వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఎన్నికల టీమ్: విధేయులకూ నిరాశే, నైతిక విలువలు హుష్‌కాకి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ / అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో, స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మరొక ఏడాది గడిస్తే ఇక ఎన్నికల హడావుడి మొదలైనట్లే. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా, కుల సమీకరణాల వారీగా క్యాబినెట్‌లోనూ, ఇతర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ అస్మదీయులకు ప్రత్యేకించి పార్టీకి తొలి నుంచి దన్నుగా నిలిచిన వారికి అవకాశాలు కల్పించడం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆనవాయితీగా జరిగే పరిణామమే.

కానీ ఆంధ్రావనిలో సరికొత్త రాజకీయానికి తెర దీయడమే అందునా ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవులు ఇస్తామని ఆశలు చూపి పార్టీలో చేర్చుకున్న వారినే అందలం ఎక్కిస్తున్న తీరు పట్ల తెలుగు తమ్ముళ్లు.. ప్రత్యేకించి మంత్రి పదవిపై సుదీర్ఘ కాలంగా ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు మొండి చేయి చూపుతున్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి.

తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రత్యేకించి రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మల మడుగు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తూ వచ్చిన రామసుబ్బారెడ్డిని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన సీ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి రంగం సిద్దం చేయడంతో కడపలో పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

తొలినుంచి సేవ చేసినా

తొలినుంచి సేవ చేసినా

రాష్ట్ర కేబినెట్ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవిపై ఆశ పెట్టుకున్నవారు తమను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులిస్తుండడంతో వారి ప్రత్యర్థులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునే నిలదీశారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు, అలక వహించిన వారిని బుజ్జగించేందుకు, తాయిలాలతో నచ్చజెప్పేందుకు ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు సీనియర్లను రంగంలోకి దించారు.

గంటా రాయబారం విఫలం

గంటా రాయబారం విఫలం

ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఖరారు చేయడంతో ఆయన ప్రత్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డి తన వర్గంతో విజయవాడ చేరుకున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రామసుబ్బారెడ్డితోపాటు లింగారెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, సతీష్‌రెడ్డి, సుధాకర్‌ యాదవ్, రమేష్‌రెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. రామసుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆదినారాయణరెడ్డి మంత్రయినా పార్టీలో ప్రాధాన్యం ఉండేలా ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎంను ఒప్పిస్తానని గంటా చెప్పినా వారు వినలేదని తెలిసింది.

పార్టీ మారడం ఖాయమన్న రామసుబ్బారెడ్డి

పార్టీ మారడం ఖాయమన్న రామసుబ్బారెడ్డి

నారాయణరెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తే తాను తన వర్గంతో సహా పార్టీ మారిపోతానని ఇందులో ఎలాంటి తేడా ఉండదని రామసుబ్బారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. తొందరపడవద్దని వారించిన గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లగా అక్కడ రామసుబ్బారెడ్డి చంద్రబాబును నిలదీసినట్లు తెలుస్తున్నది. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దని రామ సుబ్బారెడ్డి తొలి నుంచి చెప్తూనే వస్తున్నారు.

అశోకుడి ఆగ్రహం

అశోకుడి ఆగ్రహం

విజయనగరంలో జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సుజయ కృష్ణకు కేబినెట్‌లో చోటు కల్పించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ఆగ్రహిస్తున్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ విస్తరణ విషయమై కనీసం తనను సంప్రదించలేదని.. ప్రత్యేకించి బొబ్బిలి రాజ వంశీయుడిగా పేరొందిన సుజయకృష్ణకు చోటు కల్పించడమేమిటని ఆయన విస్తూ పోతున్నట్లు సమాచారం. సుజయకృష్ణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీసాల గీత, కేవీ నాయుడు, సంధ్యారాణి, జగదీశ్ తదితరులు సీఎం చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సుజయకృష్ణ శైలే భిన్నం

సుజయకృష్ణ శైలే భిన్నం

గమ్మత్తేమిటంటే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన సుజయకృష్ణ తర్వాత వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయనగరం జిల్లా నుంచి కీలక బాధ్యతలు వహిస్తూ వచ్చారు. 2013, 2014లలో ఆయన వ్యవహారశైలి కారణంగానే ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న నాటి అమలాపురం ఎంపి సబ్బం హరి.. జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు కష్ట సాధ్యమని భావించి సబ్బం హరికి వ్యతిరేకంగా సుజయకృష్ణ వ్యవహరించారని సమాచారం. దాని ఫలితంగానే సబ్బంహరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు సాగాయి. దీనికి ప్రతిగా సబ్బం హరి ధీటుగా స్పందించడంతోనే అంతా కామ్ అయిపోయారు.

