హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై, టిడిపి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు: కెసిఆర్ ప్రసంగ పాఠం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చూశారు. సోమవారం సాయంత్రం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహబూబ్‌నగర్ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలు తీర్చుకోవాలని, అక్కడి సమస్యలను వదిలేసి ఇక్కడ మాట్లాడుతాడని ఆయన అన్నారు. చంద్రబాబును కిరికిరి నాయుడిగా ఆయన అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గురించి ప్రస్తావిస్తూ అక్కడ అన్నీ మోసాలే అని కెసిఆర్ అన్నారు. "మనకో కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన పక్క రాష్ట్రం సీఎం.. ఛీ పో అన్న పోడట. ఆయనకు రాష్ట్రం, రాజ్యముంది. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా! పొద్దున లేవగానే పుల్లలు పెడుతున్నాడు. చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చే తెలివి ఆయనకు లేదు. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. సగం మందికి కూడా చేయలేదు" అని అన్నాడు.

KCR comments on AP CM Chandrababu

"ఇక్కడ మాత్రం 17వేల కోట్లతో 34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. మేం మాట ఇస్తే తలతెగినా సరే మాటమీద నిలబడతాం. కానీ పక్కరాష్ట్రంలో అన్నీ మోసాలే. అంతా గోల్‌మాల్‌. మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి కేసీఆర్‌ ను నిద్రపోనియ్యను అన్నాడు. అక్కడ దిక్కులేదుకానీ, ఇక్కడ నీళ్లు, కరెంటు ఇస్తానంటున్నాడు. కన్నతల్లికి అన్నంపెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది ఆయన తీరు" అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘అక్కడ పోయి చావుపో... ఇక్కడేముందని!' అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చినంత మంది కూడా టీడీపీ మహబూబ్‌నగర్‌కు సభకు రాలేదని... ఆ మాత్రానికే ఆహా ఓహో అంటున్నారని అన్నారు. ‘‘మూడు, నాలుగు పెంపుడు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అయినా సరే... గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తుంది'' అని వ్యాఖ్యానించారు.

కెసిఆర్ బహిరంగ సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆసాంతం ఆసక్తికరంగా, సామెతలూ నానుడులతో సాగింది. ఆయన ప్రసంగాన్ని ఆయన మాటల్లోనే చదవండి....

నా అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లకు తమ్ముళ్లకు వందనం శుభాభివందనం. మీ అందరికీ హృదయపూర్వకంగా టీఆర్‌ఎస్ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్నాలుగు సంవత్సరాలనాడు జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభమైందీ పోరాటం. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అనేక అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ, భారత రాజకీయ వ్యవస్థనే పూర్తిగా ఒప్పించి, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. అద్భుతంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ప్రజానీకానికి ఈ శుభసందర్భంలో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమరవీరులందరికీ శిరస్సు వంచి, ఉద్యమ జోహార్లు, నీరాజనాలు అర్పిస్తున్నాను.

KCR comments on AP CM Chandrababu

తెలంగాణ విజయం.. ప్రజలకే అంకితం..
మిత్రులారా.. జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించిననాడు కారు చీకట్లు. అనేకమైనటువంటి అపనమ్మకాలు. పరిహాసాలు, జోకులు, మఖలో పట్టింది పబ్బలో పోతుందని ఒకడు, ఆర్నెల్ల తర్వాత అడ్రసే ఉండదని మరొకడు. నానా రకాల అవహేళనలను మనం జూసినం. ఆనాడు నేను తెలంగాణ ప్రజానీకానికి ఒక్కటే మాటజెప్పిన. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర సాధనే నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని బయల్దేరుతున్నా.. ఆరు నూరైనా పిడుగులు పడ్డా, ఏది ఏమైనా సరే లక్ష్యం వీడ.. మార్గం వదల అన్జెప్పిన. ఒకవేళ ఉద్యమపంథా మారిస్తే నా లక్ష్యం నుంచి పక్కకు వైదొలిగితే నన్ను రాళ్లతోని కొట్టి సంపండని చెప్పిన. ఇంటికొక యువకుడిని తోడుగా ఇవ్వండి.. తెలంగాణ రాష్ట్రం సాధించి ఇస్తానని చెప్పిన. ఆనాడు భయంకరమైన ఆత్మహత్యలు. రైతుల ఆత్మహత్యలు. కరెంటు బిల్లు పెంచకూడదని ప్రొటెస్ట్ చేయడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా పట్టపగలు రాజధాని నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో రైతుల మీద కాల్పులు జరిపారు. ఆనాడు తెలంగాణ వలసల తెలంగాణ. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిలాగ మన జీవితాలు మారిపోయినై. అటువంటి దుర్భరమైన పరిస్థితులలో.. భాషకు అవమానం. బతుకుకు అవమానం. మన ప్రగతికి అవరోధం. అన్ని రకాలాగా విషతుల్యంగా పరిణమించిన సమైక్య పాలకుల దుర్మార్గపూరిత, దోపిడీపూరిత పాలనకు వ్యతిరేకంగా.. మా ఆత్మగౌరవం మాకు గావాలి.. మా వనరులు మాకు దక్కాలి.. మా నదుల నీళ్లు మాకు రావాలి..

