వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టిసీమకు ప్రాచుర్యం సరే.. పోలవరం సంగతేమిటి?

కొందరు రాజకీయ పార్టీల నాయకులు తమకు సుదీర్ఘ అనుభవం ఉన్నదని పదే పదే చెప్తుంటారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి తమకే అన్నీ తెలుసునన్నట్లు వ్యవహరిస్తుంటారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: కొందరు రాజకీయ పార్టీల నాయకులు తమకు సుదీర్ఘ అనుభవం ఉన్నదని పదే పదే చెప్తుంటారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి తమకే అన్నీ తెలుసునన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఆ కోవలోకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆచరణలో 40 ఏళ్ల నాటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మాత్రం ప్రతీసారి విఫలమవుతున్నారని తాజా పరిణామాలు చెప్తున్నాయి. 1980వ దశకంలో దివంగత సీఎం టంగుటూరి అంజయ్య ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసిన 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణానికి తర్వాత అధికారంలోకి వచ్చిన వారెవ్వరూ పూనుకోలేదు.

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత 2006లో వైఎస్ సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తర్వాత దాన్ని పట్టించుకున్న వారే కరువయ్యరు. 2014లో తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి క్రుష్ణా డెల్టాకు వర ప్రదాయనిగా భావించే 'పోలవరం' ప్రాజెక్టుకు జాతీయ హోదా కట్టబెట్టింది నాటి యూపీఏ ప్రభుత్వం.

AP CM Chandrababu said to propaganda for PATTISEEMA

అసలు సంగతి బయటపెట్టిన బాబు

తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం.. స్కోరింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయే తప్ప.. నిజంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పూనుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అసలు సంగతి బయట పెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల.. చాలా మేలు జరుగుతుందని.. దాని గురించి బాగా ప్రచారం చేయాలని తన మనసులో మనోగతాన్ని చంద్రబాబు బయటపెట్టారు. కానీ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న సంగతి మాత్రం బయటపెట్టలేదు. ఇటీవలే దాని నిర్మాణ వ్యయం రూ.40 వేలకు వెళుతుందన్న అంచనాల మధ్య నిపుణుల కమిటీని నియమించారు. ఆ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చే సరికి పుణ్య కాలం పూర్తయిపోతుంది. ఈ సంగతి చంద్రబాబు వంటి వారికి తెలియని విషయం కాదు. కానీ తనకు మద్దతుగా నిలుస్తున్న మీడియా మాటున దాటేయడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

పదేళ్ల ప్రత్యేక హోదా కోసం ఇలా డిమాండ్

ఎపీ సీఎం చంద్రబాబు అవునంటే కాదని.. కాదంటే అవుననే అభిప్రాయం అందరిలో ప్రబలిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇవ్వని హామీ లేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం అని ఊరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఊదరగొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం సాగించారు. పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలులో వడ్డీ మాఫీ పథకంగా మారింది. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. వీటిపై నిలదీసే విపక్షాలు మాత్రం అబద్దాలు చెప్తున్నాయని, ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆడిపోసుకోవడంలో మాత్రం చంద్రబాబు ముందు ఉంటారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శని, ఆదివారాల్లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. అందులో నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు, ఆయన క్యాబినెట్ సహచరులు, నాయకుల వ్యాఖ్యలు, ఎత్తిపొడుపు విమర్శలు బయటకు వచ్చాయని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

ఉపాధిపై ఇలా నారా లోకేశ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిన అంశాలు ఆమోదయోగ్యమా? కాదా? అన్న విమర్శలు పక్కనబెడితే... అధికార పక్షంగా టీడీపీ నేతలు గానీ, మంత్రులు గానీ సంయమనం పాటించిన దాఖలాలు లేవు. విపక్షాలు చేసే విమర్శలకు ఓపిగ్గా సమాధానం చెప్పడం అధికార పక్షం విధి. కాని అందుకు భిన్నంగా అంతకంటే దూకుడుగా వ్యక్తిగత దూకుడు ప్రదర్శించడం టీడీపీ నేతలకే చెల్లింది. ఏపీ బారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు లండన్‌లోని ఆట గుర్తుకు వస్తే.. వరుసకు ఆయన అన్న దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్.. నాలుక కోస్తానని అని బెదిరించేందుకు వెనుకాడలేదు. అన్నీ సవ్యంగా సాగుతున్నాయని చెప్పడానికే టీడీపీ నేతలు ప్రయత్నించారు. మూడేళ్లలో మూడు వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాదిన్నర కాలంలో 15 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని సోమవారం సాయంత్రం జరిగిన ఒక సంస్థ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.

