వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో ఏం జరుగుతోంది?: అడుగడుగునా అరెస్టులు.. ఆంక్షలు

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగానికి హుకుం జారీచేశారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచేయాలని ఆదేశాలు జారీచేశారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తమిళనాడు ప్రజలు ప్రత్యేకించి యువత స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ యువత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు తరలుతున్న తరుణమిది. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రచారం. టాలీవుడ్ కథా నాయకుల గణం మద్దతు. అండగా ముందుకొచ్చిన విపక్షాలు.

కానీ ఇవేవీ గిట్టని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగానికి హుకుం జారీచేశారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచేయాలని ఆదేశాలు జారీచేశారు. విశాఖకు తరలి వస్తున్న యువతను, వివిధ ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేస్తున్నారు. అందుకోసం విశాఖ నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు.

యువత శాంతియుతంగా ఆందోళన చేస్తామంటున్నా తోసి రాజంటున్నదీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి కారణమేమిటి? అడ్డుకోవాల్సిన అవసరమేమిటి? తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఆయా ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో నిషేధాజ్నలు అమలులో ఉన్నాయి.

దరఖాస్తు పెట్టకుండా నిరసనలకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చేసిన ప్రకటనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టబయలుచేసింది. శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని అనుమతివ్వాలని తాము దరఖాస్తుచేసినా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొనడంతో పోలీసుల దమనకాండకు తెర తీశారని అర్థమవుతూనే ఉన్నది.

యువ నేతల అరెస్టు

యువ నేతల అరెస్టు

శాంతియుత నిరసనోద్యమానికి అనుమతులు కావాలని విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌ను కోరేందుకు జెఎసి నాయకులు యత్నిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు..వారిని ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు. ఇఖ ప్రధాన పార్టీల నాయకులు నిరసనలో పాల్గొనకుండా గురువారం తెల్లవారుజాము నుంచే అరెస్టులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉద్యమంలో యువకులు పాల్గొనకూడదని, పాల్గొని విధ్వంసానికి పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు బహిరంగంగానే బెదిరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల ద్వారా వారి విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపి విద్యార్థులను ఆందోళనలో భాగస్వాములను కానివ్వొద్దని హెచ్చరికలు జారీచేస్తున్నారు.

అడ్డుకోవడమే లక్ష్యం

అడ్డుకోవడమే లక్ష్యం

విపక్ష నేత జగన్, పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ హీరోలు రానుండడంతో విశాఖ బీచ్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లనున్నారు. వీరందరినీ నగరంలోకి రాకముందే నిలువరించాలని పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు వద్దే అడ్డుకోవాలని వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. నగరంలోకి ప్రవేశించే ప్రతి దారిలోనూ పోలీసు చెక్‌ పోస్టులు పెట్టి అభిమానులు, విద్యార్థులు, ప్రజాసంఘాలను బీచ్‌కు చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 1000 మంది పోలీసులను నియమించినట్లు సమాచారం. విశాఖలో అడుగడుగునా సిసి కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రధాన కూడళ్లలోని కెమెరాలను కమిషనరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. బీచ్‌ రోడ్డులో కూడా సీసీ కెమెరాల సంఖ్యను పెంచి కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. బీచ్‌ సమీపంలో నివాసముంటున్న వారంతా కచ్చితంగా గుర్తింపు కార్డులు లేకపోతే అనుమతించమని చెబుతున్నారు.

అణచివేతకు సాకులు ఇలా...

అణచివేతకు సాకులు ఇలా...

