వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లు: బాబు సొంత జిల్లాల్లోనూ ఎదురుగాలి

తొలినాళ్లలో విజయ సంరంభంతోనే గడిచిపోయినా తెలుగు తమ్ముళ్లలో క్రమంగా అసమ్మతి పెరుగుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అదీ కూడా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మద్దతుతో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.

తొలినాళ్లలో విజయ సంరంభంతోనే గడిచిపోయినా తెలుగు తమ్ముళ్లలో క్రమంగా అసమ్మతి పెరుగుతోంది. శ్రీకాకుళం మొదలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వరకు.. చిత్తూరు నుంచి ప్రకాశం వరకు అధికార తెలుగుదేశం పార్టీలో నేతలు, కార్యకర్తలు గ్రూపుల వారీగా, నేతల వారీగా విడిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మొదలు ఆయన బావమరిది - వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రుష్ణ ప్రాతినిధ్యం వహించే అనంతపురం, రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యానికి మారుపేరుగా నిలిచే కృష్ణా జిల్లా వరకు ఈ అసంత్రుప్తి వ్యక్తమవుతూనే ఉన్నది. ప్రకాశం జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు, నాలుగు గ్రూపులుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తమది ప్రత్యేక విశిష్టత గల పార్టీ అని పదేపదే చెప్తుంటారు.

జన్మభూమి కమిటీల్లోనూ చేరుస్తామని అధిష్ఠానం బుజ్జగింపులు

జన్మభూమి కమిటీల్లోనూ చేరుస్తామని అధిష్ఠానం బుజ్జగింపులు

తాజాగా పార్టీ మండలశాఖ అధ్యక్షుల నియామకంతో చిత్తూరు జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో పార్టీ అధిష్టానానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతుండటం.. ఈ కమిటీల్లో జిల్లా స్థాయి నాయకుల అనుచరులు.. బంధువులే అధికంగా ఉండటాన్ని సామాన్య కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రకటించిన మండలాధ్యక్ష పదవులలోనూ తమకు అన్యాయం చేశారని బీసీలు నిరసిస్తున్నారు. ఎక్కువ మండలాల్లో పార్టీ సారథ్యం సీఎం సామాజిక వర్గీయులకే కట్టబెట్టారని వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపే లేదని ఎస్సీ, ఎస్టీలు రగిలిపోతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కుతూహలమ్మ చెప్పినవారికి కాక. టీడీపీలో అన్నీతామై నడిపిస్తున్న ఓ సామాజికవర్గం చెప్పిన వారికి మండలాధ్యక్ష పదవులిచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గ వరదయ్యపాళ్యంలో పరిస్థితి టీ - కప్పులో తుపానులా మారింది. ఎమ్మెల్యే తలారి ఆదిత్య నాన్న మనోహర్‌, జెడ్పీటీసీ సరస్వతమ్మ కొడుకు కరుణాకర్‌నాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నా ఆయనకు ఎక్కువ ప్రాధ్యాన్యం ఇస్తున్నారని స్థానిక తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తలారి మనోహర్‌ ప్రతిపాదించిన చలపతినాయుడు ఐవీఆర్‌ఎస్‌ ఓటింగ్‌లో ఓడిపోయినా ఆయననే తిరిగి మండలాధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై అసంతృప్తులు భగ్గుమంటున్నారు. గతంలో రెండుసార్లు పదవి కోసం పోటీ పడిన మైనారిటీ నాయకుడు నవాబును ఈ సారీ పక్కన పెట్టారు

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
మూడు గ్రూపులుగా మదనపల్లి టీడీపీ

మూడు గ్రూపులుగా మదనపల్లి టీడీపీ

ఎంపీ శివప్రసాద్‌ మాటకూ పార్టీలో విలువ లేదని ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దికాలంగా పార్టీలో అసంతృప్తి పెరుగుతుండటం గమనించిన అధిష్ఠానం మండలాధ్యక్షుల ప్రకటనను రెండు నెలలు వాయిదా వేసింది. మదనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు నియోజకవర్గాల్లో మండలాధ్యక్షుల పదవుల కోసం రోడ్డుపైకొచ్చి ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అసంతృప్తులను బుజ్జగించే పనిలో భాగంగా కొత్తగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇంతకుముందు కమిటీలో సర్పంచ్, ఎంపీపీ, నలుగురు పార్టీ నాయకులు ఉండేవారు. ఇప్పుడు సర్పంచ్‌లు ఇతర పార్టీ వారు ఉన్నచోట్ల వారిని తొలగించి టీడీపీ నాయకులకు ఈ కమిటీల్లో చోటుకల్పిస్తామని అధిష్ఠానం వారికి మాట ఇచ్చినట్లు వినికిడి.

మదనపల్లి టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. రామదాస్‌చౌదరి, దొమ్మలపాటి రమేశ్, బొమ్మచెరువు శ్రీరాములు వర్గాలు నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నాయి. మదనపల్లి మండలాధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని బొమ్మచెరువు వర్గం డిమాండ్‌ చేస్తోంది. గొడవలు ముదరడంతో పాత అధ్యక్షుడు దొరస్వామి నాయుడినే కొనసాగిస్తున్నారు. శ్రీకాళహస్తిలో నాలుగు మండలాలకు కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం పెద్ద గొడవే జరగడంతో పాత వారినే కొనసాగిస్తున్నారు. నెల్లూరు గంగాధర సెగ్మెంట్ పరిధిలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి.

