వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొన్నాల భూమిపై రగడ: ద్వేషం లేదని కేసీఆర్, టీడీపీ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా రాంపూర్‌లో కొన్న భూముల పైన తెలంగాణ శాసన సభలో బుధవారం వాడిగావేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా రాంపూర్ అసైన్డ్ భూముల వ్యవహారంలో సభా సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి మధుసూదనా చారి ప్రకటించారు.

దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 1971లో రాంపూర్‌లో 106 ఎకరాల భూమిని దళితులకు కేటాయించారని, దళితుల భూముల పైన 1987లో పొన్నాల, రామ్మోహన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఆ సమయంలో అసైన్డ్ భూములను కొనవద్దని, అమ్మవద్దని, బదలాయించవద్దని హైకోర్టు తెలిపిందన్నారు.

నిబంధనలను అతిక్రమించి పొన్నాల ఎనిమిది ఎకరాల భూమిని కొన్నారని, దీనికి సంబంధించి నోటీసులు జారీ అయ్యాయని, పొన్నాల పట్ల అప్పటి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్నారు. ఒకే జీవోపై ఏపీఐఐసీకి 75 ఎకరాలు, పొన్నాలకు 8 ఎకరాలు కట్టబెట్టారన్నారు. ఏపీఐఐసీని 12 శాతం వడ్డీ కట్టమన్నారని చెప్పారు. పొన్నాలకు మాత్రం వడ్డీ లేకుండా కట్టబెట్టారన్నారు.

అప్పటి ప్రభుత్వం కబ్జా చేసిన భూమికి చట్టబద్ధత కల్పించిందన్నారు. పొన్నాల అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని, ఎకరాకు రూ.10 లక్షల విలువ చేసే భూములను రూ.25వేలకే కేటాయించారన్నారు. కబ్జాకు గైరన దళితుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కడియం శ్రీహరి సహా దళిత నేతలు ధర్నా చేశారని, పొన్నాలకు కేటాయించిన భూమిని కాగ్ తప్పు పట్టిందన్నారు. అక్రమ భూమిని పొన్నాల సక్రమం చేసుకోవాలనుకున్నారన్నారు.

కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని బీజేపీ, టీడీపీ సూచించింది. పొన్నాల లక్ష్మయ్య దళితుల భూమి ఆక్రమణ పైన ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.

House Committee on Rampur lands in Warangal district

ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు: కేసీఆర్

తనకు ఎవరి పైనా వ్యక్తిగత ద్వేషం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభలో అన్నారు. రాష్ట్రంలో లక్షా 90వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురయిందన్నారు. కోర్టు తీర్పులను కూడా కబ్జాదారులు పట్టించుకోవడం లేదన్నారు. పొన్నాల ఆక్రమించిన అసైన్డ్ భూముల పైన చర్యలు తీసుకుంటామన్నారు. తమకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.

అసైన్డ్ భూముల పైన సభా సంఘం వేస్తామని చెప్పారు. అసైన్డ్, వక్భ్, చర్చి, దేవాదాయ భూముల పైన సభా సంఘం ఉంటుందన్నారు. వచ్చే సమావేశాలలోపు హౌస్ కమిటీకి నివేదిక అందిస్తారన్నారు.

పొన్నాల భూమి కొన్నారు: జానా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఐఐసీ నుండి పొన్నాల భూమిని కొన్నారని, ఆయన పైన పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. అప్పటి ప్రభుత్వమే భూములు కేటాయించిందని చెప్పారు. దళితుల భూములను ఆయన గుంజుకోలేదన్నారు. ఏపీఐఐసీ నిర్ధారించిన ధరకే కొన్నారన్నారు.

దళితులకు పంచాలి: కొండా సురేఖ

పొన్నాల భూములను స్వాధీనం చేసుకొని దళితులకు పంచాలని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు.

పాటలు పాడిన వారికే: డీకె అరుణ

సభలో పాటలు, కవితలు పాడిన వారికే అవకాశాలు ఇస్తున్నారని అంతకుముందు డీకే అరుణ ఎద్దేవా చేశారు. సభను ప్రజాస్వామ్యబద్ధంగా నడపటం లేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. విధి నిర్వహణలో సభాపతి స్వతంత్రంగా వ్యవహరించాలని జీవన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాకు శ్రీకాంత చారి పేరు పెట్టాలన్నారు.

English summary
House Committee on Rampur lands in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X