వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా చాణక్యం: తెలంగాణలో పట్టు కోసం ఇలా, ఏపీలో మరో ప్లాన్

దక్షిణాదిలో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అందునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలతో ‘అమిత్ షా’ పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోడీని ప్రస్తుత రాజకీయాల్లో అత్యున్నతమైన జోడీగా పరిగణిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిష్టవేసిన అమిత్ షా.. ఇతర పార్టీల్లోని ప్రముఖ నేతలను, అసంత్రుప్తులను చేరదీశారు. 2014 ఎన్నికల్లో యూపీ నుంచి 72 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి పునాదే వేశారు.

తాజాగా ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి మించి ఓబీసీ సమ్మేళనాలు, దళిత సదస్సులతో అన్ని వర్గాల్లోకి దూసుకెళ్లారు కమలనాథులు.. విపక్షాల్లో చీలిక బీజేపీకి వరంగా మారింది. యూపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ చారిత్రక స్థాయిలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉన్నది. ఈ లోగా బీజేపీ గతంలో గెలుపొందిన స్థానాలన్నింటా బీజేపీ గెలుపొందుతుందా? లేదా? అన్న సంగతి కమలనాథులకే సందేహంగా ఉన్నందునే దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ పేరిట పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు అమిత్ షా.

కాంగ్రెస్ పార్టీతోపాటు సంస్థాగత నిర్మాణం గల కమ్యూనిస్టు పార్టీలకూ అర్థం గానీ అంశం ఒక్కటి ఉంది. అదే బూత్ స్థాయి కమిటీతో నియోజకవర్గ రాజకీయాల నిర్వహణ అమిత్ షా ముందు ఉన్న అత్యంత శక్తిమంతమైన పీఠం. ఈ అంశాన్ని గుర్తించకుండా... ప్రజల మద్దతు తమకే ఉన్నదని, పలు పథకాల అమలుతోతమకూ బలం ఉన్నదని దూసుకెళ్లాలని భావిస్తే ఎదురు దెబ్బలు తినడం ఖాయంగా కనిపిస్తున్నది.

నల్లగొండలో తొలిరోజు అమిత్ షా ఇలా

నల్లగొండలో తొలిరోజు అమిత్ షా ఇలా

దక్షిణాదిలో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అందునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలతో ‘అమిత్ షా' పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తెలంగాణలోని పాత నల్లగొండ జిల్లాలోని తెరటుపల్లి గ్రామంలో సోమవారం అమిత్ షా పర్యటిస్తున్నారు. నక్సల్స్ చేతిలో హత్యకు గురైన మైసయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు గ్రామంలో ఇంటింటికీ తిరిగి పార్టీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి, చివరకు దళితులతో సహపంక్తి భోజనం చేస్తారు. తద్వారా బీజేపీ అందరి పార్టీ అన్న సంకేతాలివ్వబోతున్నారు. అటుపై నల్లగొండలో 400 మంది మేధావులతో సమాలోచనలు.. పార్టీ సీనియర్లు, పదాధికారులతో విస్త్రుతస్థాయి చర్చల ద్వారా పార్టీ బలోపేతానికి గల అవకాశాలను చర్చించి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన వ్యూహ రచన చేయనున్నారు.

బూత్ కమిటీలను శక్తిపీఠంగా భావిస్తున్న అమిత్ షా

బూత్ కమిటీలను శక్తిపీఠంగా భావిస్తున్న అమిత్ షా

మరోవైపు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో బూత్ కమిటీల సభ్యుల సమావేశంలో అమిత్ షా పాల్గొని దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో బూత్ స్థాయి కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. తాజాగా నల్లగొండ, హైదరాబాద్ లోక్ సభ స్థానాల బూత్ స్థాయి కమిటీల సమావేశాలకు అమిత్ షా హాజరు కానున్నారు. అమిత్ షా ద్రుష్టిలో ‘బూత్ స్థాయి' కమిటీలే కీలకమని కమలనాథులు చెప్తున్నారు. సాధారణంగా జిల్లా కార్యకర్తల సమావేశాలకు గంపగుత్తగా భారీస్థాయిలో పార్టీలు ప్రజలను సమీకరిస్తాయి. కానీ అమిత్ షా మాత్రం ఖచ్చితంగా బూత్ కమిటీ సభ్యులు మాత్రమే హాజరు కావాలని నొక్కి చెప్తారని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. దీన్ని ‘శక్తి పీఠం' అని కూడా అమిత్ షా పేరు పెట్టారు అంటే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం బూత్ కమిటీలకే ఉన్నదని అర్థమని చెప్తున్నారు. గతంలో యూపీ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, తాజాగా మళ్లీ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాలతో ముందుకు సాగుతున్న బీజేపీకి.. అమిత్ షా.. ‘శక్తి పీఠం' అనే బూత్ కమిటీలే పార్టీ విస్తరణకు పునాదిగా మారుతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అమిత్ షా పక్కా ప్రణాళిక ఇది

అమిత్ షా పక్కా ప్రణాళిక ఇది

మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు తెలుగుదేశం సహా ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలపై వల విసురుతోంది బీజేపీ.. ఈ పాటికే ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయి. నల్లగొండ జిల్లా నుంచే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కందూరు జానారెడ్డి, ఉప నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీ నాయకత్వం తీరు పట్ల అసంత్రుప్తితో ఉన్నారని వార్తలొచ్చాయి. వారితోనూ బీజేపీ నాయకత్వం సంప్రదించినా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. 1998 - 2004 మధ్య వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో బీజేపీకి, ప్రస్తుతం మోదీ - అమిత్ షా సారథ్యంలోని బీజేపీకి చాలా తేడా ఉన్నది. వాజ్ పేయి ప్రభుత్వం సంప్రదాయ రాజకీయాలకు పాల్పడితే.. ప్రస్తుతం బీజేపీ నాయకత్వం ఆధిపత్యమే ప్రధానంగా.. అందుకు విపక్షాల నేతలను తమ అక్కున చేర్చుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది.