మా హక్కులు మాకు దక్కాలి.. అనే నినాదంతో ఆనాడు నేనొక్కడినై నినదిస్తే మీరందరుగూడా ఎల్లవేళలా అడుగడుగునా ఆదుకున్నారు. కొన్ని గొప్ప క్షణాలు.. కొన్ని గొప్ప జయాలు.. కొన్ని అపజయాలు.. అన్నింటి మధ్య.. అయిపోయింది.. ఇంకేముంది? టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసినం.. తెలంగాణ భవన్‌నుగూడ కబ్జాచేస్తాం! అనేదాకా మాట్లాడినారు. అటువంటి విపత్కర పరిస్థితులలో ఆనాటి రోశయ్య సర్కార్ హైదరాబాద్‌లో తెలంగాణ బిడ్డలకు కనీసం చెప్రాసి ఉద్యోగం కూడా దొరుకకుండా 14ఎఫ్‌నే సవరించే దుర్మార్గానికి ఒడిగట్టినప్పుడు ఇంక నేను బతికికూడా లాభంలేదనుకుని.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో తేల్చుకుందామని ఆనాడు ఆమరణ నిరాహారదీక్షకు పోయిన. ఆ దీక్ష విరమించే సమయంలో శ్రీకాంతాచారి చనిపోయిండు. దీక్ష విరమించే టైమ్‌లో నేను ఎక్కిఎక్కి ఏడుస్తుంటే నేటి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నన్ను ఆపినారు. అన్నా ఇది సమయం కాదని చెప్పినారు. తమ్ముడూ నేను తెలంగాణ తేగలుగుతాగానీ ఎక్కడినుంచి నా శ్రీకాంతాచారిని తెచ్చుకోగలను అని ఆ ఉద్వేగం ఆపుకోలేక నేను కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చిన. మరో మంత్రి ఈటల రాజేందర్.. అన్నా మనం గుండె దిటవు చేసుకోవాలి.

KCR comments on AP CM Chandrababu

ఆ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుందాం. ముందుకుపోదాం అని చెప్పినారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు చూసినాం. చివరకు నేను కూడా చావు అంచువరకూ వెళ్లి మృత్యువును ముద్దాడే క్షణంలో ఆనాడు కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటనజేసింది. ఆనాడు తెలంగాణ ప్రజలు, విద్యార్థిలోకం బెబ్బులిలా లేసింది. రాష్ట్ర జనజీవితాన్ని స్తంభింపజేసినారు. గల్లీనుంచి ఢిల్లీదాకా తెలంగాణ నినాదం మారుమోగింది. ఆ ప్రకటన వచ్చిన దరిమిలా యావత్ తెలంగాణ ఊపిరిపీల్చుకున్నది. కేసీఆర్ చచ్చిపోలేదు.. తెలంగాణ వచ్చింది! గడ్డకుపడ్డంరా అని సంతోషపడ్డారు. అంతలోనే కొన్ని గుంటనక్కలు కొన్ని మీడియా శక్తులు అందరు కలిసి క్రికెట్ స్కోరు చూపిచ్చినట్లు, సెన్సెక్స్ మార్కెట్ ఫిగర్లు చూపిచ్చినట్లు ఆంధ్రా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తున్నరని కల్పితాలు సృష్టించి.. మళ్లీ ఢిల్లీ తన ప్రకటనను వెనుకకు తీసుకునే కుట్రజేసినారు. ఆ తర్వాత జరిగినటువంటి సకల జనుల సమ్మె, సింగరేణితో సహా యావత్ తెలంగాణ ఉద్యోగుల సమాజం, విద్యార్థి సమాజం, యావత్ ప్రజాసంఘాలు తెలంగాణలో ఉండే అందరుగూడా బరిగీసి ఒక్కవైపు నిల్చున్నరు. 2001లో ఉద్యమానికి వ్యూహరచన చేస్తుంటే ఈనాడు వేదికపై నాతోపాటు ఉన్న ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ సీనియర్ నేత, నాకు అన్నలాంటివారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉద్యమం ఎట్లెట్లపోతుందని అడిగిన్రు. ఈ పద్ధతిల ఉద్యమం పోతదని చెప్తే.. సినిమా చూసినట్లుందన్నారు. కానీ విశ్వాసం కలిగినకొద్దీ.. నేను వినోద్‌కుమార్‌తో చెప్పిన. వినోద్‌కుమార్.. మన చిత్తశుద్ధి, మన కమిట్‌మెంట్, ఆటుపోటులు తట్టుకుని నిలబడితే కచ్చితంగ తెలంగాణ సమాజం ఒకనాటికి ఏకమైతది.

