న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిషేధం మంచే చేసింది, టార్గెట్ ఒలింపిక్స్: సరితాదేవి

న్యూఢిల్లీ: తాను ఎంతో మారానని, ఇకపై వివాదాల జోలికి వెళ్లబోనని భారత మహిళా బాక్సర్ సరితా దేవి స్పష్టం చేసింది. ఈ గురువారం(అక్టోబర్ 1, 2015)తో నిషేధం ముగుస్తున్న నేపథ్యంలో సరితాదేవి స్పందించారు.

'ఇప్పుడు చాలా మెరుగయ్యాను. ఈ ఏడాదికాలం నన్ను మానసికంగా బలవంతురాల్ని చేసింది. ముందుకన్నా ఎక్కువ కష్టపడుతున్నా. ప్రపంచ టైటిల్‌ నెగ్గి.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం గెలుస్తా' సరితాదేవి అని చెప్పింది.

కాగా, ఇంచియాన్‌లో నిరుడు జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న సరిత సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలను అందిస్తారు. అయితే, ఆసియా క్రీడల్లో మహిళల 57-60 కిలోల లైట్‌వెయిట్ బాక్సింగ్‌లో తనకు అన్యాయం జరిగినట్టు సరిత అప్పట్లో ఆరోపించింది.

సెమీ ఫైనల్ బౌట్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ న్యాయమూర్తులు ఏక పక్ష నిర్ణయం వల్ల తాను కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చిందని పోటీ పూర్తయన వెంటనే మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. ఈ వివాదంపై గేమ్స్ బాక్సింగ్ న్యాయమూర్తుల ప్యానెల్‌కు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదని ప్యానెల్ అభిప్రాయపడింది. నిజానికి సరిత విజృంభణ ముందు దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ నిలవలేకపోయింది. సరిత పర్ఫెక్ట్ లాండింగ్స్‌తో విరుచుకుపడి పార్క్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేయడంతో ఆమె ఫైనల్ చేరడం ఖాయంగా కనిపించింది. కానీ, రింగ్‌సైడ్ న్యాయమూర్తులు బ్రహం మహమ్మద్(ట్యునీషియా), అల్బినో ఫొటీ (ఇటీ), మారిస్ జోసెఫ్ గోర్నీ (పోలాండ్) అనూహ్యంగా పార్క్‌ను విజేతగా ప్రకటించారు.

Both mentally and physically I’m much better than before: Sarita Devi

ఆ తర్వాత, సెమీ ఫైనల్‌లో ఓడి, కాంస్య పతకానికి పడిపోయిన సరిత మీడియాతో మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అన్యాయం జరిగిందని వాపోయింది. ఒక్క పొరపాటు నిర్ణయం వల్ల తన చిరకాల శ్రమ వృథా అయిందని చెప్పింది.

సరిత భర్త, మాజీ ఫుట్‌బాలర్ తోయిబా సింగ్ కూడా న్యాయమూర్తుల తీరుపై మండిపడ్డాడు. 'మీరు బాక్సింగ్‌ను చంపేస్తున్నారు' అని అరుస్తూ, ఒకానొక దశలో రింగ్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. అనంతరం బహుమతి ప్రదానికి హాజరైనప్పుడు కాంస్య పతకాన్ని తీసుకున్న సరిత మరుక్షణమే బిగ్గరగా రోదిస్తూ, కాంస్య పతకాన్ని తీసుకొని, వెంటనే తిరిగి ఇచ్చేసింది.

తనకు అన్యాయం జరిగిందంటూ వాపోయింది. ఈ చర్య ప్రకంపనలు సృష్టించగా, వివాదం ఓసిఏ ముంగిటకు చేరింది. న్యాయమూర్తులు వివక్ష చూపారని, 60 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ కంటే తాను అన్ని విధాలా ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఓడినట్టు ప్రకటించారని సరిత ఆరోపించింది.

కాగా, సరిత పతకాన్ని నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని ఒసిఎ వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తర్వాత, భారత మహిళా బాక్సర్ సరిత వివాదానికి తెరదించింది. ఆమెకు కాంస్య పతకాన్నే ఖరారు చేసింది.

అంతేగాక, సరిత వ్యవహార శైలిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) తీవ్రంగా స్పందించింది. క్రీడాస్ఫూర్తికి విఘాతం గలిగించిన సరితను ఏడాది పాటు అంతర్జాతీయ బాక్సింగ్ నుంచి నిషేధించింది. ఆ ఉత్తర్వులు 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకూ అమల్లో ఉంటాయని ప్రకటించింది.

గురువారంతో నిషేధం పూర్తికావడంతో సరిత పిటిఐతో మాట్లాడుతూ.. తాను ఇప్పుడు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నానని తెలిపింది. ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న సంఘటనపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. మునుపటి కంటే ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నానని, ఉద్వేగానికి, ఉద్రేకానికి గురికాకుండా బాక్సింగ్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నానని తెలిపింది.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అభిమానుల వరకూ అన్ని వర్గాల నుంచి తనకు మద్దతు లభించిందని చెప్పింది. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చెప్పింది. వారి అంచనాల మేరకు రాణిస్తానని, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X