పారిస్ : హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల డబుల్స్ లో తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫ్రెంచ్ ఓపెన్ లో బుధవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో ఏడో సీడ్ సానియా, ఎలీనా వెస్నీనా (రష్యా) జోడీ 6-3, 2-6, 6-4తో అమెరికా జంట హుబర్ , రేమండ్ ను ఓడించింది. గంటన్నరసేపు సాగిన ఈ మ్యాచ్ లో ఆరంభంలో సానియా జోడీ చెలరేగిపోయింది. రెండు బ్రేక్ పాయింట్లు సాధించి తొలి సెట్ ను గెలుచుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో ఫలితం మూడో సెట్ కు దారితీసింది. నిర్ణయాత్మకసెట్ తొలి గేమ్ లోనే బ్రేక్ సాధించిన సానియా జంట చివర వరకు ఆధిపత్యం ప్రదర్శించి 6-4తో మూడో సెట్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సానియా జంట ఆండ్రియా లవకోవా, లూసి హ్రదెక (చెక్ )లను ఎదుర్కొంటుంది. ఇంతకుముందు వింబుల్డన్ (2208), యూఎస్ ఓపెన్ (2007) క్వార్టర్స్ కు చేరడమే మహిళల డబుల్స్ లో సానియా అత్యుత్తమ ప్రదర్శన.ప్రపంచ నెంబర్ వన్ , డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన క్వార్టర్స్ లో 6-4, 6-1, 7-6 (7-3)తో ఐదో సీడ్ రాబిన్ సొదర్లింగ్ (స్వీడన్ )ను అలవోకగానే ఓడించాడు. మ్యాచ్ కు ముందు ఇద్దరి పోరుపై ఎంతో ఆసక్తి రేగింది. కానీ సొదర్లింగ్ చివరి సెట్లో తప్ప నాదల్ కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. కీలకమైన పోరులో నాదల్ అంతకుముందు మ్యాచ్ లకన్నా మెరుగ్గా ఆడాడు. తొలి 12 నిమిషాల్లోనే 0-3తో వెనుకబడ్డ సొదర్లింగ్ .. ఆ తర్వాత జోరందుకోలేకపోయాడు. నాదల్ కేవలం 13 అవనసర తప్పిదాలే చేయగా.. సొదర్లింగ్ 41 అనవసర తప్పిదాలతో పరాజయంపాలయ్యాడు. నాదల్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఆండీ ముర్రేతో తలపడతాడు. క్వార్టర్స్ లో ముర్రే (బ్రిటన్ ) 7-6 (7-2), 7-5, 6-2తో ఇగ్నాసియో చెలా (అర్జెంటీనా)పై గెలిచాడు. మ్యాచ్ లో ముర్రే 9 ఏస్ లు సంధించాడు. పురుషుల విభాగంలో తొలి నాలుగు సీడెడ్ క్రీడాకారులు సెమీఫైనల్ చేరడం విశేషం.ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ చేరిన తొలి చైనా ప్లేయర్ గా నా లి రికార్డు సృష్టించింది. మహిళల క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ లి 7-5, 6-2తో నాలుగో సీడ్ విక్టోరియా అజరెంక (బెలారస్ )పై విజయం సాధించింది. మ్యాచ్ లో తొలుత ఆధిక్యం సాధించింది అజరెంకనే. మూడో గేమ్ లో లి సర్వీసును బ్రేక్ చేసింది. ఐతే వెంటనే సర్వీసును కోల్పోయింది. 12వ గేమ్ లో మరో సారి బ్రేక్ సాధించి లీ సెట్ ను గెలుచుకుంది. రెండో సెట్లోనూ అంతే. మూడో గేమ్ లో బ్రేక్ తో అజరెంక 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెంటనే సర్వీసును పోగొట్టుకుంది. ఆ తర్వాత లీకి ఎదురులేకుండా పోయింది. అజరెంక 4 డబుల్ ఫాల్ట్ లు, 23 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. సెమీస్ లో లి మాజీ నెంబర్ వన్ షరపోవా (రష్యా)ను ఢీకొంటుంది. జోరు మీదున్న షరపోవా క్వార్టర్స్ లో 6-0, 6-3తో పెట్కోవిచ్ (జర్మనీ)ను చిత్తు చేసింది. షరపోవా ఈ టైటిల్ సాధిస్తే కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన పదో క్రీడాకారిణిగా నిలుస్తుంది.