హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జగన్‌'తో సీన్ రివర్స్: ఉపఎన్నికల్లో పోటీకి విముఖత?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం కాంగ్రెసు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది! జగన్ వర్గం నేతలపై అనర్హత వేటు పడటంతో రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే చాలాచోట్ల పోటీ చేసేందుకు అధికార కాంగ్రెసు పార్టీ నేతలు ముందుకు రావడం లేదని అంటున్నారు.

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ టిక్కెట్ కోసం అభ్యర్థులు ఎగబడతారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. పోటీ చేసేందుకు చాలామంది విముఖత చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది. సీమాంధ్రలో అయితే జగన్ ప్రభావంలో కొట్టుకు పోయిందనే చెప్పవచ్చు.

సీమాంధ్రలో జగన్ పార్టీలోకి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి రోజు రోజుకు వరుసలు పెరుగుతున్నాయి. జగన్ సెంటిమెంట్ బాగా ఉన్న ప్రస్తుత తరుణంలో పోటీ చేయక పోవడమే ఉత్తమమని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు భావిస్తున్నారట. సర్వేలు కూడా జగన్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని తేల్చి చెప్పాయి. కొన్నిచోట్ల టిడిపి గెలవవచ్చని తెలిపాయి. కాంగ్రెసుకు మాత్రం ఎదురుదెబ్బ ఖాయమని సర్వేలు తేల్చాయి.

అదే సమయంలో జగన్ ప్రభావం సీమాంధ్రలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పోటీకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారని అంటున్నారు. జగన్ ప్రభావంతో పాటు పార్టీలోని విభేదాలు తదితర అంశాలు కూడా అభ్యర్థులు వెనక్కి తగ్గేందుకు కారణమవుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు గంగుల ప్రతాప్ రెడ్డి విముఖత చూపారు. అందుకు పార్టీలోని విభేదాలు కారణమని తెలుస్తోంది.

ఓవైపు కాంగ్రెసు నేతలు గంగుల తమ అభ్యర్థి అని చెబుతుండగా ఆయన మాత్రం అభ్యర్థి ఎవరో తెలియదనడం గమనార్హం. ఇక అనంతపరం నుండి తన సోదరుడిని రంగంలోకి దింపేందుకు ఎంపి వెంకట్రామి రెడ్డి ససేమీరా అంటున్నారు. నేతలు పోటీకి వెనుకంజ వేయడం వల్లనే మెజార్టీ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతుందని అంటున్నారు.

ఒంగోలు, పాయకరావుపేట, పరకాల నియోజకవర్గాలలో జగన్ అభ్యర్థులను ఎదుర్కొగలిగే సరైన వారి కోసం కాంగ్రెసు భూతద్దంలో చూస్తోందట. ఒంగోలు, పరకాలలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖలను ధీటుగా ఎదుర్కొగలిగే నేతల కోసం చూస్తున్నారట. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తన సతీమణి గండ్ర జ్యోతిని పరకాల నుండి రంగంలోకి దింపేందుకు సై అన్నారు. దాదాపు ఆమె పేరే ఖరారయ్యే అవకాశముందని అంటున్నారు.

అయితే కాంగ్రెసులో అభ్యర్థుల కొరత లేదని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. మంత్రి కొండ్రు మురళీ మోహన్ గురువారం... కాంగ్రెసులో అభ్యర్థులకు కొదవ లేదని, మాకు టిక్కెట్ ఇవ్వండి గెలుస్తామని చాలామంది అడుగుతున్నారని అందుకే ఆలస్యమవుతోందని చెప్పారు.

English summary
It is said that Congress party is searching for bypolls candidates. Many party leaders are backing their step to contest from Congress with YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy effect and differences in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X