ప్రజా మద్దతు ఉన్నంత వరకే అధికారం

ప్రజా మద్దతు ఉన్నంత వరకే అధికారం

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామి కాకున్నా వివిధ అంశాల్లో కీలక మద్దతుదారుగానే వ్యవహరిస్తున్నది. నిధుల సాధనే ధ్యేయంగా సన్నిహితంగా వ్యవహరిస్తున్నా.. రాష్ట్రంలో మాత్రం స్థానిక నాయకత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో బీజేపీ - టీఆర్ఎస్ పరస్పరం పోటీ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ పార్టీగా సాగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా కాలంగా కమిటీలు కూడా లేవు. తాజా పరిస్థితుల్లో నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే ఒక్క విషయం విస్మరించరానిది. సంస్థాగతంగా బలోపేతంగా ఉన్న టీడీపీ 2004, 2009, 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఓటమి పాలైంది. 1994, 1996, 1998, 1999లో కాంగ్రెస్ పార్టీని ఎదురొడ్డి తెలుగుదేశం పార్టీ నిలిచింది. కానీ టీఆర్ఎస్ వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.

సంక్షేమ పథకాలతోనే ప్రజాతీర్పు అనుకూలమని టీఆర్ఎస్

సంక్షేమ పథకాలతోనే ప్రజాతీర్పు అనుకూలమని టీఆర్ఎస్

తమకు కమిటీలు లేకపోయినా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను తిరిగి గెలిపిస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం విశ్వసిస్తున్నది. కానీ సంక్షేమంతోపాటు వివిధ అంశాల్లో పార్టీ నాయకత్వం వైఖరిని బట్టి ప్రజల నాడి మారుతుందన్న సంగతి కూడా విస్మరించరానిదే అవుతుంది. వివిధ రకాల ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతతోపాటు అర్హుల దరి చేర్చడంతో విజయవంతం కాగలిగితే కొంత పునాది సాధించుకోగలిగినట్లే. కానీ ప్రభుత్వ చర్యలే గెలిపిస్తాయంటే ఇటీవల మిర్చి రైతులు ఆందోళన బాట పడితే బేడీలేసి కోర్టుకు తీసుకొచ్చిన ఘటన.. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తివేత ప్రయత్నాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళన పట్ల ప్రభుత్వం అనురించిన వ్యూహం బెడిసి కొట్టడంతోపాటు వెలవెలబోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సమయోచితంగా వ్యవహరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నర్మగర్భంగా ముందుకు సాగితే అందరినీ కలుపుకుని పోతేనే సత్ఫలితాలు వస్తాయని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఒకనాడు ‘ఇందిరే ఇండియా', ‘ఇండియే ఇందిర' నినాదాన్ని హోరెత్తించినట్లు తెలంగాణ అంటేనే కేసీఆర్ మాత్రమేనన్నట్లు జరుగుతున్న ప్రచారం.. ఆచరణలో ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీపై బెజవాడ ఎంపీ కేశనేని ఇలా

బీజేపీపై బెజవాడ ఎంపీ కేశనేని ఇలా

తెలంగాణతోపాటు మరో తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉంటూనే బలోపేతం కావాలని బీజేపీ తలపోస్తున్నది. ఇందుకోసం టీడీపీతో నేరుగా తలపడకుండానే నిర్దేశిత నియోజకవర్గాల స్థాయిలో పటిష్ఠానికి వ్యూహం రచిస్తున్నది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా బలోపేతం కావాలని చూస్తుందని, రాజకీయ పరిపక్వత లేని వారే అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి భేటీ తర్వాత టీడీపీలో ఆందోళన మొదలైందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే తమతో ఉంటేనే బీజేపీకి కొన్ని సీట్లయినా వచ్చాయని చెప్తున్నారు. కానీ 1998లో వంటరిగా బీజేపీ కొన్ని స్థానాల్లో విజయం సాధించిన సంగతిని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు. అందుకేనన్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బీజేపీ పొత్తు లేకపోతే తనకు మరింత మెజారిటీ వచ్చేదని, మరికొన్ని స్థానాల్లో గెలిచేవారమని వ్యాఖ్యానించారు. అమిత్ షా పర్యటించనున్నారన్న వార్తల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ అభద్రతాభావానికి గురవుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేశినేని నాని వ్యాఖ్యలను బట్టి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ - బీజేపీ పొత్తు వీడే అవకాశం ఉన్నదా? అని పలువురు రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.

English summary
Amit Shah political tour has starts today in Telangana while it would be continued next Two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X