శ్రీధర్ బాబుపై వ్యాఖ్యలు: కోదండరామ్ తొందరపాటా?

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

శ్రీధర్ బాబుపై వ్యాఖ్యలు: కోదండరామ్ తొందరపాటా?
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చిక్కుల్లో పడుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయన తొందర పడ్డారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కోదండరామ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చెబుతున్నారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొనని నాయకులకు మృత్యుఘంటికలు మోగుతాయని, తండ్రికి బట్టిన గతే శ్రీధర్ బాబుకు పడుతుందని కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు విషయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఇప్పటికే ఆరా తీయడం ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలోని పలువురు మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి ఆదివారం రాత్రి సివిల్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఫోన్ చేసి కోదండరాం వ్యాఖ్యలపై ఆరాతీశారు. "మీ నాయన (అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు)కు ఏమైందో గుర్తుతెచ్చుకో.. సమాజం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు'' అని కోదండరాం అన్నారు.

శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలు మంత్రికి హాని కలిగించేలా, తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయని కోదండరామ్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు తెలియవచ్చింది. కోదండరామ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమానికి ఊపు తేవడానికి కోదండరామ్ ఆ మాటలు అన్నారా, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి అన్నారా, ఆయన మాటల్లోని ఆంతర్యమేమిటి అనే విషయాలపై తీవ్రంగా చర్చ సాగుతోంది. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావును నక్సలైట్లు హత్య చేశారు. ఆయన శాసనసభా స్పీకర్‌గా పనిచేశారు. దానివల్లనే శ్రీధర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జెఎసి ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చ్ కార్యక్రమాన్ని తలపెట్టింది. దాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాల్లో తెలంగాణ జెఎసి కవాతులు నిర్వహిస్తోంది. ఆదివారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా కవాతులో పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికితోడు, ఇంత కాలం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ముద్ర నుంచి బయటపడడానికి ఆయన కరీంనగర్ వేదికను వాడుకున్నట్లు అర్థమవుతోంది.

రాజకీయ నాయకులు కాదు, తామే ఇక గడువులు పెడతామని ఆయన చెప్పారు. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన కోదండరామ్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతోనే దూకుడుగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీధర్ బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో సహనం నశిస్తోందనే సంకేతాలను కూడా ఆయన ఇవ్వదలుచుకున్నట్లు భావిస్తున్నారు.

English summary
The comments made by Telangana JAC chairman Kodandaram on minister Sridhar babu became hot topic in political circles. It is said that Kodandaram may be booked for the comments.
Write a Comment
AIFW autumn winter 2015