న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నైట్ వాచ్‌మన్‌గా సేవచేస్తా': బీసీసీఐ కొత్త బాస్‌‌లు వీరే

సుప్రీం కోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్‌సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలు ఉన్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: బీసీసీఐకి కొత్త బాస్‌లొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా తులతూగుతున్న బీసీసీఐ ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు చేయడంలో తాత్సారం చేసినందుకు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులపై వేటు వేసిన సుప్రీం... తాజాగా బీసీసీఐ కార్యకలాపాలు నిర్వహించేందుకు కాగ్ మాజీ చీఫ్ వినోద్‌రాయ్ అధ్యక్షతన నలుగురితో కూడిన కమిటీని నియమించింది.

ఈ కమిటీలో సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్‌సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలు ఉన్నారు. ఈ కమిటీ కమిటీ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కొత్త ఆఫీసు బేరర్ల ఎన్నికలు జరిగేంత వరకు బీసీసీఐ కార్యకలాపాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. 2016, జూలై 18న సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సంస్కరణలను బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో అమలు చేయడంతో పాపటు బోర్డు, రాష్ట్ర సంఘాల్లో ఉన్న ఆఫీసు బేరర్ల పదవీ కాలంతోపాటు, 70 ఏళ్ల నిబంధన ఎంత వరకు అమలైందో కోర్టుకు నివేదిక ఇవ్వడం చేయనుంది.

దీంతో పాటు బీసీసీఐ ఆదాయంలో అత్యంత ముఖ్యమైన ప్రసార హక్కులకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ కమిటీ తీసుకోనుంది. మరోవైపు ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మంత్రులు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వారు బీసీసీఐ పాలకులుగా అనర్హులని చెప్పిన తీర్పును సుప్రీం ప్రస్తావించింది.

ఫిబ్రవరి మొదటి వారంలో ఐసీసీ సమావేశానికి బీసీసీఐ తరుపున జాయింట్ సెక్రెటరీ అమితాబ్‌ చౌదరి, విక్రమ్ లిమాయేలు ప్రాతినిధ్యం వహిస్తారని సుప్రీం కోర్టు వెల్లడించింది. బీసీసీఐ సీఈఓ ప్యానెల్‌కు రిపోర్ట్‌ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో లోధా సిఫారసుల అమలుపై నివేదికను అడ్మినిస్ట్రేషన్ ప్యానెల్‌.. నాలుగు వారాల్లో కోర్టుకు సమర్పించనుందని ధర్మాసనం తెలిపింది.

నైట్ వాచ్‌మన్‌గా సేవచేస్తా: వినోద్ రాయ్

నైట్ వాచ్‌మన్‌గా సేవచేస్తా: వినోద్ రాయ్

తన నియామకం వార్త వెలువడిన వెంటనే వినోద్ రాయ్ మీడియాతో మాట్లాడాడు. క్రికెట్‌ను అమితంగా అభిమానించే వ్యక్తిని అని ఒక నైట్ వాచ్‌మన్‌గా క్రికెట్‌కు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానుని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు అప్పజెప్పిన గురుతర బాధ్యతలను నిర్వర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. కొత్త ఆఫీసు బేరర్లకు అంతా సవ్యంగా సాగేలా చక్కదిద్దడమే తన కర్తవ్యమని చెప్పారు. పారదర్శకతో పాటు మంచి పరిపాలన శైలితో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తానని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో 1948లో జన్మించిన రాయ్ అంచలంచెలుగా అత్యున్నత పదవులను అధిరోహించాడు. 1972 బ్యాచ్‌ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పలు హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ ప్రభుత్వ హయంలో 2008-13 మధ్య భారత 11వ కాగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కాలంలో దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ లైసెన్సుల కుంభకోణంతో పాటు కోల్ గేట్(బొగ్గు కుంభకోణం), ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్(2010) నిధుల దుర్వినియోగం, పద్మనాభస్వామి ఆలయ ఆడిట్ లాంటి కేసులతో రాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రఖ్యాత హర్వర్డ్ యూనివర్సిటీలో విధ్యనభ్యసించిన రాయ్ ప్రస్తుతం యూనైటెడ్ నేషన్స్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