కానీ టైం పడతది. మనకు పట్టుదల అవసరం అని చెప్పిన. బరిగీసి తెలంగాణ అంతా ఒక్కటిగా నిల్చుని అరే..! నా తెలంగాణ అక్కడ పెట్టు! అని తొడగొట్టి, జబ్బజరిసి అడుగుతదని చెప్పిన. ఆ సన్నివేశాన్ని మీరు సృష్టించినారు. నా ఊహ ప్రకారమే మీరందరూ గ్రామగ్రామంలో పులిలా పంజా ఎత్తి.. మా తెలంగాణ మాకు గావాలె.. మా ఉద్యోగాలు మాకు గావాలె.. మా నీళ్లు మాకు గావాలె.. అని బరిగీసి భారత ప్రభుత్వాన్ని, రాజకీయ వ్యవస్థను నిలదీసినారు కాబట్టే ఈ రోజు తెలంగాణ సాకారమైంది. ఒక కేసీఆర్‌గా, ఒక వ్యక్తిగా నేనొక సందేశం చెప్పాను. దాన్ని అందిపుచ్చుకుని మీరందరూ అద్భుతంగా ఎక్కడివాళ్లక్కడే కథానాయకులై విజృంభించి ఉద్యమానికి నాయకత్వం అందించారు. ఈ రోజు తెలంగాణ కలను సాకారం చేసుకున్న ఘనత ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలకే దక్కుతది. ఆ గౌరవం తెలంగాణ ప్రజానీకానిదే. ఆ విజయాన్ని నేను మా తెలంగాణ ప్రజలకు మాత్రమే అంకితం చేస్తున్నా.

మంచినీళ్లతో ప్రజల పాదాలు అభిషేకిస్త..
తెలంగాణ యావత్ పల్లెలలో ఇయాల్టికీ నా అక్కలు చెల్లెళ్లు కుండలు, బిందెలు పట్కొని కిలోమీటర్లదూరం బోవాలె మంచినీళ్లకు. నీళ్ల సీసాలు కొనుక్కోని తాగాలె. ఊరూరికీ అవేంటియో మిషన్లు మోపైనై. లీటరుకింత అని అమ్ముతరు. పోతులూరి వీరబ్రహ్మంగారు రాసిన్రు.. నీళ్లమ్మే కాలంగూడ వస్తదిరా అని! ఇయ్యాల ఆయన్జెప్పిన మాటే నిజమైంది. ఇప్పుడే నా తల్లి పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పింది.. సార్ మీరు మాకు వాటర్‌గ్రిడ్ పెట్టిన్రు.. మేం ఆడబిడ్డలుగా మీకు శాలువా కప్పి సన్మానం చేస్తం అంటే తల్లీ నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత గప్పమని జెప్పిన. ప్రపంచంలో ఏ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు వాగ్దానాలిస్తది. కానీ.. టీఆర్‌ఎస్ స్పెషల్‌కదా..! ఎలక్షన్లయిపోయినంక గవర్నమెంటుగా.. శాసనసభ వేదిక మీద నేను ప్రకటించిన! తెలంగాణలో ప్రతి లంబాడీ తండాలో, ప్రతి గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీలో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా కనెక్షన్ ఇచ్చి.. ఆ మంచినీళ్లతోనే మీ పాదాలు గడుగుతా..! ఇయ్యకపోతే ఓట్లడుగ అని జెప్పిన! ఎప్పుడన్న చరిత్రలో ఉందా? ఏ పార్టీ అన్న ఈ మాట జెప్పిందా! దేశంలోని 29 రాష్ర్టాల్లో ఏ ముఖ్యమంత్రయినా ఈ మాట జెప్తడా? నేన్జెప్పిన! ఆనాడు తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి సంపమని జెప్పిన! ఈనాడు మంచినీళ్లు తేకపోతే ఓట్లు అడుగది టీఆర్‌ఎస్ పార్టీ అని జెప్పిన! ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఇంతమంది నాయకుల భవిష్యత్తు పణంగాపెట్టి చెప్పిన. ఏ పట్టుపట్టినా మొండిపట్టు పట్టాలె.. లేకపోతే పనికాదని చెప్పి.. ఇయ్యాల ఏ పద్ధతిలో మన కరెంటు మంత్రి, కరెంటు అధికారులు 24గంటలు తిప్పలు పడి.. మీకు కరెంటు అందిస్తా ఉన్నరో అదే పద్ధతులలో రేపు మొత్తం మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరుగూడా కచ్చితంగా మంచినీళ్లు తెచ్చి ఆ మంచినీళ్లతో మా ప్రజల పాదాలు కడిగి.. అభిషేకిస్తాం..

