వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగిస్తాం, లాగులెందుకు తడుస్తున్నాయ్: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:విద్యుదుత్పత్తిని కొనసాగిస్తామని, శ్రీశైలంలో మా వాటా నీటిని వాడుకుంటామని, అక్కడ ఉత్పత్తిని ఆపేస్తే రైతులకు కరెంట్ ఇవ్వలేమని, కృష్ణా బోర్డు, ఆంధ్ర ప్రభుత్ం సహేతుకంగా ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు.

కరెంటు విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ఆధారాలతో సహా బయటపెట్టామని, ఈ అంశంపై టీటీడీపీ నేతల సమాధానం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు మనకు రావాల్సిన కరెంటు ఇవ్వడం లేదని, ఇవ్వాలని మీరు ఆయనను ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని, కృష్ణపట్నం, సీలేరులో మా వాటా కరెంటు ఏదీ అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

Harish Rao

చంద్రబాబును చూస్తే ఇంకా మీ లాగులు తడుస్తున్నాయెందుకు? అని టీటీడీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో రైతుల పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటితో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారమైనా, కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు అభిప్రాయం ప్రకారమైనా సాగునీటికి ప్రాధాన్యమివ్వాలని, తాము కూడా ఈ నీటితో విద్యుత్‌ను సాగునీటి కోసమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో 20 లక్షల వ్యవసాయ విద్యుత్‌ పంపు సెట్లు ఉన్నాయని, వాటి ద్వారా 500 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వస్తుందని, తద్వారా 40 లక్షల ఎకరాల్లో పంట సాగువుతుందని చెప్పారు.

అందుకే శ్రీశైలం నీటిని సాగు నీటికోసం వినియోగిస్తున్నట్లుగానే పరిగణించాలన్నారు. కనీస నీటినిల్వ మట్టం 854 అడుగుల నిబంధనను ఎత్తివేయాని, 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అంశాన్ని సహేతుకంగా ఆలోచించాలని ఏపీని, కేంద్రాన్ని, కృష్ణా నీటి యాజమాన్య బోర్డును కోరారు.

రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ సన్నాసి, దద్దమ్మ, పచ్చి అబద్ధాలకోరని అన్నారు. సీసా మూత ఎప్పుడు తీయాలన్న మందు చూపు తప్ప ముందుచూపులేని ముఖ్యమంత్రి గద్దెనెక్కిన ఫలితంగా తెలంగాణలోని రైతాంగం తీవ్ర విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు.

తన అసమర్థత, నిర్లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తోసేసి కేసీఆర్‌ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం చంద్రబాబు తెలంగాణకు కరెంటు ఇవ్వకపోవడం వల్లే ఇక్కడ కొరత ఉందని కేసీఆర్‌ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని, కొత్త రాష్ట్రాలు ఏర్పడిన ఈ నాలుగు నెలల్లో ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ కరెంటు వాడుకొందన్నారు.

సదరన్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ లెక్కలంటూ కేసీఆర్‌ నిన్న చెప్పారని, అవే లెక్కలు తాను చెబుతున్నానని, జూన్‌ 18వ తేదీ నుంచి అక్టోబర్‌ 23వ తేదీ వరకూ ఉమ్మడి రాష్ట్రంలో 10, 717 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే అందులో 53.1 శాతం కరెంటు తెలంగాణ రాష్ట్రం వాడుకుందని, 46.9 శాతం కరెంటు ఏపీ వాడుకుందన్నారు. తెలంగాణ నోరు కొట్టి ఏపీ వాడుకున్నది ఎక్కడ? తాగినోడి మాటలు సాగినోడి మాటలకు అడ్డం లేదన్నట్లుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఒక యూనిట్‌ విద్యుత్‌ను రూ. 5.73 పైసల చొప్పున 900 మెగావాట్ల కరెంటు కొన్నారని, కేసీఆర్‌ నిద్ర నుంచి లేచి కొనాలనుకొనే సరికి ఒక యూనిట్‌ ధర రూ. 8 అయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కరెంటులో 54 శాతం తెలంగాణ వాటాను చంద్రబాబు ఇవ్వడం లేదని కేసీఆర్‌ పదేపదే ఆరోపిస్తున్నారని, అసలు 54 శాతం వాటా ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, తెలంగాణలో కరెంటు కొరత ఉందని తర్వాత కేంద్రం విడిగా ఒక ఉత్తర్వు ఇచ్చిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన ఏపీ 58 శాతం ఇచ్చారని, విద్యుత్‌ కూడా అదే మాదిరిగా తమకు 58 శాతం ఇవ్వాలని చంద్రబాబు కోర్టుకు వెళ్లవచ్చునని, కానీ చంద్రబాబు తెలంగాణ రైతుల బాధలు తెలిసినవాడుగా దానిపై ఏ వివాదం చేయలేదన్నారు. దానిని గుర్తించే తెలివి కేసీఆర్‌కు లేకపోయిందన్నారు. మూడేళ్ళ తర్వాత రెప్పపాటు కాలం కూడా కరెంటు పోదని కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలు పచ్చి అబద్ధాలన్నారు.

ఒకవేళ మూడేళ్ళ తర్వాత 2017 సంవత్సరంలో సరిగ్గా ఇదే తేదీన కరెంట్‌ కష్టాలు లేకుండా ఉత్పత్తి మొదలైతే కేసీఆర్‌ ఏ శిక్ష విధించినా తాను సిద్ధమేనన్నారు. ఒకవేళ ఉత్పత్తి మొదలు కాకపోతే కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత జటిలంగా ఉండే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

కేసీఆర్‌కు చేతగాకపోతే గద్దె దిగి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అధికారం అప్పగించాలన్నారు. తెలంగాణ కోసం ఆయన కంటే రసమయే ఎక్కువగా పోరాడాడని చెప్పారు. ఏపీలోని గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లకు గ్యాస్‌ వస్తే ఐదు వేల మెగావాట్ల కరెంటు వస్తుందని, అందులో రెండు వేల మెగావాట్లు తెలంగాణ పొందే వీలుందని తెలిపారు. ఈ గ్యాస్‌ కోసం బాబును తీసుకొని తాము డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తామని, అది నెరవేరితే చంద్రబాబు వల్ల తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయన్నారు.

మూడేళ్లలో అదనపు విద్యుత్ అసాధ్యమన్నారు. కేసీఆర్ జేజమ్మ దిగొచ్చినా కొత్త ప్లాంట్లు పూర్తి కావన్నారు. అవి పూర్తయితే ఏ శిక్షకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. ల్యాంకో కంపెనీ నుండి 150 మెగావాట్ల విద్యుత్ అమ్ముతారని అదికారులు కేసీఆర్‌కు ఫైలు పంపితే కమీషన్లు రావనో, రాజకీయ కారణంతోనో తిరస్కరించారని ఆరోపించారు.

English summary
Telangana TDP leader Revanth Reddy takes on Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X