బాబు దూకుడుకు జగన్ బ్రేక్: బాలయ్య కొత్త గానంతో...

Subscribe to Oneindia Telugu

Balakrishna - YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బ్రేకులు వేశారు! ఉప ఎన్నికలలో ఘోర పరాభవం, పార్టీ ఇంటి నుండి బయటి నుండి ఎదుర్కొంటున్న పలు సంక్షోభాల నేపథ్యంలో పార్టీని గట్టెక్కించేందుకు చంద్రబాబు పలు కీలక అంశాలపై ఇటీవలి కాలంలో దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందులో బిసి డిక్లరేషన్ కూడా ఒకటి. చంద్రబాబు ఇటీవల బిసి డిక్లరేషన్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించిన విషయం తెలిసిందే.

బిసి సంఘాల నుండి టిడిపికి భారీగా మద్దతు వచ్చింది. పలు బిసి సంఘాల నేతలు బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బిసి వర్గాల నుండి భారీగా మద్దతు రావడంతో చంద్రబాబు బిసి డిక్లరేషన్ పైన ఇతర పార్టీలకు సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. ఇతర పార్టీలు విమర్శలు చేయడం మాని తమ లాగ ప్రకటన చేయాలని సూచించారు. టిడిపి బిసి డిక్లరేషన్‌ ప్రకటించడం.. ఆ పార్టీకి మంచి మద్దతు రావడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా ఆలోచనలో పడవేసినట్లుగా కనిపిస్తోంది.

దీంతో తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బిసి డిక్లరేషన్‌పై సై అని ఆదివారం ప్రకటన చేశారు. టిడిపి డిక్లరేషన్ ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీలో చర్చ ప్రారంభమైందని తెలుస్తోంది. అన్ని కోణాల నుండి ఆలోచించి జగన్‌ను సంప్రదించి ఆయన ఓకే చెప్పాక ఆ పార్టీ దీనిని ప్రకటించింది. బిసిలకు వంద సీట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత మాదేనని బాబు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు కూడా టిక్కెట్లు ఇవ్వడం కాదని, గెలిపించి చూపించాలని బాబుకు సవాల్ విసిరింది.

అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నియోజకవర్గాలను మినహాయించి బిసిలకు టిక్కెట్లు కేటాయించాలని బాబుకు సవాల్ విసిరి ఒకడుగు ముందుకేసింది. బిసిలకు వంద సీట్ల ప్రకటన ద్వారా జగన్ టిడిపి అధినేత జోరుకు బ్రేక్ వేసినట్లుగానే భావించవచ్చు. మరోవైపు ఈ రెండు పార్టీలు వంద సీట్ల చొప్పున కేటాయిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని మిగిలిన పార్టీల పైన పడుతోంది. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలు డిక్లరేషన్ పైన బిసి సంఘాల నుండి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశముంది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత, హీరో బాలకృష్ణ కొత్త గానం తెలుగుదేశం పార్టీలో చర్చకు దారి తీసింది. మూడు రోజుల క్రితం స్వతంత్ర్య దినోత్సవం రోజు బాలకృష్ణ తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, అవసరమైతే మరోసారి లేఖ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. బాలయ్య ప్రకటనతో తెలంగాణ టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బాలయ్య వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపి మళ్లీ పుంజుకోవడానికి ఉపయోగపడతాయని అంటున్నారు.

అదే సమయంలో సీమాంధ్ర నేతల నుండి బాలకృష్ణ వ్యాఖ్యలపై అంతగా స్పందన కనబడలేదు. బాలయ్యకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా టిడిపి నేతలు అతని వ్యాఖ్యలను ఖండించేందుకు సాహసించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలను తిప్పి కొడితే తమకే నష్టం అనే భావనలో సీమాంధ్ర నేతలు ఉన్నారని అంటున్నారు. అయినా నిర్ణయం తీసుకోవాల్సింది బాబు కానీ బాలయ్య కాదు కదా అని చెబుతున్నారు. మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు సీమాంధ్రలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనప్పటికీ తెలంగాణలో పార్టీ పుంజుకోవడానికి ఉపయోగపడటం గమనార్హం.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy has countered Telugudesam Party chief Nara Chandrababu Naidu's BC declaration.
Please Wait while comments are loading...