ప్రజల అభ్యున్నతిపై చేపట్టిన పథకాల ఊసే లేదు

అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనంపై చంద్రబాబు ఏమన్నారో చూద్దాం.. 'వైకాపా ప్లీనరీలో జగన్‌ అన్నీ అబద్ధాలు చెప్పారు. ఈ సంగతి ప్రజలకూ తెలుసు. వాటికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళదాం. ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంపైనే దృష్టి పెడదాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేవారినే ప్రజలు విశ్వసిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిపాలన అనుభవం లేదు. వాళ్లు అవగాహన లేమితో మాట్లాడుతుంటారు' అని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు హితబోధ. అబద్ధాలే చెబితే అసలు వాటి ఊసెత్తడం ఎందుకన్నది ధర్మ సందేహంగా ఉన్నది. అంటే ఏదో ఒక మూల ఒకింత బెరుకు ఉన్నదని పరోక్షంగా ప్రభుత్వం మాటలే చెప్తున్నాయి. ఆ బెరుకు లేకపోతే.. ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను పట్టించుకునే వారే ఉండరని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చాల్సిన అంశాలపై పట్టుబట్టాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి పాలనా అనుభవం లేకపోవచ్చు గానీ.. ప్రజాభిమానం మెండుగా ఉన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు. అలాగే ఆ పార్టీలోని నాయకుల్లో చాలా మంది మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఆ మాటకు వస్తే మూడేళ్ల క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో చాలా మంది కొత్తగా మంత్రులైన వారే. ప్రభుత్వ పాలనలో ముందుకు వెళ్లినా కొద్దీ ప్రజా నాయకులైతే జన రంజకంగా ఉంటుంది.. లేదంటే తదుపరి ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతారు అది వేరే సంగతి. ఈ అంశాన్ని విస్మరించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వ్యవహరిస్తే మూల్యం కూడా భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది.

హోదా కంటే ప్యాకేజీ ముద్దు అన్న బాబు

ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లోనే ప్రత్యేక హోదా అంశం కూడా ఉన్నది. దాదాపుగా అది ఒక్కటి మినహా దాదాపుగా ఏపీకి విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిచేసింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ కోసం ఎందుకు గట్టిగా ప్రయత్నించలేదో చెప్పకుండా చంద్రబాబు నాయుడు దాటవేస్తే చైతన్యానికి మారుపేరైన ఆంధ్రులు మరిచి పోతారని భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. ప్రత్యేక హోదా కోసం తాను పట్టుబట్టడానికి ఇబ్బందులు ఉంటే ఉండవచ్చుగానీ విపక్షాలు చేసే ఆందోళనకు మద్దతు పలుకడానికి ఇబ్బందులేమిటో సీఎంగా, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ప్రజలందరికి వివరణ ఇవ్వాలని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ప్రత్యేక హోదా కోసం 'జల్లికట్టు' తరహాలో ఆందోళనకు సిద్ధమైన యువతను.. దానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి అష్ట దిగ్బంధనం చేసిన ఘనత, నేపథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరన్న చంద్రబాబు ఎన్నికల్లో పదేపదే ఐదేళ్ల హోదా సరిపోదని, పదేళ్లు కావాలని ఎందుకు డిమాండ్ చేశారో ప్రజలకు సెలవియ్యారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మందకృష్ణ మీడియా భేటీకీ ఆంక్షలు

తాజాగా గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 'కురుక్షేత్ర' సభ నిర్వహించాలని తలపెట్టిన ఎమ్మార్పీఎస్ పట్ల ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు విధానం అదే. 2012లో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టడానికి తెలంగాణలో అన్ని విధాల ఎమ్మార్పీఎస్ సహకరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతి కూడా విస్మరించి మరీ రహదారులన్నీ దిగ్బంధించి ఎమ్మార్పీఎస్‌ను కట్టడి చేశారు. చివరకు విజయవాడలో మీడియాతోనూ మాట్లాడేందుకు కూడా ఆయన ప్రభుత్వం అనుమతించలేదు. ఇక రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు 'ల్యాండ్ పూలింగ్' పేరిట రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న నేపథ్యం ఏపీ ప్రభుత్వానిది. ఏటా మూడు పంటలు పండే భూములు ఇవ్వ నిరాకరించిన రైతుల పంటలు రాత్రుల్లో తగులబెట్టి బెదిరింపులకు దిగిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు సర్కార్‌ది.

ముద్రగడ ఆందోళన అణచివేతకు వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా గణనీయ శక్తిగా ఉన్న 'కాపు'లు.. వారి మద్దతు పొందేందుకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తానని ప్రకటించిన నేపథ్యం చంద్రబాబు నాయుడిదే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళనకు శ్రీకారం చుడితే తప్పా.. దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆందోళన చేపట్టకుండా ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు దుర్భాషలాడిన సంగతి ఆంధ్రప్రదేశ్ అంతటా చూశారు. సమస్య సద్దుమణిగేలా చేసేందుకు 'మంజునాథ' కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది సమయం పడుతున్నది. కానీ ఇంత వరకు నివేదిక సమర్పించనే లేదు. దానిపై పాదయాత్ర చేపట్టాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. కనుక ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే అన్ని చేశామని మీడియాలో ప్రకటనలతో కాలం గడిపే రోజులు పోయాయని అధికార తెలుగుదేశం పార్టీ గుర్తించాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
The Telugu Desam Party Parliamentary (TDPP) committee decided to mount pressure on the Centre for getting Railway zone as well as for increasing the number of Assembly constituencies in the State and other issues pertaining to the AP State Reorganisation Act during the Parliament Session, which will start on July 17. AP CM Chandra babu said that no problem with YSR Congress Party while they didn't have experience in governence. Chandra babau said that he had 40 years experience in Politics and People know what we have to do this governent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X