త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ.. రెండు బెడ్‌రూమ్‌ల ఇండ్లు చేయాల్సినవి ఇంక చాలా కార్యక్రమాలున్నయి. ఇప్పుడిప్పుడే గవర్నమెంటు తేటపడ్డది. కార్యక్రమాలు మొదలుపెట్టినం. ఒక నాలుగైదు కార్యక్రమాలకు ప్రజలు ఎదురుచూస్తున్నరని నాకు తెలుసు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, అంతులేని అవినీతి, విపరీతమైన అక్రమాల వల్ల.. ఏ విధంగా జేయాలన్న బాధతోని ఇన్నిరోజలు దానికి ఆలస్యం జేసినం! ఇప్పుడు ప్రణాళిక రూపకల్పన జరిగింది. రెండు బెడ్‌రూమ్‌ల ఇండ్లు కట్టిస్తానని చెప్పిన.. మే నెల నుంచే రెండు బెడ్‌రూమ్‌ల ఇండ్లు పేదలకు కట్టించే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. ప్రభుత్వమే ఇండ్లు కట్టి.. పేదలకప్పగిస్తుంది. మా కాంట్రాక్టు ఉద్యోగ సోదరులందరూ సీఎంగారు జెప్పిన్రు.. మాకింకా అమలైతలేదని అనుకుంటున్నరు! వందశాతం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తం. త్వరలోనే ఆదేశాలు కూడా జారీ చేస్తాం. బెంగపడొద్దు. నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు రావాలని అనుకుంటున్నరు. వందశాతం రావాలి. మీకు ఉద్యోగాలు వచ్చితీరుతయి. ఒక్క జెన్‌కోలోనే 24వేల మెగావాట్ల పవర్‌కు రూ.91వేల కోట్లతో శ్రీకారం చుట్టినం! అక్కడ్నే 20 నుంచి 25వేల ఉద్యోగాలు రాబోతున్నయి! ప్రభుత్వంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ ఆలస్యం చేస్తున్నది. అది అయిన మరుక్షణమే కచ్చితంగా ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. ఎందుకంటే పరాయివాళ్లున్నరు.. మనవాళ్లున్నరు! మళ్ల రెగ్యులరైజ్ చేస్తే వాళ్లకియ్యాలి.. ఇయ్యకపోతే వారు కోర్టులకుబోతరు! న్యాయపరమైన చిక్కులు ఉన్నయి.

నిరుద్యోగ మిత్రులు అర్థంచేసుకోవాలి. ఆ ఖాళీలన్నీ ఏర్పడితే మీకు అన్నం పెట్టాలన్నదే నా ఆలోచన. కొద్దిపాటి ఆలస్యానికి ఎవరో ఏదో తప్పుదారిపట్టిస్తే.. పట్టొద్దు! కచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక లక్ష మందికి మన ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తాం. మరొక్క మంచి కార్యక్రమం కూడా ఆచరణలో ఉంది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన మన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిగారు ఇప్పుడు విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో లెక్చరర్‌గా కూడా పనిచేసినారు. విద్యావేత్త! కేజీ టూ పీజీ పథకం ఆషామాషీగాజెయ్యలేం. కేజీ టూ పీజీ విద్య నాకున్న పెద్ద కల. కులం మతం లేకుండా అందరూ ఒకటే పాఠశాలలో.. ఒకటే యూనిఫారం వేసుకుని ఒకటే సిలబస్‌లో చదువుకోవాలనే ఆకాంక్ష! దాంతో ఈ కులమతాల అంతరం కూడా తీరాలనే కోరిక ఉంది. వచ్చే సంవత్సరం ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం.

కిరికిరి నాయుడు.. అంతా మీడియా మేనేజ్‌మెంటే
చాలా ముఖ్య కార్యక్రమం ఇంకొకటి ఉంది. ఆనాడు పాటలు నేనేరాసిన! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలె.. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగంగావాలె.. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె! పక్క రాష్ట్ర సీఎం కిరికిరి నాయుడు ఉన్నడు. ఆయన ఛీ పో అన్నా.. పోడంట! ఆయనకో రాష్ట్రముంది.. రాజ్యముంది.. ఆడ చాలా సమస్యలున్నయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా! పొద్దున లేస్తే ఓ పుల్ల పెడతడు ఈడ! ఆడ దిక్కులేదుగానీ.. చెప్పిన వాగ్దానాలు అమలు చేసే తెలివిలేదుగానీ!! మీ మొత్తం రుణాలు మాఫీ చేస్తనని అక్కడ డ్వాక్రా మహిళలకు చెప్పిండు.. సబ్బు పెట్టిండు. రైతులకు అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తనన్నడు! గోల్‌మాల్ చేసి సగం మందికి కూడ చేస్తలేడు. కానీ తెలంగాణ రాష్ట్రంల రూ.17వేల కోట్లతో 34 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తనన్నం.

