నాని జంప్: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ?

Subscribe to Oneindia Telugu

Vallabhaneni Vamshi
నాలుగు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన తెలుగుదేశం పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. నాని ఎపిసోడ్ అనంతరం వంశీ తెరచాటుకు వెళ్లారని అంటున్నారు. ఆయన అజ్ఞాతంలో ఉండటం టిడిపిని కలవరపెడుతోందట. ఆయన కూడా నాని బాటలోనే ఏ క్షణంలోనైనా జగన్‌కు జై అనవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాని జంప్ అనంతరం మూడు రోజులుగా వంశీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందనే ప్రచారం జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశాలలో వంశీ పాల్గొన్నారు. సోమవారం జగన్‌ను నాని జైలులో కలిసినప్పుడు వంశీ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. నానిపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా నేతలు మూకుమ్మడిగా ఓకే వేదికపై కనిపించి దుమ్మెత్తి పోశారు. కానీ వంశీ మాత్రం కనిపించలేదు.

ఆ తర్వాత కూడా వంశీ నానిపై స్పందించలేదు. ఆయన జగన్‌కు జై కొట్టడాన్ని తప్పు పట్టడమో లేక సమర్థించడమో చేయలేదు. దీంతో వంశీ కూడా జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వంశీ వర్గం మాత్రం ఆ వాదనలను కొట్టి పారేస్తుంది. అతను టిడిపిలోనే ఉంటారని, ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అతనికి టిడిపి అవకాశం ఇవ్వకుంటే ఇంట్లోనైనా కూర్చుంటారని, పార్టీ మారే ఉద్దేశ్యం మాత్రం లేదని చెబుతున్నారు.

వంశీ కూడా తాను నాని వెంట వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నారట. గతంలో జగన్‌ను నడిరోడ్డుపై ఆలింగనం చేసుకున్న సంఘటన చర్చనీయాంశమైంది. వెంటనే పార్టీ వంశీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై అతను వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత నుండి వంశీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నానికి వంశీ మంచి మిత్రుడు. దీంతో అతను ఇప్పటికే జగన్ వైపు వెళ్లడంతో వంశీపై కూడా అనుమానాలు వస్తున్నాయి. అతని ఫోన్ స్విచ్చాఫ్ ఉందని, అజ్ఞాతంలో ఉన్నాడనే ప్రచారం అనుమానాలను బలపరుస్తున్నాయి.

English summary
It is said that Telugudesam Party krishna district urban president Vallabhaneni Vamshi switched off his phone after Kodali Nani jump in to YSR Congress party.
Please Wait while comments are loading...