వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్య భారత ప్రగతికి వారధి ధోలా - సాదియా: నేడే ప్రారంభం

ఈశాన్య భారత ప్రగతికి చుక్కాని వంటి ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే అత్యంత పొడవైన వంతెన నిర్మాణం పూర్తి కావడంతో శుక్రవారం ప్రారంభానికి ముస్తాబైంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గౌహతి: ఈశాన్య భారత ప్రగతికి చుక్కాని వంటి ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే అత్యంత పొడవైన వంతెన నిర్మాణం పూర్తి కావడంతో శుక్రవారం ప్రారంభానికి ముస్తాబైంది. అసోంలోని తిన్‌సుకియా జిల్లాలో, చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో నిర్మించిన ధోలా - సాదియా వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తారు.

భారత్ ‌- చైనా సరిహద్దులో రక్షణ సామగ్రిని చేరవేయడానికి ఈ వంతెన అత్యంత కీలకమైందని భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో యుద్ధట్యాంకుల్లాంటి భారీ సామగ్రిని చేరవేయడానికి సరైన వంతెన లేదు. ప్రధానంగా సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెన నిర్మాణం సాగింది. అస్సాం రాజధాని దిస్‌పూర్‌కు 540 కి.మీల. దూరంలో, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 375 కి.మీ.ల దూరంలో దీనిని నిర్మించారు.

అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో గల కాలీభూమోరా వద్ద ఓ వంతెన ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మపుత్ర నదిపై ఎగువన దాదాపు 375 కి.మీల. దూరం అంటే ధోలా వరకూ ఎలాంటి వంతెన లేదు. అందువల్లే రవాణాకు ఇదో పెద్ద అడ్డంకి. ఆ తర్వాత మరో 120 కి.మీ.ల దూరంలో ఓ వంతెన ఉన్నా.. అది సంక్లిష్ట పర్వత శ్రేణుల మధ్య ఉంది. ఆ వంతెన మీదుగా వాహనాలు రవాణా సాగించడం కష్టంగా ఉంది. ఫలితంగా రవాణా అంతా నీటిలో పడవల ద్వారానే సాగుతోంది. రక్షణ సంబంధ వస్తు రవాణా కష్టంగా ఉంది. అందువల్లే నడుమ ధోలా - సాదియా వంతెన నిర్మాణం అత్యంత కీలకంగా మారింది.

ఇవీ ఈ వంతెన ప్రత్యేకతలు

ఇవీ ఈ వంతెన ప్రత్యేకతలు

ఈ వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు (5.69 మైళ్లు) ఉంటుంది. మూడు లేన్లతో రెండు వైపులా అప్రోచ్‌ రోడ్లను కలుపుకుంటే నిర్మాణం మొత్తం 28.50 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వంతెన 42 అడుగుల (12.9 మీటర్లు) వెడల్పుతో నిర్మించారు. బ్రహ్మపుత్ర ఉప నది లోహిత్‌ నది మీదుగా నిర్మాణం చేపట్టారు. అసోంలోని తిన్ సుకియా జిల్లా ధోలా - సాదియా మధ్య కనుమలను కలుపుతూ ఈ వంతెన సాగుతుంది. 2011లో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన వంతెన నిర్మాణం 2017లో పూర్తయింది. దాదాపు 60 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకు వెళ్లినా తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనకు ఉన్నది. దీని నిర్మాణానికి దాదాపు రూ.2056 కోట్లు ఖర్చయింది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ వంతెన ఉంటుంది. ఇది మహారాష్ట్రలోని బాంద్రా - వర్లీ సీ లింక్ కన్నా 3.55 కిలోమీటర్లు పొడవు ఎక్కువగా ఉంటుంది.

వంతెన వల్ల ఉపయోగాలు

వంతెన వల్ల ఉపయోగాలు

అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజల మధ్య రవాణా సంబంధాల మెరుగుదలకు ఈ వంతెన ఉపకరిస్తుంది. రవాణా నెట్‌వర్క్‌ మెరుగవ్వడంతోపాటు వాహనాల రాకపోకలు పెరిగి అభివృద్ధి కార్యకలాపాలు పుంజుకుంటాయి. వస్తువుల సరఫరా పెరగడంతో ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈశాన్య భారతంలో పారిశ్రామిక పెట్టుబడులు పెరగడానికి దోహద పడుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు విద్య, వైద్య వసతులు పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆసియాన్‌ దేశాలతో అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దు వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఈ వంతెన కీలకం కానున్నది. అంతే కాదు ఈ వంతెన నిర్మాణంతో అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు తగ్గుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన వంతెనలను ఒకసారి పరిశీలిద్దాం..

35.66 కిలోమీటర్ల పొడవైన రన్యాంగ్ వంతెన

35.66 కిలోమీటర్ల పొడవైన రన్యాంగ్ వంతెన

చైనాలోని జియాంగ్ష్ రాష్ట్రంలోని యాంగ్జే నదిపై ఈ వంతెన నిర్మాణానికి 700 మిలియన్ల డాలర్లు ఖర్చయింది. 215 మీటర్ల ఎత్తుగల ఈ వంతెన 22.16 మైళ్ల దూరం ఉంటుంది. ఈ వంతెన దాటడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. 2005 ఏప్రిల్ లో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

హాంగ్జౌబే వంతెన పొడవు 33.6 కిలోమీటర్లు

ఇదీ ప్రపంచంలోకెల్లా పొడవైందే. చైనాలోని జెజియాంగ్ రాష్ట్రం జియాజింగ్, నింగ్బో మున్సిపాలిటీలను కలుపుతూ నిర్మించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య దాదాపు 220 కిలోమీటర్ల దూరం తగ్గిపోయింది. 22 మైళ్ల దూరం గల ఈ వంతెన 2008 మే ఒకటో తేదీన ప్రజల వినియోగంలోకి వచ్చింది.

హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్లే యాంగ్‌కన్ వంతెన

హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్లే యాంగ్‌కన్ వంతెన

ఈ వంతెన పొడవు 35.8 కిలోమీటర్లు. ఇది కూడా చైనాలోని యాంగ్‌కన్ వద్ద నిర్మించారు. హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్లే సామర్థ్యం గల వంతెన ఇది. గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లొచ్చు. బీజింగ్ - తియాంజిన్ ఇంటర్ సిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే వంతెన 2007లో పూర్తయింది.

మంచక్ స్వాంప్ వంతెన

ఈ వంతెన పొడవు 38.35 కిలోమీటర్ల దూరం. అమెరికాలోని లుసియానా రాష్ట్రం మంచక్ స్వాప్‌పై ఈ పొడవైన వంతెన నిర్మించారు. టోల్ రహిత వంతెన అని కూడా చెబుతారు. 15 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ వంతెన 22.80 మైళ్ల దూరం ఉంటుంది. అమెరికాలోని దక్షిణ లూసియానాలోని లేక్ పొంచర్ ట్రెయిన్ మీదుగా ఈ క్యాజ్ వే నిర్మాణం సాగింది.

English summary
India's longest bridge, over nine kilometres long, will be inaugurated today in Assam by Prime Minister Narendra Modi as his government completes three years in office. The bridge is among a series of infrastructure projects that PM Modi has fast-tracked since taking charge after a landslide win in 2014. Launched a decade ago under the government of former Prime Minister Manmohan Singh, PM Modi's biggest challenge is to see these projects to completion without the years-long delays that have beset many key endeavours in Asia's third largest economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X