వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్ మరి: లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు!

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలు ఉద్యోగ మార్కెట్‌కు భారీగా ఊతమివ్వనున్నదని మానవ వనరుల (హెచ్‌ఆర్) నిపుణులు, జాబ్ కన్సల్టెంట్లు భావిస్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలు ఉద్యోగ మార్కెట్‌కు భారీగా ఊతమివ్వనున్నదని మానవ వనరుల (హెచ్‌ఆర్) నిపుణులు, జాబ్ కన్సల్టెంట్లు భావిస్తున్నారు. జీఎస్టీ అమలయ్యాక ట్యాక్సేషన్, అకౌంటింగ్, డాటా అనాలిసిస్‌తోపాటు పలు విభాగాల్లో తక్షణమే లక్షకు పైగా కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకురావచ్చని వారు అంచనా వేస్తున్నారు.

దేశమంతా ఏకరీతి పరోక్ష పన్నుల విధాన్ని ప్రవేశపెట్టేందుకు రూపొందించిన జీఎస్టీని వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చేపట్టిన అతిపెద్ద పన్ను చట్టాల సంస్కరణ ఇదే. ఈ ఏడాది సంఘటిత రంగ ఉద్యోగ మార్కెట్ రెండంకెల (10 - 13 శాతం) వృద్ధి సాధించేందుకు జీఎస్టీ అమలు దోహదపడనున్నదని, ఆర్థిక సేవలకు సంబంధించిన పలు విభాగాల్లో నిపుణుల డిమాండ్ భారీగా పెరుగనున్నదని జాబ్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

సంఘటిత వ్యాపార రంగంలో ఉపాధి

సంఘటిత వ్యాపార రంగంలో ఉపాధి

జీఎస్టీ హయాంలో వస్తు సేకరణ, సరఫరా వేగం పెరుగనుందని, సంస్థలోకి నగదు ప్రవాహంపై యాజమాన్యాలకు మరింత స్పష్టత వస్తుందని, లాభదాయకత సైతం మెరుగుపడనుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ అంశాలతోపాటు నిబంధనల్లో పారదర్శకత వల్ల సంఘటిత వ్యాపారుల వద్ద పనిచేసేందుకు ఉద్యోగులు మరింతగా మొగ్గు చూపవచ్చని, తద్వారా సంఘటిత రంగ పరిధి మరింత పెరుగవచ్చని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో సంఘటిత ఉద్యోగ మార్కెట్ వార్షిక వృద్ధి 10-13 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు చక్రవర్తి చెప్పారు.

అక్కౌంటింగ్ విభాగంలో అనుకూలం

అక్కౌంటింగ్ విభాగంలో అనుకూలం

జీఎస్టీ అమలైన మొదటి త్రైమాసికంలో లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు పుట్టుకు రావచ్చని గ్లోబల్ హంట్ ఎండీ సునీల్ గోయల్ అన్నారు. ఆ తర్వాత కాలంలో కొత్త చట్టం నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యకలాపాల కోసం మరో 50,000 - 60,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీలు రిటర్నుల ఫైలింగ్, తదితర ప్రత్యేక కార్యకలాపాలను థర్డ్‌పార్టీ అకౌంటింగ్ సంస్థలకు అప్పగించేందుకే మొగ్గు చూపవచ్చని గోయల్ అన్నారు. కొత్త పరోక్ష పన్నుల చట్టానికి అనుగుణంగా రికార్డుల నిర్వహణ, రిటర్నుల ఫైలింగ్ కోసం వ్యాపార సంస్థలు నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. సులభ వాణిజ్య నిర్వహణపై జీఎస్టీ సానుకూల ప్రభావం చూపనున్నది. తద్వారా విదేశీ పెట్టుబడిదారులు, సంస్థలకు భారత మార్కెట్ మరింత అనుకూలంగా మారనున్నది. ఈ పరిణామం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేందుకు తోడ్పడటంతోపాటు సంఘటిత రంగ ఉద్యోగావకాశాలను పెంచనున్నదని మాన్‌స్టర్.కామ్ ఏపీఏసీ, మధ్యప్రాచ్య విభాగ ఎండీ సంజయ్ మోదీ అన్నారు.