చిత్తశుద్ధితో బాజాప్తా అమలు చేస్తున్నం! వనరులు ఉన్నా, లేకున్నా.. మాట ఇచ్చినమంటే తల తెగిపడ్డా సరే.. వెనకకు పోవద్దు కాబట్టి.. వంద శాతం చేసి తీరుతున్నం! పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలే! అబద్ధాలే! మీడియా మేనేజ్‌మెంట్ తప్ప వాస్తవంగా ప్రజా సంక్షేమం చేయరు. కానీ నేనేదో ఉద్ధరిస్త అని ఆయన మొన్న వచ్చి మహబూబ్‌నగర్‌ల నాకేదో చెప్తున్నడు. కేసీఆర్.. నిన్ను నిద్ర పోనియ్య! అని అంటడు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తనన్నడంట! నీ రాష్ట్రంల దిక్కులేదుగానీ.. ఇక్కడొచ్చి నిన్ను నిద్రపోనియ్య, నన్ను నిద్రపోనియ్య! ఆ ఆంధ్రకుపోయి.. ప్రజలెమ్మటి పడి సావుపో! ఇక్కడేముంది నాకు తెల్వక అడుగుత! మొన్న మహబూబ్‌నగర్ పోయి ఆడ పాములాట దుకాణం పెట్టిండు. మన మీటింగ్‌ల బఠాణీలు అమ్ముకునేంత మంది కూడ అక్కడికి రాలేదు. ఆ మందికే ఆహా.. ఓహో.. మా అంత సిపాయిలు లేరని! ఓ మూడు, నాలుగు పెంపుడు కుక్కల్ని పెట్టుకున్నడు. ఆ కుక్కలు ఇష్టం వచ్చినట్లు మొరుగుతా.. ఉంటయి. నాతోని కొందరన్నరు.. అవి మొరుగుతున్నయని భయపడకు కేసీఆర్... గాడిదలుంటేనే గుర్రం విలువ తెలుస్తదని అన్నరు. మరి గుర్రమేందో, గాడిదేందో ఎట్ల తెల్వాలె? అందుకె గాడిదలను పట్టుకునే అక్కర లేదు.

కొద్దిరోజుల్లోనే పాలమూరు, నక్కలగండి శంకుస్థాపనలు..
దక్షిణ తెలంగాణల తిరిగిన్నాడు ప్రజలకు చెప్పిన! ఇది తెలంగాణ గడ్డ.. ఇది తెలంగాణ రాష్ట్రం.. ఎవడు అడ్డం వస్తడో చూస్త.. ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుని ప్రాజెక్టులు కట్టిస్తనన్న. రాబోయే కొన్నిరోజుల్లోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబోతున్నం. నల్లగొండ జిల్లాలో నక్కలగండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబోతున్నం. నాకు గోల్‌మాల్ చేసుడురాదు. ఏదైనా అనుకున్నంటె వజ్ర సంకల్పంతో అడుగేస్తా. బ్రహ్మాండంగా సాధించి తీరుతా. అది నాకున్న ధీర గుణం! ఏదో అబద్ధాలు చెప్పి, చక్కిలిగింతలు పెట్టి, మోచేతికి బెల్లం పెట్టి అరచేయి నాకమనే రకం కాదు. చెప్పినమంటే అది జరిగి తీరాలి! ఇక్కడికి వచ్చే అర్ధగంట ముందే పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి పథకం మీద సమీక్ష చేసిన. మా ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి అన్నరు.. అన్నా ఈరోజు కూడా దుకాణం ముందు పెట్టుకున్నరా అని! పాలమూరు, నక్కలగండి మీద మాట్లాడి.. ఆ మీటింగ్‌నుంచి ఈ మీటింగ్‌కు వచ్చిన. ఇటు పాలమూరు పథకంతో ఆరు నూరైనా.. పాలమూరు పచ్చబడాలి. కల్వకుర్తి పథకంలో అరకొర కాల్వలు తవ్విండ్రు. కాల్వలు వెడల్పు చేయాలె. ఉన్న రిజర్వాయర్లు తీసేసిండ్రు. కొత్త రిజర్వాయర్లు కట్టాలె. కడుపు నిండ నీళ్లు రావాలె. ప్రాణహిత-చేవెళ్ల కింద ఆంధ్రోళ్ల మాయ..! తెలంగాణ ప్రాజెక్టు అంటె ఒక అంతర్రాష్ట్ర జలవివాదం పెట్టాలె.. మాయ చేయాలె.

