వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా గప్‌చుప్!: పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు.. తెలంగాణకు నో

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆగమేఘాల పూర్తి చేసిన చంద్రబాబు సర్కార్.. రికార్డు స్థాయిలో 2016లోనే నీళ్లు మళ్లించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: కృష్ణా నదిపై ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంతో భారీగా వర్షాలు కురిస్తే తప్ప.. దిగువన ఉన్న తెలంగాణకు, ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీరానికి నీరు రావడం లేదు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా నీరు తరలించుకునే సంప్రదాయం ఉండేది.

కానీ తర్వాత కాలం తిరగబడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆ పరిస్థితికి తెర పడింది. దీనికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై ద్రుష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోస్తాంధ్రలోని క్రుష్ణా డెల్టాకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆగమేఘాల పూర్తి చేసిన చంద్రబాబు సర్కార్.. రికార్డు స్థాయిలో 2016లోనే నీళ్లు మళ్లించింది.

కానీ దాని కింద తెలంగాణకు రావాల్సిన కృష్ణా నదీ జలాలను కేటాయించడానికి మాత్రం రకరకాల సాకులు చూపుతోంది. ఇదే సమయంలో రెండేళ్ల పాటు కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరు మళ్లించిన తర్వాత పంటల సాగు తగ్గుముఖం పడుతున్నదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు నిజమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లోనూ పట్టిసీమ నుంచి నీళ్ల మళ్లింపు చేపట్టిందీ ఏపీ సర్కార్.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి పట్టిసీమ ఇలా

పట్టిసీమద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు మళ్లించడమనేది కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వస్తుందని చెప్తున్నా, 2017-18లో ఎలాంటి విధివిధానాలు ఖరారు కాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమద్వారా ముమ్మరంగా నీటిని తరలిస్తున్నది. ఇది కండ్ల ముందే కనిపిస్తున్నా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 4500 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో డెల్టాకు గోదావరి జలాలను ఏపీ తరలిస్తున్నది.

AP Government has Supplied water from Pattiseema to Krishna Delta

మొదలే కానీ గోదావరి ఉప నదుల ఇన్ ఫ్లోలు

వాస్తవంగా మహారాష్ట్ర నుంచిగానీ, ఇటు ప్రాణహిత, ఇంద్రావతి నుంచి గానీ ఇంకా సరైన ఇన్‌ఫ్లోలు మొదలే కాలేదు. కానీ వీటితోపాటు శబరి నుంచి వచ్చే కొద్దిపాటి నీటిని సైతం ఏపీ పట్టిసీమతో మళ్లిస్తున్నది. గతేడాది 53 టీఎంసీలను ఏపీ మళ్లించుకున్నది. ఈ దఫా 80 టీఎంసీల కంటే ఎక్కువే డెల్టాకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. గతేడాది గోదావరి జలాల మళ్లింపునకు అనుగుణంగా తెలంగాణకు కించిత్తు వాటాను కృష్ణాజలాల్లో ఇవ్వలేదు. పైగా కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ వాడుకున్న నీటి వినియోగంలోనూ పట్టిసీమ జలాలను పరిగణనలోకి తీసుకోలేదు.

లెక్కలు తేల్చకుండా దాటేస్తున్న ఆంధ్రప్రదేశ్

పట్టి సీమ నుంచి తరలిస్తున్న గోదావరి జలాల వాటా ఇవ్వకుండా, ఇటు లెక్కల్లోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ మాత్రం నీటిని వాడుకుంటూ పోతున్నా కేంద్రం చేస్తున్న పనేమిటి? రెండు నదీ యాజమాన్య బోర్డులు ఎందుకు ఉన్నట్లు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెత్తనంపై యావ తప్ప పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు విస్మరిస్తున్నాయని పలువురు జల నిపుణులు విమర్శిస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పులు అధికారిక రికార్డుల్లో భద్రంగా ఉన్నా, కళ్ల ముందు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పరుగులు పెడుతున్నా కేంద్ర సర్కార్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు.

తెలంగాణ వాదన పట్టించుకోని కేంద్ర జల వనరుల శాఖ

పట్టిసీమ ద్వారా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం డెల్టాకు ఎంత నీటిని మళ్లిస్తున్నది? దానిలో తెలంగాణకు రావాల్సిన వాటా ఎంత? కనీసం కృష్ణా బేసిన్‌లో గోదావరి జలాల వినియోగమెంత? ఇవన్నీ లెక్కలు తేల్చాల్సింది ఎవరు? వీటికీ ఒక పరిష్కారం చూపే రెండు రాష్ట్రాలతో కూడిన సమావేశాన్ని కూడా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ నేటికీ ఖరారు చేయక పోవడం మరీ విడ్డూరమని అభిప్రాయ పడుతున్నారు.