రామచంద్ర గుహ

రామచంద్ర గుహ

ప్రముఖ చరిత్ర కారుడు. బెంగళూరుకు చెందిన గుహ కాలమిస్టు, క్రికెట్ పరిశోధకుడు. దేశంలోని నాన్‌ఫిక్షన్ రచయితల్లో రామచంద్ర గుహ ఒకరు. చారిత్రక పరిశోధక అంశాలతో పాటు పర్యావరణ అంశాలపై అనేక పరిశోధనలు చేశారు. గుహ రాసిన ‘ఇండియా ఆఫ్టర్‌ గాంధీ', భారత క్రికెట్‌ చరిత్రను తెలిపే ‘ఎ కార్నర్‌ ఆఫ్‌ ఎ ఫారిన్‌ ఫీల్డ్‌' ఎంతో గుర్తింపు తెచ్చాయి. యేల్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీల్లో బోధించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి విజిటింగ్‌ ప్రొఫెసర్‌. డెహ్రాడూన్‌ స్కూల్లో చదివిన గుహ.. ఆ స్కూల్‌ వీక్లీకి ఎడిటర్‌గా పనిచేశారు. 1977లో ఎకనామిక్స్‌లో డిగ్రీ అనంతరం ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పీజీ చేశారు. ఉత్తరాఖండ్‌ అడవుల్లో నడిచిన ‘చిప్కో' ఉద్యమంపై పరిశోధన చేశారు. ఆధునిక భారత చరిత్రపై పరిశోధనలు చేసే వారికి సహాయం అందించడం కోసం న్యూ ఇండియా ఫౌండేషన్‌ను స్థాపించారు.

విక్రమ్ లిమాయె

విక్రమ్ లిమాయె

బీసీసీఐలో ఉత్తమ పరిపాలన తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. బోర్డు సిద్ధాంతాలతోపాటు ఇప్పటి వరకూ పని చేసిన విధానాన్ని తెలుసుకుని వాటిని విశ్లేషించి ఓ అంచనాకు వస్తానని అన్నారు. లోధా సంస్కరణలతోపాటు ఎన్నో విషయాలను చక్కబెట్టాల్సి ఉందని అన్నారు. ఐసీసీలో పరిస్థితి గురించి తెలుసుకోవడానికి అనిరుధ్‌, అమితాబ్‌లతో మాట్లాడాల్సి ఉందని చెప్పారు.

ఫైనాన్స్‌ రంగంలో ఎంతో అనుభవం ఉన్న చార్టెడ్‌ అకౌంటెంట్‌. న్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైన్సాన్స్ కంపెనీ లిమిటెడ్(ఐడీఎఫ్‌సీ)కి విక్రమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అమెరికాలో ఎంబీఏ డిగ్రీ పట్టా పొందిన విక్రమ్..గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్లలో ఒకరు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమలకు సంబంధించిన ఎకానమిక్ పాలసీ, మార్కెట్ల పరిస్థితి, ట్రేడ్, మైనార్టీ వ్యవహారాలు లాంటి రంగాల్లో అత్యుత్తమ సేవలందించారు.

డయానా ఎడుల్జీ

డయానా ఎడుల్జీ

మహిళా క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంతోపాటు ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారుల అసోసియేషన్‌ ఏర్పాటుపైనే ఎక్కువగా దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. అమికస్‌ క్యూరీ సుబ్రమణియమ్‌ నన్ను సంప్రదించగానే.. వెంటనే ఆమోదం తెలిపానని ఎంతో పెద్ద బాధ్యతను కోర్టు తనపై ఉంచిందన్నారు. మిగిలిన సభ్యులతో కలసి భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. 40 రైల్వే జట్లను మేనేజ్‌ చేసిన అనుభవం కొంత పనికొస్తుందన్నారు. మహిళల టెస్ట్‌ క్రికెట్‌ను మరింతగా ప్రోత్సహించాలని, పేమెంట్‌ విధానాలను కూడా మరింతగా సంస్కరించాలని చెప్పారు.

ఇక సుప్రీం కోర్టు నియమించిన కమిటీలో ఏకైక క్రికెటర్ డయానా. 20 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన డయానా 17 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు సేవలందించింది. తన కెరీర్‌లో 20 టెస్ట్‌లాడిన ఈమె 63 వికెట్లతో పాటు 404 పరుగులు చేసింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 1983లో అర్జున, 2002లో పద్మశ్రీ అవార్డులు ఆమెను వరించాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X