నవారికి భోజనం పెట్టాలి.

ఎవరైనా ఇంటికి వచ్చినపుడు ప్రసన్నవదనంతో చూడాలి. పలకరిం చాలి. మనస్సును సంతోషంతో ఉంచుకోవాలి. వారితో మధురంగా మాట్లా డాలి. వారివద్ద కూర్చోవాలి. వారు వెళ్ళిపోయేటపుడు వారిని సాగనంపుతూ వారి వెంట వెళ్ళాలి.

సజ్జనుల ఇళ్ళల్లో అతిథి కొరకు చివరకు భూమి, ఆసనం, జలం, మధురవాక్కు, భోజనం, మర్యాద వంటివాటికి ఏ లోపం ఉండదు. అందువల్ల ఈ సత్కారాలను అతిథికి చేయాలి.

మర్యాదలు, సంస్కారాలు...

అతిథి వచ్చినపుడు అతని కడకు వచ్చి అతని వయస్సును బట్టి సము చితంగా నమస్కారం లేదా ఆశీర్వాదం చేసి అతన్ని ఆసనం పై కూర్చోబెట్టాలి. మొదట మధురవాక్కుల చేత అతిథిని సంతృప్తిపరచి, ఆహార పానీయాలు ఇచ్చి, పూజాదులతో తృప్తి పరచాలి.

అల్లుని గురించి అత్తమామలు ఎంతో మర్యాదలు చేయాలి. పండగల్లో, వేడుకల్లో, ఫంక్షన్లలో అల్లున్ని పిలవకపోవడం, దుర్భాషలాడడం, అల్లునికి ఇష్టంలేని పనులు చేయడం, మర్యాదల ప్రకారం ఇచ్చే కట్న కానుకలు ఇవ్వక పోవడం అల్లుని పట్ల కొడుకువలె వాత్సల్యం లేకపోవడం మొదలైన పనులు మామ చేయకూడదు. అల్లుడ్ని గురుజనాలను, సోదరులను, అతని ఇతర బంధుమిత్రులను కూడా మామ యధాశక్తిగా ఆదరించి సత్కరించాలి. అట్లు చేయని యెడల ధర్మం తప్పినవాడు అవుతాడు.

బావలు... అల్లుళ్ళు... మామలు...

ఒకవేళ సోదరి భర్త వయస్సులో పెద్దవాడు అయినపుడు బావగారిని దేవతుల్యునిగా భావించి ఆదర సత్కారాలు చేయాలి. అల్లుడు కూడా మామకు ఇష్టం లేనివిధంగా వ్యవహరించకూడదు. మామకు నచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ అతనికి అత్తమామ ఇంట్లో గౌరవం జరగని యెడల మామ ఇంటికి పోకూడదు. వేడుకల్లో, పండుగల్లో, ఫంక్షన్లలో మేనమామ అతిథి, ఆచార్యుడు, బాలకుడు, వృద్ధుడు, ఆశ్రిత జనం, కుటుంబ సంబంధీకులు, వియ్యంకులు, బంధువులు, తల్లితండ్రి కుటుంబంలోని కోడలు, సోదరి మొదలైన స్త్రీలు, సోదరుడు, పుత్రుడు, భార్య కూతురు, సేవక జనం మొదలైనవారందరితో చిన్న చిన్న విషయాలను పురస్కరించుకొని వాద వివాదాలు చేయకూడదు. అందరితో ప్రసన్నంగా మెలగాలి. చిన్న చిన్న విషయాలపై పోట్లాటలు చిన్న బుద్ధులను తెలుపుతాయి.

సోదరుల పరస్పర వ్యవహారం...

అందరూ ఒకటిగా కూర్చొని భోజనం చేయాలి. అందరూ ఒకటిగా కూర్చొని ప్రేమపూరితంగా మాట్లాడుకోవాలి. పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. ఒకరింటికి మరొకరు వైరం చేయక రాకపోకలు సాగిస్తుం డాలి. సోదరులు తమకు తాము ఒంటరిగా కాక, అందరూ కలిసి మెలిసి కష్టసుఖాలను అనుభవించాలి. సోదరులమధ్య శతృత్వం కలిగిన యెడల మధ్యవర్తి ఒక పక్షం వహించక సమానంగా వ్యవహరించి, భేదభావాలను పోగొట్టాలి. మిత్రులు, బంధువులు, సోదరులు, భోజన సమయమందు ఇంటికి వస్తే వారికి కూడా భోజనం పెట్టాలి. ఎవరు తన శ్రేయస్సు కోరెదరో వారు తమ సోదరులను, బంధువులను అభివృద్ధి పరచవలెను.