నెల్లూరు గంగాధర నియోజకవర్గం తెలుగుదేశం కన్వీనర్‌ హరికృష్ణను కాదని అక్కడి టీడీపీలో కీలక పాత్ర పోషించే సామాజిక వర్గం వారికే పదవులు కట్టబెట్టడం పుండుమీద కారం చల్లినట్లుగా తయారైంది. నారాయణవనం టీడీపీ నాయకుల మధ్య కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ తలారి మనోహర్‌కు వాడవాడల నుంచి కలెక్షన్లు సమకూర్చే గిరిబాబుకు పదవి కట్టబెట్టడంతో భాస్కరన్‌ గ్రూపు పార్టీని వీడేందుకు సిద్ధమైంది. భాస్కరన్‌ గ్రూపు ఎమ్మెల్యే నిర్వహించే ఏ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

రాజీనామాకు ముద్రబోయిన వర్గం రెడీ

రాజీనామాకు ముద్రబోయిన వర్గం రెడీ

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న కాపా శ్రీనివాసరావుకు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి కోసం వీరి మధ్య అంతర్యుద్ధం​ జరుగుతోంది. కాపా శ్రీనివాసరావుకు నూజివీడు ఏఎంసీ పదవి ఇవ్వాలని పార్టీ అథినేత నిర్ణయించినట్లు సమాచారం. కాపాకు పదవి ఇవ్వడాన్ని ముద్రబోయిన వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రస్తుతం పరిస్థతి రసవత్తరంగా మారింది. పదవిని దక్కించుకుకోవడానికి ఇరువర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకున్నాయి. అందులో ముద్రబోయిన వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాపా శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తే టీడీపీకి రాజీనామా చేయాలని ముద్రబోయిన వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

హిందూపురంలో టీడీపీ నేతల రహస్య భేటీలు ఇలా

హిందూపురంలో టీడీపీ నేతల రహస్య భేటీలు ఇలా

ఇక వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా పక్కకు తప్పుకుని తన తనయుడిని రంగ ప్రవేశం చేయించాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వంటి వారు గుర్రుమంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలక్రుష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఇటీవల తెలుగుదేశం నేతలంతా రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లోని అధికార పార్టీ మండలస్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు ఇటీవల చిలమత్తూరు మండలం తూమకుంట సరిహద్దుల్లోని తోటలో రోజంతా రహస్య సమావేశమయ్యారు.

చిలమత్తూరు మండల నాయకులు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇటీవల నియమితులైన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వ్యవహార సరళిపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా, ప్రజాప్రతినిధులైనా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఎలాంటి పని కోసం వెళ్లినా తమ మాటకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులుగా తామున్నా.. పట్టించుకోకుండా ఇటీవల ఒకవర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చకొచ్చినట్లు వినికిడి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇస్తున్నారని, ఇలాగైతే ఇక తామెందుకుని పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బాలయ్య పీఏపైనే నేతలందరి గుర్రు

బాలయ్య పీఏపైనే నేతలందరి గుర్రు

ఈ విషయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తేవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ రహస్య సమావేశం నిర్వహించిన వారంతా ఆరు నెలల క్రితం వరకు ఆధిపత్యం చెలాయించిన వారేనని తెలుస్తోంది. గతంలో విభేదాలు రచ్చకెక్కిన సమయంలో పార్టీని సమన్వయం చేసేందుకు వచ్చిన రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్‌ కృష్ణమూర్తి నెల రోజులుగా హిందూపురం వైపు ముఖం చాటేశారు. తాను అనారోగ్యంతో రాలేకపోతున్నట్లు ఆయన చెబుతున్నారు కానీ తెలుగుతమ్ముళ్లు మాత్రం ఇక రారంటున్నారు. ఎమ్మెల్యే పీఏగా నియమితులయిన వీరయ్య మాత్రం అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇది మింగుడు పడని కొందరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే తమకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, తమ మాటే నెగ్గాలని కొంత కాలంగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం బయటికి పొక్కడంతో ఆ పార్టీలోని నాయకులు ఏమి జరుగుతోందో ఆరా తీయడం ప్రారంభించారు. ఈ విషయమై నిఘా వర్గాలు కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా క్రమశిక్షణ గల హిందూపురం టీడీపీలో ఆధిపత్యం కోసం మరోసారి నాయకులు రచ్చకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

English summary
Dessents are raising in Andhra Pradesh Telugudesham Party. Srikakulam to West Godavari while chitoor to Prakasam Telugudesham Mandal, Village level leaders, important persons were rebel mood. Dessents leads to MLA's and Main leaders were priority for their own priority. Even Party leader ship didnot take into consideration of Present Chithoor MP Shiva Prasad and ex MLA Kuthulamma. In Ananthapur district Hindupur leaders serious on present MLA Balakrishna PA Veeraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X