ఉన్నదా సంతోషం! దాన్ని కఠినం చేయి, జఠిలం చేయి.. లేదంటే ఇంటర్‌స్టేట్ డిస్పూట్ పెట్టు! మెడకు పెడితె కాళ్లకు, కాళ్లకు పెడితె మెడకు! మన కళ్లముందు కనిపిస్తున్న సాక్ష్యం.. సమైక్యాంధ్ర పాలనలో దుర్నీతికి సాక్ష్యం.. ఎస్సెల్బీసీ. ఎన్నేళ్లు తవ్వాలి? ఆ సొరంగం ఎన్నటికి పూర్తి కావాలె? మనకు కొబ్బరి కాయ కొట్టాలి, ఆంధ్రకు ప్రాజెక్టులు పెట్టుకోవాలె. దానికి తెలంగాణ సన్నాసులు డబ్బాలు కొట్టాలె. కానీ ఇప్పుడు ఆ మోసం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తి కావాలి. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ప్రతి నియోజకవర్గానికి లక్ష చొప్పున 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పూచీ నాది. ఉత్తర తెలంగాణలో కామారెడ్డినుంచి ఎల్లారెడ్డి, రామాయంపేట, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, భువనగిరి, ఆలేరు, జనగాం, స్టేషన్‌ఘనపూర్ దాకా కరువుకు సజీవ సాక్ష్యాలుగ ఉన్నయి. కరీంనగర్‌ల మిగిలిన ప్రాంతాలు పారాలె. పెన్‌గంగతో ఆదిలాబాద్ పారాలె. ఎస్సారెస్పీ, నిజామాబాద్‌ల లెండి పూర్తి కావాలె. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చాకులా పని చేస్తున్నడు. ఇవన్నీ అయ్యే వరకు విశ్రమించం. రాజీలేని పోరాటం చేస్తం.

సంక్షేమంలో దేశంలోనే మనమే నంబర్ వన్
ప్రజలు కోరని కార్యక్రమాలు కూడా చేపడ్తున్నం. షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలను ఏ ప్రజలూ నన్ను అడగలె. ఎవలు ధర్నాల్జెయ్యలె. ఏనాడూ ఏ ప్రభుత్వంకూడా బీడీ కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన జేయలేదు. ఈరోజు ఆలోచన చేసి.. వారిని ఆదుకుంటున్నాం! 200 పెన్షన్లను వెయ్యిరూపాయలకు తీస్కొని పోయినం. సంతోషంగ ఉన్నరు! అత్తల్ని ఎల్లగొట్టే కోడళ్లు మళ్ల అత్తల్ని తెచ్చుకుంటున్నరు.. ముసల్దానికి పైసలొత్తయని! మా పేద తల్లులు వాళ్ల కళ్లల్లో ఆనందం ఉన్నది. మా బీడీ కార్మిక చెల్లెళ్లు.. అక్కల కళ్లల్లో ఆనందం ఉన్నది. వికలాంగులైన బిడ్డలకు ఐదు వందలకు మించి ఏ గవర్నమెంటూ ఇయ్యలే. మన గవర్నమెంటు 1500 పెన్షనిచ్చి ఆదుకుంటున్నది. ప్రజా సంక్షేమ రంగంలో పేద ప్రజలకు మేలు చేసే సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్టాల్లో మనమే నంబర్‌వన్.

అవాకులు చవాకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుల్లారా.. మీకు ఎవలకు దమ్ముంటే వాళ్లు రాండ్రి.. ఏ వీధి చౌరస్తాలోనైనా మాట్లాడటానికి సిద్ధం! సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భారతదేశంలోనే ఇయాల నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ! పేదల పెన్షన్ల కోసం, హాస్టళ్ల సన్న బియ్యం కోసం, అంగన్‌వాడీ జీతాలకోసం, అంగన్‌వాడీల్లో పెట్టే పోషకాహారంకోసం సంవత్సరానికి 28వేల కోట్లు ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదీ లేదు! నేను ఆనాడు చెప్పిన! ఊళ్లల్ల ఇయ్యాల చర్చ జరుగుతున్నది.. ఎక్కడికెల్లొత్తన్నయిరా ఈ పైసలన్నీ!! ఆనాడు నేన్జెప్పలే! మన పైస.. మన సొమ్ము.. ఆంధ్రకుబోతున్నది! తెలంగాణైతే మన డబ్బు మన దగ్గర్నే ఖర్చయితుంది అని చెప్పిన! నేనెక్కడ్నో దొంగతనం చేసి తెత్తలేను. మన డబ్బే.. మన బడ్జెటే ఇయ్యాల మన తెలంగాణకు ఖర్చు పెట్టుకుంటున్నం. మన పిల్లల్ని సాదుకోగలుగుతున్నాం. మన ప్రజలను ఆదుకోగలుగుతున్నాం.

KCR comments on AP CM Chandrababu

24 గంటలు పనిచేస్తాం..

