వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండి బకాయిల వసూలుకు దారి లభిస్తుందా? ఆర్బీఐ, కేంద్రం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య మొండిబకాయిలు. కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులే రూ.6 లక్షల కోట్లకు పైగా రుణాలను తిరిగి వసూలు చేసుకోలేక నానా తిప్పలు పడుతున్నాయి.

సర్ఫేసీ చట్టం నుంచి దివాలా చట్టం వరకు పలు కఠిన చట్టాలున్నా.. రుణ గ్రహీతల నుంచి బకాయిల వసూలు చేయడం ద్వారా అవేవీ బ్యాంకులను కష్టాల నుంచి బయటపడేయలేకపోతున్నాయి. వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేకపోవడంతో బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇచ్చిన అప్పులు వసూలుకాక, కొత్తగా అనుకున్న రీతిలో అప్పులు ఇవ్వలేక బ్యాంకులు సతమతం అవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలతో ఆయా బ్యాంకుల లాభాలు హారతి కర్పూరంలా హరించుకుపోయాయి.

Stressed assets issue: Govt, RBI may finalise NPA resolution policy soon

గత మూడేళ్లలో కొన్ని బ్యాంకులైతే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. ఎప్పటికప్పుడు బ్యాంకుల స్థితిగతులు మెరుగుపడతాయని ఆశిస్తూ వచ్చినా అలాంటి అద్భుతమేదీ జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), కేంద్ర ఆర్ధిక శాఖ సంయుక్తంగా కసరత్తు చేయడంతోపాటు వేగిరం పరిష్కార మార్గం దిశగా ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సిన అవసరమేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

రుణ వసూళ్లకు ఆర్బీఐ మార్గదర్శకాలు

ప్రత్యేకించి రోడ్ల రంగ సంస్థలు తీసుకున్న రుణాల వసూలు కోసం బ్యాంకుల లాభాలను హరించేస్తున్న మొండి బకాయిల వసూళ్లకు ఆర్బీఐ మార్గదర్శకాలు రూపొందించనున్నది. ఇతర రంగాల వారీ రుణ బకాయిల వసూళ్లకూ కూడా ఆర్బీఐ భిన్న విధానాలు డిజైన్ చేసింది. ఇక టెక్నాలజీ రంగం ఇచ్చిన అవకాశంతో ప్రపంచాన్ని ఏలుతున్న టెలికం రంగానికి రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

వచ్చే జూన్ 30 నాటికి వివిధ బ్యాంకుల రుణాలు, లాభాలపై బాలెన్స్ షీట్ సంసిద్ధం చేయాలని కూడా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొన్నది. లోహాలు, టెక్స్ టైల్, విద్యుత్, మౌలిక వసతుల రంగ సంస్థలు తీసుకున్న బ్యాంకింగ్ రుణాల్లో అత్యధికంగా మొండి బకాయిలుగా మారాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ ప్రణాళిక అమలులోకి తీసుకొచ్చినా అవి మొండి బకాయిల నుంచి బయటపడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సారథ్యంలోని కమిటీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కార్పొరేట్ల రుణాల వసూళ్లకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇందుకోసం ఒక కమిటీకి ప్రభుత్వం సర్వాధికారాలు అప్పగించనున్నది.

పెద్ద సంస్థలవే 60 - 70 శాతం రుణాలు

వసూలు కానీ మొండి బకాయిల్లో పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందినవే 60 నుంచి 70 శాతం ఉంటాయి. వీటిలో కొన్నైనా త్వరగా పరిష్కరించుకుంటే బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు వీలుకలుగుతుంది. ఈ నేపథ్యంలో మొండి బకాయిల సమస్య పరిష్కారానికి వీలుగా ఆర్బీఐకి కేంద్రం అదనపు అధికారాలు కట్టబెట్టనున్నది. వసూలు కాని రుణాలన్నీ ఒక నూతన సంస్థకు (బ్యాడ్‌ బ్యాంకు) బదిలీ చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తక్కువ రేటుకు బ్యాంకులు ఇలాంటి రుణాలను ఆ సంస్థకు బదిలీ చేస్తే అది వసూలు చేస్తుంది.

