వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేటెడ్ పోస్టులు సరే: కేసీఆర్ క్యాబినెట్‌లో బెర్త్ ఏదీ?

ఆకాశంలో సగం మహిళలు.. సమాజ ప్రగతిలో వారే కీలకం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ మహిళల ప్రాతినిధ్యం కొట్టిపారేయలేం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మరో మూడు నెలల్లో మూడేళ్లు పూర్తి కావస్తున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆకాశంలో సగం మహిళలు.. సమాజ ప్రగతిలో వారే కీలకం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ మహిళల ప్రాతినిధ్యం కొట్టిపారేయలేం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మరో మూడు నెలల్లో మూడేళ్లు పూర్తి కావస్తున్నది. సబ్బండ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పాలనా పగ్గాలు చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం ప్రారంభంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం నినాదం ముందుకు వచ్చింది.

తాజాగా రాష్ట్ర పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళాభ్యుదయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.. వివిధ కార్పొరేషన్లతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టులకు అర్హులైన వారి ఎంపిక కోసం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమలతో కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే అర్హుల జాబితా సమర్పిస్తే వీలైనంత త్వరగా నియామకాలు చేపడతామన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తమ కమిటీ త్వరలోనే అర్హుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని ఎంపీ కవిత చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'డబుల్ బెడ్ రూం ఇల్లు' పథకం మొదలు దళితులకు మూడెకరాల స్థలం, రేషన్ కార్డుల వరకు ప్రతి కీలక పథకాన్ని మహిళల పేరిట అమలు చేయాలని సంకల్పించిన సీఎం కే చంద్రశేఖర్ రావు ఒక విషయం విస్మరించారు. సమాజంలో సగభాగమైన మహిళలకు తన క్యాబినెట్‌లో చోటు కల్పించే విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారా? సామాజిక సమీకరణాలే కారణమా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014 జూన్ రెండో తేదీన కొలువుదీరిన తొలి రాష్ట్ర మంత్రివర్గంలోనే మహిళలకు క్యాబినెట్‌లో అవకాశం లభిస్తుందన్న ఆశలు అడియాసలు అయ్యాయి.

విస్తరణలోనైనా చోటు దక్కక పోతుందా? అని అంతా ఆసక్తిగా చూశారు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన, ఫిరాయించిన, పార్టీలను విలీనంచేసిన నేతలకు క్యాబినెట్‌లో చోటు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చారు ప్రభుత్వాధినేత. అందుకు ఆయా నేతలందరికీ శాసనమండలిలో చోటు కల్పించారు కూడా. అంతేకాదు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క మహిళకూ చోటు కల్పించలేదు.

సంక్షేమ పథకాలు సరే.. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యమేదీ?

సంక్షేమ పథకాలు సరే.. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యమేదీ?

తెలంగాణ ఏర్పాటైన తొలి రోజుల్లోనే తొలుత ఎస్సీ, ఎస్టీలో పేద కుటుంబాల్లోని యువతుల వివాహానికి ‘కల్యాణలక్ష్మి', పేద ముస్లింల అమ్మాయిల షాదీ కోసం ‘షాదీ ముబారక్' పథకం కింద రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నసర్కార్.. తర్వాత అన్ని వర్గాల వారికి వర్తింపజేస్తున్నది. అడుగడుగునా మహిళా ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ రాష్ట్ర పాలనలో కీలకమైన క్యాబినెట్‌లో మహిళలకు చోటు కల్పించలేకపోవడానికి కారణాలేమిటి? క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న మహిళలు లేరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు క్యాబినెట్‌లో చోటెందుకు కల్పించలేదని ప్రశ్నించే విపక్షాల నేతలపై మాత్రం టీఆర్ఎస్ నాయకత్వం అంతా ఒంటికాలిపై ఆగ్రహం వ్యక్తం చేయడంలో ముందు వరుసలో నిలుస్తుంది. ఆగమేఘాలపై నామినేటెడ్ పోస్టుల నియామకానికి అర్హులైన మహిళామణుల ఎంపికకు కమిటీని నియమించిన ప్రభుత్వాధినేత మరో సంగతీ విస్మరించారు.

ఎంపీ కవిత ఇలా..

ఎంపీ కవిత ఇలా..

జిల్లాల, వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాల వల్ల మహిళలకు క్యాబినెట్‌లో అవకాశాలు కల్పించలేకపోతున్నట్లు సీఎం కేసీఆర్ నుంచి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వరకు ప్రతి ఒక్కరూ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎంపీ కవిత సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు లభించకపోవడంపై తన అసంత్రుప్తిని వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. అదే సమయంలో మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఘంటాపథంగా చెప్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఎంపీ కవిత తన అసంత్రుప్తిని వ్యక్తీకరించినట్లు తెలుస్తున్నది. కానీ అదే సమీకరణాలకు మహిళలను జోడిస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయని ఎంపీ కల్వకుంట్ల కవితకు గానీ, సీఎం కే చంద్రశేఖర్‌రావుకు గానీ తెలియదని భావిస్తే ‘తప్పు'లో కాలేసినట్లే.

