ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, బ్రిటిష్ మోడల్, నటి హాజెల్ కీచ్‌ల నిశ్చితార్ధం జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండోనేషియాలోని బాలీ దీవుల్లో దీపావళి పర్వదినం నాడు సన్నిహితుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా హాజెల్ కీచ్‌తో యువరాజ్ సింగ్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీమిండియా క్రికెటర్ హార్భజన్ సింగ్ వివాహం అనంతరం యువీ హాజెల్‌తో ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు హాజెల్‌తో కలిసి యువరాజ్ సింగ్ ఢిల్లీలో జరిగిన భజ్జీ, గీతా బస్రాల రిసెప్షన్‌కు వెళ్లాడు. దీంతో తొందరలోనే యువీ పెళ్లిచేసుకోబోతున్నాడంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం హాజెల్‌తో యువరాజ్ సింగ్ డేటింగ్‌పై అతడి తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాజెల్ను పెళ్లి చేసుకుంటే యువరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కే అవకాశముందని యోగ్ రాజ్ పేర్కొన్నారు.
యువీ ఛాయిస్ పట్ల తండ్రి యోగ్రాజ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మోడల్‌తో పెళ్లి యువీ భవిష్యత్తును మారుస్తుందన్న ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. వచ్చే ఫిబ్రవరిలో హేజల్ను యువీ పెళ్లి చేసుకుంటాడని వార్తలు కూడా వస్తున్నాయి.
హాజెల్‌తో యువీకి మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ గత రెండు నెలల నుంచి మాత్రమే ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు క్రికెటర్ తల్లి షబ్నం సింగ్ చెప్పారు. ఈ క్రమంలో యువరాజ్ ఏకంగా హాజెల్ తో ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంపై యువరాజ్ మాత్రం నోరు మెదపడం లేదు. ఇక హాజెల్ కీచ్ (28) విషయానికి వస్తే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ సినిమాలో నటించింది.