నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత
ఖాట్మాండ్: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని ఆయన స్వగ్రామమైన మహారాజ్‌గంజ్‌కి చేరుకున్నారు.
మంగళవారం ఉదయం మళ్లీ అస్వస్థతకు గురైన సుశీల్ కొయిరాలా తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని నేపాలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. బుధవారం నేపాల్‌లో సుశీల్ కొయిరాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేపాల్ మంత్రివర్గం సమావేశమై సుశీల్ కొయిరాలా మృతికి సంతాపం తెలపనుంది.
సుశీల్ కొయిరాలా జీవితానికి సంబంధించిన విశేషాలను గమనించినట్లయితే.. సుశీల్ కొయిరాలా భారత్‌లోని బనారస్‌లో బోధ్ ప్రసాద్ కొయిరాలా, కుమినిధి దంపతులకు 1939 ఆగస్టు 12న జన్మించారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న కొయిరాలా కుటుంబంలో జన్మించిన సుశీల్ కొయిరాలా వివాహం చేసుకోలేదు.

కొయిరాలా 1954లో రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ఆకర్షితులై నేపాలీ కాంగ్రెస్‌లో చేరారు. 1960లో నేపాల్‌ను అక్కడి రాజు ఆధీనంలోకి తీసుకొని సుశీల్ కొయిరాలను 16ఏళ్ల పాటు రాజకీయ బహిష్కరణ చేశారు. 1973లో విమానం హైజాక్‌కు సంబంధించి సుశీల్ కొయిరాలాకు సంబంధాలు ఉన్నాయని రుజువు కావడంతో కొయిరాలా భారత్‌లో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించారు.
నేపాలీ కాంగ్రెస్‌కు వివిధ పదవుల్లో పనిచేసిన కొయిరాలా 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో నేపాల్‌లో కొయిరాలా ఆధ్వర్యంలో నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. కొయిరాలా 2014 ఫిబ్రవరి 11 నుంచి 2015 అక్టోబర్ 12 వరకు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆయన ఆధ్వర్యంలో నేపాల్‌లో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో సుశీల్ 2015 అక్టోబరులో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం(ఫిబ్రవరి 9, 2016) ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రధాని మోడీ సంతాపం
నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. భారత్ మంచి స్నేహితుడిని, నేపాల్ గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications