తెలంగాణ వస్తుంది: జానా, సమైక్యమే ఉంటుంది.. గాదె

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

 తెలంగాణ వస్తుంది: జానా, సమైక్యమే.. గాదె
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఎవరి వాదనలు వారు వినిపించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి గురువారం అన్నారు. గురువారం సభ వాయిదా పడిన అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జానా రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ మంత్రులు గాదె వెంకట రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. భేటీ అనంతరం జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజనపై ఎవరి వాదనలు వారు వినిపించారని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ తప్పకుండా వస్తుందని తాము భావిస్తున్నామన్నారు. మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని తాము భావిస్తున్నామని, చెప్పారు. కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా త్వరగా ప్రకటన చేస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు.

కాగా తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత నేతలు అప్రమవుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి ముందే తమ వాణి వినిపించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ దీనిపై పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో ఫోన్ సంభాషణ సాగిస్తున్నారట.

ఈ నెల 22తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. దీనికి ముందే, అంటే 21న సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమావేశమైతే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవైపు తెలంగాణ ప్రాంత నేతలు తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారని, ఈ సమయంలో తమ గళం వినిపించకపోతే కేంద్ర నిర్ణయం ఏకపక్షమయ్యే అవకాశం ఉండవచ్చునని వారిలో కొందరు ఆందోళన చెందుతున్నారట.

అందుకే ఒకచోట చేరి ఈ అంశంపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ సదరు నేతలకు చెబుతున్నట్లు సమాచారం. అంతా అంగీకరిస్తే కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉండి కాంగ్రెసు పెద్దలతో తెలంగాణపై మంతనాలు జరుపుతున్నారు.

English summary
Minister Jana Reddy hoped that Telangana will come soon. Ministers and former ministers met DCM Damodara Rajanarasimha on Thursday.
Write a Comment
AIFW autumn winter 2015