వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాభిప్రాయం అంటే ఇదేనా..: వెంకయ్య నాయుడి వితండవాదం

వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం సాధిస్తామని తొలుత ప్రకటించిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏకపక్షంగానే అభ్యర్థిని ప్రకటించి.. తమ అభ్యర్థికి మద్దతునివ్వాలని విపక్షాలను కోరింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం సాధిస్తామని తొలుత ప్రకటించిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏకపక్షంగానే అభ్యర్థిని ప్రకటించి.. తమ అభ్యర్థికి మద్దతునివ్వాలని విపక్షాలను కోరింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులైన కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ తదితరులతో సంప్రదింపులు జరిపారే గానీ అభ్యర్థి ఎవరన్నది బయటపెట్టలేదు.

సోనియాగాంధీ సహా విపక్షాలన్నీ 'అభ్యర్థి పేరు చెప్పకుండా' ఎలా మద్దతునివ్వాలని నిలదీశాయి. దీంతో చేసేదేమీ లేక మళ్లీ అభ్యర్థి పేరుతో కలుస్తామని బయటపడ్డారు కేంద్రమంత్రుల ద్వయం. ఆ రెండు రోజులకే అభ్యర్థిగా బీహార్ గవర్నర్‌గా పని చేసిన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించేశారు. ఈలోగా సాధారణ ప్రజానీకానికి అర్థం కాని విషయం ఒకటి ఉన్నది. పరిమితుల మాటెలా ఉన్నా.. ఏకాభిప్రాయ సాధన అంటే కనీసం రెండు, మూడు దఫాలు చర్చలు జరిపితే విస్త్రుత ప్రాతిపదికన ఏకాభిప్రాయం సాధించొచ్చు.

కానీ ఇక్కడ అభ్యర్థి పేరుపై స్పష్టత లేకుండానే కేంద్ర మంత్రులు మొక్కుబడి సంప్రదింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మూలాలు ఉన్న వ్యక్తిని రాష్ట్రపతిగా నిలుపాలని ముందుగానే సంకల్పించింది. ఆరెస్సెస్ భావజాలం ఉన్న వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెడితే పోటీ తప్పదని ముందే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రానికి తేల్చి చెప్పారు. విపక్షాల మనోగతమేమిటో తొలి దశ చర్చల్లో తేలిపోవడంతో పోటీ తప్పదన్న అనివార్యతతో అభ్యర్థిని ప్రకటించారే తప్పా.. పూర్తిస్థాయి సంప్రదింపులకు ముందుకు రాలేదు అధికార బీజేపీ నాయకత్వం.

కాంగ్రెస్ సహా విపక్షాల వ్యూహం ఇదీ

కాంగ్రెస్ సహా విపక్షాల వ్యూహం ఇదీ

రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే బీహార్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాం విలాస్ పాశ్వాన్ వంటి సీనియర్ నేతలు కూడా విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ అని బాష్యాలు చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే దళితుడిని నిలబెట్టామని, తమకు తిరుగులేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని అధికార ఎన్డీయే పక్షాలన్నీ భావించాయి. అధికార పక్షం వ్యూహం ఏమిటో తెలుసుకున్నాకే విపక్షం తన వ్యూహానికి పదును బెట్టింది. ముందుగా రాజకీయంగా కాకలు తీరిన యోధులను నిలుపాలని భావించినా వ్యూహాత్మకంగా లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో కమలనాథులకు ఏం చేయాలో తోచడం లేదు. సాంకేతికంగా నామమాత్రపు పోటీ అయినా.. దీని ప్రభావం 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందనేది నిర్వివాదాంశం. కమలనాథుల దుగ్ధ కూడా అదే.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా నిష్ఠూరం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా నిష్ఠూరం

అధికార పక్షం సంగతి తేలకుండా ఏ విపక్షం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తన ఆలోచనలు బయటపెట్టే అవకాశం లేదు. కనుకే ముందే మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు బయట పెట్టలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిష్ఠూరాలాడారు. ఇక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరో అడుగు ముందుకేసి ప్రజాభీష్ఠానికి భిన్నంగా విపక్షాలు పోటీ పెడుతున్నాయని విపరీత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకాడలేదు. దళితుడన్న పేరుతో రామ్ నాథ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదని మరో వాదన ముందుకు తెచ్చారు. రామ్‌నాథ్‌ దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించి తాము ఎన్నికల బరిలో వుంచలేదని.. చక్కని వ్యక్తిత్వం, అపార అనుభవం ఉన్న కారణంగానే ఆయనను ప్రతిపాదించినట్టు చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. మంచి అభ్యర్థిని, అన్ని అర్హతలు ఉన్న యోగ్యుడిని ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షం కలిసివచ్చి ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తే మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఇలా వెంకయ్య

ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఇలా వెంకయ్య

ఆ మాటకు వస్తే మీరా కుమార్ మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ తనయ కావడంతోపాటు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఐఎఫ్ఎస్ సర్వీసుల్లో భాగంగా పలు దేశాల్లో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ రెండు దఫాలు రాజ్యసభకు మాత్రం ప్రాతినిధ్యం వహించారు. అంతకు మించిన అనుభవం ఏమీ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయేకే ఇప్పటికే మద్దతు ఉందని, కొన్ని ప్రధాన ప్రతిపక్షాలతో పాటు కొందరు స్వతంత్రులు కూడా తమ అభ్యర్థిని సమర్థించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. అయినా.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మీరా కుమార్ పేరు ఎత్తకుండా వేరే అభ్యర్థిని బరిలో దించి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయన్నారు. ఈ విషయంలో తమకేమీ అభ్యంతరం లేదన్నారు.

