న్యూఢిల్లీ: జాన్ రైట్ ప్రభావం తనపై చాలా ఉందని, తాను ఆటగాళ్ల పట్ల ఆయనలాగే వ్యవహరిస్తానని టీమిండియా కొత్త కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. యువ జట్టు క్రీడాకారులపై తన ఐడియాలను రుద్దే బదులు వారిని ఎప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.
తొలుత అన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని, ఆ తర్వాత తాను వారిని ఒప్పించగలననే నమ్మకం ఉందని, తాను అంతా సవ్యంగా జరగడానికి అనువైన పాత్ర మాత్రమే వహిస్తానని ఆయన చెప్పారు. జాన్ రైట్ కింద తాను చాలా ఆడానని, ఆయన ప్రభావం తనపై చాలా ఉందని, ఆయన తరహాలో తాను పనిచేస్తానని కుంబ్లే వివరించాడు.
జాన్ రైట్ భారత సంస్కృతిని అర్థం చేసుకున్నాడని, కోచ్లు ఎలా పనిచేయాలో తాను నేర్చుకున్నానని ఆయన చెప్పారు. రైట్ ఆలోచనలను తాను తీసుకుంటానని చెప్పాడు. గ్యారీ కిర్స్టన్ కొద్ది కాలం మాత్రమే పనిచేశాడని, ఆయన కూడా వెనక ఉండే పనిచేశాడని, తెర మీదికి ఎప్పుడూ రాలేదని కుంబ్లే చెప్పాడు.
తాను కూడా అలాగే వెనక ఉండి చోదక శక్తిగా పనిచేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. కోచ్గా కెప్టెన్ భారాన్ని పంచుకుంటానని ఆయన చెప్పాడు. తాను కెప్టెన్గా ఉన్నప్పుడు మైదానంలో నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వెలుపల కూడా తీసుకోవాల్సి ఉంటుందని గ్రహించినట్లు తెలిపాడు.
కోచ్గా కెప్టెన్ బరువును తగ్గించడం తన పని అని అన్నాడు. మైదానంలో శిక్షణ ఇవ్వడం మాత్రమే కోచ్ పని కాదని, మైదానం వెలుపల కూడా ఆ పనిచేయాల్సి ఉంటుందని అన్నాడు. వ్యక్తిత్వాలను, నాయకులను తయారు చేయడమే తన పని అన్నాడు. విజయాలు అందుకున్నప్పుడు మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా కోచ్గా పనిచేయాలని అన్నాడు.