గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ము చూపండి: జగన్, బాబులకు శివాజీ పిలుపు, రాజేంద్ర ప్రసాద్ ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ముందుకు రావాలని, తెలుగువాడి దమ్మేమిటో చూపించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగు సినీ నటుడు శివాజీ ముఖ్యమంత్రి నారా చంద్రరబాబు నాయుడిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రత్యేక హోదా సాధించేందుకు టిడిపి, పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే తాము వెనక నడుస్తామని ఆయన చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఆ సందర్భంగా ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ఆయన షుగర్ లెవెల్స్, బిపి పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తాను పోరాటాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పదవీ ఆశించడం లేదని, తనకు రాజకీయ పార్టీలు అవసరం లేదని, ప్రత్యేక హోదా ఇస్తే తాను సామాన్య సామాజిక కార్యకర్తగా ఉండిపోతానని ఆయన చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క నిమిషమైనా కేటాయించాలని, యువత ట్వీట్ చేయాలని, ఫేస్ బుక్కులో వ్యాఖ్య పెట్టాలని ఆయన కోరారు.

ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు జయలలిత మరెవరో అడ్డు వస్తున్నారని, బిల్లులో దాన్ని పెట్టలేదని అంటున్నారని అంటూ ఎపి ప్రజలు పిచ్చోళ్లా అని ఆయన అడిగారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రధాని చెప్పారని ఆయన అన్నారు. విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటు చేస్తామని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, ఎపిలో పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారని, ప్రత్యేక హోదాపై ఇప్పుడు తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు.

Shivaji appeals to Jagan and Chandrababu to fight for special status

ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు ప్రతి రాజకీయ నాయకుడినీ తరిమికొడుతారని ఆయన హెచ్చరించారు. హామీలను అమలు చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్‌లా తయారవుతుందని, తన్నుకునీ కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. మతాన్ని, కులాన్ని, వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు గెలువాలని చూస్తాయని ఆయన అన్నారు.

హైదరాబాదులో పరిశ్రమలు, ఐటి సంస్థలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు మిగులు వస్తోందని, ఎపికి రాజధానిని ఏర్పాటు చేసుకుంటే సమస్యలు తీరుతాయని ఆయన అన్నారు. 44 డిగ్రీలో ఉష్టోగ్రత ఉందని, తాను మనిషినే అని, వాచిపోతోందని శివాజీ అన్నారు. పిల్లలకు చదువు, వైద్యం కావాలని ఆయన అన్నారు. మనిషి మనిషిలాగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రతీ ఇల్లు బాగుండాలంటే బజారు, ఊరు బాగుండాలని, అందుకు ప్రత్యేక హోదా కావాలని ఆయన అన్నారు.

ఇది శివాజీ సినిమా కాదని ఆయన అన్నారు. నాయకులు, పార్టీలు బాధపడుతాయని నాయకులు పోరాటానికి ముందుకు రాకపోవడం సరి కాదని ఆయన అన్నారు. చేతులెత్తి మొక్కుతున్నాను, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని ఆయన రాజకీయ నాయకులను కోరారు. తాను ప్రభుత్వాల పరువు తీయాలని దీక్ష జరపడం లేదని, ప్రజలకు మేలు జరగాలనే చేపట్టానని, ప్రత్యేక హోదా విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలని ఆయన అన్నారు. ఎవరో వచ్చి నిమ్మరసం ఇస్తే దీక్ష విరమిస్తానని అనుకోరాదని, ప్రత్యేక హోదా ఇస్తేనే విరమిస్తానని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను ప్రధానికి లేఖ రాశానని, వెంకయ్య నాయుడిని అడిగానని, కానీ సమాధానం రాలేదని, దాంతో నమస్కారం పెట్టేసి వచ్చానని ఆయన చెప్పారు. తనకు ఏదీ అవసరం లేదని, తనకు సినిమాలున్నాయని, ఎవరి ఇంటి ముందు డ్యాన్స్ చేసినా నాలుగు డబ్బులు ఇస్తారని, తిండి పెడుతారని ఆయన అన్నారు. పదవులు గానీ, మెహర్బానీలు గానీ తనకు అవసరం లేదని ఆయన అన్నారు. దేవుడున్నాడు, ప్రజలున్నారని ఆయన అన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ శివాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శివాజీ దీక్షకు మద్దతుగా ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.

English summary
Telugu film hero shivaji appealed to the Andhra Pradesh CM Nara Chandrababu Naidu and YSR Congress party president YS Jagan to fight for special status for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X