తనఖా ఆస్తుల జప్తుకు బ్యాంకులకు అధికారం

రూ.9000 కోట్ల రుణాలు తీసుకుని, అందుకు తన ఆస్తులు తనఖా పెట్టి జల్సాలు చేసిన లిక్కర్ సంస్థ అధినేత విజయ్ మాల్య వంటి వారు రుణాలు కట్టలేక.. దర్యాప్తు సంస్థలు తనను అరెస్ట్ చేయకుండా లండన్‌కు పారిపోయారు. అక్కడ షెల్టర్ తీసుకున్నా ఇటీవలే ఒక కేసులో అరెస్టయిన విజయ్ మాల్యకు వెంటనే బెయిల్ లభించింది. దీని ప్రకారం ఆయనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థన పరిష్కారం అయ్యే సరికి ఏడాది సమయం పడుతుందని అంచనా. ఇలా తమ వద్ద తనఖా ఉంచిన ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని బ్యాంకులు విక్రయించుకునే అవకాశం వాటిని కేంద్రం, ఆర్బీఐ కల్పించనున్నది.

చైనా, ఈయూలకే అదే సమస్య

మనదేశంలో కార్పొరేట్ సంస్థలు రుణ బకాయిలు వదిలేస్తున్నట్లే చైనాలోనూ కార్పొరేట్లు రుణాలు తీసుకుని చెల్లించక పోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఆ దేశంలోని అతిపెద్ద బ్యాంకులైన చైనా కనస్ట్రక్షన్‌ బ్యాంకు, వ్యవసాయ బ్యాంకు, కమ్యునికేషన్ల బ్యాంకు, పారిశ్రామిక వాణిజ్య బ్యాంకు కొన్నేళ్లుగా మొండి బకాయిలు వసూలు చేయలేక సతమతం అవుతున్నాయి. చైనా ప్రభుత్వం ఆయా బ్యాంకుల అవసరాన్ని బట్టి మూలధన నిధులు సమకూర్చుతోంది. కొన్ని రానిబాకీల ఖాతాలను ఇతర సంస్థలకు విక్రయిస్తున్నా అవీ ఇటీవల కాలంలో వసూలు చేయలేకపోతున్నాయి. 2007-08 లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవటానికి అమెరికాలో వెలుగులోకి వచ్చిన సబ్‌-ప్రైమ్‌ సంక్షోభం ప్రధాన కారణం. ఆ తర్వాత అది విస్తరించి ఐరోపా యూనియన్ దేశాల్లోని బ్యాంకులను అతలాకుతలం చేసింది. గ్రీస్‌, సైప్రస్‌, పోర్చుగల్‌, ఇటలీ దేశాలు అప్పుల భారంతో కుంగిపోయాయి. కొన్ని బ్యాంకులను ఆదుకోలేక ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఐరోపా యూనియన్‌లోని బ్యాంకులకు ఇప్పటికీ భారీగా మొండి బకాయిలు ఉన్నాయి.

ఆసియా టైగర్లదీ అదే పరిస్థితి..

మలేసియా, సింగపూర్‌, థాయిల్యాండ్‌ తదితర దేశాలు రెండు దశాబ్దాల క్రితం కరెన్సీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ సమయంలో అక్కడి బ్యాంకులకు మొండి బకాయిలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లో అదే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మలేసియా ప్రభుత్వం అప్పట్లో అస్సెట్‌ రీకకస్ట్రక్షన్‌ సంస్థలను (ఏఆర్‌సీ) ఏర్పాటు చేసి మొండి బకాయిలను ఆ 'ఏఆర్‌సీ'లకు అప్పగించి బ్యాంకులను బతికించింది. ఇప్పుడు భారతదేశంలోనూ అలా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పులు తీర్చలేని సంస్థను అదే రంగానికి చెందిన మరొక బలమైన సంస్థలో విలీనం చేసేందుకు వీలైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనున్నది. దివాలా చట్టం, సర్ఫేసీ చట్టం దీనికోసమే తెచ్చారు. కొత్తగా రుణ వసూలు ట్రైబ్యునల్‌లు(డీఆర్టీ) కూడా ఏర్పాటు చేశారు. రుణాలు తీర్చని సంస్థలు, వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు సర్ఫేసీ చట్టం అనుమతిస్తున్నది. ఈ చట్టం కింద 2015-16లో బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు 64,519 ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. 2016-17 మొదటి నాలుగు నెలల్లో 34,000 ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలానికి పెట్టాయి.

English summary
The government and the Reserve Bank of India (RBI) are expected to finalise a non-performing asset (NPA) resolution policy soon after finance minister Arun Jaitley returns from his visit to the US and Russia later next week. Sources said that the policy changes do not require approval of the Union Cabinet, and the RBI as well as the government will issue directions for speedy resolution of the NPAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X