వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకి గొట్టం ద్వారా అధికారమా: ఈ కాలంలోనూ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎర్రజెండాలన్నీ ఏకం కావాలని, మావోయిస్టులు అడవులు వదిలి ప్రజల్లోకి రావాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని విమర్శిస్తూనే ఆయన ఆ పిలుపునిచ్చారు.

ఆ పిలుపులో ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉదయించడం సహజం. నిజానికి మావోయిస్టులపై లేదా నక్సలైట్లపై ప్రభుత్వ నిర్బంధాలను, ఎన్‌కౌంటర్లను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం ఖండిస్తూనే ఉన్నాయి. కానీ, మావోయిస్టులు లేదా నక్సలైట్ల పంథాను మాత్రం తప్పు పడుతున్నాయి. అదే సమయంలో సిపిఐ, సిపిఎం పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయాయని నక్సలైట్లు విమర్శించడం సర్వసాధారణంగా మారుతాయి.

ఈ పరిస్థితులను పరిశీలిస్తే, తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యమనే సూత్రాన్ని భారతదేశంలోని మావోయిస్టులు గుడ్డిగా అనుసరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాతనే కాకుండా అంతకు ముందు జరిగిన పలు ఎన్‌కౌంటర్ల వల్ల కూడా ఈ ప్రశ్న ముందుకు వచ్చే ఉంటుంది. కానీ, వారు తమ పంథాను మార్చుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేరని పలు సందర్బాల్లో రుజువైంది.

నక్సలైట్ ఉద్యమంలోని పరిణామాలను పరిశీలిస్తే ఆ ఉద్యమ పయనం ఎటువైపు సాగుతుందనేది అర్థమవుతుంది. నక్సలైట్ల పట్ల సానుభూతి ఉన్న చాలా మంది మేధావులు క్రమక్రమంగా దూరమవుతూ, ఆ సానుభూతిని గుండెల్లో మాత్రమే దాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

తెలంగాణలో ఒకప్పుడు గోదావరి లోయ పోరాటం, జగిత్యాల పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ఉద్యమ ప్రభావం వల్ల ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని అమలు చేయాల్సి వచ్చింది. అది ప్రజా మద్దతు లేకుండా జరిగింది కాదు. ప్రజా మద్దతు కారణంగా ఆ ఉద్యమాలు ఎగిసి పడ్డాయి. కానీ, ఉత్తర తెలంగాణలో ప్రభుత్వాలకు సవాల్‌గా నిలిచిన నక్సలైట్ ఉద్యమాల ప్రభావం ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అతి తక్కువగా కనిపిస్తాయి.

Power with barrel is a myth?

అయితే, నక్సలైట్ ఉద్యమాలు గుణాత్మకమైన మార్పునే తెచ్చాయి. ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ చైతన్యం కారణంగానే నిన్న మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అందులో నిజం లేకపోలేదు. కానీ, ఉద్యమంటూ ఉంటే, అది విస్తరిస్తూ వెళ్లాలి గానీ క్రమ క్రమంగా దూరం జరుగుతూ వెళ్లకూడదు.

ఉత్తర తెలంగాణ నుంచి అది చత్తీస్‌గడ్‌కు, జార్ఖండ్ తదితర అటవీ ప్రాంతాలకు వెళ్లింది. దాన్ని విస్తరణగా చెప్పడానికి వీల్లేని పరిస్థితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడిలో నక్సలైట్లు కీలక పాత్ర పోషించారు. చిన్న శత్రువు, పెద్ద శత్రువు అనే సూత్రంతో అధికారం ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారడంలో వారు కీలకమైన పాత్రనే పోషించారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని ఏలిన వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి, మమతా బెనర్జీ అధికారం సాధించడంలో కూడా నక్సలైట్లే కీలక పాత్ర పోషించారు. తృణమూల్ కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన కిషన్ జీ ఎన్‌కౌంటర్ అయ్యాడు.

నక్సలైట్ సానుభూతిపరులుగా ఉంటూ ప్రజా సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన వర్గాలు తెలుగు రాష్ట్రాల్లో అస్తిత్వ ఉద్యమాల బాట పట్టారు. దానివల్లనే కాకుండా, విపరీతమైన నిర్బంధం కారణంగా మేధావులు, రచయితలు నక్సలైట్ ఉద్యమానికి బాసటగా నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నిర్బంధానికి సంబంధించిన పలు ప్రశ్నలు కూడా మిగిలే ఉన్నాయి.

కాగా, ప్రముఖ కవి కె. శివారెడ్డి ఇటీవల ఓ పుస్తకావిష్కరణ సభలో ఓ మాట అన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో రష్యాలో లెనిన్ మాదిరిగా, చైనాలో మావో మాదిరిగా మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించే నాయకుడు రాలేదని అన్నారు. అది ఎందుకో తెలియదని ఆయన అన్నారు. కానీ, జాగ్రత్తగా విశ్లేషిస్తే దానికి కారణం తెలిసే అవకాశం లేకపోలేదు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ తీరుతెన్నుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యమాల తీరుతెన్నులు మారాల్సిన అవసరం ఉందని ఇక్కడి నక్సలైట్లు గుర్తిస్తున్నట్లు లేదు. లాటిన్ అమెరికాలోని న్యూలెఫ్ట్ ఉద్యమాలను అధ్యయనం చేస్తే దారి దొరికే అవకాశాలు లేకపోలేదు. చావెజ్ ఉదాహరణ మన ముందు ఉంది. అదే సమయంలో నేపాల్‌లోని ప్రచండ ఉద్యమాన్ని కూడా అధ్యయనం చేయాల్సే ఉంది.

అంతేకాకుండా, భారతదేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలు చేసే వెసులుబాటు ఉందని 1990 దశకంలో హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఓ కేసు సందర్బంలో చేసిన వ్యాఖ్యను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం తాజా ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సమయంలో నక్సలైట్లు తమ పంథా గురించి పునరాలోచన చేయాల్సి ఉందా లేదా అనేది ప్రశ్న. అయితే, సిపిఐ నేత రామకృష్ణ ఇచ్చిన పిలుపుపై మాత్రం చర్చ జరగాల్సిందే.

English summary
Debate should be done on Maoists path in India. After Malkangiri encounter this is coming into for in Andhra Pradesh and telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X