వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరానికి మోక్షం ఉందా?: అంచనాలు సరే.. కేంద్రం మెలికలు

కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా ఒక కొలిక్కి రానేలేదు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: మూడేళ్ల క్రితం 2014లో తెలంగాణ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా ఒక కొలిక్కి రానేలేదు.

దాని నిర్మాణానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి కాపర్ డ్యామ్ నిర్మిస్తామని, గ్రావిటీని బట్టి కిందకు నీరు విడుదల చేస్తామన్నారు. 2019 జూన్ నాటికి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు కూడా సిద్ధమవుతుందని నమ్మకంగా చెప్పారు. గత ఆరు నెలలుగా మాత్రమే పనులు వేగం పుంజుకున్నాయి. మళ్లీ ప్రస్తుతం వర్షాకాలం రావడంతో నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో కొనసాగించడం వీలు కాదు.

ఇదిలా ఉంటే సందెట్లో సడేమియా అన్నట్లు తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత భారం అవుతుందంటూ దానిపై అంచనా వేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తాజా అనధికార అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.40 వేల కోట్లకు చేరుతుందని అంచనా. దీని ప్రకారం సమీప భవిష్యత్‌లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి క్రుష్ణా డెల్టాతోపాటు ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు సరఫరా అవుతుందా? అన్న సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.

పునరావాసానికి మరో రూ.30 వేలు

పునరావాసానికి మరో రూ.30 వేలు

ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నెమ్మదిగా పని చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ సంస్థకే సత్తా ఉన్నదని ప్రకటించారు మరి. తాజా అనధికారిక అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లతోపాటు పునరావాస పథకం అమలుకు మరో రూ.30 వేల కోట్లు కావాలని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలన్నీ గుత్తేదార్లకు లబ్ధి చేకూర్చేందుకేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లెలా ఖర్చవుతాయని అంచనా వేశారని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందు వల్లే ప్రాజెక్టు నిర్మాణం జాప్యం అవుతున్నదన్న అనుమానం వ్యక్తం చేశారాయన.

మూడు రెట్లు దాటిన అంచనాలు

మూడు రెట్లు దాటిన అంచనాలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి స్పందిస్తోంది. తాము రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్తున్నది. 2011 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే. గత ఆరేళ్లలో అంచనాలు మూడు రెట్లు దాటిపోతే.. ఆ మేరకు నిధుల కేటాయింపులు ఎక్కడ నుంచి వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక 2014 నుంచి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రమారమి రూ.3500 కోట్లు విడుదల చేసింది. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే నిధులు ఖర్చు చేసినందున అంతే స్థాయిలో అదనంగా నిధులు విడుదల చేస్తుందని కేంద్రంపై ఆశలు పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం.

రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందా?

రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విషయమై ఇక్కడ ఒక విషయం పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడే ‘నర్మదా' ప్రాజెక్టు నిర్మాణానికి దశాబ్దాల సమయం పట్టిందీ అదీ కూడా ప్రస్తుత ప్రధాని మోదీ.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే శరవేగంగా సాగింది. కనుక ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా ఎలా పూర్తి చేయాలో మోదీకి తెలిసినంత మరెవ్వరికీ తెలియదంటే అతిశేయోక్తి కాదు. తెలంగాణకు అడ్డమూ కాదు నిలువు కాదంటూనే రాష్ట్ర ఏర్పాటు నినాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరంతోపాటు వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి పనులు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైతే పోలవరం మినహా ఆ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ప్రజల నాడి తెలిసిన నేతలు మాత్రమే సకాలంలో లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటారంటే అతిశేయోక్తి కాదు.

పోలవరం అంటే ఇష్టమేనా?

పోలవరం అంటే ఇష్టమేనా?

1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని.. ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబును కోరినా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈనాడు అనివార్య పరిస్థితుల్లో పోలవరంపై తరుచుగా సమీక్షలు నిర్వహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ ప్రాజెక్టు నిర్మాణం అసలే ఇష్టం లేదని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టారు. తాజాగా దాని పూర్తికి అనుసరిస్తున్న విధి విధానాలు అలాగే కనిపిస్తున్నాయి.

కేంద్రం ప్రసన్నానికి ఏపీ ఎత్తు

కేంద్రం ప్రసన్నానికి ఏపీ ఎత్తు

తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం పోలవరం ప్రాజెక్టు గుత్తేదారు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ అభ్యర్థించడమే కారణమని సదరు జీవోలోనూ పేర్కొన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై శ్రద్ధ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కేంద్రం ఆమోదం కోసమా? అన్నట్లు ఈ కమిటీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, పోలవరం ప్రాజెక్టు సలహాదారు దినేష్‌ ప్రసాద్‌ భార్గవ సభ్యులుగా జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి గుప్తాను రాష్ట్ర అధికారులు నియమించిన కమిటీలో సభ్యుడిని చేయడమూ చర్చనీయాంశమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను రూ.4717 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ చేపట్టింది. 2015లో ఈ పనులకు తాజా ధరలు వర్తింపజేయాలని రాష్ట్రమంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు రూ.5355 కోట్లకు ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలు పెరిగాయి.

ఉన్నతాధికారులతో సీఎం బాబు సమీక్ష

ఉన్నతాధికారులతో సీఎం బాబు సమీక్ష

గత నెల 26న పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌కు- త్రివేణికి మధ్య చెల్లింపులపై సీఎం చంద్రబాబు వద్దే చర్చ జరిగింది. ప్రాజెక్టు అంచనాల్లో లీడ్‌ కింద తమకు ఏడు కిలోమీటర్ల దూరం వస్తోందని, ఆ మేరకు ధరను ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించడం లేదని త్రివేణి సంస్థ ఫిర్యాదు చేసింది. తమకు అంచనాల్లో రెండు కిలోమీటర్లకే లీడ్‌ చెల్లిస్తున్న పరిస్థితుల్లో తాము ఏడు కిలోమీటర్లకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించాలని ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రస్తావించింది.

