వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టగ్ ఆఫ్ వార్: బీజేపీ అభ్యర్థే రాష్ట్రపతి?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే జూలై 24వ తేదీతో ముగిసిపోనున్నది. తర్వాత నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇటు బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయే, అటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని విపక్షాలు ఎడతెగని సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇరు వర్గాలు తమ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని నమ్మబలుకుతున్నాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. పార్లమెంట్ లైబ్రరీ హాలులో విపక్ష నేతలకు ఇచ్చిన విందు సమావేశం వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నది. ప్రస్తుతానికి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పక్కనబెట్టి తామంతా ఏకమయ్యామన్న సంకేతాన్నిచ్చింది. ముందు రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయ సాధనకు విపక్షాల అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని 'నిర్ణాయక బంతి'ని అధికార పక్షం కోర్టులోకి నెట్టేసింది. అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి పేరు తమకు నచ్చితే అంగీకరిస్తామని, లేదంటే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే అభ్యర్థిని తాము నిలబెడతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ తెలిపారు.

తత్ఫలితంగానే అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పల్లవి మార్చారు. ఇంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదన్న అమిత్ షా.. ఇప్పుడు విపక్షాలనూ సంప్రదిస్తామన్నారు. దానికి ముందు భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపాల్సి ఉన్నదన్నారు. కానీ మిత్రపక్షాలతో సంప్రదింపులు గతంలోనే పూర్తయ్యాయి. తాజాగా మరోసారి మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపాల్సిన అవసరమేమిటో ఆయన విడమరిచి చెప్పలేదు మరి. ఇప్పటివరకు రాష్ట్రపతిగా తమ అధికారిక అభ్యర్థిని నేరుగా ప్రకటించొచ్చన బీజేపీ వ్యూహానికి విపక్షాలు ప్రతివ్యూహం రచిస్తుండటంతో కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు ఆగ్రహం వచ్చింది. విపక్షాలది అవకాశ వాద కూటమి అని మండిపడ్డారు. కానీ ప్రజాస్వామ్యంలో విపక్షాల వాణి కూడా వినాలన్న స్ఫూర్తిని మాత్రం ఆయన మర్చిపోయారనిపిస్తున్నదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Presidential Election: How the numbers stack up for NDA and Opposition camps

ఇక సోనియాగాంధీ నిర్వహించిన విందు సమావేశానికి పశ్చిమ బెంగాల్లో పరస్పరం కత్తులు దూసుకునే రాజకీయ ప్రత్యర్థులు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సహా ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం విపక్ష పాత్ర పోషిస్తున్న బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధినేత తరఫున నరేశ్ అగర్వాల్, జేడీయూ సీనియర్ నేతలు శరద్ యాదవ్, కేసీ త్యాగి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే ఎంపి కనిమొళి, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రభ్రుతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల పూర్వాపరాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఇలా
పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు. వారిలో ప్రతి ఒక్కరి ఓటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా, అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ స్థానాలను బట్టి ఆధార పడి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేక ఫార్ములా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్ల సంఖ్య 4896 మంది. పార్లమెంట్ ఉభయసభల్లోని 776 మంది ఎంపీలు ప్లస్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు 4120 మంది ఉంటారు. పార్లమెంట్ సభ్యుల విలువ 5,49,409 కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ 5,49,474. ఎమ్మెల్యేల ఓటు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా, దాని విస్తీర్ణం, జనాభాను బట్టి వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది. ఎంపీ ఓటు విలువ 708. కాగా, మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల విలువ 10,98,882. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వారు కనీసం 5,49,442 ఓట్లు పొందాల్సి ఉంటుంది.

తేల్చుకోలేకపోతున్న ప్రాంతీయ పార్టీలు
ఈ ఓట్ల సమీకరణాలన్నీ జాతీయ, రాష్ట్రాల రాజకీయాల ఆదారంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు అధికార ఎన్డీయే పక్షానికి గానీ, అటు విపక్షాలకు గానీ సాధారణ మెజారిటీ లభించడం లేదు. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్, ఒడిశాలోని బిజూ జనతాదళ్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. తమిళనాట అధికార అన్నాడీఎంకే ఓట్ల విలువ ఎంతో కీలకంగా మారనున్నది.

Presidential Election: How the numbers stack up for NDA and Opposition camps

బీజేపీకి 11,828 ఓట్లు అదనంగా లభిస్తే సరి
బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ అలయెన్స్ (ఎన్డీయే)లో శివసేన, తెలుగుదేశం, అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ, పీడీపీ సహా 14 పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేకు 5,37,614 ఓట్లు ఉన్నాయి. ఇది సాధారణ మెజారిటీకి కేవలం 11,828 ఓట్లు తక్కువ.

