వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దగ్గుబాటి సినీ హీరో కల ఎలా చెదిరింది?

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజకీయ నాయకుడు, ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సినిమా హీరో కావాలనే కల ఉండేదంటే ఎవరూ నమ్మక పోవచ్చు. కానీ, ఆయన సినిమాల్లో హీరోగా నటించి ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన కల గమ్మత్తుగా చెదిరిపోయింది.

నేను అప్పుడు ఉదయం దినపత్రికలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూస్తున్నాను. ఎలాగో గానీ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సినిమా తీయబోతున్నారని, అందులో హీరో పాత్ర పోషించబోతున్నారని నాకు ఉప్పు అందింది. అంతేకాదు, ఆ సినిమా కథ ఏమిటో కూడా తెలిసిపోయింది. దీంతో నేను అప్పుడు ఓ వార్తాకథనం రాశాను. దుగ్గుబాటిని ఆవరించిన సినీ మాయ, మామ దారిలో అల్లుడు అనే శీర్షికన ఆ వార్తాకథనం ఉదయం దినపత్రిక మొదటి పేజీలో అచ్చయింది.

హీరోయిన్‌గా ఓ ముంబై అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారని, అందుకు సంబంధించిన అన్వేషణ సాగుతోందని నేను రాశాను. ఆ సినిమా కథ ఏమిటో కూడా క్లుప్తంగా ఇచ్చాను. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా కథను రూపొందిస్తున్నారని కూడా రాశాను.

Why Daggubati dropped his cinema plans?

అంతే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆ వార్త వచ్చిన రోజు హుటాహుటిన హైదరాబాదులోని ఉదయం దినపత్రిక కార్యాలయానికి వచ్చేశారు. నాకు ఆ రోజు వీక్లీ ఆఫ్. దాంతో నేను ఆయనను ఆఫీసులో కలవలేకపోయాను. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డిని కలిశారు. ఆ విషయం మల్లారెడ్డి గారు నాకు మర్నాడు చెప్పారు.

సినిమా తీయాలని తాను దగ్గుబాటిని ప్రోత్సహిస్తానని, తాను కూడా కావాలంటే ఓ పాట రాసిస్తానని చెప్పానని గజ్జెల మల్లారెడ్డిగారు నాకు చెప్పారు. కానీ, దగ్గుబాటి మాత్రం సినిమాను ఆపేశారు. ఆ సినిమా కథను మా ఆఫీసులోనే పనిచేస్తున్న చైతన్యప్రసాద్ రాస్తున్నారని తర్వాత తెలిసింది. చైతన్యప్రసాదే ఆ సినిమాకు సంబంధించిన ఉప్పును అందించారని దగ్గుబాటి వర్గీయులు ఆడిపోసుకున్నారు. కానీ, నేను వార్త రాసిన విషయం అది అచ్చయ్యేవరకు చైతన్యప్రసాద్‌కు తెలియదు. అదే విధంగా పోసాని కృష్ణమురళి కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు నాకు తెలిసింది. సినిమా ఆగిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు.

వార్తాకథనం రావడంతో సినిమాను ఆపేయాల్సిన అవసరం దగ్గుబాటికి ఎందుకు వచ్చిందో మాత్రం నాకు తెలియలేదు. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. కానీ, ఓ సందర్భంలో మాత్రం ఆయన కొన్ని స్టిల్స్ తీసుకొచ్చి నాకు చూపించారు. ఆ సినిమా వద్దనుకున్నానని, భగత్‌సింగ్ సినిమా తీయబోతున్నామని ఆ స్టిల్స్ చూపిస్తూ దగ్గుబాటి నాకు చెప్పారు. భగత్‌సింగ్ గెటప్‌లో దగ్గుబాటి తీయించుకున్న స్టిల్స్ అవి. చాలా బాగున్నాయి.

దీనికి సంబంధించిన వార్త రాయకూడదని నీకు స్టిల్స్ చూపిస్తున్నానని దగ్గుబాటి నాకు చెప్పారు. దాంతో నేను ఆ వార్తాకథనం రాయలేదు. సినిమా కూడా రాలేదు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియదు. మొత్తం మీద, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సినీ హీరో కల మాత్రం చెదిరిపోయింది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Politician and BJP leader Daggubati Purandheswari's husband Dr Daggubati Venkateswar Rao has dropped his cinema plan, as the story of the film was leaked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X