వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య?: ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్, బాబుకు కష్టమేనా?

అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నేత, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నేత, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఈ ప్రతిపాదనను స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర మంత్రి ముందు పెట్టినట్లు తెలిసింది.

దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపికచేయాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడమే వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడానికి కారణమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. వెంకయ్యనాయుడు మాత్రం ఈ పోటీకి అంత సుముఖత వ్యక్తం చేయలేదని విశ్వసనీయ వర్గాల భోగట్టా. క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగాలని ఆయన భావిస్తున్నా.. ప్రధాని నిర్ణయాధికారం మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని కమలనాథులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే తనకు బదులు ఉప రాష్ట్రపతి పదవికి రామ్‌నాయక్‌ అయితే బాగుంటుందని, ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై విశేష రాజకీయ అనుభవం ఉన్న ఆయన అన్ని విధాలా సరిపోతారని వెంకయ్య పేర్కొన్నట్లు తెలిసింది. దక్షిణాది నుంచి అయితే కేరళకు చెందిన మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఓరాజగోపాల్‌, తమిళనాడు ఎంపీ ఎల్‌.గణేశన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పేర్లను పరిగణనలో తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అంతా ఊహించినట్లు వెంకయ్యనాయుడు పేరును ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోనున్నాయి.

ఊహాగానాలను ఖండించిన కేంద్ర మంత్రి వెంకయ్య

ఊహాగానాలను ఖండించిన కేంద్ర మంత్రి వెంకయ్య

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వెంకయ్య నాయుడును సీనియర్ నేతగా గౌరవిస్తూనే బీజేపీ అధిష్ఠానం ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టాలని భావిస్తున్నది. దీనివల్ల రోజువారీ రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం వీలు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉపరాష్ట్రపతి పదవికి తన పేరు ఖరారైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధ్రువీకరించలేదు. పార్టీ అధికారిక ప్రకటన వెలువరించేవరకూ ఊహాజనితంగా పేర్లను ప్రసారం చేయడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నత రాజ్యాంగబద్ధ పదవి విషయంలో ఊహాజనిత వార్తలు ప్రసారం చేయడం ఉచితం కాదని వ్యాఖ్యానించారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
ఐదేళ్ల ప్రత్యేక హోదా స్థానే ఇలా ప్యాకేజీ

ఐదేళ్ల ప్రత్యేక హోదా స్థానే ఇలా ప్యాకేజీ

తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో 2014లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటెలా తీరుస్తారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసేందుకు సిద్ధం కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌లోని ఏదేని సభలో ప్రధాని ప్రకటన చేయడం అంటే ప్రభుత్వ విధాన ప్రకటనే. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా దాన్ని పక్కకు నెట్టివేసి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టింది. అది వేరే సంగతి.

కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి ఇలా ఎపీ నేతలు

కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి ఇలా ఎపీ నేతలు

తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో 2014లో రాజ్యసభలో అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు బెట్టిన వెంకయ్యనాయుడు తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా పదేళ్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ అంతటా ఊరూ వాడా ప్రచారం గావించారు. మరోవైపు ఏపీలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా మంది బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. బీజేపీలో చేరిన వారిలో కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో డొక్కా మాణిక్య వరప్రసాద్, టీజీ వెంకటేశ్, జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పొలుసు పార్థసారథి తదితరులు చేరిపోయారు.

ఏపీలోనూ బలోపేతానికి కమలనాథుల చొరవ

ఏపీలోనూ బలోపేతానికి కమలనాథుల చొరవ

గతంతో పోలిస్తే బీజేపీ దేశవ్యాప్తంగా దూకుడుగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుసరిస్తున్న వ్యూహం అందరినీ ఆకర్షింపజేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తున్న వెంకయ్యనాయుడును కాదని ముందుకు వెళ్లాలంటే ఒకింత కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైతే.. ఏపీ రాజకీయాల్లో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. మిత్రపక్షమైనా టీడీపీపై బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టు సాధించేందుకు... అవసరమైతే ఒంటరి పోరుకైనా సిద్ధంగా పార్టీ శ్రేణులను నడిపించేందుకు అవకాశాలు లభిస్తాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు నోరు మెదపడం లేదు. కానీ తొలి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నేతలు మాత్రం తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు.

క్రియా శీల రాజకీయాలకు ఇలా సెలవు

క్రియా శీల రాజకీయాలకు ఇలా సెలవు

అధికారికంగా బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయకముందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా గంగవెర్రులెత్తుతున్నది. ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనతో వార్తాకథనం ప్రచురించింది. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దన్నుగా నిలిచి ఆదుకున్నారని ఆ వార్తాకథనం సారాంశం. ఒక కేంద్ర మంత్రి అంటే యావత్ భారత్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న సంగతి ఆ పత్రిక వార్తాకథనం విస్మరించడం గమనార్హం. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించలేరని టీడీపీకి చెందిన ఎపీ మంత్రులు, ఎంపీలు ఆందోళన చెందుతున్నారు. ‘ఏ సమస్యపై ఢిల్లీ వెళ్లినా ఆయన ఒక పెద్ద అండగా ఉండి సహాయపడేవారు. మమ్మల్ని కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లేవారు. లేదంటే వారినే పిలిపించి మాట్లాడేవారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సమస్య పరిష్కారం కావడంలో ఆయన పాత్ర ఉంది. ఉప రాష్ట్రపతి అయితే ఆయన ఇంత క్రియాశీలంగా ఉండలేరు. అందరి వద్దకూ రాలేరు. ఆ హోదాలో ఒక రాష్ట్రం కోసం ప్రయత్నించడం ఆయనకూ ఇబ్బంది అవుతుంది' అని ఒక ఎంపీ అభిప్రాయపడ్డారని ఆ పత్రిక తెలిపింది.

