వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రావనిలో ఫ్లోరైడ్ భూతం: లేవే కనికారాలూ...

పోలియో మహమ్మారి వల్ల కాళ్లు, చేతులు వంకర్లు పోయే దుస్థితి ఈ తరంలో లేదని వూరట చెందుతున్న తరుణంలో అంతకంటే భయంకరమైన విష వలయంలో చిక్కుకుంటున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: కదలలేరు.. కన్నీళ్లు కార్చడం తప్ప.. ఖర్చు భరించలేరు.. కాటికి వెళ్లడం తప్ప.. కష్టపడలేరు.. ఒంట్లో చేవ లేక.. వంగిన నడుము వృద్ధాప్యంతో వచ్చింది కాదు.. ఒరిగిన కాయం.. చివరి దశకు చిహ్నమూ కాదు.. కాళ్లు వంకర్లతోపాటు పాడైన మూత్రపిండాలు.. కాయకష్టం చేస్తేనే కడుపు నిండే కుటుంబాలు.. చెమటతో తడిచిన డబ్బుతో కొనే మందులు ఎన్నాళ్లు కాపాడుతాయో తెలియని బతుకులు.. కాపాడేవారి కోసం ఆ కళ్లు ఆశగా చూస్తున్నాయి.. కరుణించేవారి కోసం ఆ చేతులు అర్థిస్తున్నాయి.. కోరుకుంటున్నారు శుద్ధ జలం.. కనికరిస్తుందా మన సభ్య సమాజం.. ఫ్లోరోసిస్‌ భూతం ప్రజల ప్రాణాలను హరిస్తోంది.

పోలియో మహమ్మారి వల్ల కాళ్లు, చేతులు వంకర్లు పోయే దుస్థితి ఈ తరంలో లేదని వూరట చెందుతున్న తరుణంలో అంతకంటే భయంకరమైన విష వలయంలో చిక్కుకుంటున్నారు. పల్లెల గుండెపై ఫ్లోరైడ్‌ బండ కమ్ముకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల ప్రజలను ఫ్లోరైడ్ భూతం వెంటాడుతున్నది. క్రుష్ణా, గోదావరి నదులు పారుతున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ ఫ్లోరైడ్ భూతంతో ఇబ్బందుల పాలవుతున్నారనడానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న పాట్లే నిదర్శనం. పాలబుగ్గల వయసు పిల్లలు పండు ముసలి తాతలవుతున్నారు.

ఫ్లోరైడ్‌ ప్రభావిత పల్లెల్లోని ప్రజలు రెక్కల కష్టంతో బతుకీడుస్తున్న దుర్భర పరిస్థితుల్లో వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక అనారోగ్యంతో అలమటిస్తున్నారు. ఇక్కడి పల్లెల్లో ఎవర్ని కదిలించినా మదినిండా వేదనతో ఉబికి వస్తున్న కన్నీళ్లతో మౌనంగా రోదిస్తున్నారు. తాగునీటి సమస్యలతో ఇప్పటికే అల్లాడుతున్న 11 జిల్లాల్లోని ప్రజలకు అందుబాటులోని కొద్దిపాటి నీటిలో పరిమితికి మించిన ఫ్లోరైడ్‌ ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక పార్టీకి ఈ సంగతి తెలుసు. కానీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని కబుర్లు చెప్పడం మినహా ఆచరణలో చేస్తున్నదేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంటికొక ఫ్లోరైడ్ బాధితులు

ఇంటికొక ఫ్లోరైడ్ బాధితులు

ప్రకాశం జిల్లాల్లోని ఏడెనిమిది మండలాల్లో ఇంటికొకరు చొప్పున ఫ్లోరైడ్‌ బాధితులుండటం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని తాగునీటిలో సాధారణంగా ఉండే ఫ్లోరైడ్‌ 1.5 పీపీఎంను (పార్ట్‌ ఫర్‌ మిలియన్‌) మించి 5 నుంచి 8 పీపీఎం వరకూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో వీటి తీవ్రత 10 వరకూ ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్న నీటిని తాగుతున్న వారు కాళ్లు, చేతులు, మోకాళ్లు, నడుం నొప్పులతో మొదలై క్రమంగా మూత్రపిండాలు దెబ్బతిని మంచం పై నుంచి కదల్లేని స్థితికి చేరుకుంటున్నారు.

