తెలంగాణపై పరాచికాలు ఆడలేదు: వాయలార్ వివరణ

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+ Comments Mail

Vayalar Ravi
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు దోశ వేసినంత సులువు కాదన్న తన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ పై తాను పరాచికాలు ఆడలేదని వాయలార్ రవి చెప్పారు. సమస్య పరిష్కారం అంత సులభం కాదని మాత్రమే తాను చెప్పానన్నారు. తెలంగాణ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందన్నారు.

కాగా, సోమవారం తెలంగాణపై కేంద్రమంత్రి వాయలార్ రవి మరోసారి విచిత్రమైన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పలువురు మీడియా ప్రతినిధులు వాయలార్ రవిని తెలంగాణ విషయమై అడిగారు. తెలంగాణపై నెల రోజుల్లో తేల్చుతానని చెప్పారని, ఆ తర్వాత మరో పది పదిహేను రోజులు పట్టవచ్చునని చెప్పారని ఏమయిందని మీడియా ప్రతినిధులు అడిగారు.

దానికి వాయలార్ రవి స్పందిస్తూ.. తెలంగాణ సమస్యపై పరిష్కారం దోశ వేసినంత సులువు ఏం కాదని అన్నారు. తెలంగాణ విషయంలో రాజకీయ నాయకుల కంటే మీడియాకే ఎక్కువగా ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, పరిష్కారం క్లిష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా గతేడాది డిసెంబరులో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రం నుండి తెలంగాణపై అఖిల పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు మినహా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయి! తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా, సిపిఐ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నిర్ణయాన్ని కేంద్రంపై వేశాయి. మజ్లిస్ పార్టీ సమైక్యాంధ్ర లేదంటే రాయల తెలంగాణను ప్రతిపాదించింది. కాంగ్రెసు నుండి వెళ్లిన ఇద్దరు రెండు వాదనలు వినిపించారు.

అన్ని పార్టీల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత షిండే మాట్లాడుతూ.. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జనవరి 28వ తేదీ లోగా తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వస్తుందని అందరూ భావించారు. కానీ, కేంద్రం ఈ విషయమై మళ్లీ తాత్సార మంత్రాన్నే పఠించింది. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ నెల అంటే ముప్పయి రోజులు మాత్రమే కాదని, వారం అంటే ఏడు రోజులు మాత్రమే కాదని చెప్పి అందర్నీ ఆశ్చర్యపర్చారు. త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ, షిండే ఇచ్చిన గడువు దాటి నెల దాటినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు.

వాయలార్ వ్యాఖ్యలపై హరీష్ రావు హైదరాబాదులో మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోశతో పోల్చడం సరికాదని, అది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనన్నారు. వాయలార్ రవి గతంలోను తెలంగాణపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారన్నారు. తమ మనోభావాలను కించపర్చేలా మాట్లాడిన వాయలార్ రవి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఓ నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Central Minister Vayalar Ravi has clarified on his comments about Telangana on Tuesday.
Please Wait while comments are loading...
Your Fashion Voice
Advertisement
Content will resume after advertisement