సబ్బం ప్రకటనతో మారిన విశాఖ ఎన్నికల ఫలితం

సబ్బం ప్రకటనతో మారిన విశాఖ ఎన్నికల ఫలితం

సబ్బం హరి 2014 ఎన్నికలకు ఒకరోజు ముందు చేసిన ప్రకటనతో నాడు విశాఖపట్నంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ అనూహ్య రీతిలో విశాఖ పట్నం లోక్ సభ స్థానంలో ఓటమి పాలయ్యారు. కానీ బొబ్బిలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన సుజయక్రుష్ణ తర్వాత అధికారం కోసం.. పలుకుబడి కోసం తెలుగుదేశం పార్టీకి, సీఎం చంద్రబాబు నాయుడుకు దగ్గరయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ధూళిపాళ్లకూ...

ధూళిపాళ్లకూ...

2004 నుంచి 2014 వరకు పార్టీ కోసం కష్ట పడటంతోపాటు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టిన నేతల్లో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఒకరు. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబుతో పట్టుబట్టినా ప్రయోజనం లేకపోవడంతో ధూళిపాళ్ల నరేంద్ర సీఎం నివాసం నుంచి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి.

 డొక్కా కోసం పని చేయని రాయపాటి రాయబారం

డొక్కా కోసం పని చేయని రాయపాటి రాయబారం

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సైతం తన వర్గీయులను చంద్రబాబుకు వద్దకు పంపి మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని డిమాండ్‌ చేయించినా ఆయన పట్టించుకోలేదు. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్‌ సీఎం వద్దే తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. యరపతినేని శ్రీనివాసరావును సీఎం అంతకు ముందే పిలిచి సర్దిచెప్పారు.

పయ్యావులనూ పట్టించుకోని చంద్రబాబు

పయ్యావులనూ పట్టించుకోని చంద్రబాబు

మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పయ్యావుల కేశవ్‌ తనకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబుకు వద్దకు పంపినా సీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2004 - 14 మధ్య అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా.. తెలంగాణ ఏర్పాటు సమయంలో సమైక్య వాదాన్ని సమర్థవంతంగా వినిపించిన నేతగా పయ్యావుల కేశవ్‌కు పేరుంది. కానీ సమీకరణాల పేరిట ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఉన్న కాలువ శ్రీనివాసులుకు చోటు కల్పించడం గమనార్హం.

శిల్పా అసహనం

శిల్పా అసహనం

వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హతాశులైన మంత్రులు

హతాశులైన మంత్రులు

మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పీతల సుజాతలను పిలిచి ఇక మంత్రివర్గంలోకి చోటు లేదని ముఖ్యమంత్రి పిలిచి చెప్పడంతో వారు హతాశుతులయ్యారు. తమను కొనసాగించాలని కోరినా ఆయన పట్టించుకోలేదు.

జ్యోతులకూ చంద్రబాబు రిక్తహస్తమే

జ్యోతులకూ చంద్రబాబు రిక్తహస్తమే

మంత్రి పదవి హామీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూ, చాంద్‌బాషాలకు మొండిచేయి చూపడంతో వారు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టీడీపీ తమను వాడుకుని వదిలేసిందని వాపోతున్నారు. మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వేటుకూరి శివరామరాజు, షరీఫ్‌ తమను పార్టీ మోసం చేసిందని వాపోయారు.

హామీలతో సరిపెడ్తున్న బాబు

హామీలతో సరిపెడ్తున్న బాబు

శనివారం ఉదయం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్న వారిని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి ఆశావహులను కలుస్తున్నా ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అయితే మంత్రి పదవులు ఖాయమైన వారికి వ్యతిరేకంగా ఉన్న వారితో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి పదవులు ఇవ్వలేని వారికి మంచి కార్పొరేషన్లు ఇస్తానని, అవసరమైతే ఆర్థికంగానూ ఆదుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇస్తున్నట్లు తెలిసింది. అయినా పలువురు తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల టీం పేరిట...

ఎన్నికల టీం పేరిట...

అందరికీ అవకాశాలు రావని.. తనకు ఎన్నికల టీం సిద్దం చేసుకుంటున్నానని చెప్తున్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేబినెట్‌లో ఎలా చోటు కల్పిస్తారని ప్రశ్నించిందీ చంద్రబాబేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. విపక్షాలకు నైతిక విలువలు లేవని పదేపదే ప్రకటించే తెలుగుదేశం పార్టీ అధినేత.. తానే స్వయంగా ఫిరాయింపులకు పాల్పడిన వారిని అందలమెక్కించి తొలి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని నడి సంద్రంలో వదిలేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

English summary
In Andhra Pradesh TeluguDesham Party dissents exploded. Today AP cabinet expanded while some of senior party leaders warned to ditch party if their rivals gets chance in cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X