Recommended Video

Rural India does not have safe drinking water
మూత్ర పిండాల సమస్యతో జన జీవనం తల్లకిందులు

మూత్ర పిండాల సమస్యతో జన జీవనం తల్లకిందులు

తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఫ్లోరైడ్‌ బాధిత జిల్లాల్లో 32,047 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిలో 23 శాతం మందిని మూత్రపిండ సంబంధిత సమస్య వెంటాడుతోంది. ఇందులో 12 శాతం మందికి డయాలసిస్‌ తప్పనిసరని అధికారవర్గాలు గుర్తించాయి. ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి వంటి ప్రాంతాల్లో ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో రోజూ 200 నుంచి 250 మంది వెన్నుపూస, నడుం, కాళ్లు, చేతులు, మోకాళ్ల సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్యం కోసం వెళుతున్నారని అంచనా.

చేతులెత్తేసిన అధికార యంత్రాంగం

చేతులెత్తేసిన అధికార యంత్రాంగం

నీటిలో పరిమితికి మించి ఉన్న ఫ్లోరైడ్‌ సమస్యపై ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన పలు కార్యక్రమాలు ఆచరణలో వారికి ఉపశమనం కలిగించలేకపోయాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో రూ.9,350 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల్లో 20 నుంచి 25 శాతం మొరాయిస్తున్నాయి. ఈ వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, జలాశయాల్లోనూ తగినంత నీరు లేక సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. నీరు అందుబాటులో లేక పంపింగ్‌ చేసే పరిస్థితి లేక 18 మండలాల్లో అధికార వర్గాలు చేతులెత్తేశాయి. ప్రజలు మళ్లీ చేతిబోర్ల నీటితో దాహార్తి తీర్చుకుంటున్నారు. వీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉన్నందున అనార్యోగానికి కారణమవుతోంది.

ప్రతి ప్రాంతంలో పది మందికి డయాలసిస్ తప్పనిసరి

ప్రతి ప్రాంతంలో పది మందికి డయాలసిస్ తప్పనిసరి

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 52 వేల ఆవాస ప్రాంతాల్లో 442 ప్రాంతాలు ఫ్లోరైడ్ ప్రభావంతో బక్కచిక్కిపోతున్నాయి. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినా ఆచరణలో ఉపయోగంలోకి రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి రోజూ ఒక్కో ప్రాంతంలో రోజూ పది మందికి డయాలసిస్‌ చేయించాల్సి వస్తోంది. ఫ్లోరైడ్‌ కారణంగా తలెత్తే వివిధ అనారోగ్య సమస్యలపై అనేకమంది మోతాదుకి మించి ఔషధాలు వినియోగించడంతో మూత్రపిండాలపై ప్రభావం చూపుతోంది. అలాంటి వారందరికీ రోజూ 10 మందికి తక్కువ కాకుండా డయాలసిస్‌ చేస్తున్నాం. కనిగిరిలో రోజూ 30 మందికి డయాలసిస్‌ అందించే సౌలభ్యం ఉందని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎస్ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. 40 - 50 ఏళ్ల వయస్సులోనే ఫ్లోరైడ్‌ భూతం గ్రామంలో ఎంతో మందిని బలితీసుకుంది. 40 నుంచి 50 ఏళ్ల వయసులో కాళ్లు, చేతులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ క్రమంగా మూత్రపిండాలు దెబ్బతిని మృతి చెందుతున్నారని బి.ఆశీర్వాదం, అనే వ్యవసాయ కూలీ తెలిపారు.

