భువనగిరిలో బాంబు కలకలం: కోఠిలో బెదిరింపు కాల్

Subscribe to Oneindia Telugu

Bomb scare in Bhongiri
నల్గొండ/హైదరాబాద్: నల్గొండ జిల్లా భువనగిరిలో బాంబు కలకలం చెలరేగింది. ఓ థియేటర్‌లోకి నలుగురు వ్యక్తులు బాంబులు పట్టుకు వచ్చారనే వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. భువనగిరిలోని భద్రాద్రి థియేటర్‌లోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సంచులతో ప్రవేశించే ప్రయత్నాలు చేశారు. సంచులతో వెళుతుండటంతో పోలీసులు, భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. సంచిలో ఏమున్నాయో చూపించమని అడగ్గా.. అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు.

మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికిన వ్యక్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాసిగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పారిపోయిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. థియేటర్‌లోకి యువకులు బాంబులతో ప్రవేశించే ప్రయత్నం జరిగిందనే వార్తలు రావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. థియేటర్‌లో తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్ ఏమీ లేవని గుర్తించింది.

బాంబు బెదిరింపు

హైదరాబాదులోని కోఠిలో ఉన్న ఎయిడ్స్ సొసైటీ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది.

గంజాయి పట్టివేత

సికింద్రాబాదులో అరవై కిలోల గంజాయిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో రాజ్ కోట్ ఎక్సుప్రెస్ నుండి పోలీసులు ఈ గంజాయిని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నలుగురు దొంగల అరెస్టు

కడప జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్డు వద్ద నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి డెబ్బై గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

English summary
Three Ganja accused were arrested by Secunderabad Railway police on Tuesday.
Please Wait while comments are loading...