కొలంబో: శ్రీలంక - ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సందర్భంగా దుస్తులు విప్పిన ఆసిస్ అభిమానికి శ్రీలంకలో జైలు శిక్ష పడింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా టీం ప్రస్తతం శ్రీలంకలో పర్యటిస్తోంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జులై 26న ప్రారంభమైంది.
తొలి రోజు మంగళవారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా అభిమాని ఒకరు ఒంటి పైన దుస్తులు తొలగించి మైదానంలో పరుగులు పెట్టాడు.
ఎక్కువ సమయం అలాగే మైదానంలో గడిపిన అతడు తిరిగి మైదానాన్ని వీడిన అనంతరం దుస్తులు ధరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారం పాటు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. అతనికి రూ.3వేల జరిమానా కూడా విధించారు.