కిరణ్‌కు అండ: 'ఏరాసు' ఆపరేషన్ దుర్యోదన2

Subscribe to Oneindia Telugu

Kiran Kumar Reddy - Erasu Pratap Reddy
న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రధారిగా ఆపరేషన్ దుర్యోదన-2 చిత్రం త్వరలో రాబోతుంది. ఈ చిత్రం ఒక్క పాట మినహా దాదాపు పూర్తయింది. ఈ చిత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు మద్దతుగా కూడా సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ చిత్రం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పరోక్షంగా ప్రజల కోసం తపిస్తున్న వ్యక్తిగా చూపించనున్నారట.

నిజ జీవితంలో కిరణ్ ముఖ్యమంత్రి కాగా ఈ చిత్రంలో ఆయనతో మంచి సంబంధాలు ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి సిఎంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆయన పాత్ర ద్వారా కిరణ్ మంచి పాలనను ప్రజలకు తెలిసే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. పార్టీలో, బయట కిరణ్‌ను దెబ్బతీయాలని చూస్తున్న వారిని కూడా ఇందులో పరోక్షంగా చూపించనున్నారట.

ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ చిత్రంలో తన డబ్బింగ్ తానే చెప్పుకున్నారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటేనే పాత్ర తీరు ప్రజల్లోకి బాగా వెళుతుందనే భావనతోనే ఆయన అలా చేశారని చెబుతున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి అవినీతిని అస్సలు సహించడు. కిరణ్ అవినీతి పట్ల ఓర్పు వహించడని చెప్పేందుకే ఇలాంటి సన్నివేశాలు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.

సినిమాలో సిఎం పాత్రధారి ఏరాసు ఫైర్ బ్రాండ్ అయిన తన స్నేహితుడు జగపతి బాబును సిబిఐ అధికారిగా నియమిస్తారట. జగపతి బాబు అవినీతిపరులను ఏరిపారేసి జైలుకు పంపిస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన పురోగతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికి అప్పుడు తెలుసుకుంటున్నారట.

ఈ సినిమాకు పలువురు కాంగ్రెసు నేతలు(కిరణ్ మద్దతుదారులు) నిధులు సమకూర్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ప్రవేశ పెట్టిన పలు పథకాలు, ప్రజల అభివృద్ధికి ఆయన పడుతున్న తాపత్రయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకే ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అవసరమైన సన్నివేశాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలను పోలిన పాత్రలను కూడా పెట్టి ఉంటారని అంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా సినిమాలో జొప్పించారట. ఈ సినిమాను త్వరలో ముఖ్యమంత్రి తన సన్నిహితులతో కలిసి చూడనున్నారట.

English summary
Supporters of CM Kiran Kumar are trying their best to ensure that their propaganda film operation duryodhana 2 becomes a hit.
Please Wait while comments are loading...