వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాయాది దేశాల నుదిటి రాత రాడ్‌క్లిఫ్ నెత్తుటి గీత!

దాదాపు 190 ఏండ్లు భారత్‌ను ఏలిన ఆంగ్లేయులు వెళ్లిపోతూ భారత ఉపఖండంలో పెట్టిన విభజన చిచ్చు నేటికీ దాయాది దేశాల మధ్య రగులుతూనే ఉన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాదాపు 190 ఏండ్లు భారత్‌ను ఏలిన ఆంగ్లేయులు వెళ్లిపోతూ భారత ఉపఖండంలో పెట్టిన విభజన చిచ్చు నేటికీ దాయాది దేశాల మధ్య రగులుతూనే ఉన్నది. దేశ విభజనతో సుమారు 1.5 కోట్ల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. దాదాపు పది లక్షల మందిని బలితీసుకున్న విభజన గీత నేటికీ రక్తమోడుతూనే ఉన్నది. భారతదేశం నుంచి 60 లక్షల మంది పాకిస్థాన్‌కు తరలిపోతే.. పాకిస్థాన్ నుంచి 40 లక్షల మందికి పైగా భారతదేశానికి తరలి వచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో రెండు లక్షల నుంచి 20 లక్షల మంది వరకు మరణించారు. చట్టాన్ని అమలు చేసే వారు లేక మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. రాజకీయ అనిశ్చితికి దారి తీసింది. భారత్, పాకిస్థాన్ మధ్య జమ్ము కశ్మీర్ సరిహద్దుగా గీసిన సరిహద్దు రేఖ రెండు దేశాలనూ ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నది. దీనికి తోడు సంస్థానాలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చునని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటన.. మరింత గాయం రేపింది.

తొలుత కశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉంటానని చేసి, పాకిస్థాన్‌తో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు.
కానీ వెంటనే తమతో మమేకం కాకపోవడంతో పాకిస్థాన్‌లోని ప్రభుత్వం ఆక్రమిత కశ్మీర్ భాగంలోని గిరిజనులను ఉసిగొలిపితే కశ్మీర్ రాజు హరిసింగ్.. నాటి నెహ్రూ ప్రభుత్వాన్ని శరణు కోరారు. తర్వాత కశ్మీర్ కూడా భారతదేశంలో భూభాగమైనా.. దానికి గల ప్రత్యేక పరిస్థితులు నేటికి దానిని రావణ కాష్టంగా మార్చేశాయి. మిలిటెంట్ల చొరబాట్లు, పాక్ సైన్యం అకారణంగా కాల్పులు జరుపడం నిత్యక్రుత్యంగా మారింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల పెరుగుదలకు దారి తీసింది.

మత ఘర్షణల నివారణకే దేశ విభజన

మత ఘర్షణల నివారణకే దేశ విభజన

వందేండ్ల పోరాటం తర్వాత భారత్ 1947లో వలస పాలకుల నుంచి విముక్తి పొందింది. బ్రిటన్ పార్లమెంట్ స్థానంలో భారత స్వాతంత్య్ర చట్టం అమలులోకి వచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి బ్రిటీషువారి పాలన ముగుస్తుందని ఆ చట్టం నిర్దేశించింది. అలాగే దేశాన్ని రెండు సార్వభౌమ దేశాలైన ఐక్య భారత్, అధినివేశ పాకిస్థాన్‌గా విభజించాలని సూచించింది. రెండు దేశాలకు కేటాయించాల్సిన ప్రాంతాల పర్యవేక్షణకు బ్రిటీషు వారు సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌ను రంగంలోకి దించారు. వృత్తిరీత్యా న్యాయాధికారి రాడ్‌క్లిఫ్‌ను సరిహద్దు కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు. ఒక దేశాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టే గీత గీయడానికి ఈ కమిషన్‌ను నియమించారు.

గుడారాల మయంగా ఢిల్లీ

గుడారాల మయంగా ఢిల్లీ

దేశ విభజన అనంతరం దాదాపు 1.5 కోట్ల మంది తమ నివాస ప్రదేశాలను వదిలి రాడ్‌క్లిఫ్ గీతకు అటూ ఇటూ ప్రయాణించారు. వారిలో కొందరు కాలినడకన, మరికొందరు రైళ్లలో, బస్సుల్లో రవాణా వసతి ఏది దొరికితే దానిలో గీత దాటారు. ఈ సందర్భంగా జరిగిన మతోన్మాద మారణకాండలో దాదాపు పది లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డాయి. వేల మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. దేశవిభజనతో ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి తరలివెళ్తున్న నిరాశ్రయులైన జనంతో ఢిల్లీ గుడారాల నగరంగా మారిపోయింది. ఇండ్లను, పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి, మతకల్లోలాల్లో సర్వం పోగొట్టుకొని పాకిస్థాన్‌కు వెళ్లటానికి సిద్ధమైన వేల ముస్లింలు.. ఢిల్లీలోని హుమా యూన్ సమాధి వద్ద తలదాచుకున్నారు.