చివరకు ఒకటే మాట... హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేసినమన్నరు. తాగే మంచినీళ్లు లేవు. వానపడితే కార్లు పడవలయితయి. సరైన మార్కెట్లు లేవు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లయితన్నయి. భయంకరమైన పరిస్థితులున్నయి. మన నగరం మన గుండెకాయ. ఇది విశ్వనగరంగా రూపుదాల్చాలె. రాబోయే రెండు మూడేండ్లలో అమెరికాలోని డల్లాస్‌ను, సింగపూర్, జపాన్‌లను తలదన్నే పద్ధతుల్లో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతానని జంట నగరాల ప్రజలకు శుభసందేశాన్ని ఇస్తున్నా. మీరు నా వెంట నడవండి.. కేసీఆర్ మాట అన్నడంటె తప్పడు. జంట నగరాలను అంతర్జాతీయ నగరాలకు తీసిపోని రీతిలో రాబోయే మూడు, మూడున్నరేండ్లల అందిస్తా. నాకు ఒకటే లక్ష్యం. ఇప్పటికే మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన. ఈ జీవితానికి ఆ స్ఫూర్తి, ఆ గౌరవం చాలు. కానీ తెచ్చిన తెలంగాణ గుంట నక్కల పాలు కావద్దు! ఈనగాచి నక్కల పాలుకావద్దు! బంగారు తెలంగాణ కావాలి.. బడుగు బలహీనవర్గాల జీవితాలు బాగు పడాలె. రైతన్నలు సుఖంగ ఉండాలె, యువతకు ఉద్యోగాలు రావాలె. అందరు చిరునవ్వులతోని ఉండే తెలంగాణ కావాలి. అప్పటివరకు విశ్రమించను. నాకు వేరే పనిలేదు. దీనికోసమే 24గంటలూ పనిచేస్తాను. మీ కల సాకారం చేస్తాను.

మిషన్ కాకతీయతో వలస పాపాన్ని తోడుతున్నం..

మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇరిగేషన్ మంత్రి హరీశ్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నరు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏడ దొరుకుతరంటే చెర్లకాడికి పోండి ఆడ దొరుకుతరు అని ఈ రోజు తెలంగాణలో ఒక జోకు చెప్తున్నరు. ఏ మంత్రి.. ఏ ఎమ్మెల్యే జూసినా.. తట్టలు మోసుకుంట మిషన్ కాకతీయలో పాల్గొంటున్నరు. ఏ కాకతీయ, రెడ్డి రాజులైతే మనకు అన్నంపెట్టిన్రో.. వాళ్లకుదండంపెట్టి.. వాళ్లదే పేరుపెట్టి.. ఈ రోజు చెరువులలో కూరుకుపోయిన వలస పాలన పాపాన్ని వదలగొడుతున్నం. చెరువులో మనం తవ్వుతున్నది మట్టికాదు! 60 ఏండ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో.. సమైక్య పాలనలో.. వలస ముష్కరుల పాలనలో మన గుండెల మీద పేరుకుపోయిన పాపం! ఆ పాపాన్ని మనం ఎత్తేస్తా ఉన్నాం! ఆ చెరువులన్నీ ప్రక్షాళన కావడం ఖాయం. మళ్ల ఊటలు జాళ్లు పెట్టడం ఖాయం. జాలు పొలాలు పండటం ఖాయం! ఆ తెలంగాణనే మనం కోరుకున్నం. ఆ తెలంగాణ తెచ్చిస్తం!

ఇది చేతల సమయం..

తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకోకముందు చాలా విషయాలు! మొన్న ప్రతినిధుల సభలో మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టు ఉండేది. చాల చప్పగున్నదిరా అని ఒకడన్నడు. ఏం గట్టిగజెప్పకపాయె అని ఇంకొకడన్నడు. అప్పుడు చెప్పిన సమయం వేరు. ఇప్పుడు చేసే సమయం. ఇప్పుడు మాటలుగాదు.. చేతలు గావాలె. బంగారు తెలంగాణ లక్ష్యంగావాలె. ఆనాటి స్వప్నం, లక్ష్యం తెలంగాణ రాష్ట్రంగావాలె. నేటి మన స్వప్నం బంగారు తెలంగాణ గావాలె. నేను చాలా సందర్భాల్ల ప్రకటించిన.. తెలంగాణల 80% దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలే ఉన్నరు! ఇందులో చాలామంది పేదవాళ్లున్నరు. ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు... బతుకు ఆగమై వలసపోయే వాళ్లు ఈ వర్గంనుంచే ఎక్కువగా ఉన్నరు. ఈ వర్గం కళ్లల్లో వెలుతురు వచ్చిన్నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఈ వర్గం సంతోషంగా ఉన్ననాడే తెచ్చుకున్న తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే పత్తులాల బంగారంజేసి తెలంగాణ జేసి చూపియొచ్చు. అది కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మొఖం బంగారు నాణెంలా వెలిగితేనె అదే నిజమైన బంగారు తెలంగాణ. ఈ రోజు నాకున్న లక్ష్యం, నాకున్న స్వప్నం.. నా వెంట ఉన్న మొత్తం టీమ్ లక్ష్యం.. అది తప్పవేరేది లేదు.