ఈ నెల 27వ తేదీ నుంచి సిఐఐ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని, ఒకరోజు ముందు శాంతియుత ప్రదర్శనలు జరిపితే రాష్ట్ర పరువు ప్రతిష్టలు మంట గలుస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వాదిస్తున్నారు. అందుకోసం బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి డిజిపి సాంబశివరావును ఆహ్వానించి.. జిల్లాల నుంచి ఆందోళనలో పాల్గొనేందుకు యువత రాకుండా నియంత్రించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆందోళనల మాటెలా ఉన్నా.. సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామం సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నది. నిరసనకు వ్యతిరేకంగా అధికారం అణచివేత చర్యలు చేపడితే దాని మూల్యం ఎక్కువగానే చెల్లించుకునే స్థాయిలో సోషల్ మీడియా ప్రచారం ఉధ్రుతంగా సాగుతుంది. ఈ విషయాలేవీ పాలక పక్షానికి తెలియనివేమీ కాదు. అయినా ప్రత్యేక హోదా వల్ల లబ్ది పొందేది కూడా పారిశ్రామికవేత్తలూ, ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులే తప్ప యువత కాదు. కాకపోతే తమకు కొంత ఉపాధి లభిస్తుందన్న యువతరం ఆకాంక్షలను మొగ్గదశలోనే తుంచేయడం చంద్రబాబు నాయుడు వంటి ప్రభుత్వాధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే పని అంటే అతిశేయోక్తి కాదు.

చంద్రబాబుకు కొత్తేమీ కాదు..

చంద్రబాబుకు కొత్తేమీ కాదు..

సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఉద్యమ బాట పట్టినప్పుడల్లా ఉక్కు పాదంతో అణచివేయడం ఏపీ సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2001లో ఆర్టీసీ సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టినా.. అంతకుముందు 2000లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం ఉద్యమంలో పాల్గొన్నప్పుడూ, చేవెళ్లలో రైతులు విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలిచినప్పుడూ తూటాలు ప్రయోగించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుది. 2000లో విద్యుత్ ఉద్యమ సమయంలో వచ్చిన భారీ వరదలనూ తమ బెదిరింపులకు ఉపయోగించుకునేందుకు ఆయన వెనుకాడలేదు. దీని ఫలితంగానే 2004లో ఘోర పరాజయాన్ని చవిచూసి 10ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యం తెలుగుదేశం పార్టీ అధినేతది. ఈ పదేళ్ల కాలంలో తాను చాలా మారానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పదేపదే చెప్తూ జనంలోకి వెళ్లగలిగారు.

ఇలా అందలం...

ఇలా అందలం...

తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కొన్ని కార్పొరేట్ సంస్థల తెర వెనుక సహకారం.. తెలంగాణ ఆవిర్భావ దశలో నాటి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత.. అన్ని పార్టీల నేతలను తనతో కలుపుకోవడం వల్ల అధికార దండం చేజిక్కించుకున్న నేపథ్యం చంద్రబాబు నాయుడుది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పార్టీలోనే ఆయా వర్గాల వారేనని పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని విరుచుకు పడటం చంద్రబాబు స్టయిల్ రాజకీయం. తర్వాత వారు రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరమయ్యే పరిస్థితి నెలకొల్పగల సమర్థులు. నాడు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాకు పట్టుబడిన టిడిపి మిత్రపక్షమే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది.

ప్రత్యేక హోదాపై రెండు వైఖరులు..

ప్రత్యేక హోదాపై రెండు వైఖరులు..

ప్రత్యేక హోదాయే ఏపీకి సంజీవిని అని.. తర్వాత అదే సర్వం కాదని మాట మార్చిన ఘనత కూడా ఆ రెండు పార్టీలదే. ప్రత్యేక హోదాకు నాటి ప్రధాని ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేయకపోగా దాని వల్ల రాయితీలు వస్తాయని ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. తమిళనాట సంప్రదాయ ఆట జల్లికట్టు కోసం ఆందోళనచేస్తే.. దాని స్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయాల్సిన అవసరమేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తానే ముందు ఉంటానని పదేపదే చెప్తున్న చంద్రబాబు.. హోదాపై కేంద్రంతో తల పడేందుకు ముందుకు రాకపోవడానికి కారణాలేమిటో మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. గమ్మత్తేమిటంటే అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్నట్లు చంద్రబాబు ధోరణి ఉంది. అందువల్లే అధికారం అండగా కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశాలు ఉన్నా.. అందుకు ముందుకు రాకపోగా.. హోదా కోసం పోరాడుతున్న వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుందన్న దుగ్ధతోనే అణచివేత విధానం అమలుచేస్తున్నారని రాష్ట్రంలోని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

English summary
The protest proposed at Visakha patnam RK beach of Andhra Pradesh has been obstructed by the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X