అక్కడ ఉన్న ఉద్యానవనాలన్నింటా గుడారాలు కిక్కిరిసి పోయాయి. అక్కడి సుందరమైన ఫౌంటేన్లు.. మానవ వ్యర్థాలతో నిండిపోయాయి. దుర్వాసనను అడ్డుకోవటం కోసం వాటిని మట్టితో కప్పివేశారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులదీ ఇదే పరిస్థితి. అదే సమయంలో ఢిల్లీ జనాభాలో.. వలస వచ్చిన ప్రజల సంఖ్య దాదాపు మూడోవంతు వరకు చేరుకున్నదంటే.. ఏ స్థాయిలో వలసలు జరిగాయో ఊహించుకోవచ్చు. నిట్టనిలువునా చీలిన పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి. పలు కాలేజీలు వలస ప్రజల శిబిరాలుగా మారిపోయాయి. కనీస సౌకర్యాలు లేక, ఆహారం లేక జనం అలమటించిపోయారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ ఆహారం రోజుకు ఒక చపాతీకి తగ్గించారు. ఆకలితో అల్లాడి వేల మంది మరణించారు.

ఐదు వారాల్లో లక్ష్యం పూర్తి చేయాలన్న ఆదేశం సంక్లిష్టం

ఐదు వారాల్లో లక్ష్యం పూర్తి చేయాలన్న ఆదేశం సంక్లిష్టం

కేవలం ఓ పెన్ను గీతతో దేశాన్ని రెండు ముక్కలు చేసేందుకు సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ భారత్‌కు జూలై 8న వచ్చారు. ఆయన అంతకుమునుపెన్నడూ భారత్‌ను సందర్శించలేదు. ఇక్కడి సామాజిక రాజకీయ సంస్కృతి గురించి ఆయనకు ఎటువంటి అవగాహన లేదు. అటువంటి వ్యక్తి ఎందుకు వచ్చినట్టు అన్న ప్రశ్నకు తనకు అప్పగించిన బాధ్యతను తన దేశానికి చేస్తున్న సేవగా ఆయన భావించారు. స్వల్ప వ్యవధిలో పాత గణాంకాల ప్రకారం దేశాన్ని విభజించేందుకు ఆయన తొలుత విముఖత చూపినప్పటికీ ఆ తరువాత ఒప్పుకొన్నారు. భారత్ నుంచి పాకిస్థాన్‌ను వేరు చేసే గీత గీసి వెళ్లిపోయిన రాడ్‌క్లిఫ్ మరెన్నడూ తిరిగి రాలేదు.

తన విధి నిర్వహణకు బ్రిటిషు ప్రభుత్వం ఇచ్చిన మూడువేల పౌండ్ల ఫీజును కూడా ఆయన తిరస్కరించారు. ఆ గీత తనను రెండు దేశాలలోనూ దుష్టుడిని చేసిందని రాడ్‌క్లిఫ్ ఒక సందర్భంలో వాపోయారు. ఆగస్టు 15కు ముందే గీత గీయాలని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అందువల్ల వారికోసం ఓ గీత గీశాను.. ఆ గీత ఒక దేశాన్ని& ఒక గుండెను రెండు ముక్కలు చేసింది. నేను మహాత్మాగాంధీని కలిసినప్పుడు దేశ విభజన భారీ హింసను సృష్టిస్తుందని చెప్పారు. కేవలం ఐదు వారాల వ్యవధిలో తనకు ఇచ్చిన పని పూర్తి చేయడం చాలా సంక్లిష్టం అని తేల్చేవారు రాడ్ క్లిప్. స్వల్ప వ్యవధిలో అంతకుమించి తానేం చేయలేకపోయానని, కనీసం రెండు మూడేండ్ల సమయం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బెంగాల్, పంజాబ్ విషయంలో సందిగ్ధం

బెంగాల్, పంజాబ్ విషయంలో సందిగ్ధం

రాడ్‌క్లిఫ్‌కు అందజేసిన భారతదేశ చిత్రపటంలో జిల్లాల సరిహద్దు గీతలు లేవు. దీంతో ఆయనకు తోచినట్టు ఓ గీత గీశారు. అప్పుడు లాహోర్ నగరం భారత్‌కు దక్కింది. వెంటనే ఆయన సహాయకుడు అది చూసి.. పాకిస్థాన్‌కు పెద్ద నగరం ఒక్కటి కూడా దక్కలేదని చెప్పాడట. అప్పుడు లాహోర్‌ను పాక్‌కు కేటాయించారు. ముస్లింలు అధికంగా ఉన్న సింధ్, బెలూచిస్థాన్ రాష్ట్రాలను పూర్తిగా పాకిస్థాన్‌కు కేటాయించారు. కానీ పంజాబ్, బెంగాల్ విషయంలో రాడ్‌క్లిఫ్ సందిగ్ధంలో పడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లో హిందువులు లేదా ముస్లింలు మెజారిటీగా లేరు. దీంతో ఆయన బెంగాల్‌కు మధ్య ఒకటి, పంజాబ్ మధ్యలో ఒకటి గీతలు గీశారు. దీంతో తూర్పు బెంగాల్ పాకిస్థాన్‌కు, పశ్చిమ బెంగాల్ భారత్‌కు దక్కాయి. అలాగే పశ్చిమ పంజాబ్ పాకిస్థాన్‌కు తూర్పు పంజాబ్ భారత్‌కు వచ్చాయి. తూర్పు బెంగాల్ ఆ తరువాత బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.

English summary
India was separated in August 1947 as it gained its independence, splitting into Pakistan and India. The decision to create two separate countries was sparked by the end of British rule in India. It was decided that to limit violence and bloodshed between Hindus and Muslims, the country would be split into two completely separate countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X