విపక్షాలకు 1.47 లక్షల ఓట్లు కావాలి
కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఓట్లన్నీ కలిసి 4,02,230 ఓట్లు ఉన్నాయి. విపక్షాల అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 1,47,212 ఓట్లు కావాలి. ఇంకా నిర్ణయించుకోని అన్నాడీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ లోక్ దళ్ పార్టీలు 1,59,038 ఓట్లు కలిగి ఉన్నాయి. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి.. ప్రధానిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలోని ఓట్ల సంఖ్యలో ఈ పార్టీలన్నీ 13 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈపార్టీలేవీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని గానీ, ఎన్డీయేను గానీ సమర్థించడం లేదు.

అన్నాడీఎంకే ఓటు కీలకం
అన్నాడీఎంకే మద్దతును ఎన్డీయే పొందగలిగితే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి 5,96,838 ఓట్లు లభిస్తాయి. అయినా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని అభ్యర్థిని బట్టి దాని విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. అయితే శివసేన, అన్నాడీఎంకే, బీజేడీ, ఆప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మద్దతు కూడగట్టడం ప్రస్తుతం పరిస్థితుల్లో కష్ట సాధ్యం. ఈ నేపథ్యంలో విపక్షాలు వ్యూహాత్మకంగా ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఖరారు చేయాలని భారమంతా ప్రభుత్వంపై పెట్టాయి. కాకపోతే విపక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి దన్నుగా నిలువడమే ఆసక్తికరం. ఒకవేళ శివసేన రాష్ట్రపతి ఎన్నికల్లో భిన్నంగా వ్యవహరిస్తే కొంత కస్టమే. గత రెండుసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మద్దతు పలికింది. గతంలో బీజేపీకి మద్దతునిచ్చిన మమతాబెనర్జీ, మాయావతి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచాయి.

Presidential Election: How the numbers stack up for NDA and Opposition camps

అన్నాడీఎంకే చీలికను అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహం
తమిళనాట అధికార అన్నాడీఎంకేలో కుమ్ములాటలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఇక ఆప్ తటస్థంగా ఉంటుందా? విపక్షానికి ఓటేస్తుందా తేలాల్సి ఉన్నది. ఇక ఇటీవల తెలంగాణలో బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన చేసిన విమర్శలు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి విమర్శలతో ఒకింత వాతావరణం వేడెక్కింది. ఇదే పరిస్థితి ఒడిశాలో నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం ఒడిశాలో బీజేపీ నేతలు.. అధికార బీజేడీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

మోదీ వైఫల్యాలపై ప్రజల్లోకి దూసుకెళ్లాలి
2019 సార్వత్రిక ఎన్నికల వరకు తమ ఐక్యతను నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న ప్రతిపక్ష పార్టీలు చెన్నైలో వచ్చేనెల మూడో తేదీన కరుణానిధి 93వ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి కలవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత ఆగస్టులో తాను పట్నాలో ఏర్పాటుచేసే భారీసభకు హాజరు కావాలని లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆహ్వానించారు. వీరు కేవలం సమావేశాలకే పరిమితమైతే ఆశించిన లక్ష్యం నెరవేరదని విశ్లేషకులు అంటున్నారు. మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి.. వాటిపై క్షేత్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి.

మోదీకి ధీటుగా భావ వ్యక్తీకరణ తేలిక కాదు
భావ వ్యక్తీకరణలో దిట్టయిన మోదీని ఎదుర్కోవడం, ఆయనతో పోటీ పడే సమర్థుడిని ఎన్నుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ ఎన్నుకున్నా వాళ్లు ఎల్లవేళలా ఐక్యంగా ఉండే విషయంలో చిత్తుశుద్ది ప్రదర్శించాలని చెప్తున్నారు. అదే జరిగితే 2004లో ప్రతిపక్షాలను యూపీఏ వేదికపైకి తీసుకొచ్చి పదేళ్లపాటు అధికారం సాగించిన చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. లేదంటే 'వో కహతే ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో' నినాదంతో ఇందిరాగాంధీ తిప్పి ప్రతిపక్షాన్ని మట్టి కరిపించిన అనుభవం చవిచూడాల్సి వస్తుంది.

English summary
President Pranab Mukherjee’s tenure will end on July 14 this year and the election for the new president has to be held before that date. Ruling BJP-led NDA and Opposition parties have moved to finalise their presidential candidate and the names are expected to be announced soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X