ధనవంతుడు సమర్ధుడైన వ్యక్తి దరిద్రులు, దీనులు, రోగులైన తమ బంధువులకు, సోదరులకు సహాయం చేస్తే అట్టివ్యక్తి పుత్రపౌత్రాది కుటుంబంతో ధన, ధాన్య పశు సంవృద్ధితో ఎడతెగని అనంత సుఖములను, శ్రేయస్సును పొందగలడు. వాహన యోగ్యమైన గుఱ్ఱాలు, ఎద్దులు మొదలైన పశువులు వాహన నడకనుండి విడువబడనంతవరకు, వాటికి నీరు తాపనంతవరకు వాటిపైన ఎక్కి కూర్చున్నవారు నీరు తాగకూడదు. నేటి ప్రకారం ఏదైనా స్కూటర్‌ బైక్‌, కారు పై పోతున్నపుడు వాటి ఆయిల్‌, పెట్రోల్‌, సర్వీసింగ్‌ వగైరా శ్రద్ధ వహించాలి.

సభలో శత్రువును నిందించకూడదు...

సభలో శత్రువును నిందించకూడదు అంటుంది చాణక్య నీతి. కానీ నేడు ఇద్దరు కలిసినా లక్షలాది ప్రజలతో బహిరంగ సభ జరిగినా, తాను చెప్పదలచిన దానికన్నా ఇతరులను నిందించడమే ఎక్కువ. తద్వారా నెగెటివ్‌ థింకింగ్‌ నేర్పినవారవుతారు. అది కాలక్రమంలో వారిపైనే విమర్శలకు తావిస్తుంది. ఒకవేళ శత్రువైనను, దీనహీన స్థితిలో ఉన్నయెడల అతనిపట్ల కూడా దయ చూపవలెను. శత్రువైనను అతని జీవనోపాదికి నాశనం కలిగించకూడదు. అనగా పొట్టమీద కొట్టకూడదు. శత్రువుయొక్క కొడుకైనా సరే అతడు తనపట్ల మిత్రునిగా వ్యవహరిస్తే అతన్నికూడా రక్షించాలి.

తన శత్రువులో మంచి గుణాలు ఉన్నయెడల వాటిని గ్రహించాలి. శత్రువు తనకు విరోధి అయినా ఒకవేళ మంచి మాట చెప్పినచో ఆ మాటను దోషదృష్టితో చూడక దాన్ని కూడా అంగీకరించాలి. ఏ వ్యక్తులు శత్రువులయెడల గూడ ఎప్పుడూ దోషములు చెప్పక, దానికి వ్యతిరేకంగా శత్రువులలోని మంచిగుణాలను వర్ణిస్తారో వారు సుఖసౌఖ్యాలను శాంతిని అనుభవిస్తారు.

నమస్కారాలు, ఆశీర్వాదాలు...

తనకంటే శ్రేష్ఠులైన స్త్రీలకు, పురుషులకు అభివాదం చేయాలి. అలా నమస్కరించినవారికి శ్రేష్ఠులు ఆశీర్వాదం ఇవ్వాలి. నేడు సమానులమధ్య హలో అని బాగున్నారా అని పలకరించుకోవాలి. కొందరు పెద్దవారిని కూడా హలో అని పలకరిస్తుంటారు. ఇది మర్యాద కాదు. అసలు పలకరింపే లేకుండా చిరునవ్వు నవ్వడం, మొహం చాటువేయడం చేస్తుంటారు కొందరు. ఇది మంచిపద్దతి కాదు. తనను కూడా అలాగే అగౌరవ పరుస్తారు. గౌరవం ఇవ్వాలి. తీసుకోవాలి అని ఇంగ్లీషులో గొప్ప సామెత. గౌరవనీయులను ఇగోకు గురికాకుండా, తనకున్న పెద్ద పదవులతో నిమిత్తం లేకుండా సదా గౌరవిస్తుండాలి. అదే వారికి అపారగౌరవాన్ని తెచ్చిపెడుతుంది.

తల్లిదండ్రులకు, వారిబంధువులైన మేనమామలు, పినతల్లులు, పెద తల్లులు, పెదతండ్రులు, పినతండ్రులు, వారి భార్యలు, మేనత్తలు, అన్నలు మొదలైనవారి పాదాలు తాకి నమస్కరించాలి. కుడిచేత కుడిపాదాన్ని, ఎడమ చేత ఎడమ పాదాన్ని తాకాలి. అందరూ ఒకేసారి కలిసినపుడు వారిలో అందరికన్న శ్రేష్ఠునకు మొదట నమస్కరించి ఆ క్రమంలో తక్కినవారికి నమస్కరించాలి. గురువుగానీ, ఇతర శ్రేష్టులుగానీ, గొప్పవారుగానీ కలిసి నపుడు లేచి నిలబడి ఎదురుగా పోయి నమస్కారం చేయాలి. కూర్చుండియే నమస్కారం పెద్దలపై ఎప్పుడు చేయకూడదు. పెద్దలు కలిసినపుడు తన పేరు చెప్పుకొని నమస్కారం చేస్తే మంచిది.

ప్రయాణికుల యెడల వ్యవహారం...