సీఎం ద్రుష్టికి ఎంపీ కవిత తీసుకెళ్లలేరా?

సీఎం ద్రుష్టికి ఎంపీ కవిత తీసుకెళ్లలేరా?

అనునిత్యం తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు బహిర్గతంచేసే ఎంపి కల్వకుంట్ల కవిత.. క్యాబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాల్సిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వాధినేతగా సీఎం కేసీఆర్‌కు విన్నవించలేరా? ఉద్యమాధినేతగా, సీఎంగా కేసీఆర్ వద్దకు వివిధ సామాజిక వర్గాల సమస్యలను తీసుకెళ్లి తనదైన శైలిలో పరిష్కారం చూపుతున్న ప్రజాప్రతినిధిగా అందరికీ ప్రీతిపాత్రురాలు. ఇటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్‌లో మహిళలకు చోటు కల్పించే విషయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లలేని అశక్తురాలని అనుకోలేం. అంతెందుకు 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించిన సీఎం కేసీఆర్‌కు మహిళలు వ్యక్తిగతంగా తమ కుటుంబంలోనూ, సమాజ ప్రగతిలో కీలక పాత్ర వహించిన, వహిస్తున్న సంగతి తెలియదని భావించలేం.

ఓరుగల్లులో సురేఖ ఇలా..

ఓరుగల్లులో సురేఖ ఇలా..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోశయ్య క్యాబినెట్లలో పనిచేసిన కొండా సురేఖ రాజకీయ కారణాలేమైనా టీఆర్ఎస్ నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుత సీఎం, టీఆర్ఎస్ అధినేతగా వ్యూహాత్మకంగా ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదే సురేఖ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేంద్ర పరిధిలో ఓదార్పు యాత్రకు బయలుదేరినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల నిరసనను ఎదుర్కొన్నారు. రైల్వే ట్రాక్ యుద్ధ క్షేత్రంగా మారిన దాఖలాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన సురేఖ ప్రత్యర్థులకు సింహ స్వప్నం వంటి వారు. స్వపక్షాన్ని వెనుకేసుకు రావడంలో ఆమెకు ఆమే సాటి అని గతంలో జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయి.

విపక్షాలకు దీటుగా సునీత

విపక్షాలకు దీటుగా సునీత

అంతకుముందు 1995లో మండల పరిషత్ అధ్యక్షురాలిగా విజయవంతమైన పాత్ర పోషించారు. ఆమెతోపాటు ప్రస్తుత ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ స్థాయిలో పరిశుభ్రత, పచ్చదనం పట్ల అమలుచేసిన విధానాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా మహిళా నేతగా స్వరం వినిపించడంలో ఏమాత్రం వెనుకాడలేదు. విపక్ష నేతల విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు.

పద్మా దేవేందర్ ఇలా

పద్మా దేవేందర్ ఇలా

2004లో తొలిసారి పాత మెదక్ జిల్లా పరిధిలోని రామాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి ఉద్యమంలో అందరితోపాటు కలిసి పాల్గొన్న నేత. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమె అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పంపారు.

మహిళల సామర్థ్యం ఇలా..

మహిళల సామర్థ్యం ఇలా..

మనది పురుషాధిక్య సమాజం. ఒకనాడు ఘోషా పద్ధతిలో మహిళలను తెర వెనుకకే పరిమితం చేసిందీ సమాజం. ప్రస్తుతం ముస్లిం మహిళలకు బురఖా పద్దతి అమలులో ఉన్న సంగతి. అది వేరే విషయం. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో పురుషులతో సమానంగా.. ఆ మాటకొస్తే విద్యావంతులైన మహిళలు విధుల నిర్వహణలోగానీ, వేతనాల సంపాదనలో గానీ, సమాజానికి ఉత్తమ సందేశాన్నివ్వడంలోగానీ పురుష పుంగవుల కంటే ఓ మెట్టుపైనే ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ సమాజం పురోగతి సాధించేందుకు సమయం పడుతుండవచ్చుగానీ మహిళలకు సరైన అవకాశం కల్పిస్తే దాన్ని ఖచ్చితంగా రుజువుచేసుకోగలరని గత అనుభవాలు చెప్తున్నాయి. కనుక ఆగమేఘాలపై నామినేటెడ్ పోస్టుల్లో మహిళల నియామకానికి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వాధినేత తన క్యాబినెట్‌లో వారికి చోటు కల్పించగలరా? అన్నది సందేహస్పదమే.

English summary
Seeking to enhance representation for women in government, Telangana Chief Minister K Chandrasekhar Rao constituted a committee to identify women leaders who can be appointed as heads of different state-run corporations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X