రాజ్‌కోట్‌లోని ఇంపీరియల్ హోటల్లో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు
విరాట్ కోహ్లీ తన 28వ పుట్టిన రోజుని రాజ్‌కోట్‌లోని ఇంపీరియల్ హోటల్లో జరుపుకున్నాడు. కోహ్లీ పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్ నటి, ప్రేయసి అనుష్క కూడా హాజరైందని జట్టు మేనేజర్ పేర్కొన్నాడు. విరాట్ 18 అనే బొమ్మతో కూడిన కేక్‌ను కోహ్లీ కట్ చేశాడు.
పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు
కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని రాజ్ కోట్‌లోని కోహ్లీ బస చేసిన ఇంపీరియల్ హోటల్‌కు పెద్దఎత్తున అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు తీసుకొచ్చిన చాక్ లెట్ కేక్‌ను కోహ్లీ కట్ చేసి వారిని ఆనందింపజేశాడు. ఇదిలా ఉంటే కోహ్లీ పుట్టినరోజు నాడు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ రెచ్చిపోయాడు.
సెహ్వాగ్ ట్వీట్ ప్రత్యేకం
‘హజ్మీ గోలీ, రంగుల హోలీ, గుజరాత్లో గాగ్రా చోళీ, ఇక బ్యాటింగ్‌లో కోహ్లీ ఇండియాలో అందరికీ ఇష్టం' అంటూ ట్వీట్ చేశాడు. సరిగ్గా ‘8 ఏళ్ల క్రితం ఈ రోజును చీకూ (సపోటా) పండ్లను తింటూ జరుపుకొనే వాళ్లం. కానీ ఇప్పటి రోజును మాత్రం ఆటో, టాక్సీలు తమ మీటర్లను 100 నుంచి ప్రారంభిస్తున్నారని అనుకుంటున్నా' అంటూ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు.
మాజీలు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇక కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని మాజీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాలో కోహ్లీనే షరారతి గయ్(నాటీ బాయ్) అంటూ సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. కోహ్లీ ఎప్పుడూ తనలాగే ఉండాలని, భారత జట్టుకు మరెన్నో విజయాలను సాధించి పెట్టాలంటూ సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించాడు.
సోదరుడు కోహ్లీకి పుట్టినరోజు అభినందనలు
కోహ్లీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భారత కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు. ‘సోదరుడు కోహ్లీకి పుట్టినరోజు అభినందనలు' అని రహానే, శిఖర్ ధావన్‌లు ట్వీట్ చేశారు. ‘చిన్న తమ్ముడు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమతో..' అంటూ హర్భజన్‌సింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలి
‘మరిన్ని రికార్డులు బద్దలు చేయాలని ఆశిస్తున్నా' అంటూ వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్... కోహ్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహ్మద్ కైఫ్, బీసీసీఐ, జాంటీరోడ్స్, అంజుమ్చోప్రా, ఏంజెలో మాథ్యూస్ తదితరులు కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలిపారు. కాగా, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కోహ్లీ థ్యాంక్స్ తెలిపాడు.