పూటగడవటమే కష్టమైన వైనం

పూటగడవటమే కష్టమైన వైనం

యువ శక్తి నిర్వీర్యం అవుతోంది. విషతుల్యమైన నీటిని తాగలేక అవస్థలు పడుతున్నారు. పెద్దలే కాకుండా కౌమారంలో ఉన్న వారిని కబలిస్తోంది. కూలీ పనులు చేస్తేనే కుండలో ఎసర పెట్టే శ్రామికులు వంగిపోయిన నడుములు, మెడలు, కదల్లేనిస్థితిలో గుండలవిసేలా విలపిస్తున్నారు. ‘మాకు పథకాలు ఏమీ వద్దు.. ప్రాణాలు నిలుపుకొనేందుకు గుక్కెడు నీళ్లిప్పించండి..' అంటూ చేతిలెత్తి వేడుకుంటున్నారు. స్పందించిన ప్రభుత్వం శుద్ధజలాల సరఫరా నిమిత్తం క్రుష్ణా జిల్లా ఎ కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో రూ.6 లక్షలతో ఎన్టీఆర్‌ సుజల కింద ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. మిగిలిన గ్రామాల్లో కూడా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి తమకు శుద్ధజలాలు సరఫరా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలో మండల కేంద్రమైన ఎ.కొండూరుతో పాటు జీళ్లకుంట, వల్లంపట్ల, కుమ్మరికుంట్ల, గోపాలపురం, రామచంద్రపురం గ్రామాల్లో సైతం ఫ్లోరైడ్‌ సమస్య ప్రజలను వేధిస్తోంది. ఒక్కో గ్రామంలో వందలాది మంది ఫ్లోరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు డయాలసిస్‌ నిమిత్తం రూ.5 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మొకాళ్లు, నడుములు వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్న బాధితులు నెలకు సగటున రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.

ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో సమస్య పరిష్కారం

ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో సమస్య పరిష్కారం

వ్యవసాయ కూలీ పనులు చేయటం ద్వారా జీవనం సాగించే వీరికి చికిత్స నిమిత్తం చేస్తున్న ఖర్చు ఆర్థిక భారమైంది. కూలీవేతనం ద్వారా వస్తున్న మొత్తంలో కొంత వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావటంతో పూట గడవటం కష్టతరమవుతోంది. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.వెయ్యికి అదనంగా తమ రెక్కాల కష్టాన్ని ఖర్చు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో సగటున వంద మందిని తీసుకుంటే నెలకు చికిత్స నిమిత్తం రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అదే రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల విలువైన ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే ప్రజలకు శుద్ధజలాలు అందించటానికి అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం తరహాలో మండల కేంద్రంలో మదర్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు శుద్ధజలాలు సరఫరా చేయటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ శ్రీనివాసరావు తెలిపారు. కనీసం దీని మంజూరుకైనా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉన్నదని స్థానికులు చెప్తున్నారు..

సిద్ధం చేసిన ప్రతిపాదనలు అమలు చేసేదెవరు?

సిద్ధం చేసిన ప్రతిపాదనలు అమలు చేసేదెవరు?

ప్లోరైడ్‌ రహిత తాగునీటిని సరఫరా చేసే పథకాలకు నిధుల మంజూరు, నిర్మాణం పూర్తి కావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్టీఆర్‌ సుజల పథకం కింద ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయటం తక్షణ ఆవశ్యకతను చాటిచెబుతోంది. రూ.2లకే 20 లీటర్ల సురక్షితనీటిని సరఫరా చేయటానికి మొదటి విడతగా 513 గ్రామాల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2016 జనవరి 31 నాటికి 30 ప్లాంట్లు ఏర్పాటు చేయగా గడిచిన ఏడాది కాలంలో మరో రెండు మాత్రమే ఏర్పాటుకు నోచుకున్నాయి. ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయటం ద్వారా ప్రజలకు శుద్ధ జలాలను సరఫరా చేయటానికి అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవటంతో ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో రూ.5 లక్షల విలువైన ఆర్‌వో ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా పల్లెల్లో వందలాది మంది ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్‌వో ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తే ప్రజల కన్నీటి కష్టాలకు కాస్తయిన ఉపసమనం లభించనుంది.