వెంకయ్య తప్పుకుంటే ఏపీకి శూన్యమేనా..

వెంకయ్య తప్పుకుంటే ఏపీకి శూన్యమేనా..

కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకునేందుకు వెళ్లే ఏపీ మంత్రులు, ఎంపీలకు ఒక సీనియర్ నేతగా.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నీ తానై వ్యవహరిస్తూ చొరవ తీసుకుని ఇతర కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. ఆయన సీనియారిటీ రీత్యా మిగిలిన మంత్రులు ఆయన చెప్పినప్పుడు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంకయ్యతో మాట్లాడుతున్నారు. నిధుల విడుదల తదితర అంశాల్లో ఆయన సాయం కోరుతున్నారు. ‘విభజన చట్టం, ప్రత్యేక సాయం కింద చేసిన ప్రకటనల ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం రావలసి ఉంది. కానీ కేంద్రం దృష్టిలో దేశంలోని 29 రాష్ట్రాల్లో నవ్యాంధ్ర కూడా ఒకటి. ప్రతి రాష్ట్రం నిత్యం కేంద్ర సాయం కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. మిత్రపక్షమైనా టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అంత ఒత్తిడి తేలేరు. వారికుండే పరిమితులు వారికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కోణంలో మూడేళ్లుగా వెంకయ్య రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతున్నారు. ఆయన లేకపోతే పెద్ద శూన్యం ఏర్పడినట్లే' అని ఒక సీనియర్‌ టీడీపీ ఎంపీ విశ్లేషించారని ఆ దిన పత్రిక ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది.

పునర్వవ్యస్థీకరణ హామీలన్నీ అమలు

పునర్వవ్యస్థీకరణ హామీలన్నీ అమలు

ఒక కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. స్మార్ట్ సిటీల రూపకల్పనలో గాని, అమ్రుత్ పట్టణాల ప్రకటనలో కావచ్చు.. వివిధ కేంద్ర పథకాల అమలులో గానీ ఏపీ పట్ల అనుకూల ముద్ర స్పష్టంగా కాన వస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటిలో దాదాపు మొత్తం పూర్తిచేశారంటే అది ఆయన చొరవ వల్లే.. అదే సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు సంగతే పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించలేదని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. తెలంగాణకు ఇనుము - ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంతోపాటు గిరిజన విశ్వ విద్యాలయం ఊసే లేదు. ఇంకా పలు హామీలు హామీలుగానే నిలిచిపోయాయి. ప్రత్యేకించి రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన జోలికే ఆయన వెళ్లలేదు. ఇక కేంద్ర పట్టణాభివ్రుద్ధి, గ్రుహ నిర్మాణశాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమీ 1.87 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే.. తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత సుమారు 20 వేల ఇండ్లు మంజూరయ్యాయి. కనుక వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఇలా ఒక రాష్ట్రానికి మేలు చేసే వారు ఉండే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకే మద్దతు

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకే మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం చాలా సులభం కానుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లోని మొత్తం 787 మంది సభ్యుల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్డీఏకి 527 మంది సభ్యుల బలం ఉంది. ఒక్క ఎన్డీఏ కూటమికే 426 మంది సభ్యుల బలం ఉన్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, పీఎంకే, ఏఐఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌లాంటి పార్టీల మద్దతు పరిగణనలో తీసుకుంటే మరో 101 జత కలవనున్నాయి.

యూపీఏ అభ్యర్థిగా గోపాలక్రుష్ణ గాంధీ

యూపీఏ అభ్యర్థిగా గోపాలక్రుష్ణ గాంధీ

వివిధ కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ అధిష్ఠానం మాత్రం వెంకయ్య వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభకు ఛైర్మన్‌గా ఉప రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి వెంకయ్యనాయుడు లాంటి వారే సరితూగుతారని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అమిత్‌షా పార్టీ అభిప్రాయాన్ని చెప్పినా వెంకయ్యనాయుడు మాత్రం ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల సమాచారం. సోమవారం సాయంత్రం జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను ప్రధాని ముందు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. తాను క్రియాశీలక రాజకీయాల్లో ఎందుకు ఉండాలనుకుంటున్నదీ ప్రధానమంత్రికి వివరించి తుది నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయన అభిప్రాయంతో ప్రధాని ఏకీభవిస్తే సరే... లేదు మీరే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని కోరితే మాత్రం ఒప్పుకోక తప్పదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థిత్వం ఖరారైతే మంగళవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆయనతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలక్రుష్ణ గాంధీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ కూటమి తరఫున తలపడనున్నారు.

English summary
New Delhi: The suspense over the NDA’s candidate for vice-president could, meanwhile, end on Monday when the BJP’s parliamentary board is expected to meet. The Opposition parties have already chosen Mahatma Gandhi’s grandson Gopalkrishna Gandhi as their joint nominee for vice-president. Several names are doing the rounds in the BJP for the second-highest constitutional post, and speculation is rife that Mr M. Venkaiah Naidu is being regarded as the front-runner, even though Mr Naidu had himself rejected such suggestions. BJP president Amit Shah had recently met the RSS top brass on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X