వచ్చే మార్చి తర్వాత రైతులకు పగటిపూట కరెంటు
గతంలో చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను జూసినం. ఓట్లకోసం ఆకాశంలో జాబిల్లిని చూపించి, ఎలక్షన్ల తర్వాత చాలా చౌకబారుగా మాట ఫిరాయించిన నాయకులను, ప్రభుత్వాలను జూసినం. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఏ ప్రతిజ్ఞ చేసిందో, ప్రణాళికలో ఏం చెప్పిందో తూ.చ. తప్పకుండా అమలుజేసి చూపిస్తున్నం. ఆనాడు సభలల్లో నేను చెప్పిన. నేనింక ఎంతజెప్పాలె.. ప్రజలారా మీరింక మేల్కుంటలేరు.. మీకు అర్థమైతలేదు.. అని చెప్పిన. ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నయి జెండాలెన్నొ.. తెలంగాణకు సంభవించిన రాజకీయ గండాలెన్నొ అని నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడు బాధ మీద పాటలు నేనే రాసిన. ఆ రోజు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు తెలంగాణను వ్యతిరేకించుకుంటూ పోయినయి. చాలా జిల్లాలలో మీరంతా నా ఉపన్యాసం విన్నరు.

కరెంటు స్తంభానికి మూడు తీగెలుంటాయి.. ఒక తీగకు టీడీపీ జెండా.. ఇంకో తీగెకు కాంగ్రెస్ జండా.. ఇంకో తీగెకు సీపీఐ, సీపీఎం జెండా కట్టుండ్రి.. ఫుల్లు కరెంటు వస్తుంది.. అని ఆ రోజు చెప్పిన. మీరందరు నవ్వి సప్పట్లు కొట్టినరు. కానీ ఎలక్షన్ల ఆ జెండాలు పక్కనపెట్టి.. మూడు తీగలకు టీఆర్‌ఎస్ జెండాలే కట్టి.. టీఆర్‌ఎస్ గవర్నమెంటును ఏర్పాటు చేసిండ్రు. అందుకే ఇయ్యాల మూడు తీగెలనిండా మా రైతన్నలకు ఫుల్లుగా కరెంటు వస్తున్నది. (సభికులనుద్దేశించి.. కరెంటు వస్తున్నదా అన్నా.. అనగానే... వస్తున్నదంటూ చేతులు పైకెత్తి నినదించారు). వచ్చే మార్చి తర్వాత తెలంగాణలో వ్యవసాయానికి పొద్దటిపూట ఉదయం 6గంటల నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకూ 9గంటల కరెంటు ఏకధాటిగా వస్తది. ఇది కేసీఆర్ మాట. ఇగ చీకట్ల పొలంకాడికి పోవుడు లేదు. ఆటోస్టార్టర్లు అవసరం లేదు. పాములు తేళ్లు కరిచి సచ్చిపోవుడు లేదు.. ఆరునూరైనా సరే.. తల తాకట్టుపెట్టయినా సరే.. పొద్దటిపూట కరెంటు తెచ్చిచ్చే బాధ్యత నాది.

నేపాల్‌ను ఆదుకుంటాం

పొరుగు దేశం నేపాల్‌లో జరిగిన ఘోరకలికి అనేక వందలమంది చనిపోయినట్లు, యావత్ బీభత్సం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల పక్షాన, ప్రజా ప్రతినిధులందరి పక్షాన నేపాల్ ప్రజానీకానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి సహాయ చర్యలనైనా చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా కార్యక్రమం చేయాల్సి ఉంటే రేపు భారత ప్రభుత్వంతో మాట్లాడుతాను. నేపాల్‌కు తరలి వెళ్లడానికి కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రభుత్వ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.

అంతా క్షేమంగా ఇండ్లకు వెళ్లండి

మీరందరూ ఈ రోజు లక్షలాదిగా తరలివచ్చినారు.. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న. సభను జయప్రదం చేశారు. సంతోషం! టీఆర్‌ఎస్ అంటే ఏందో తెలంగాణ ప్రజల ఐక్యత ఏందో మరొక్కసారి రుజువుచేసి చూపిచ్చినారు. అందరూ క్షేమంగా సురక్షితంగా ఇండ్లకు తరలి వెళ్లండి. నాయకులు జాగ్రత్తలు తీసుకోండి.

English summary
Telangana CM and Telangana Rastra samithi (TRS) president K Chandrasekhar Rao made comments against Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X