హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పటడుగా...?: జగన్ దారిలో జూ.ఎన్టీఆర్, తేడా ఏంటి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr-YS Jagan
హైదరాబాద్: ప్రముఖ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ పయనిస్తున్నారని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్ కాంగ్రెసు పార్టీలో ఇమడలేక పోయారు.

ఓదార్పుతో అధిష్టానంతో వచ్చిన విబేధాలు ఆయన పార్టీని విడిచి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకునే పరిస్థితికి తీసుకు వచ్చాయి. వైయస్ మృతి తర్వాత తమ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ వర్గం చెబుతుంటే, ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన పార్టీని విడిచారని వ్యతిరేక వర్గం అంటోంది. ఏది ఏమైనా ఆయన పార్టీ వీడిన తర్వాత ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పవచ్చు.

అందుకు కాంగ్రెసు పార్టీని జగన్ వర్గం దోషిగా చెబుతోంది. జగన్ పార్టీ వీడటంతో ఆయనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టారని, జైలుకు పంపించారని ఆరోపిస్తున్నారు. అదేం కాదని కాంగ్రెసు పార్టీ చెబుతోంది. నిజానిజాలు ఎలా ఉన్నా జగన్ కాంగ్రెసును వీడాక చిక్కుల్లో పడ్డారు. ఆయన కాంగ్రెసును వీడి, కొత్త పార్టీ పెట్టడం ఆవేశపూరిత చర్య అని అప్పట్లోనే వాదనలు వినిపించాయి. జగన్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ పలువురు ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు.

ఆవేశంలో కాంగ్రెసును వీడిన జగన్ చిక్కులు కొని తెచ్చుకున్నారని అంటున్నారు. జగన్ కాంగ్రెసులోనే ఉంటే పదవులు వచ్చేవని కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా గతంలో చెప్పారు. దీనిని జగన్ పార్టీ ప్రచారాస్త్రంగా కూడా ఉపయోగించుకుంది. కాంగ్రెసులో ఉంటే ఆలస్యంగానైనా 'ముఖ్య'మైన పదవులు వచ్చి ఉండేవని అభిప్రాయపడుతున్నారు. జగన్ బయటకు వెళ్లి సాధించిందేమీ లేదంటున్నారు.

కాంగ్రెసులో ఉన్నా పార్టీలో అప్పటి వరకు జగన్ మద్దతు కూడగట్టుకొని 2014 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారని, కొత్త పార్టీ పెట్టాక కూడా అప్పటి వరకు ఆగాల్సి వస్తోందంటున్నారు. అది 2014లో జగన్ పార్టీ అధికారంలోకి వస్తేనే అని గుర్తు చేస్తున్నారు. ఇదంతా చూస్తే జగన్ ఆవేశపడి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు. పార్టీ వీడే ముందు విజయమ్మ కూడా హెచ్చరించినట్లుగా చెప్పారు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఆవేశంతో వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విజయవాడ దుకాణ ప్రారంభోత్సవం సమయంలో, బాద్ షా ఆడియో రిలీజ్ సమయంలో జూనియర్ బల ప్రదర్సన చేశారని, అది టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణలకు చూపించడానికే అనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. జగన్‌లాగే జూనియర్ రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం తాపత్రయపడి ఆవేశంతో వెళ్తున్నారంటున్నారు.

జగన్, జూనియర్‌లకు తేడా ఉందా?

కాంగ్రెసులో ఇమడలేక బయటకు వచ్చిన జగన్‌కు అంతకుముందు పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యం ఉంది. అంతేకాకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగతంగా తెచ్చి పెట్టుకున్న ఇమేజ్ కాంగ్రెసుకు కాకుండా జగన్‌కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎప్పుడో చూసిన జగన్ రాజకీయాల్లో నెట్టుకు రావడం కష్టమేమీ కాదంటున్నారు. వైయస్ ఇమేజ్‌తో ఎదిగిన జగన్ ఆ ఇమేజ్ అంతా తానే అట్టిపెట్టుకున్నాడని చెప్పవచ్చు.

కానీ, ఎన్టీఆర్ పరిస్థితి వేరంటున్నారు. నందమూరి పేరుతో పైకి వచ్చిన జూనియర్ ఆవేశంతో ఫ్యామిలీతో విబేధించి బయటకు వస్తే రాజకీయంగా నెగ్గుకు రావడం కష్టమే అంటున్నారు. ఆయన ఫ్యామిలీతో చీలిపోతే ఎక్కువ మంది అభిమానులు టిడిపితోనే ఉంటారు.. తప్ప జూనియర్‌తో వెళ్లరంటున్నారు. పైగా జగన్‌కు పార్టీ కారణంగా బయటకు వెళ్లారని, అదే ఎన్టీఆర్ బయటకు వెళ్తే కుటుంబంతో విభేదాల వల్లనే అనే పేరు ఉంటుందంటున్నారు. ఇవన్నీ ఆయనకు ఏమాత్రం ఉపయోగపడేవి కాదంటున్నారు.

English summary
It is said that Hero Junor Ntr is followng YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X