ప్రయాణికుల సౌకర్యం కొరకు నదిపైగానీ, మార్గంపైగానీ, వంతెన నిర్మించేవారికి ఎంతో పుణ్యం. దారిలో గులకరాళ్ళు, మట్టిపెడ్డలు, ముండ్లు మొదలైనవి పడివుంటే వాటిని తీసేస్తే ఎంతో పుణ్యం. దీనులు, దుఃఖితులు, అనాథలైన బాటసారుల విశ్రాంతికోసం అన్నము, నీరు, సత్రము, ధర్మశాల, మఠము ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యము. ఎండాకాలంలో దారిలో మంచినీళ్ళు, చలికాలంలో అగ్ని, కట్టెలు బాటసారులకు ఏర్పాటు చేస్తే వారికి భుక్తి, ముక్తి, దీప్తి ఈ మూడు లభిస్తాయి.

ప్రపంచ శుభాల కోసం...

ప్రపంచమునకు కళ్యాణమగుగాక! దుర్జనులు సజ్జనులగుగాక! ప్రాణు లందరు పరస్పరం హితం కోరుకుందురుగాక! అందరి మనస్సులందు మంచి భావాలు ఉత్పన్నమగుగాక!. అందరికీ సుఖము, ఆరోగ్యము, మంగళము కలుగుగాక. ఎవరికి కూడ దుఃఖము కలగకుండ ఉండుగాక. సమస్థ ప్రపం చానికి శుభాలు కలుగునుగాక, అందరి కష్టాలు తీరుగాక. సంతానం లేని వారికి సంతానం కలుగుగాక. నిర్దనులు ధనవంతులు అగుదురుగాక. అందరూ నూరేళ్ళు జీవించి వుందురుగాక!.

రోగులయెడ సద్భావన...

జీవనోపాధి లేకుండా బాధపడేవారికి అనారోగ్యంతో బాధపడేవారికి, దుఃఖితులకు, తనశక్తికొద్దీ సహాయం చేయాలి. రోగులకు ఆరోగ్యం కలిగించ టానికి అన్నివిధాల కృషి చేయాలి. దరిద్రులు, రోగి, అనాథలు, అంగవిహీనులు, విధవలు, మూగవారు, కుంటివారు, బాలకులు, బాలికలు, వృద్ధులు మొదలైనవారికి ఔషధము, వసతి, భోజనము, వస్త్రము, పండ్లు, పక్కదుప్పట్లు మొదలైనవి సహాయముగా ఇవ్వ వలెను. వారిని పోషించవలెను. ఎవరికి సహాయం చేస్తున్నామో వారిని హేళన చేయకూడదు. ప్రేమపూరితంగా సహాయం చేయాలి. ఇవన్నీ వ్యక్తిత్వ వికాసాన్ని, సంస్కారాన్ని తెలుపుతాయి.

ఇలా నేటికీ పనికివచ్చే సంస్కృతి, సంప్రదాయాలు మనం ఆచరించాలి. సాధారణంగా వీటిని ఎవరూ నొక్కి చెప్పరు. చూసి నేర్చుకోవాలి. దాన్నే సంస్కారం అంటారు. దాన్నే ఇంగిత జ్ఞానం అంటారు. సివిక్‌సెన్స్‌ అంటారు. మీ కుటుంబాల్లో ఇలా పాటించేవి, నేర్పేవి, నేర్చుకునేవి పరిశీలించాలి.

రోజుకు ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి భోంచేయాలి...

రోజుకు ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకచోట కూర్చొని భోం చేయాలి. సూర్యోదయం కాకముందే లేవాలి. రాత్రి పది పదిన్నరలోపు నిద్రపోవాలి. పొద్దున్నే స్నానం చేయాలి. పనితో అలసిపోతే సాయంత్రం, లేదా రాత్రి మళ్ళీ స్నానం చేస్తే డెడ్‌సెల్స్‌ పోయి చురుకుదనం ఏర్పడుతుంది.

బద్ధకం, బద్ధశత్రువు. అన్నం తినకుండా బద్ధకంగా ఉండగలరా? కానీ చేయాల్సిన పనులపై బద్ధకం. కబీర్‌దాస్‌ చెప్పినట్టు 'కల్‌ కా కాం ఆజ్‌ కరో, ఆజ్‌కా కామ్‌ అభీ కరో'. ఒకటవ తేదీన జీతం తీసుకోవడం, నిర్నీత తేదీల్లో పండగలు, ఎన్నికలు, ఉద్యోగ వయో పరిమితి అనేది కూడా డెడ్‌లైన్సే... లక్ష్యాల సాధనకు డెడ్‌లైన్స్‌ అవసరం.

నేటి జీవితంలో రోజూ ఒక గంట టీవీ చూస్తే చాలు. అన్నం తినేటప్పుడు దానిపైనే ధ్యాస ఉంచాలి. జంక్‌ ఫుడ్‌, బయటి ఫుడ్‌ తినకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకోవడానికి కృషి చేయాలి. ప్రేమ సహజమైనది. పెళ్ళి సమాజపరమైనది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, సహ జీవనం చేయడం నూతన ఆదర్శనీయ సంస్కృతి.

- బియస్ రాములు

English summary

 An eminent writer BS Ramulu opined that personality development depends on culture and sensibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X