కోల్‌కతా: దాల్మియా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దశ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దాల్మియా హయాంలో గంగూలీకి ఎనలేని ప్రోత్సాహం లభించింది. ఒక రకంగా దాల్మియా గంగూలీకి గాడ్ ఫాదర్ వంటివారు. ఓ సమయంలో టీమిండియాను ఏకచక్రాధిపత్యంతో ఏలిన గంగూలీకీ దాల్మియా నుంచి అత్యధిక మద్దతు లభించింది.
దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో (2001-2004) కెప్టెన్‌గా దాదా స్థాయి ఎంతటితో తెలియంది కాదు. అందుకు కారణం వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం. ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా ధృడమైనవి. గతంలో గంగూలీ తండ్రి చండీదాస్తో కలిసి కొన్నేళ్లపాటు దాల్మియా బెంగాల్ క్రికెట్ సంఘాన్ని నడిపించాడు. నాటి నుంచీ ఇరు కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం.
మళ్లీ ఇప్పుడు దాల్మియా బీసీసీఐ పగ్గాలు చేపట్టాడు. మరి ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘానికి సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని దాల్మియా కేవలం బెంగాల్‌కే పరిమితం చేస్తారని అనుకోలేం. గంగూలీకి క్రికెట్ క్రీడలో ప్రధానమైన స్థాయి దక్కే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
తన బిసిసిఐ పాలనలో తన మార్కు కనిపించడానికి తనకు అత్యంత సన్నిహితుడైన గంగూలీకి టీమిండియా డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయంటున్నారు. ఐపీఎల్ పరిపాలనా మండలిలోనూ దాల్మియా కొన్ని మార్పులకు పూనుకుంటాడని అభిప్రాయపడుతున్నారు.