తమిళనాట ఇదీ అన్నాడీఎంకే వైఖరి

తమిళనాట ఇదీ అన్నాడీఎంకే వైఖరి

దేశం ఆశించిన రీతిలో వారు కలిసి వస్తే బాగుండేదన్న వెంకయ్య నాయుడు ద్రుష్టిలో దేశం.. జాతి అంటే కేవలం బీజేపీ మాత్రమే వస్తుందా? అని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. బీహార్ గవర్నర్‌గా రామ్ నాథ్ కోవింద్ నిష్పక్షపాతంగా పనిచేసినందున ఎన్డీయే అభ్యర్థిగా ఆయనకు మద్దతునిచ్చామని బీహార్ సీఎం - జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో ఎన్డీయేలో ఉన్నా ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీల అభ్యర్థిత్వాలకు జేడీయూ మద్దతు తెలిపింది. ఇక తమిళనాట అధికార అన్నాడీఎంకేను తమతో కలుపుకునేందుకు సాగిన తెర వెనుక రాజకీయాలన్నీ యావత్ జాతి గమనిస్తూనే ఉన్నది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుంగు నెచ్చెలి శశికళా నటరాజన్ ఎదురు తిరగడంతో అధికారపార్టీ నేతలపై ఐటీ అధికారులను ప్రయోగించారు. సీఎం పళనిస్వామి, అసమ్మతి నేత - మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేతో మిత్రపక్షంగా కొనసాగడానికి వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్నాయి. అటువంటి వాతావరణం నెలకొల్పడంలో కేంద్రం విజయవంతమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విపక్షాలపై కేంద్రం ఆక్షేపణలిలా

విపక్షాలపై కేంద్రం ఆక్షేపణలిలా

అంతెందుకు? 2019 ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటుకు సన్నాహంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను వాడుకోవాలని ప్రతిపాదించిన ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబ సభ్యులపై బీనామీ ఆస్తుల చట్టాన్ని ప్రయోగించారు. వాస్తవంగా సీబీఐ, ఐటీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిష్పక్షపాతంగా పనిచేస్తే దేశంలోని సగం మంది రాజకీయ నాయకులకు కష్టాలే మిగులుతాయి. ఈ సంగతులన్నీ విస్మరించి తమ అభ్యర్థిత్వానికి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మద్దతు పలకడమే తమకు ఉన్న విశ్వసనీయత అని వెంకయ్య నాయుడు చెప్తున్నారు. అందులో ఆయన అలా వాదన వినిపించడంలో తప్పేమీ లేదు. కానీ ఆయన స్వయంగా చెప్పినట్లు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. విపక్షాలకు ప్రజల వాణి వినిపించే హక్కు ఉంది. ఆ సంగతి విస్మరించి.. విపక్షాలు తమతో కలిసి రావడం లేదని ఆక్షేపించడం సరి కాదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

అద్వానీకి గురు దక్షిణ అంటే

అద్వానీకి గురు దక్షిణ అంటే

ఆ మాటకు వస్తే మహా భారతంలో భీష్మాచార్యుడి మాదిరిగా.. బీజేపీ వంటి వట వ్రుక్షానికి పునాదులు వేసిన సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి గురుదక్షిణ ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సాక్షాత్ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆచరణలోకి వచ్చే సరికి బీజేపీ అధికారంలో ఉండగా.. అదే పార్టీకి చెందిన అద్వానీ తదితరులపై చార్జిషీట్ దాఖలు చేయాలని దిగువ న్యాయస్థానానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం.. ఉత్తరప్రదేశ్‌లోని న్యాయస్థానం అభియోగాలు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇదే అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనపై అభియోగాలు ఉపసంహరించుకుంటామని సుప్రీం కోర్టు ముందు సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజకీయాల్లో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అన్న నానుడి అద్వానీకి కూడా వర్తిస్తుందేమోనని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్ ఆహ్వానంపై కర్నె ఇలా

కాంగ్రెస్ ఆహ్వానంపై కర్నె ఇలా

ఒక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికే మద్దతు తెలిపింది. అంతే కాదు నామినేషన్ల పర్వంలో పాల్గొని తాము ఇక ఎన్డీయే పక్షమేనని జాతికి స్పష్టమైన సంకేతాలు పంపింది. కానీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాత్రం.. తమకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని ఆరోపణలకు దిగారు. అసలు సంగతేమిటంటే ఇటీవల రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్.. షా ఆరోపణలను ఖండించడంతోపాటు గవర్నర్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదుచేశారు. అప్పట్లోనే రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జరిగే సమావేశంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం లభించినా వెళ్లలేదని గవర్నర్ తో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కనుక మిగతా టీఆర్ఎస్ నాయకత్వం వాస్తవాలు సరి చూసుకోకుండా ఇతర పక్షాలపై విమర్శలు చేయడంతో ప్రజల్లో పలుచన అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Information and Broadcasting Minister M Venkaiah Naidu on Friday said that he could not understand why the Congress was opposing NDA Presidential candidate Ram Nath Kovind."Kovind is a good candidate. He is non-controversial, educated and experienced and has been good as Bihar Governor. He has worked among the weaker sections and the downtrodden. I cannot understand why (the) Congress is opposing him," Naidu said after Kovind filed his nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X