మూడేళ్లుగా తప్పనిసరి డయాలసిస్

మూడేళ్లుగా తప్పనిసరి డయాలసిస్

ఎ కొండూరు మండలం వల్లంపట్ల గ్రామ వాసి సీహెచ్ రామాంజనేయులు. గత 25 ఏళ్లనుంచి కీళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో గత మూడేళ్ల నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. కిరాణా దుకాణం ద్వారా కుటుంబాన్ని పోషించేవారు. కిడ్నీల సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. డయాలసిస్‌కు నెలకు రూ. 7 వేల నుంచి 8 వేలకు పైగా ఖర్చవుతోంది. అప్పు తెచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. పింఛను కూడా రాలేదు. ప్రభుత్వం తమ వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తే బావుంటుందని భార్యాభర్తలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి శుద్ధజలాలను అందిస్తే భవిష్యత్తు తరాలవారికైనా మేలు చేకూరుతుందంటున్నారు. ఎ.కొండూరు మండలం మానిసింగ్‌తండా నివాసి కేళావతు చిన్నా ఏడాది క్రితం వరకు చలాకీగా వ్యవసాయ పనులకు వెళ్లారు. కొద్ది నెలలుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో నొప్పి రాడావడం ప్రారంభించింది. ఆరు నెలల క్రితం కిడ్నీల సమస్య తీవ్రతరం కావడంతో విజయవాడ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని డయాలసిస్‌ చేయించుకోవాలని చెప్పారు. రోజువారీ కూలి పనులకు వెళ్తేగాని పూటగడవని కుటుంబ పరిస్థితి చిన్నాది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యం కోసం నెలకు రూ. 7 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు పెట్టే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత డయాలసిస్‌తో పాటు మందులు కూడా అందించాలని వేడుకుంటున్నారు.

మంచానికి పరిమితమవుతున్న బాధితులు

మంచానికి పరిమితమవుతున్న బాధితులు

ఎ.కొండూరు మండలానికి చెందిన తేనేటి చిన్నఇస్రాయేలు గత ఆరు సంవత్సరాలుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. మొదట్లో ఖమ్మం, విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. నెలకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతోందని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో తమకు ఇంత ఖర్చు భరించటం తలకు మించిన భారంగా మారుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎ.కొండూరు మండలం గొల్లమందలతండాకు చెందిన బాణావతు తిరుప ఆరేళ్ల నుంచి ఫ్లోరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. మోకాళ్ల కింద ఎముకలు వంగిపోవటంతో ప్రస్తుతం వంకరగా నడుస్తూ ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో ఏడాది పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. నెలకు రూ.600 నుంచి రూ.700 ఖర్చు చేస్తూ మందులు వాడుతున్నారు. మందులు వేసుకుంటే తాత్కాలిక ఉపశమనం లేదంటే నొప్పులతో తల్లడిల్లి పోవాల్సి వస్తున్నది. ఎస్సీకాలనీకి చెందిన తేళ్లూరి వెంకటరత్నం పదిహేనేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడటంతో రెండు మూత్రపిండాలు పాడైపోయాయి. కాళ్లు వంకర్లు పోవటం, చేతులు కదిలించలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

English summary
The ground water is contaminated by excess of fluoride in 11 out of 13 districts in Andhra Pradesh, whereas all the 13 districts have areas with excess of nitrate in them. According to a statement made by Sanwar Lal Jat, Union minister of state for water resources, river development and Ganga rejuvenation, in the Lok Sabha on Thursday, AP districts including Visakhapatnam, West Godavari, Krishna, Guntur, Prakasam, Nellore, Chittoor, Kadapa, Kurnool, Ananathpur and Srikakulam have been identified as having fluoride levels in excess of 1.5 mg/l, which is the permissible limit as per the drinking water standards of Bureau of Indian Standards (BIS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X