మౌలిక వసతులు మెరుగుదలతో ఉద్యోగావకాశాలు

మౌలిక వసతులు మెరుగుదలతో ఉద్యోగావకాశాలు

ఆటోమొబైల్, లాజిస్టిక్స్, గృహాలంకరణ, ఈ-కామర్స్, మీడియా, వినోదం, సిమెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిక సేవలు (ఐటీఈఎస్), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), దీర్ఘకాల వినియోగ వస్తువులు, ఔషధ తయారీ, టెలికం రంగాలపై జీఎస్టీ అమలు తక్షణమే ప్రభావం చూపనున్నది. జీఎస్టీ హయాంలో అన్ని రంగాల్లోనూ ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరుగవచ్చని లేబర్‌నెట్ సర్వీసెస్ ఇండియా సహ వ్యవస్థాపకురాలు, సీఈవో గాయత్రీ వాసుదేవన్ అన్నారు. అయితే, జీఎస్టీ అమలు నేపథ్యంలో మౌలిక వసతులు, సరుకు రవాణా విషయంలో సవాళ్లను సకాలంలో పరిష్కరించుకోగలిగితేనే ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. జీఎస్టీకి అనుగుణంగా వ్యాపారాలను సర్దుబాటు చేసుకొనే దశ ముగిశాక దీర్ఘకాలంలో అన్ని విభాగాల్లోనూ నియామకాలు పుంజుకోవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ధరవరలపై కేంద్రమంత్రి సీతారామన్ ఇలా

ధరవరలపై కేంద్రమంత్రి సీతారామన్ ఇలా

జీఎస్టీ అమలులోకి వచ్చాక నిత్యావసరాల ధరలు మరింత పెరుగవచ్చన్న ఆందోళనలు అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటికే పన్ను పరిధిలోకి వచ్చిన వస్తువులపై కొత్త పన్నులు విధించడం జరుగదని ఆమె స్పష్టతనిచ్చారు. జీఎస్టీపై వర్తకుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ..ప్రస్తుత రేట్లతో పోలిస్తే జీఎస్టీ హయాంలో నిత్యావసరాలపై పన్ను భారం పెరుగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నదన్నారు. కాబట్టి జీఎస్టీ హయాంలో నిత్యావసరాల ధరలు తగ్గుతాయే తప్ప పెరుగవన్నారు.

చైనా దిగుమతులు పెరుగొచ్చు: ఎస్‌జేఎం

చైనా దిగుమతులు పెరుగొచ్చు: ఎస్‌జేఎం

జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులు భారీగా దెబ్బతినవచ్చని, చైనా నుంచి దిగుమతులు మరింత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిన్న పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారుల గుండె చప్పుడు పెరుగుతున్నదని ఎస్‌జేఎం జాతీయ కో - కన్వీనర్ అశ్వనీ మహాజన్ అన్నారు. ప్రస్తుతం చిన్న పరిశ్రమలకు రూ.1.50 కోట్ల వరకు ఉత్పత్తిపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు లభిస్తున్నదని, జీఎస్టీ హయాంలో రూ.20 లక్షలు, అంతకుపైగా విలువైన వ్యాపారం కలిగిన వారందరూ జీఎస్టీఎన్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనతో చిన్న తరహా పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీపై భారీ ప్రభావం పడవచ్చని ఆయన అన్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చన్నారు. ఫలితంగా దేశీయ ఉత్పత్తి తగ్గి చైనా నుంచి దిగుమతులు పెరుగవచ్చని మహాజన్ హెచ్చరించారు.

టీవీఎస్ మోటార్స్ కూడా..

టీవీఎస్ మోటార్స్ కూడా..

జీఎస్టీ అమలుకు ముందే ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తున్న వాహన తయారీదారుల జాబితాలో మరో రెండు సంస్థలు చేరాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలను రూ.1,600 నుంచి రూ.2,300 వరకు తగ్గించింది. టీవీఎస్ మోటార్స్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించినా..ఏయే మోడల్‌పై ఎంత తగ్గనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఎఫ్‌ఎంసీజీ సంస్థల తీరిది

ఎఫ్‌ఎంసీజీ సంస్థల తీరిది

కొత్త పరోక్ష పన్నుల చట్టం అమలు నేపథ్యంలో ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు తమ ఉత్పత్తుల నిల్వలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. డీలర్లు స్టాక్‌ను గణనీయంగా తగ్గించుకుంటుండటమే ఇందుకు కారణం. అయితే సెప్టెంబర్‌కల్లా నిల్వలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చని కంపెనీలంటున్నాయి.

English summary
The job market is looking forward to a big boost from the new GST regime and expects over one lakh immediate new employment opportunities, including in specialised areas like taxation, accounting and data analysis. The historic tax reform, to be rolled out from July 1, is expected to help the formal job sector attain an annualised growth rate of 10-13 per cent and fuel demand for professionals in various segments of the economy, experts said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X