మాట్లాడదాం రండని చంద్రబాబు, కేసీఆర్ స్పందిస్తారా?

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందుకేశారని, అయితే తెలంగాణ సీఎం ఏ మేరకు స్పందిస్తారనే చర్చ సాగుతోంది.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోను గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు తెరాస చీఫ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అప్పుడు చంద్రబాబుతో చర్చించేందుకు తాము చాలని తెరాస ఇతర నేతలు చెప్పారు. ఓ సమయంలో కేసీఆర్ సైతం తాను చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ప్రకటించారు.

రావాలని బాబు, కేసీఆర్ స్పందిస్తారా?

చంద్రబాబు సై అన్న తర్వాత ఇతర నేతలు ముందుకు వచ్చారు. అంతేకాదు కేసీఆర్ ప్రధానంగా చంద్రబాబును టార్గెట్‌గా పెట్టుకున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్.. చంద్రబాబు సవాల్‌కు ఏమేరకు స్పందిస్తారనే చర్చ సాగుతోంది.

లేక్‌వ్యూ అతిథి గృహంలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కృష్ణా డెల్టా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాగునీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం కాదని, ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లో ఉందని, దీనిపైన ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏమిటని కేసీఆర్‌పై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.

ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను మొగ్గలోనే తుంచేసేందుకు వీలుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడంలో తప్పేమిటన్న ప్రశ్నకు .. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాను కేసీఆర్‌తో భేటీ అవుతానని, తానకు ఎలాంటి భేషజాలూ లేవని, పైగా .. కేసీఆర్ తనకు తెలియని వ్యక్తి కాదని, ఆయనతో పరిచయం ఉందని, ఇరు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

రెండు రాష్ట్రాల అభివృద్ధినీ టీడీపీ కాంక్షిస్తోందన్నారు. తమ పార్టీపై నమ్మకంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఇస్తే.. తెలంగాణలో 22 నుంచి 23 శాతం ఓటర్లు తమకు అండగా నిలిచారని ఎమ్మెల్యేలను గెలిపించారని చంద్రబాబు అన్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకూ విద్యుత్‌ను ఇవ్వాలని కోరానని చెప్పారు.

English summary
AP CM Nara Chandrababu Naidu said that he is ready to meet Telangana CM K Chandrasekhar Rao.
Write a Comment