కాంక్రీటు తదితర పనులకు తాము సమకూర్చిన యంత్ర పరికరాలు చాలా విలువైనవని, వాటిపై తాము ఎంతో మొత్తం చెల్లించామని, వాటి అద్దె స్థాయి మొత్తం కూడా తమకు దక్కడం లేదని ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం తాము వంద మంది శ్రామికులను వినియోగించాల్సిన చోట 300 మంది శ్రామికులను వినియోగించాల్సి వస్తోందని, ఈ ప్రాజెక్టుపై వాస్తవ కోణంలో అంచనాలు రూపొందించలేదని ట్రాన్స్‌ట్రాయ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ రోజు సమావేశం తర్వాత సీఎం ఉన్నతాధికారులతో ఈ అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది.గుత్తేదారు ప్రస్తావించిన అంశాలను పరిశీలించేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తిస్థాయి నివేదిక లభిస్తుందా?

ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తిస్థాయి నివేదిక లభిస్తుందా?

ప్రాజెక్టు స్పిల్‌ వే కాంక్రీటు పనుల్లో జోన్ల మార్పులు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఒక ముఖ్యాంశంగా మారుతుంది. మట్టి తవ్వకం పనులు వివిధ కేటగిరీల్లో పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆ మట్టిని, రాయిని ఎంత దూరం తీసుకువెళ్తున్నారో, ఆ అదనపు దూరానికి ఎంత వ్యయమవుతోందో కూడా లెక్కిస్తుంది. ఇక ప్రాజెక్టు వద్ద కాంక్రీట్ పనుల నిర్మాణానికి తాజా ధరలకు అనుగుణంగా ఎంత ఖర్చవుతుందన్న విషయం కూడా గణిస్తుంది. అదనపు యంత్రాలు, అదనపు వనరులు ఏమేరకు సమీకరించాల్సి వస్తోందో పరిశీలించి ఆ మేరకయ్యే అదనపు వ్యయాన్ని, భారాన్ని లెక్కించి..అదనపు పరిహారం చెల్లింపుల వైనంపై పరిశీలించి ప్రభుత్వానికి కమిటీ నివేదిస్తుంది.

ప్రభుత్వం నేరుగా ప్రాజెక్టు పనుల్లో భాగస్వామ్యం

ప్రభుత్వం నేరుగా ప్రాజెక్టు పనుల్లో భాగస్వామ్యం

ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం పోలవరం క్షేత్రంలో రెండు కిలోమీటర్లకే మట్టి రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తోంది. కాంట్రాక్టు సంస్థలపై భారం పడకుండా, త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలన్న తపన కూడా ఇందులో ఉంది సుమా. అయితే ప్రస్తుతం ఏడు కిలోమీటర్ల వరకే మాత్రమే మట్టి రవాణా ఖర్చులు భరిస్తుంది. ఆ లెక్కన ధర వర్తింపజేస్తే క్యూబిక్‌ మీటరుకు రూ.100 వరకు పెరుగుతుంది. ఇంకా పోలవరంలో 3 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పని మిగిలి ఉంది. ఆ మేరకు రూ.300 కోట్లకు ఆ వ్యయం పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాంక్రీటులో క్యూబిక్‌ మీటరుకు రూ.4500 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ధర రూ.6300 వరకు ఉంది. ఆ మేరకు చెల్లింపులకు ఆస్కారం కల్పించినా ఇంకా 35 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు వేయాలి. ఇది ఇవ్వడానికి సిద్ధమయితే మరో రూ.700 కోట్ల వరకు లెక్క తేలవచ్చని అధికారిక వర్గాల భోగట్టా. ఇతరత్రా పరిశీలన అంశాలు కలిస్తే అంచనాలు వాస్తవ ప్రాతిపదికన ఏ మేరకు పెరగవచ్చో చూడాలి. ఈపీసీ విధానంలో ఇంతవరకు ఇలా వాస్తవ దృక్పథంగా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన తర్వాత పరిశీలన చేపట్టిన పరిస్థితి లేదు.

ఏపీని వెంటాడుతున్న జీఎస్టీ.. రెవెన్యూ లోటు

ఏపీని వెంటాడుతున్న జీఎస్టీ.. రెవెన్యూ లోటు

కమిటీ అంచనా పూర్తయిన తర్వాత దానికి కేంద్రం ఆమోదం లభించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో రెండేళ్ల వరకూ రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రంపై ఆధారపడాల్సిందే. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం అదనపు భారం కూడా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఏ మేరకు పెంచిన అంచనాలకు అనుమతులు లభిస్తాయన్న సంగతి వేచి చూస్తే గానీ తేలదు. ఒకవేళ కేంద్రం నిధులు కోరినంత ఇవ్వడానికి సిద్ధమైతే.. నిపుణులు మరోసారి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించాక గానీ ఆచరణలోకి రాదు. దీని ప్రకారం కోస్తాంధ్ర రైతులకు వరప్రదాయినిగా మారుతుందని పెట్టుకున్న ఆశలు.. ఆకాంక్షలు కొందరికి బంగారు బాతుగా మారుతున్నదా? అన్నఅనుమానాలు విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Former MP Vundavalli Arun Kumar said he was unable to understand as to how the estimated cost of Polavaram project had increased to ₹40,000 crore. Speaking to reporters, he said people of the State had pinned hopes on the Polavaram project and there was a feeling among the public that this crucial project was being neglected by the TDP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X