AP Government has Supplied water from Pattiseema to Krishna Delta

నదీజలాల పంపిణీపై స్తబ్దత

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ తీరుపై అంతా స్తబ్దత నెలకొంది. జలాశయాలకు ఇన్‌ఫ్లోలు ఇంకా రావడం లేదు కదా.. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. తీరా అవి మొదలైన తర్వాత సమావేశాలు మొదలుపెడితే హడావుడి నిర్ణయాలు తప్ప ప్రణాళికబద్ధ కార్యాచరణ ఎలా రూపొందుతుందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కీలకమైన కృష్ణాజలాల పంపిణీపై రాష్ట్ర విభజన తర్వాత ప్రతి ఏటా జూన్ 11-12 తేదీల్లోనే సమావేశాలు ఏర్పాటు చేసేవారు. గతేడాది జూన్ 21-22 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. కానీ, ఈ ఏడాది ఆ అంశంపై ఎవరూ దృష్టేసారించ లేదు. ఈ నెల 28, 29వ తేదీల్లో భేటీ నిర్వహించేందుకు కృష్ణా బోర్డు కొంతమేర కసరత్తు చేసినా ప్రస్తుతం మాత్రం ఆ దిశగా కదలికలేవీ కనిపించడం లేదు.

హైదరాబాద్‌కు తాగునీరు పట్టించుకోని ఏపీ

దీంతో కనీసం హైదరాబాద్ తాగునీటి కోసం ఒక్క టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి వదలాలని తెలంగాణ కోరుతున్నా బోర్డు తన అధికారాలు ఉపయోగించడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఇంకా ఈ ఏడాదికి విధివిధానాలు ఖరారు కాలేదు కదా.. అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని అంటున్నారు.

AP Government has Supplied water from Pattiseema to Krishna Delta

వర్షాలతో నిల్వ పెరిగినప్పుడు చూస్తామన్న ఆంధ్రా

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు ఇక నీరు విడుదల చేసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ తెగేసి చెప్పింది. సాగర్‌ నుంచి హక్కుగా తమకు రావలసిన నీటిని వదలకుండా తెలంగాణ అడ్డుకుంటోందని విమర్శించింది. 'మాకు న్యాయంగా రావలసిన కృష్ణా జలాలను తెలంగాణ విడుదల చేయడం లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఇచ్చిన ఇండెంట్‌ ఆర్డర్‌ను గౌరవించి శ్రీశైలం నుంచి మేం ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్నాం. కానీ ఆ నీరు నాగార్జున సాగర్‌లోకి చేరాక మాకు హక్కుగా రావాల్సిన జలాల గురించి ప్రతిసారి ప్రాధేయ పడాల్సి వస్తోంది.

సాగర్‌లో నీటి మట్టం 502 అడుగులు

ఇప్పుడు నాగార్జున సాగర్‌లో 502 అడుగులకు నీటి నిల్వలు చేరాయని అంటున్నారు. వీటిని పంపింగ్‌ చేసే వ్యవస్థ పూర్తి స్థాయిలో పని చేసేందుకు 10 రోజుల సమయం కావాలని తెలంగాణ అంటోంది. వాస్తవానికి ఈ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని మేం ఎప్పుడో తెలంగాణకు స్పష్టం చేశాం. ఇప్పటిదాకా సిద్ధం చేయలేదు. ఇప్పుడేమో.. తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీళ్లు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి నీటిని విడుదల చేయడం కుదరదు. వర్షాలు కురిస్తే.. నీటి నిల్వలను బట్టి అప్పుడు చూస్తాం' అని కృష్ణా బోర్డుకు విస్పష్టంగా తెలియజేసింది.

AP Government has Supplied water from Pattiseema to Krishna Delta

వర్షాలొస్తేనే సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు

వర్షాలు వచ్చినప్పుడే తెలంగాణ కూడా తన ఇండెంట్‌ను అప్పుడిస్తే మంచిదని ఆంధ్రప్రదేశ్ హితవు పలికింది. బోర్డు ఆదేశాల మేరకు తమకింకా నాగర్జునసాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు 1.8 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నదని ఏపీ గుర్తుచేసింది. ఇదే సమయంలో సాగర్‌ కుడి కాలువ నుంచి 6 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని ఇండెంట్‌ పెట్టింది. సాగర్‌ నిల్వలు డెడ్‌ స్టోరేజీకి వెళ్లినందున.. నీటిని తోడాల్సి ఉందని బోర్డు పేర్కొంది. ఇందుకు పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని, ఈ పంపింగ్‌ స్టేషన్‌ పని చేసేందుకు 10 రోజులు పడుతుందని తెలంగాణ తెలిపింది.
తక్షణమే నీటి అవసరాలు తీరాలంటే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని దిగువకు వదలాలని తెలంగాణ వాదించింది. తమకు తక్షణమే హైదరాబాద్‌ తాగు నీటి అవసరాల కోసం 0.86 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ వాదనలను ఆంధ్ర తోసిపుచ్చింది. బోర్డు ఆదేశాల మేరకు సాగర్‌లోకి క్రమం తప్పకుండా శ్రీశైలం నుంచి జలాలు విడుదల చేస్తున్నామని గుర్తుచేసింది. తెలంగాణ మాత్రం బోర్డు ఆదేశాలను ఏ మాత్రం పాటించడం లేదని ఆక్షేపించింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జలాశయాల్లో నీటి నిల్వలను లెక్కించి.. వాటి ఆధారంగా నీటి విడుదలను చేయాలని సూచించింది. ఉభయ పక్షాల వాదనల నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి బోర్డు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

English summary
Andhra Pradesh state government has decided to supply water through Pattiseema lift irrigation scheme from Godavari to Krishna delta and at the same time Chandra Babu government didn't accept Telangana appeals for Krishna water from Nagarjuna Sagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X